నరైన్ బౌలింగ్ సందేహాస్పదం అంటున్న అంపైర్లు... రిఫరీకి ఫిర్యాదు
వెస్టిండీస్ మిస్టరీ స్పిన్నర్ సునీల్ నరైన్ బౌలింగ్ పై అంపైర్లు సందేహం వ్యక్తం చేస్తున్నారు. చాంపియన్స్ లీగ్ టి20 టోర్నీ సందర్భంగా కోల్ కతా నైట్ రైడర్స్, డాల్ఫిన్స్ జట్ల మధ్య హైదరాబాదులో మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో నరైన్ విసిరిన 'క్విక్ డెలివరీ'లపై అంపైర్లు అనిల్ చౌదరి, షంషుద్దీన్, థర్డ్ అంపైర్ కుమార ధర్మసేన అనుమానం వ్యక్తం చేశారు. ఓవర్లో కొన్ని బంతులను వేగంగా విసిరే ప్రయత్నంలో నరైన్ 'త్రో' చేస్తున్నట్టు వారు భావిస్తున్నారు. ఈ మేరకు వారు బీసీసీఐ సందేహాస్పద బౌలింగ్ యాక్షన్ కమిటీకి ఫిర్యాదు చేశారు. మరోసారి అంపైర్లు ఇలాంటి ఫిర్యాదు చేస్తే నరైన్ బౌలింగ్ పై టోర్నీలో నిషేధం విధిస్తారు. అప్పుడతను కేవలం బ్యాట్స్ మన్ గా ఆడాల్సి ఉంటుంది. ప్రస్తుతం మందలింపుతో సరిపెడతారు. తొలి ఫిర్యాదు నేపథ్యంలో అతని బౌలింగ్ పై ఎలాంటి ఆంక్షలు ఉండబోవు.