కట్టినవాళ్లకీ, కట్టనివారికీ కూడా రుణమాఫీ వర్తిస్తుంది: సీఎం చంద్రబాబు
రుణమాఫీ ఎప్పుడు చేస్తారు, ఎంత చేస్తారన్న దానిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నేడు ప్రజలకు ఓ స్పష్టత ఇచ్చారు. కట్టినవాళ్లకీ, కట్టనివారికీ కూడా రుణమాఫీ వర్తిస్తుందని వెల్లడించారు. ఈ మేరకు సీఎం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రుణమాఫీ ద్వారా దాదాపు 96 శాతం మందికి నూరు శాతం లబ్ది చేకూరుతుందని చెప్పారు. రుణమాఫీకి రూ.37,900 కోట్లు అవసరం అవుతాయన్నారు. ఒక్కో కుటుంబానికి లక్షన్నర రుణమాఫీ చేయాలని, డ్వాక్రా సంఘానికి లక్ష రూపాయల చొప్పున మాఫీ చేయాలని నిర్ణయించామని చెప్పారు.
కాగా, రుణమాఫీలో అక్రమాలు జరగకుండా కోటయ్య కమిటీ కొన్ని సూచనలు చేసిందని పేర్కొన్నారు. అటు చేనేత కార్మికుల రుణమాఫీ చేయాలని కూడా నిర్ణయించామని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో నిబంధనల మేరకు లబ్దిదారుల వివరాలు ఇవ్వాలని బ్యాంకులను కోరామన్నారు. రుణమాఫీ బాకీ ఏడేళ్లలో తీరుస్తామని ఆర్బీఐని కోరామని, ఇంకా అనుమతి రాలేదని చెప్పారు. బాధల్లో ఉన్న రైతులు ఆనందంగా ఉండాలనేదే తమ ఉద్దేశమని పేర్కొన్నారు.