నాటి భారతంలోనే కాదు, నేటి సభ్యసమాజంలో కూడా దుశ్శాసనులున్నారు. మూర్ఖులు ఉన్న సమాజంలో ప్రతీకార యావే తప్ప చేస్తున్నది తప్పో ఒప్పో తెలుసుకోలేని దుస్థితిలోకి నాగరిక సమాజం దిగజారిపోతోంది. బీహార్ లోని జెహానాబాద్ జిల్లాలోని నిజాముద్దీన్ పూర్ లో సభ్యసమాజం సిగ్గుతో తలదించుకునే దారుణం చోటు చేసుకుంది. గ్రామస్థులు, పోలీసుల సాక్షిగా అరాచకం జరుగుతోంటే... ఆపే నాధుడు లేకపోవడం జనారణ్యంలో మహిళల దుస్థితిని కళ్లకు కడుతోంది. వివరాల్లోకి వెలితే... నిజాముద్దీన్ పూర్ వాస్తవ్యురాలైన బాధిత మహిళకు శక్తిసింగ్ అనే వ్యక్తితో భూతగాదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో శక్తిసింగ్ అపహరణకు గురయ్యాడు. అతడిని బాధితురాలే కిడ్నాప్ చేయించి ఉంటుందని అనుమానించిన శక్తిసింగ్ తరపు బంధువులు... పొద్దుపోయాక ఆమె ఇంట్లోకి జొరబడి, బరబరా ఈడ్చుకువచ్చి, గ్రామస్థుల సమక్షంలో ఆమెను వివస్త్రను చేసి, దారుణంగా కొట్టారు. ఈ తతంగం జరుగుతున్నప్పుడు పోలీసులు అక్కడే ఉండడం విశేషం. అయితే, ఈ దారుణాన్ని గ్రామస్థులు కానీ, పోలీసులు కానీ నిలువరించే ప్రయత్నం చేయలేదు. తాళలేని దెబ్బలు తగలడంతో ఆమె పాట్నాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. దీనిపై బీహార్ శాసనసభ అట్టుడికిపోయింది. పార్టీల కతీతంగా శాసనసభ్యులంతా ఈ దారుణాన్ని ఖండించారు. జేడీ (యూ), ఆర్జేడీకి దగ్గరవడంతో బీహార్ లో అరాచకాలు పెరిగిపోతున్నాయని ఆరోపిస్తూ బీజేపీ శాసనసభ్యులు వెల్ లోకి దూసుకెళ్లి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి జీతన్ రాం మాంఝీ విచారణకు ఆదేశించారు. దోషులను శిక్షించి న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.