Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆ తండ్రి వేదనకు స్పందించిన వేలాది హృదయాలు

‘నా కలల ప్రతిరూపానికి ఓ రూపమివ్వండి’ అంటూ ఓ తండ్రి చేసిన విజ్ఞప్తికి వేల హృదయాలు స్పందించి మానవత్వాన్ని చాటాయి. అమెరికాలోని కొలంబస్ లో గల ఓహియోలో నాధన్ స్టెఫిల్ కు మే 30న ఓ కుమార్తె జన్మించింది. పాప పుట్టిందని సరదా పడేలోపే డాక్టర్లు పిడుగులాంటి వార్త అతని చెవిన వేశారు. పుట్టుకోతోనే కాలేయ వ్యాధితో బాధపడుతోందని, తక్షణం చికిత్స ప్రారంభించాలని డాక్టర్లు చెప్పడంతో వెంటనే పాపను రక్షించుకునే ప్రయత్నం ప్రారంభించాడు నాధన్. ఆరు వారాల పాటు మృత్యువుతో పోరాడిన చిన్నారి జూలై 10న కన్నుమూసింది. కానీ నాధన్ కంటిపాపగా మిగిలిపోయింది. నాధన్ పాప ఆలోచనల్లోంచి బయటకు రాలేకపోయాడు. ఎంత గుర్తు తెచ్చుకుందామనుకున్నా శ్వాస కోసం పైపులు, గొట్టాలు అమర్చిన పాప ముఖమే తప్ప స్వేచ్చగా ఉండే ముఖం గుర్తు రావడం లేదు. దీంతో ఇంటర్నెట్ లో రెడ్జిట్.కామ్ లో తన ఆవేదనను వ్యక్తం చేశారు. అతడి ప్రకటనకు వేలాది హృదయాలు స్పందించాయి. ఫోటోషాప్ సాయంతో ఎలాంటి ట్యూబుల్లేకుండా ఉన్న పాప ఫోటోలను వందలాదిగా అప్ లోడ్ చేశారు. 'ఆరు వారాలపాటు మృత్యువుతో నా కుమార్తె చేసిన పోరాటం విషాదాంతమైంది. తన జీవిత కాలం మొత్తం ఆసుపత్రిలో ఉండడం వల్ల ఆక్సిజన్ పైప్ లేకుండా పాపను చూడలేదు. ట్యూబుల్లేకుండా, స్వచ్చమైన ఆ చిన్నారి ముఖం చూడాలని ఉంది. దయచేసి ఎవరైనా ట్యూబుల్లేకుండా ఆమె ఫోటోను తయారు చేయగలరా?' అంటూ పోస్టు చేశాడు. ఆ పోస్టు చూసిన కొన్ని వేల హృదయాలు స్పందించాయి. వందలాది మంది ట్యూబుల్లేకుండా పాప ఫోటోను తయారు చేసి అప్ లోడ్ చేసి అతని కోరిక తీర్చారు. వారందరికీ నాధన్ కృతజ్ఞత తెలియజేస్తూ 'నేనడిగింది కేవలం నా కుమార్తె ఫోటోను మాత్రమే. కానీ మీరంతా ప్రేమను, అభిమానాన్ని, వాత్సల్యాన్ని కురిపించి మానవత్వం చాటుకున్నారు' అన్నాడు.

More Telugu News