అమరనాథ్ గుహలో శివలింగం కరిగిపోతోంది!
అమరనాథ్ యాత్ర పూర్తి కాకమునుపే శివలింగం మాయమవనుందా? అనే ప్రశ్న తలెత్తుతోంది. యాత్ర ప్రారంభమైన 18 రోజుల్లో శివలింగం 11 అడుగులకు కరిగిపోయింది. ఇక్కడ లింగాకారంలో మంచు పేరుకునిపోయి... భక్తులకు ‘మహాలింగ’ దర్శనం అవుతుంది. ఈ యాత్రలో పాల్గొన్న భక్తుడు మాట్లాడుతూ... 14 అడుగుల మేర శివలింగం ఉంటుందని తాను విన్నానని, అయితే తాను వచ్చేటప్పటికే మంచు లింగం 7-8 అడుగుల మేర కరిగిపోయిందని చెప్పారు.
అమరనాథ్ గుహలో శివలింగం కరిగిపోవడానికి కారణమేమిటి?... అంటే ఇందుకు ప్రధానంగా రెండు కారణాలున్నాయి. ఒకటి... హిమాలయాల్లో ఉష్ణోగ్రత పెరిగిపోవడం. గుహలో ఉష్ణోగ్రత పెరిగి మంచు లింగం కరిగిపోతోంది. ఇక, రెండవది... భక్తుల సంఖ్య నానాటికీ అధికమవడం. ప్రతియేటా లక్షలాది మంది భక్తులు అమర్ నాథ్ యాత్రకు వస్తున్నారు. రోజూ 20 వేల మంది భక్తులు అమర్ నాథ్ గుహలో మంచులింగాన్ని దర్శించుకుని ఆధ్యాత్మిక ఆనందానికి లోనవుతున్నారు. అయితే, రోజుకు 15 వేల మందికి మించి భక్తులకు అనుమతించకూడదని నిబంధన ఉన్నా... వాస్తవ రూపంలో ఈ రూల్ అమలుకాకపోవడంతో మంచులింగం వేగంగా కరిగిపోతున్నదని అంటున్నారు. అమర్ నాథ్ యాత్ర ఆగస్టు 10వ తేదీ వరకు కొనసాగనుంది.