ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మంత్రి అభిషేక్ మిశ్రా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రక్షణ కోసమని ప్రతి మహిళ వెనుక ఓ కానిస్టేబుల్ ను పంపలేమని వ్యాఖ్యానించారు. అది ఆచరణలో అసాధ్యమని అన్నారు. ఇటీవల లక్నోలో ఓ సదస్సులో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. మహిళల భద్రత కోసం యూపీ సర్కారు ఎలాంటి చర్యలు తీసుకుంటోందన్న ప్రశ్నకు బదులిస్తూ మిశ్రా పై వ్యాఖ్యలు చేశారు. అంతేగాకుండా, మగవాడు బయట తిరగకుండా నియంత్రించే యంత్రాంగమేమీ లేదని చెప్పుకొచ్చారు. భార్యను ఇంట్లో ఒంటరిగా వదిలేసి భర్త ఎక్కడకు వెళ్ళాడో తామెలా తెలుసుకోగలమని ఆయన అన్నారు. దీనిపై, యూపీలోని మహిళా సంఘాలు, ఉద్యమకారులు మండిపడ్డారు. మిశ్రాను మంత్రి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. అదే సదస్సులో కిరణ్ బేడీ వంటి మాజీ అధికారి ఉన్నా, మంత్రి వ్యాఖ్యలను ఖండించకపోవడం శోచనీయమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.