గర్భంతో పరుగెత్తి ప్రశంసలు పొందింది
గర్భిణిలకు సాధారణంగా విశ్రాంతి అవసరం. మరీ ముఖ్యంగా నెలలు నిండిన వారైతే శరీరానికి శ్రమ కలిగించకుండా, లోపల బిడ్డపై ఒత్తిడి పడకూడదనే యోచనతో కష్టమైన పనులకు దూరంగా ఉంటారు. కానీ, అమెరికాకు చెందిన పరుగుల రాణి అలీసియా మోంటానో మాత్రం గొప్ప సాహసం చేసి చూపింది. తాను ఎనిమిది నెలల గర్భంతో ఉన్నా, గురువారం జరిగిన జాతీయ చాంపియన్ షిప్ లో 800 మీటర్ల పరుగు పందెంలో పాల్గొంది. పందెంలో అందరికంటే చివర నిలిచింది. అయినా, ఆమెకు అందరి ప్రశంసలు దక్కాయి. రెండు నిమిషాల 32 సెకండ్లలో లక్ష్యాన్ని పూర్తి చేసింది. ఆమెను వైద్యులు కూడా ఈ విషయంలో వెన్ను తట్టారు. గర్భంతో ఉన్నప్పుడు పరుగెత్తితే తల్లీ, బిడ్డలకు మంచిదని అలీసియా చెబుతోంది. 28 ఏళ్ల ఈ స్టార్ గతంలో ఐదు సార్లు పరుగుపందెంలో జాతీయ చాంపియన్ గా నిలిచింది.