16వ లోక్ సభ ఇవాళ తొలిసారిగా సమావేశమవుతోంది. సభ ప్రారంభం కాగానే నిన్న ఢిల్లీలో రోడ్డుప్రమాదంలో మరణించిన కేంద్రమంత్రి గోపీనాథ్ ముండేకు సంతాప తీర్మానం ప్రవేశపెడతారు. అనంతరం సభ వాయిదా పడనుంది. కాంగ్రెస్ సీనియర్ ఎంపీ కమల్ నాథ్ ప్రొటెం స్పీకర్ గా వ్యవహరిస్తారు.

లోక్ సభ సమావేశం కాగానే సెక్రటరీ జనరల్ శ్రీధరన్ 16వ లోక్ సభ ఏర్పాటుకు సంబంధించిన ప్రకటనను చదివి వినిపిస్తారు. తర్వాత గోపీనాథ్ ముండే మరణానికి సంతాప సూచకంగా రెండు నిమిషాల పాటు మౌనం పాటించిన అనంతరం సభ వాయిదా పడుతుందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖా మంత్రి వెంకయ్యనాయుడు మీడియాకు వెల్లడించారు. సభ్యుల ప్రమాణ స్వీకారం 5వ తేదీ మధ్యాహ్నం ప్రారంభమై ఆరో తేదీ సాయంత్రం వరకు కొనసాగుతుందని ఆయన తెలిపారు.

ఈ నెల 9న పార్లమెంటు ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ప్రసంగిస్తారు. 10, 11 తేదీల్లో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ఉంటుంది. అనంతరం సభ వాయిదా పడుతుంది. రాజ్యసభ సమావేశాలు తొమ్మిదో తేదీ నుంచి ప్రారంభమవుతాయి.