ఆలె నరేంద్ర తీరు విలక్షణం, వివాదాస్పదం
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

ఆలె నరేంద్ర తీరు విలక్షణం, వివాదాస్పదం

బీజేపీ సీనియర్ నేత ఆలె నరేంద్ర రాజకీయం విలక్షణమే కాదు... వివాదాస్పదం కూడా. అనారోగ్యంతో బాధపడుతూ కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నరేంద్ర ఈరోజు కన్నుమూసిన విషయం విదితమే. ఆయన తెలంగాణలో బీజేపీ ఎదుగుదలలో ప్రధాన పాత్ర వహించారు. కానీ, బీజేపీ కార్యకర్తలు ఆయన వేరే పార్టీలో చేరినప్పుడు ఆయన ఇంటిపై దాడి చేశారు. ఆయన జీవితమంతా కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించారు. కానీ, చివరికి కాంగ్రెస్ హయాంలోనే ఆయన కేంద్ర మంత్రి అయ్యారు.

ఆలె నరేంద్ర 1980వ దశకపు రాజకీయాలకు ప్రతినిధి. అప్పట్లో పాతబస్తీ మత కల్లోలాలతో అట్టుడుకుతుండేది. ఆ రోజుల్లో ఒక వర్గానికి సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ నాయకత్వం వహిస్తే, ప్రత్యర్థి వర్గానికి టైగర్ నరేంద్ర నాయకుడిగా నిలిచారు. పాతబస్తీలోనే ఇల్లు ఉండి, అక్కడే నివసించిన చాలా కొద్దిమంది నాయకుల్లో నరేంద్ర ఒకరు.

నరేంద్ర ఏనాడూ పాతబస్తీ నుంచి గెలుపొందలేదు. 1983 ఎన్నికల్లో ఆయన చాంద్రాయణగుట్ట నుంచి పోటీకి దిగారు. ఆయనకి ప్రత్యర్థిగా మజ్లిస్ నేత అమానుల్లాఖాన్ బరిలో ఉన్నారు. ఇద్దరి మధ్యా హోరాహోరీ జరిగింది. ఒకానొక సందర్భంలో ఇరువురు నేతలు పరస్పరం కాల్పులు కూడా జరుపుకున్నారు. హైదరాబాదులో గణేశ్ నిమజ్జనాన్ని సామూహికంగా నిర్వహించే పద్ధతిని పాప్యులర్ చేయడంలోనూ ఆయన పాత్ర ఉంది. కొన్ని దశాబ్దాల పాటు ఆయన ట్రేడ్ యూనియన్ లీడర్ గా కూడా పనిచేశారు.

నరేంద్ర రాజకీయం పాతబస్తీ కేంద్రంగా సాగినా, ఆయన ఎన్నికల్లో గెలిచింది మాత్రం కొత్త నగరం నుంచే. నరేంద్ర రాజకీయంగా జెయింట్ కిల్లరే. ఆయన టీడీపీ సీనియర్ నేత ఉపేంద్రను ఒకసారి ఓడించారు. మెదక్ ఎంపీగా పోటీ చేసి తలపండిన కాంగ్రెస్ నేత బాగారెడ్డిని ఓడించారు. బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల తరపు నుంచి చట్టసభలకు ఎన్నికయ్యారు. కానీ మనసు మాత్రం ఆరెస్సెస్ తోనే ఉండేది. ఇతర పార్టీల్లో ఉంటున్నప్పటికీ ఆయన ఆరెస్సెస్ కార్యక్రమాలకు యూనిఫారం ధరించి మరీ హాజరయ్యేవారు.

తిరిగి నరేంద్ర బీజేపీలో చేరే నాటికే ఆరోగ్యం బాగా క్షీణించింది. గత దశాబ్దంగా ఆయన నిశ్శబ్దంగానే ఉన్నారు. నరేంద్ర కుమారుడు జితేందర్ గౌలీపురా కార్పొరేటర్. ఇంకో కుమారుడు ఆలె భాస్కర్ రాజ్ హుజురాబాద్ నుంచి పోటీ చేయాలని ప్రయత్నించారు. ఆయన సోదరుడు శ్యామ్ కుమార్ ఆరెస్సెస్ తెలంగాణ ప్రాంతానికి ప్రధాన ప్రచారక్ గా విధులు నిర్వర్తిస్తున్నారు.

More Telugu News