కొనసాగుతున్న టీజేఏసీ 'సడక్ బంద్'... పలుచోట్ల ఉద్రిక్తత...అరెస్టులు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

కొనసాగుతున్న టీజేఏసీ 'సడక్ బంద్'... పలుచోట్ల ఉద్రిక్తత...అరెస్టులు

ప్రత్యేక తెలంగాణ ఏర్పాటే లక్ష్యంగా తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి (జేఏసీ) పిలుపునిచ్చిన 'సడక్ బంద్' కర్నూలు-బెంగళూరు హైవేపై ఉద్రిక్తంగా మారింది. కర్నూలు రహదారిపై జరుగుతున్న బంద్ లో టీఆర్ఎస్, బీజేపీ, న్యూడెమోక్రసీ పార్టీలతో పాటు వేలమంది టీజేఏసీ కార్యకర్తలు పాల్గొంటున్నారు. రోడ్డుపై బంద్ నిర్వహిస్తున్న పలువురిని పోలీసులు అడ్డుకున్నారు. ఎదురుతిరుగుతున్న వారిని అరెస్టు చేస్తున్నారు. అటు ఆలంపూర్ లో కోదండరామ్ ను అరెస్టు చేశారు. సడక్ బంద్ కు అనుమతిలేదని ముందే చెప్పినా నిర్వహిస్తుండడం వల్లే అదుపులోకి తీసుకుంటున్నట్లు పోలీసులు చెబుతున్నారు.

అటు మహబూబ్ నగర్ జిల్లా పాలమాకుల వద్ద
 కొనసాగుతున్న బంద్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు, ఎమ్మెల్సీ స్వామిగౌడ్, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పాల్గొన్నారు. తెలంగాణ ఆకాంక్షను తెలిపేందుకు ఇది ఒక అవకాశంగా భావిస్తున్నామని ఆమె అన్నారు. ఇక రంగారెడ్డి జిల్లా శంషాబాద్ విమానాశ్రయం వద్ద భద్రత పెంచారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా శంషాబాద్ నుంచి మహబూబ్ నగర్ రహదారి వరకు నిఘా ఉంచారు. మరోవైపు 7వ నంబర్ జాతీయరహదారిపై రాకపోకలు స్థంభించాయి. ఎంజీబీఎస్ నుంచి వెళ్లే పలు బస్సులను అధికారులు దారి మళ్లించి నడిపిస్తున్నారు. బంద్ కు సంబంధించి హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి ముఖ్యమంత్రి కిరణ్ తో చర్చిస్తున్నారు.
    

More Telugu News