శాసనసభలో తెలుగు సినీ పరిశ్రమకు పెద్ద దిక్కులాంటి అక్కినేని నాగేశ్వరరావుకు నివాళి అర్పించే క్రమంలో... టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడే సందర్భంగా సభలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. చంద్రబాబు నాయుడు అక్కినేని మృతికి సంతాపం తెలుపుతూ ఒక్కో వ్యక్తి ఒక్కో రకంగా సమాజం మీద ప్రభావం చూపిస్తుంటారని, అలాంటి వ్యక్తులను సభలో గౌరవించుకోవడం సముచితమని అన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు అభ్యంతరం వ్యక్తం చేయగా, చంద్రబాబు నాయుడు ఆగ్రహంతో ఊగిపోయారు. "ఏం మాట్లాడుతున్నారు మీరు.. అసలు మీకు బుద్ధుందా... సందర్భాన్ని బట్టి మాట్లాడాలి" అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై కాంగ్రెస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు.