డిస్కవరీ నెట్ వర్క్స్ భారత్ లో మరింతగా చొచ్చుకుపోయే ప్రణాళికలతో ఉంది. పత్రికారంగంలోకి రావడంతో పాటు, కొత్త చానళ్లను ప్రారంభించాలని భావిస్తోంది. త్వరలో డిస్కవరీ చానల్ మేగజైన్ ను తీసుకురానున్నట్లు డిస్కవరీ నెట్ వర్క్స్ దక్షిణాసియా జనరల్ మేనేజర్ రాహుల్ జోహ్రి చెప్పారు. అలాగే భారత్ కు సంబంధించిన ప్రత్యేక షోలను రూపొందించి ప్రసారం చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.

ఇటీవల ఉత్తరాఖండ్ విపత్తుపై ప్రసారం చేసిన ఎపిసోడ్ డిస్కవరీ ఇండియా చరిత్రలోనే ఎక్కువమంది చూసిన కార్యక్రమంగా చెప్పారు. ప్రస్తుతం భారత్ లో ఎనిమిది చానళ్లు ఉండగా.. వీక్షకుల సంఖ్య 23 కోట్లుగా ఉన్నట్లు తెలిపారు. అంతర్జాతీయంగా డిస్కవరీ ఆధ్వర్యంలో ఉన్న ప్రతి చానల్ ను భారతీయులకు అందుబాటులోకి తీసుకురావాలన్నదే తమ ధ్యేయంగా జోహ్రి చెప్పారు.