ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ సర్కారు మూన్నాళ్ల ముచ్చటే కానుందా? పరిస్థితులు చూస్తుంటే అలానే అనిపిస్తోంది. ఢిల్లీలో శాంతి భద్రతల అధికారాలు కేంద్రం చేతిలో ఉండడాన్ని వ్యతిరేకిస్తూ.. తమకు సహకరించని అధికారులపై చర్యలు కోరుతూ కేంద్ర ప్రభుత్వంపై సీఎం కేజ్రీవాల్ యుద్ధం ప్రకటించిన నేపథ్యంలో పరిణామాలు మారిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ఆమ్ ఆద్మీ సర్కారుకు బయట నుంచి మద్దతిస్తున్న కాంగ్రెస్.. పునరాలోచన చేస్తుందని కేంద్ర మంత్రి జైరాం రమేశ్ ప్రకటించారు. ఢిల్లీలో పాలన ఇబ్బందుల్లో పడితే.. ఆమ్ ఆద్మీ అనవసర వివాదాన్ని ఇలానే కొనసాగిస్తే.. మద్దతుపై కాంగ్రెస్ పునరాలోచన చేస్తుందని జైరాం తెలిపారు. గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు అసంతృప్తికి గురిచేయడమే కాదని, ఆటంకాలను కూడా కలిగిస్తోందన్నారు.