అభివృద్ధి అయిన తర్వాతే హైదరాబాదుకు అందరూ వచ్చారు: అక్బరుద్దీన్
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

అభివృద్ధి అయిన తర్వాతే హైదరాబాదుకు అందరూ వచ్చారు: అక్బరుద్దీన్

శాసన సభలో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తున్నారు. హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేసింది టీడీపీయేనన్న చంద్రబాబు వ్యాఖ్యలను ఆయన ఖండించారు. దానికి బదులిస్తూ అక్బర్ మరింత ఆవేశంగా సభలో మాట్లాడారు. నిజాం పాలనలోనే అనేక హిందువుల ఆలయాలకు నిధులిచ్చారని ఆయన గుర్తు చేశారు. హైదరాబాదులో నిజాం ప్రభువులు పదుల సంఖ్యలో ఫ్యాక్టరీలు, అనేక ప్రముఖ విద్యాసంస్థలను నెలకొల్పారని అక్బర్ స్పష్టం చేశారు. ఆ విద్యాసంస్థల్లో చదువుకున్న వారు ఇప్పుడు సభలో సైతం ఉన్నారని ఆయన చెప్పారు.

1919లోనే హైదరాబాదులో హైకోర్టు నెలకొల్పారని, బేగంపేట విమానాశ్రయాన్ని నిర్మించిందీ నిజాం ప్రభువులేనని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రాంతంలో అనేక కర్మాగారాలను నిజాములు స్థాపించారని, ఆయా ఫ్యాక్టరీల పేర్ల సహా ఆయన సభ్యులకు తెలియజేశారు. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన తర్వాతనే హైదరాబాదుకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల వారు వలస వచ్చారని ఆయన తెలిపారు. అంతేకాని, హైదరాబాదును ఎవరూ అభివృద్ధి చేయలేదని ఆయన తేల్చి చెప్పారు.

More Telugu News