కృష్ణానదిపై నిర్మించిన పులిచింతల ప్రాజెక్టును సీఎం కిరణ్ కుమార్ ప్రారంభించారు. ప్రారంభోత్సవ వేదికపై జై ఆంద్రా ఉద్యమ నేత కాకాని వెంకటరత్నం పేరు ప్రస్తావించారు. అయితే, అదే వేదికపై కాంగ్రెస్ అధినేత్రి సోనియా, ప్రధాని మన్మోహన్, ఎంపీ రాహుల్ గాంధీ, ఫోటోలు లేకపోవడం కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆంధ్రప్రదేశ్ లో జలయజ్ఞం పేరిట ప్రాజెక్టులు ప్రారంభించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ ఫోటో కూడా లేకపోవడం కాంగ్రెస్ వర్గాల్లో కలకలం రేపింది.

సీఎం కిరణ్ అధిష్ఠానంపై తిరుగుబాటుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. కోస్తా కాంగ్రెస్ నేతలు అయితే.. ఈ వేదికపై సీఎం కిరణ్ భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక ప్రకటించే అవకాశం ఉందంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ముసాయిదా బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసిన నేపథ్యంలో కిరణ్ అధిష్ఠానంపై తిరుగుబాటుకు ఈ ప్రారంభోత్సవాన్ని వేదిక చేసుకున్నారని ఆ పార్టీ వర్గాలే అనుకుంటున్నాయి. పులిచింతల ప్రాజెక్టును జాతికి అంకితం చేసే ఈ కార్యక్రమానికి తెలంగాణ మీడియా ప్రతినిధులను ఆహ్వానించలేదు. దీంతో తెలంగాణ మీడియాను ఉద్దేశ్యపూర్వకంగానే పిలవలేదని టీ-జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు.