ఈ యాప్స్ తో మీ చెంతకే ప్రభుత్వ సేవలు..!

ఇప్పుడంతా డిజిటల్. కేంద్రంలో మోదీ సర్కారు కొలువుదీరిన తర్వాత మన దేశంలో ప్రభుత్వ సేవలు వేగంగా డిజిటల్ మయం అయిపోతున్నాయి. ఎన్నో యాప్స్ మన ముందుకు వచ్చి పడుతున్నాయి. వీటిలో ఉపయోగకరమైనవీ కొన్ని ఉన్నాయి. వాటి గురించి తెలియజేసే కథనమే ఇది.

నరేంద్రమోదీ యాప్
representational imageప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారిక యాప్ ఇది. ప్రధానమంత్రి రోజువారీ కార్యకలాపాల సమాచారం ఈ యాప్ నుంచి తెలుసుకోవచ్చు. ప్రధాన మంత్రి నుంచి నేరుగా సందేశాలు, ఈ మెయిల్స్ ను అందుకునే యూనిక్ ఆప్షన్ కూడా యాప్ లో ఉంది. తన ఐడియాలను ప్రజలతో పంచుకునే ఉద్దేశంతో ప్రధాని ఈ యాప్ ను తీసుకొచ్చారు. ఈ యాప్ నుంచి ప్రధాన మంత్రి మన్ కీ బాత్ లో ఏ ఎపిసోడ్ అయినా వినొచ్చు. ప్రధాని బ్లాగులను చదువుకోవడం, బయోగ్రఫీ సెక్షన్ లో ప్రధాని జీవితం గురించి ఎన్నో వివరాలు  తెలుసుకునే సదుపాయలూ ఉన్నాయి. యాండ్రాయిడ్ ప్లే స్టోర్ నుంచి యాప్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

భీమ్ యాప్
representational imageడిజిటల్ చెల్లింపుల కోసం తీసుకొచ్చిందే భీమ్ యాప్. భారత్ ఇంటర్ ఫేస్ ఫర్ మనీ (బీహెచ్ఐఎం) దీని పూర్తి నామం. యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ ఫేస్ (యూపీఐ) ఆధారంగా పనిచేస్తుంది. మొబైల్ ఫోన్లో ఈ యాప్ ఉంటే క్షణాల్లో లావాదేవీల చెల్లింపులు, నగదు బదిలీలు చేసుకోవచ్చు. నేరుగా బ్యాంకు ఖాతా నుంచే చెల్లింపులు వెళతాయి. యాప్ లోకి లోడ్ చేసుకుని చెల్లించాల్సిన అవసరం ఇందులో లేదు. యూపీఐ అడ్రస్ లేదా మొబైల్ నంబర్, లేదా క్యూఆర్ కోడ్ ఏది ఉంటే దానితోనే యూజర్లు నగదు చెల్లించడం, స్వీకరించడం చేసుకోవచ్చు. యూపీఐ ప్లాట్ ఫామ్ పై అందుబాటులో ఉన్న అన్ని బ్యాంకుల ఖాతాదారులు భీమ్ యాప్ తో కనెక్ట్ అయిపోవచ్చు.

ఎంపాస్ పోర్ట్ సేవా యాప్
representational imageపాస్ పోర్ట్ సేవలు పొందేందుకు ఉద్దేశించినదే ఈ యాప్. అంతేకాదు, పాస్ పోర్ట్ కార్యాలయం అందిస్తున్న అన్ని సేవల వివరాలూ పొందొచ్చు. పాస్ పోర్ట్ కు సంబంధించి ఎన్నో రకాల సేవలను ఈ యాప్ ద్వారా విదేశాంగ శాఖ అందిస్తోంది. సమీపంలోని పాస్ పోర్ట్ సేవా కేంద్రాలు (పీఎస్ కే) లేదా జిల్లా పాస్ పోర్ట్ సెల్స్ (డీపీసీ) సమాచారాన్ని యాప్ నుంచి తెలుసుకోవచ్చు. లేదా మీరుండే పిన్ కోడ్ సాయంతో సమీపంలోని కేంద్రం గురించి తెలుసుకోవచ్చు. పోలీసు స్టేషన్ల వివరాల కోసం సెర్చ్ చేయవచ్చు. అప్లికేషన్ తో పాటు చెల్లించాల్సిన ఫీజుల సమాచారం తెలుసుకునే అవకాశం కూడా ఉంది. కొత్తగా పాస్ పోర్ట్ కోసం లేదా రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకుంటే డేటాఫ్ బర్త్, ఫైల్ నంబర్ ఆధారంగా స్టేటస్ తెలుసుకోవచ్చు. పాస్ పోర్ట్ పొందాలంటే అందుకు అవసరమైన పత్రాలు, దరఖాస్తు విధానం తదితర సమస్త సమాచారం ఈ యాప్ అందిస్తుంది.

ఎం-కవచ్ (M-KAVACH)
representational imageఇది మొబైల్ సెక్యూరిటీ యాప్. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ పరిధిలో గల సెంటర్ ఫర్ డెవలప్ మెంట్ ఆఫ్ అడ్వాన్స్ డ్ కంప్యూటింగ్ (సీడాక్) దీన్ని ఆవిష్కరించింది. మాల్వేర్ దాడులు, హ్యాకింగ్ నుంచి రక్షణ కల్పిస్తుంది. మీరు వాడుతున్న వైఫై, బ్లూటూత్, కెమెరాలను మరొకరు దుర్వినియోగం చేయకుండా చూసుకుంటుంది. మీ ఫోన్ పోతే అందులో సిమ్ వేరొకరు మార్చిన వెంటనే ఆ సమాచారం మీకు తెలిసిపోతుంది. ఎవరి చేతిలోనైనా మీ మొబైల్ పడితే అందులో డేటాను రిమోట్ సాయంతో డిలీట్ చేసేయవచ్చు. మీరు పోగొట్టుకున్న ఫోన్ ను రీసెట్ చేయవచ్చు. డేటాను ఫోన్ తో పాటు, రిమోటర్ సర్వర్ లోనూ బ్యాకప్ చేసుకుని రీస్టోర్ చేసుకునేందుకు ఈ యాప్ అవకాశం కల్పిస్తుంది. యాండ్రాయిడ్ ప్లేస్టోర్ నుంచి దీన్ని డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

ఓటర్ సర్వీసెస్
ఈ యాప్ ద్వారా ప్రజలు ఎలక్టోరల్ రోల్ లో తమ పేరును సరి చూసుకోవచ్చు. కొత్త ఓటర్ ఐడీ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఓటరు కార్డులో మార్పులు చేర్పులతోపాటు ఓటరు జాబితా నుంచి తమ పేరును తొలగించుకోవచ్చు.  

కిసాన్ సువిధ
representational imageరైతులకు ఉద్దేశించిన యాప్ ఇది. రైతులకు సమాచారాన్ని వేగంగా అందించేందుకు తీసుకొచ్చారు. తామున్న ప్రాంతంలో ప్రస్తుత వాతావరణం, రానున్న ఐదు రోజుల్లో వాతావరణం ఎలా ఉంటుంది, సాగు సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలు, సమీపంలోని కమోడిటీల మార్కెట్ ధరలు, సంబంధిత పంటకు రాష్ట్రంలోఉన్న గరిష్ట ధరలు తెలుసుకోవచ్చు.

ఉమంగ్
కేంద్ర సర్కారు ఇటీవలే ‘యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూఏజ్ గవర్నెన్స్ (ఉమంగ్) పేరుతో భిన్న రకాల సేవల కోసం యాప్ ను విడుదల చేసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు మున్సిపాలిటీల సేవలనూ దీని సాయంతో పొందొచ్చు. ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్ వో), ఎన్ పీఎస్, పాన్ కార్డుకు దరఖాస్తు చేసుకునేందుకు ఉద్దేశించిన మైపాన్, పెన్షనర్లకు ఉద్దేశించిన డిజిలాకర్, ప్రభుత్వ సంస్థల ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు ఉద్దేశించిన డిజి సేవక్ ఇలా 100 రకాల ప్రభుత్వ సేవలను ఉమంగ్ వేదికగా పొందొచ్చు.  

ఖోయ, పాయ యాప్ (Khoya Paya)
representational imageఇది సామాజిక సేవా దృక్పథంతో కూడిన యాప్. తప్పిపోయిన చిన్నారుల వివరాలు ఈ యాప్ వేదికగా పంచుకోవచ్చు. ఎవరైనా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. తమ పేరు ఇతర వివరాలతో రిజిస్టర్ చేసుకున్న తర్వాత తమకు తెలిసి తప్పిపోయిన చిన్నారుల వివరాలను పోస్ట్ చేయవచ్చు. దాంతో ఆ వివరాలు ఈ యాప్ వేదికగా అందిరికీ తెలిసిపోతాయి. దీంతో చిన్నారులను గుర్తించే ప్రక్రియ సులభమవుతుంది. ఇదే యాప్ లో ఎంత మంది చిన్నారులు తప్పిపోయారు, ఎంత మంది ఆచూకీ లభించిందన్న వివరాలూ ఉంటాయి. ఆచూకీ లభించిన వారి వివరాల ఆధారంగా తమ వారిని గుర్తించే అవకాశం ఉంటుంది. తప్పిపోయిన పిల్లల వివరాల్ని అందరికీ తక్కువ సమయంలోనే తెలియజేసేందుకు వీలు కల్పించే వేదిక ఇది.

సీబీఈసీ జీఎస్టీ (CBEC GST)
వస్తు సేవల పన్ను (జీఎస్టీ) 2017 జూలై 1 నుంచి అమల్లోకి వచ్చింది. కొత్త పన్ను చట్టానికి మారడం ఎలా, జీఎస్టీ నిబంధనలు, చట్టం ఇతర పూర్తి వివరాలను ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. జీఎస్టీకి సంబంధించి తాజాగా చేసిన మార్పులు, చేర్పుల సమాచారం కూడా లభిస్తుంది. సీబీఈసీ హెల్ప్ డెస్క్ ను ఈ యాప్ నుంచే సంప్రదించొచ్చు.

పోస్ట్ ఇన్ఫో యాప్
representational imageపోస్టల్ సేవలను కస్టమర్ ఫ్రెండ్లీగా మార్చే చర్యల్లో భాగంగా వచ్చిందే పోస్ట్ ఇన్ఫో యాప్. ఈ యాప్ నుంచి స్పీడ్ పోస్ట్, రిజిస్టర్డ్ లెటర్, రిజిస్టర్డ్ పార్సిల్, ఎలక్ట్రానిక్ మనీ ఆర్డర్ సమాచారాన్ని ట్రాక్ చేసుకునే ఆప్షన్ ఉంది. పార్సిల్, లెటర్లు ఇలా పోస్టల్ సేవలకు సంబంధించి చార్జీలను తెలుసుకునేందుకు క్యాలిక్యులేటర్ ఉంది. సమీపంలోని పోస్టాఫీసు లొకేషన్ తెలుసుకోవచ్చు. పోస్టాఫీసు చిరునామా, సంప్రదించాల్సిన వ్యక్తి ఫోన్ నంబర్ల సమాచారం కూడా ఉంటుంది. పొదుపు పథకాల వడ్డీ రేట్ల సమాచారం కూడా తెలుసుకోవచ్చు.

ఆయ్ కర్ సేతు (AAYKAR SETU)
ఆదాయపన్నుకు సంబంధించి మనలో చాలా మందికి ఎన్నో సందేహాలుంటాయి. దాంతో పన్ను రిటర్నుల జోలికి వెళ్లే సాహసం కూడా చేయనివారున్నారు. అయితే, ఈ తరహా వ్యక్తులకు ఆయ్ కర్ సేతు యాప్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. పన్నుకు సంబంధించి సందేహాలను తీర్చుకోవచ్చు. లైవ్ చాట్ సదుపాయం ఉంది. ఆదాయపన్నుకు సంబంధించి ఇతర సేవల సమాచారాన్ని కూడా పొందొచ్చు. పన్ను రిటర్నులు, ఎంత పన్ను చెల్లించాలో తెలిపే కాలిక్యులేటర్లు కూడా ఉన్నాయి.

ఎంఈఏ ఇండియా
representational imageఇది మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్ టర్నల్ అఫైర్స్ (విదేశాంగ శాఖ) అధికారిక యాప్. విదేశాంగ శాఖ పరిధిలో అన్ని సేవల సమాచారం ఈ యాప్ లో ఉంది. ఈ సిటిజన్, పాస్ పోర్టులు, వీసాలు, ఇండియన్ ఎంబసీలు, హై కమిషన్ల సమాచారం ఉంటుంది. శాఖ తరఫున మీడియా ప్రకటనలు కూడా చూడొచ్చు.

పీఎంఓ ఇండియా మొబైల్ యాప్
ప్రజలు తమ సమస్యలను నేరుగా ప్రధాని కార్యాలయం దృష్టికి తీసుకెళ్లేందుకు ఈ యాప్ ఉపకరిస్తుంది. ఇక్కడ పలు అంశాలపై చర్చించే అవకాశం కూడా ఉంది.

హెచ్ పీ గ్యాస్ బుకింగ్
గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకునేదుకు, రీఫిల్ హిస్టరీ చూసుకునేందుకు, ఎల్పీజీ కనెక్షన్ ను సరెండర్ చేసేందుకు, ఫిర్యాదు చేసేందుకు ఈ యాప్ అనువుగా ఉంటుంది. హెచ్ పీ గ్యాస్ వినియోగదారులు దీన్ని డౌన్ లోడ్ చేసుకోవడం ద్వారా సేవల్ని సులభంగా పొందడానికి వీలవుతుంది.

ట్రాయ్ మై స్పీడ్
representational imageటెలికం రెగ్యులేటరీ అథారిటీ (ట్రాయ్) తీసుకొచ్చిన యాప్ మై స్పీడ్. మొబైల్ డేటా వినియోగదారులు తాము వినియోగిస్తున్న డేటా స్పీడ్ ఎంతన్నది రియల్ టైమ్ లో తెలుసుకునేందుకు వీలు కల్పిస్తుంది. యూజర్లు ఈ సమచారాన్ని ట్రాయ్ కు చేరవేయక్కర్లేదు. డేటా స్పీడ్ ఎంతుంది, నెట్ వర్క్ సమాచారం, మొబైల్ ఫోన్ ఏ ప్రాంతంలో ఉంది? తదితర సమాచారం ఈ యాప్ ద్వారా ట్రాయ్ కు చేరుతుంది. దాంతో ట్రాయ్ ఆ వివరాలను బహిరంగ పరుస్తుంది.

మీ సేవ యాప్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పౌర సేవలను స్మార్ట్ ఫోన్ నుంచే పొందేందుకు గాను మీ సేవ యాప్ ను ఆవిష్కరించింది. ఇది పౌర సేవల యాప్. దాదాపు చాలా రకాల ప్రభుత్వ సేవలు దీని ద్వారా పొందొచ్చు. ఎలక్ట్రిసిటీ బిల్లులు, వాటర్, గ్యాస్ బిల్లులు, పన్నుల చెల్లింపులు, బ్యాంకింగ్, వ్యవసాయం, పాస్ పోర్ట్ అప్లికేషన్ స్టేటస్, వార్తలు, హెల్త్ కేర్ ఇలా ఎన్నో రకాల సేవలు, సమాచారం పొందడానికి అవకాశం ఉంది. ఈ యాప్ నుంచి బిల్లులు, పన్నుల చెల్లింపులకు గాను పేమెంట్ గేట్ వే కూడా ఉంది.

పీపుల్స్ ఫస్ట్
representational imageఇది కూడా ఆంధ్రప్రదేశ్ సర్కారు ఆవిష్కరణే. పౌరుల వివరాలు, ప్రభుత్వం నుంచి పొందిన ప్రయోజనాల వివరాలు ఇందులో ఉంటాయి. పౌర సేవలపై ఫిర్యాదు చేసేందుకు అవకాశం ఉంది. ఈ యాప్ సాయంతో ప్రభుత్వ అధికారులు నేరుగా ప్రజలకు కాల్ చేసి ప్రభుత్వ కార్యక్రమాలపై అభిప్రాయాలను స్వీకరిస్తారు. అదే సమయంలో పౌరులు సైతం తమ ఫిర్యాదులను తెలియజేయవచ్చు. ఈ యాప్ ఇన్ స్టాల్ చేసుకున్న వారు తమ ఆధార్ నంబర్ ఆధారంగా లాగిన్ అవొచ్చు. ప్రభుత్వ రికార్డుల్లో నమోదైన తమ కుటుంబ సభ్యుల వివరాలను పొందొచ్చు. అలాగే, కులం, నివాసం, ఆదాయం, బర్త్, డెత్ సర్టిఫికెట్స్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ప్రభుత్వ పథకాల సమాచారం తెలుసుకోవచ్చు.

ఆర్ టీఏ ఎం వాలెట్
ఇది తెలంగాణ ప్రభుత్వ రవాణా శాఖ రూపొందించిన యాప్. వాహనదారులు తమ వాహన డాక్యుమెంట్లను డిజిటల్ రూపంలో భద్రపరుచుకునేందుకు ఉద్దేశించినది. వాహన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (ఆర్సీ), డ్రైవింగ్ లైసెన్స్, వాహన ఇన్సూరెన్స్ పత్రాలను డిజిటల్ రూపంలో యాప్ లోకి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఆర్టీఏ, పోలీసు అధికారులు తనిఖీ సమయంలో ఇవి చూపిస్తే సరిపోతుంది. ఫిజికల్ గా అసలు పత్రాలను వెంట తీసుకెళ్లక్కర్లేదు. దీంతో అవి పోతాయని, వర్షానికి తడిసిపోతాయన్న భయం అక్కర్లేదు. ఒక్కసారి వాహన పత్రాలను డౌన్ లోడ్ చేసుకుంటే ఆఫ్ లైన్ లోనూ వాటిని యాసెస్ చేసుకోవచ్చు.

మై జీహెచ్ఎంసీ
representational imageఇది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) కు సంబంధించిన యాప్. ఐదు కీలకమైన సేవలను ఈ యాప్ అందిస్తోంది. ప్రాపర్టీ ట్యాక్స్, ట్రేడ్ లైసెన్స్ ఫీజు, లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) దరఖాస్తుల పనితీరు, బర్త్, డెత్ సర్టిఫికెట్స్ దీని ద్వారా అందుతాయి. వీటికి సంబంధించిన పత్రాలు డిజిటల్ రూపంలో పొందొచ్చు. మ్యాన్ హోల్స్, పాతోల్స్, చెత్త వేసే ప్రదేశాలు, వీధి లైట్లకు సంబంధించి పౌరులు ఫిర్యాదు చేయవచ్చు.

హాక్ ఐ
హైదరాబాద్ పోలీసు ఐటీ సెల్ దీన్ని అభివృద్ధి చేసింది. మహిళలు ప్రయాణాల్లో అత్యవసర పరిస్థితులు ఎదురైతే సాయం కోసం ఎస్ఓఎస్ బటన్ ను క్లిక్ చేయవచ్చు. తెలంగాణ పోలీసుల కాంటాక్టు నంబర్లు తెలుసుకునేందుకు, పోలీసులకు పిర్యాదు చేసేందుకు ఈ యాప్ ఉపయోగపడుతుంది. ఈ యాప్ కు జాతీయ స్థాయిలో ఈ గవర్నెన్స్ కేటగిరీ కింద బంగారు అవార్డు కూడా వరించింది.

హైదరాబాద్ ట్రాఫిక్ లైవ్
representational imageజంట నగరాల పరిధిలో ట్రాఫిక్ సమాచార సేవల కోసం ఈ యాప్ ఉపయోగపడుతుంది. లోకల్ ట్రాఫిక్ పోలీసు స్టేషన్ల సమాచారం, చిరునామా, అధికారుల కాంటాక్టు నంబర్లు, ట్రాఫిక్ నియమాలు, నిబంధనలు, రోడ్డుపై ప్రయాణించే సమయంలో పాటించాల్సిన టిప్స్, అత్యవసర కాంటాక్టు సమాచారం, ట్రాఫిక్ ఉల్లంఘనలపై జరిమానా, ఆటో చార్జీలు, లైవ్ ట్రాఫిక్ సమాచారం ఇలా ఎన్నో వివరాలు ఈ యాప్ లో లభిస్తాయి.

టీ వ్యాలెట్
తెలంగాణ ప్రభుత్వం టీ వ్యాలెట్ పేరుతో ఓ యాప్ ను ఎప్పుడో విడుదల చేసింది. దీని ద్వారా చెల్లింపులు చేసుకోవచ్చు. లావాదేవీలపై రుసుం ఉండదు. ఇది ప్రజలు, ప్రభుత్వానికీ ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే ప్రజలు ప్రభుత్వం నుంచి ప్రయోజనాలన్ని పొందుతున్నప్పుడు... ప్రభుత్వం నేరుగా ప్రజలకు ప్రయోజనాలు అందించాలనుకుంటే అందుకు ఈ యాప్ ఉపకరిస్తుంది. ఈ యాప్ ద్వారా ప్రజలు ప్రభుత్వ, ప్రైవేటు లావాదేవీలకు చెల్లింపులు చేసుకోవచ్చు. ప్రభుత్వ పథకాల లబ్దిదారులకు యాప్ ప్రయోజనాలను అందిస్తుంది.

టీ రేషన్
representational imageతెలంగాణ పౌర సరఫరాల శాఖ టీ రేషన్ పేరుతో  ఒక యాప్ ను తీసుకొచ్చింది. దీని ద్వారా  రేషన్ కార్డుదారులు తమ కార్డుపై ప్రభుత్వం ఎంత మేర కోటా విడుదల చేసింది?, ఏ రేషన్ షాపునకు?, ఓ రేషన్ షాపునకు విడుదల చేసిన కమోడిటీలు, ప్రస్తుతం రేషన్ దుకాణంలో ఉన్న స్టాక్, రేషన్ కార్డుపై జరిగిన లావాదేవీల గురించి తెలుసుకోవచ్చు. రేషన్ షాపు నంబర్, డీలర్ పేరు, మొబైల్ నంబర్, రేషన్ షాపు తెరిచి ఉందా, లేక మూసేసి ఉందా? తదితర సమాచారం తెలుసుకోవచ్చని పౌర సరఫరాల శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ వెల్లడించారు.


More Articles