కేన్సర్ నుంచి కాపాడే ఎల్ఐసీ పాలసీ... తక్కువ ప్రీమియానికే చక్కని రక్షణ!

కేన్సర్ అంటే ఏంటో పదేళ్ల క్రితం తెలిసింది తక్కువే. కానీ, నేడు మన మధ్య ఎవరో ఒకరు కేన్సర్ బారిన పడుతూ ప్రాణాలు కోల్పోవడం చూస్తున్నాం. పెరిగిపోతున్న కాలుష్యం, మారిపోయిన ఆహార, జీవన విధానాలే కేన్సర్ ముప్పును పెంచుతున్నట్టు నిపుణులు భావిస్తున్నారు. ఈ మహమ్మారిని తొలి దశలో గుర్తిస్తే నూరు శాతం ప్రాణాలను కాపాడే వైద్య విధానాలు అందుబాటులో ఉన్నాయి.


కానీ, తొలి దశలో దీని లక్షణాలు బయటపడవు. అధిక శాతం కేసుల్లో ఏ మూడో దశలోనో గానీ గుర్తించడం లేదు. దీంతో చికిత్సలకే లక్షలాది రూపాయలు ధారపోయాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కేన్సర్ చికిత్సల వ్యయాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వరంగ బీమా సంస్థ ఎల్ఐసీ కేన్సర్ కవర్ (ప్లాన్ 905)ను ప్రవేశపెట్టింది. ఇందులో ప్రయోజనాలు, సదుపాయాల గురించి తెలుసుకుందాం.


కేవలం కేన్సర్ కోసమే
representational imageఎల్ఐసీ కేన్సర్ కవర్ పాలసీ కేవలం కేన్సర్ వ్యాధి బారిన పడితే ఏక మొత్తంలో పరిహారం చెల్లించే పాలసీ. ఇది సంప్రదాయ (నాన్ లింక్డ్) పాలసీ. ప్రీమియం వార్షికంగా చెల్లించడం ద్వారా ఏటేటా రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా రెన్యువల్ చేసుకుంటేనే మరుసటి ఏడాదికి కవరేజీ లభిస్తుంది.

అర్హతలు, కవరేజీ
20 ఏళ్ల నుంచి 65 ఏళ్ల వయసు వరకు ఈ పాలసీ తీసుకునేందుకు అర్హులు. కనీస పాలసీ కాల వ్యవధి 10 ఏళ్లు. గరిష్ట పాలసీ వ్యవధి 30 ఏళ్లు. ఉదాహరణకు 20 ఏళ్ల వ్యక్తి కేన్సర్ కవర్ పాలసీ తీసుకుంటే అతడు తక్కువలో తక్కువ 30వ సంవత్సరం వరకు కవరేజీ పొందొచ్చు. గరిష్టంగా 50వ సంవత్సరం వరకు అవకాశం ఉంటుంది. అదే 65 ఏళ్ల వయసున్న వ్యక్తి ఈ పాలసీ తీసుకుంటే గరిష్టంగా పదేళ్ల పాటే కవరేజీకి అవకాశం. అంటే 75 ఏళ్ల వయసు దాటిన తర్వాత కవరేజీ ఉండదు. ఉదాహరణకు 55 ఏళ్ల వయసున్న వ్యక్తి పాలసీ తీసుకుంటే గరిష్టంగా 75వ ఏట వరకు అంటే 20 ఏళ్ల కాలానికే పాలసీ పొందేందుకు అవకాశం ఉంటుంది. కనీసం పది లక్షల రూపాయలు, గరిష్టంగా 50 లక్షల రూపాయల కవరేజీని ఎంచుకోవచ్చు.

ప్రీమియం
ఎంత ఎంపిక చేసుకున్నారన్న దాన్ని బట్టి చెల్లించాల్సిన ప్రీమియం ఆధారపడి ఉంటుంది. మొదటి ఐదేళ్లు ప్రీమియంలో మార్పు ఉండదు. ఐదేళ్ల తర్వాత క్లెయిమ్స్ అధికంగా వస్తే దాన్ని బట్టి ప్రీమియంను ఎల్ఐసీ మార్చే అవకాశం ఉంది. కనీస వార్షిక ప్రీమియం రూ.2,400. పాలసీని ఆన్ లైన్ లో రెన్యువల్ చేసుకోవచ్చు.

రెండు కవరేజీ ఆప్షన్లు
representational imageవీటిలో ఒకటి, లెవల్ సమ్ ఇన్సూర్డ్. పాలసీ కాల వ్యవధి వరకు సమ్ ఇన్సూర్డ్ (బీమా మొత్తం) మారకుండా స్థిరంగా ఉండేది లెవల్ సమ్ ఇన్సూర్డ్. మరో ఆప్షన్ ఇంక్రీజ్ సమ్ ఇన్సూర్డ్. అంటే ఏటా బీమా కవరేజీ మొత్తం పెరుగుతూ వెళుతుంది. పాలసీ తీసుకున్న అనంతరం మొదటి ఏడాటి పూర్తయిన దగ్గర్నుంచి ఏటేటా 10 శాతం చొప్పున తొలి ఐదేళ్ల పాటు ఇలా పెరుగుతుంది. లేదా కేన్సర్ బారిన పడే వరకూ పెరుగుతూ వెళుతుంది. ఇందులో ఏది ముందు అయితే దానికే ఈ నిబంధన వర్తిస్తుంది. ఉదాహరణకు పాలసీ తీసుకున్న తర్వాత ఐదేళ్ల వరకు కేన్సర్ బారిన పడలేదనుకోండి. ఏటేటా 10 శాతం చొప్పున కవరేజీ ఐదేళ్లలో 50 శాతం పెరుగుతుంది. ఒకవేళ నాలుగో ఏట కేన్సర్ గుర్తించడం జరిగితే పెరుగుదల ఆ ఏడాదితో ఆగిపోతుంది. ఈ రెండింటిలో ఏది ముందు అయితే అదే అమల్లోకి వస్తుంది.

ప్రయోజనాలు
ఇది కేన్సర్ వ్యాధి రక్షణకు ఉద్దేశించిన పాలసీ మాత్రమే. పాలసీ కాల వ్యవధిలో కేన్సర్ బారిన పడితేనే పరిహారం అందుతుంది. కాల వ్యవధి ముగిసిన తర్వాత ఏ విధమైన ప్రయోజనం చెల్లించడం జరగదు. అలాగే, కాల వ్యవధి మధ్యలో సరెండర్ చేసే సదుపాయం కూడా లేదు. ఈ పాలసీకి ఎటువంటి చెల్లింపు విలువ ఉండదు కనుక రుణానికి కూడా అవకాశం లేదు.

ఎర్లీ స్టేజ్ కేన్సర్
representational imageకేన్సర్ ను ముందస్తు దశలో గుర్తిస్తే పాలసీ దారుడికి బీమా మొత్తంలో 25 శాతం ఒకే విడత చెల్లిస్తారు. ఆ తర్వాత కూడా పాలసీ అమల్లో ఉంటుంది. తొలి దశ కేన్సర్ గుర్తించిన తర్వాత మూడేళ్ల పాటు ప్రీమియం చెల్లించక్కర్లేదు. మూడేళ్ల తర్వాత నుంచి మళ్లీ ఏటా ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. తొలి దశ కేన్సర్ గుర్తించిన తర్వాత మిగిలిన పాలసీ కాలానికి కేవలం మేజర్ కేన్సర్ కవర్ మాత్రమే అమల్లో ఉంటుంది. మేజర్ కేన్సర్ ఉన్నట్టు ఆ తర్వాత బయటపడితే మిగిలిన పరిహారం అందుతుంది. కేన్సర్ తొలి దశ కింద రెండో సారి పరిహారం పొందేందుకు అవకాశం లేదు. శరీరంలోనే మరో చోట వేరొక కేన్సర్ తొలి దశలో ఉన్నట్టు గుర్తించినా పరిహారం రాదు.

మేజర్ స్టేజ్ కేన్సర్
మేజర్ కేన్సర్ ఉన్నట్టు గుర్తించినప్పుడు బీమా మొత్తంలో అంతకుముందు తొలి దశలో ఏమైనా చెల్లించి ఉంటే ఆ మేరకు మినహాయించి మిగిలిన పరిహారం చెల్లిస్తారు. మేజర్ కేన్సర్ ఉన్నట్టు నిర్ధారణ అయితే పైన చెప్పినట్టు పూర్తి పరిహారం చెల్లించడంతోపాటు బీమాలో ఒక శాతం మొత్తాన్ని ప్రతీ నెలా పదేళ్ల పాటు చెల్లించడం జరుగుతుంది. దీనికి పాలసీ కాల వ్యవధితో సంబంధం లేదు. అలాగే, పాలసీదారుడు జీవించి ఉండకపోయినా సరే ప్రతీ నెలా ఇన్ కమ్ బెనిఫిట్ ఒక శాతం చొప్పున పదేళ్ల పాటు నామినీ లేదా కుటుంబ సభ్యులకు చెల్లించడం జరుగుతుంది.

మేజర్ కేన్సర్ ఉన్నట్టు నిర్ధారణ అయిన మరుసటి పాలసీ సంవత్సరం నుంచి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేదు. మేజర్ స్టేజ్ కేన్సర్ పరిహారం చెల్లింపు అనంతరం, ప్రతీ నెలా ఇన్ కమ్ బెనిఫిట్ మినహా మరే ఇతర చెల్లింపులు ఉండవు. ఒకేసారి ఒకటికి మించిన కేన్సర్లను గుర్తిస్తే ఎల్ఐసీ ఒకే బెనిఫిట్ చెల్లిస్తుంది. అది కూడా ఏ దశలో ఉంటే ఆ మేరకే పరిహారం వస్తుంది.

పన్ను ప్రయోజనం
కేన్సర్ కవర్ పాలసీకి చెల్లించే ప్రీమియం మొత్తానికి ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 80డీ కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. ఇది గరిష్టంగా రూ.55,000 వరకే. ఈ పాలసీకి చెల్లించే ప్రీమియంను సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకోవడానికి వీల్లేదు.

మినహాయింపులు
కేన్సర్ ప్రారంభ దశ కవరేజీ కింద.... నిరపాయకరమైన ట్యూమర్లు, ప్రాణాంతకం కానివి, తక్కువ ప్రాణ ప్రమాదం ఉన్న వాటికి పరిహారం రాదు. కవరేజీ వర్తించని వాటిలో డిస్ ప్లాసియా, ఇంట్రా ఎపీథెలియల్ నియోప్లాసియా లేదా స్క్వామస్ ఇంట్రా ఎపీథెలియల్ లెసన్స్, కార్సినోమా ఇన్ సిటు, మెలనోమా ఇన్ సిటు, హెచ్ఐవీ ఇన్ఫెక్షన్ తో కూడిన అన్ని రకాల ట్యూమర్లకు పరిహారం రాదు.

వేచి ఉండే కాలం
representational imageపాలసీ జారీ చేసిన తేదీ నుంచి 180 రోజుల పాటు కవరేజీ కోసం వేచి ఉండే కాలం. లేదా రిస్క్ కవరేజీని పునరుద్ధరించుకున్న తేదీ నుంచి ఆరు నెలలపాటు అమల్లో ఉంటుంది. ఏది ఆలస్యం అయితే దాన్ని కవరేజీకి అమల్లోకి తీసుకోవడం జరుగుతుంది. ఏ దశ కేన్సర్ అయినా ఇదే వర్తిస్తుంది. వేచి ఉండే కాలంలో ఏ కేన్సర్ బయటపడినా పరిహారం చెల్లించకపోగా, పాలసీని రద్దు చేయడం జరుగుతుంది. వేచి ఉండే కాలం తర్వాత కేన్సర్ ఉన్నట్టు నిర్ధారణ అయితేనే పరిహారం అందుతుంది.

జీవించి ఉంటేనే పరిహారం
ఈ పాలసీ తీసుకున్న వారిలో కేన్సర్ తొలి దశ లేదా ప్రధాన దశ ఉందని బయటపడిన తర్వాత ఏడు రోజుల పాటు జీవించి ఉంటేనే పరిహారం లభిస్తుంది. కేన్సర్ గుర్తించిన తేదీ నుంచి ఏడు రోజులు లెక్కలోకి తీసుకుంటారు.

ప్రధానాంశాలు
  • ఈ పాలసీని ఆన్ లైన్ లోనూ కొనుగోలు చేయవచ్చు. ఇలా చేస్తే ప్రీమియం 7 శాతం తగ్గుతుంది.
  • మేజర్ స్టేజ్ దశ కేన్సర్ లో పూర్తి పరిహారంతోపాటు ఇన్ కమ్ బెనిఫిట్ ఉండడం ఆకర్షణీయం.
  • ప్రీమియం ఐదేళ్లకోసారి పెరిగే అవకాశం ఉంది. క్లెయిమ్స్ ను బట్టి ఎల్ఐసీ మార్పులు చేయవచ్చు. నచ్చని వారు రెన్యువల్ చేసుకోకుండా ఆపేస్తే సరి.
  • ఈ పాలసీలో థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్ ఎవరూ ఉండరు. కనుక క్లెయిమ్ ప్రక్రియ కాస్తంత శ్రమతో కూడినదే.
  • ఇందులో ఉన్న మినహాయింపులు ఓ పట్టాన సులభంగా అర్థం కావు. కుటుంబ సభ్యులందరికీ ఓ ప్లాన్ లేదు. ఎవరికి వారు విడిగా తీసుకోవాల్సి రావడం ప్రతికూలత.
  • సాధారణ బీమా కంపెనీలు సైతం కేన్సర్ కవరేజీ పాలసీలను అందిస్తున్నాయి. కనుక ఎల్ఐసీ కేన్సర్ కవర్ తీసుకునే ముందు వాటిని సైతం ఓసారి పరిశీలించడం మంచిది.


More Articles