నిద్రలో గురక పెడుతున్నారా?

నిద్రలో గురక సమస్య ఉందా...? అయితే ఓ సారి ఆలోచించాల్సిందే! అరుదుగా ఏ ఒకటి, రెండు నిమిషాలో అయితే ఆందోళన అక్కర్లేదు గానీ, ప్రతి రాత్రి గురక సాధారణంగా మారితే కచ్చితంగా ఓ సారి వైద్యులను సంప్రదించడమే మంచిది. ఎందుకంటే దాని వెనుక ఏముందో ఎవరికి తెలుసు?


గురక నిద్ర నాణ్యతను దెబ్బతీస్తుంది. దాంతో నిద్రలో శరీరానికి, మనసుకు అసలైన విశ్రాంతి ఉండదు. గురక పెట్టేవారి కంటే, పక్కనున్న వారికీ ఇబ్బంది ఎంతో. గురక శబ్ధానికి భయపడి వారి సమీపంలో నిద్రించేందుకు వెనుకాడొచ్చు. మరి గురక లేకుండా నిద్రించడం ఎలాగన్నది, అందుకు ఏం చేయాలన్నది వైద్య నిపుణుల సూచనల ద్వారా తెలుసుకుందాం.

గురక ఎందుకొస్తుంది?
నిద్ర సమయంలో గాలి ముక్కుల నుంచి ఊపిరితిత్తుల్లోకి వెళ్లే మార్గంలో అడ్డంకులు ఏర్పడితే అప్పుడు గురక వస్తుంది. అలాగే, ఈ సమయంలో నోటి ద్వారా శ్వాస తీసుకునే ప్రయత్నం జరుగుతుంది. ఆ మార్గంలోనూ అవాంతరాలుంటే అప్పుడు కుచించుకుపోయిన మార్గం నుంచి గాలి వెళ్లాల్సి ఉండడంతో చుట్టుపక్కల ఉన్న కణజాలాలు కదలికకు గురై చప్పుళ్లు వస్తాయి. ఇది ఒక్క కారణం మాత్రమే. కానీ, వాస్తవంలో మరెన్నో అంశాలు, సమస్యలు గురకకు కారణం కావచ్చు. అవేంటన్నది తెలుసుకోవడం అవసరం. ఎందుకంటే ఇది పరిష్కారమయ్యే సమస్యే గనుక.

representational imageనోటి ద్వారా శ్వాస
సాధారణంగా ముక్కుల ద్వారా గాలి తీసుకుంటాం. కానీ, నాసికా మార్గాల్లో అవాంతరాల వల్ల కొందరు నోటితో శ్వాస తీసుకుంటుంటారు. అలర్జీలు, సైనస్ ఇన్ఫెక్షన్, ముక్కులోపలి భాగం వాచిపోవడం, అడినాయిడ్స్ అన్నీ కూడా శ్వాస మార్గానికి అడ్డంకులే.

వయసు
మధ్య వయసు, ఆపై వయసుకు వచ్చిన తర్వాత గొంతు భాగం సన్నబడుతుంది. దీనివల్ల గురక రావడానికి అవకాశం ఉంటుంది.

అధిక బరువు
మహిళలతో పోలిస్తే పురుషుల్లో గురక సమస్య ఎక్కువగా వస్తుంది. వాయు నాళాలు తక్కువ వ్యాకోచంతో ఉంటాయి. అధిక బరువు ఉండడం వల్ల మెడ, గొంతు భాగంలో అధిక బరువు పడినా గురకకు దారితీస్తుంది.

నాసల్, సైనస్ సమస్యలు
సైనస్ సమస్యలో ముక్కు నాసికా కుహరములు జామ్ అవుతాయి. దీంతో గాలి కష్టంగా వెళ్లాల్సి వచ్చి శబ్దం బయటకు వస్తుంది.

ఆల్కహాల్, ఔషధాలు
మద్యం, పొగతాగడం, ట్రాంక్విలైజర్ ఔషధాలైన లోరజ్ పామ్, డైజిపామ్ కండరాలకు పూర్తి విశ్రాంతిని కలిగిస్తాయి. దానివల్ల కూడా గురక రావచ్చు.

representational imageనిద్రా భంగిమ
పడుకునే తీరు సరిగా లేకపోయినా ఈ సమస్యకు కారణం కావచ్చు.  

మెడ నిర్మాణం
మెడ భాగం మందంగా ఉన్న వారిలో, అలాగే లావుగా ఉండి, మెడ సన్నగా ఉన్న వారిలోనూ ఈ సమస్య కనిపిస్తుంది.

తీవ్ర సమస్యలు
తరచుగా గురక పెడుతున్న వారు అబ్ స్ట్రక్టివ్ స్లీప్ ఆప్నియా బారిన పడే ప్రమాదం ఉంటుంది. స్లీప్ ఆప్నియా అనేది తీవ్రమైన నిద్ర రుగ్మత. దీని వల్ల శ్వాస తీసుకోవడంలో దీర్ఘ అవరోధాలు, తరచూ నిద్ర నుంచి మేల్కొనడం, గాఢ నిద్ర లేకపోవడం వంటివి రావచ్చు. దీర్ఘకాలంగా గురక కొనసాగుతుంటే రక్తపోటు పెరిగే అవకాశాలున్నాయి. దీనివల్ల గుండె ఎన్ లార్జ్ అయ్యే ప్రమాదం ఉంది. దీంతో హార్ట్ ఎటాక్, స్ట్రోక్ ముప్పు పెరుగుతుంది. గురక వల్ల సరిగ్రా నిద్ర ఉండదు. దీనివల్ల కూడా పలు అనారోగ్య సమస్యలు రావచ్చు. సరైన ఆక్సిజన్ ను తీసుకోలేని స్థితి వల్ల రక్తంలో ఆక్సిజన్ శాతం తగ్గిపోతుంది. దీంతో పల్మనరీ హైపర్ టెన్షన్ సమస్య బారిన పడతారు. అలాగే, దీర్ఘకాలం పాటు తలనొప్పి, స్థూలకాయం, అలసట, పగలు నిద్రించడం వంటివి ఉంటాయి. గురక చాలా పెద్ద శబ్దంతో వస్తూ, పగటి పూట నిద్రిస్తుంటే దాన్ని స్లీప్ ఆప్నియాగానే పరిగణించాలి. లేదంటే శ్వాస తీసుకోవడంలో పెద్ద సమస్య ఏదో ఉందని భావించాల్సి ఉంటుంది. స్లీప్ ఆప్నియాతో గుండెకు చేటు.

representational imageచిన్నారుల్లోనూ...
చిన్నారుల్లోనూ గురక సమస్య కనిపిస్తుంటుంది. ఓ అంచనా ప్రకారం ప్రతీ 100 మంది పిల్లలలో 15 మందిలో ఇది కనిపిస్తుంది. గొంతు ద్వారా వెళ్లే శ్వాసమార్గంలో అవాంతరాలు, కుచించుకుపోవడం, సరిగా నిర్మాణం కాకపోవడం ఈ విధమైన కారణాల వల్ల రావచ్చు. అలర్జీలు, గొంతు భాగంలోని టాన్సిల్స్ వాయడం వల్ల కూడా గురక వస్తుంది. ఎక్కువ మంది పిల్లలలో టాన్సిల్స్ వాపే ఈ సమస్యకు కారణం. నెలలు నిండక ముందు పుట్టే పిల్లల్లో, అధిక బరువుతో ఉన్న వారిలోనూ ఇది కనిపించొచ్చు. పిల్లలు నిద్రలో తరచూ కదులుతుంటే, ఛాతీ కదలికలు అసాధారణంగా ఉంటే, గురక పెడుతుంటే వారిలో శ్వాసపరంగా అవాంతరాలున్నట్టు అర్థం చేసుకోవాలి. కానీ, ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే గురక అన్నది పిల్లల ఎదుగుదల మీద ప్రభావం చూపిస్తుందని వైద్య నిపుణులు అంటున్నారు. అందుకే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులకు చూపించాలి.

గుర్తించడం ఎలా?
గురక సమయంలో వీడియో, ఆడియా రికార్డు చేసి దాన్ని వైద్యులకు చూపిస్తే సమస్యను గుర్తించడం సులభం అవుతుంది. అలాగే, పల్స్ ఆక్సిమెట్రీ సాయంతో  రక్తంలో ఆక్సిజన్ పరిమాణాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. ఎటువంటి అనారోగ్య సమస్య లేకపోతే గురక నుంచి బయటపడేందుకు పలు మార్గాలను సూచించొచ్చు. సమస్య ఉన్నట్టు గుర్తిస్తే అప్పుడు మందులు లేదా శస్త్రచికిత్స ద్వారా సమస్యను సరిచేస్తారు. నోరుమూసి గురక పెడుతుంటే నాలుక కారణంగా గురక వస్తుందని... నోరు తెరిచి గురక పెడుతుంటే గొంతు కండరాల వల్ల, వెల్లకిలా పడుకున్నప్పుడు చిన్నగా గురక పెడుతుంటే జీవన విధానంలో మార్పులు చేసుకోవడం వల్ల సమస్య పరిష్కారం అవుతుంది. ఏ విధంగా పడుకున్నాగానీ గురక వస్తుంటే అందుకు చికిత్స అవసరం.

సొంతంగా నివారణ
కొన్ని రకాల టెక్నిక్కులు, జీవన విధానంలో మార్పులతో గురక సమస్యను తగ్గించుకోవడం, దాన్నుంచి బయటపడడం సాధ్యమే.
  • నిద్ర భంగిమల్లో మార్పులు చేసుకోవాలి. కనీసం నాలుగు అంగుళాల ఎత్తులో తల ఉంచి నిద్రించినట్టయితే దవడ, నాలుక ముందుకు వస్తాయి. మెడ కండరాలు మడత పడకుండా చూసుకోవాలి.
  • ఒకపక్కకు నిద్రించాలి. వెల్లకిలా పడుకోవద్దు. ముక్కు నాసికా రంధ్రాలు మూసుకుపోతే, నిద్రించే ముందు ముక్కులో సెలైన్ వాటర్ డ్రాప్స్ సాయంతో అడ్డంకులు లేకుండా చూసుకోవాలి. అలెర్జీ ఉంటే అందుకు సంబంధించి మందులను వాడాలి.- అధిక బరువు ఉంటే దాన్ని తగ్గించుకునే కార్యాచరణను వెంటనే మొదలు పెట్టాలి. 
  • పొగతాగే వారిలో గురక సమస్య ఎక్కువ మందిలో వస్తుంది. కనుక ఈ అలవాటును వదిలించుకోవాలి. ఆల్కహాల్, నిద్రమాత్రలకు దూరంగా ఉండాలి.
  • నిద్రించడానికి ముందు జీర్ణం పరంగా కష్టమైన ఆహార పదార్థాలను తీసుకోవద్దు.
representational imageవ్యాయామాలు
  • ప్రతీ రోజూ వ్యాయామం చేయడం, వీలైతే ఈత కొట్టడం వల్ల మంచి ఫలితం వుంటుంది.
  • ఏ ఈ ఐ ఓ యూ అంటూ వోవెల్స్ ను పెద్దగా పలుకుతూ తడవకు మూడు నిమిషాలు పాటు చేయాలి. ఇలా రోజులో వీలైనన్ని సార్లు చేయొచ్చు.- నాలుకను బయటపెట్టి దవడను ఎడమచేతి వైపునకు తిప్పి 30 సెకండ్ల పాటు ఉంచాలి. ఆ తర్వాత ఇదే విధంగా దవడను కుడి వైపునకు తిప్పి మరో 30 సెకండ్ల పాటు ఉంచాలి. 

  • చికిత్సా విధానాలు
వైద్యపరంగా ఆధునిక చికిత్సా విధానాలు వచ్చేశాయి. గురక సమస్య తగ్గదన్న అభిప్రాయాన్ని విడిచిపెట్టి వెంటనే చెవి, గొంతు, ముక్కు డాక్టర్ ను సంప్రదించాలి. కొన్ని రకాల పరికరాలు, మందులు వీటిలో ఏదైనా సూచించే అవకాశం ఉంది. సైనస్, టాన్సిల్స్ వల్ల గురక వస్తుంటే శస్త్రచికిత్స ద్వారా అయినా సమస్యను సరిచేయవచ్చు. దీర్ఘకాలంగా గురకతో బాధపడుతుంటే స్లీప్ ఆప్నియా సమస్య ఉందని గుర్తిస్తే దాన్ని నయం చేసేందుకు మందులు సూచిస్తారు. గుండెకు సంబంధించి కూడా పరీక్షలు చేసి చూస్తారు. నిజానికి గురక బయటకు కనిపించే లక్షణం. ఏం కాదులే అని నిర్లక్ష్యం తగదు. దాని మూలాన్ని, ఎందుకు వస్తుందో కారణాన్ని గుర్తించాలి. దానివల్ల అరుదుగా గుండె జబ్బులు, ఇతర ఇబ్బందులు బయటపడే అవకాశం ఉంది. అందుకే ఓ సారి వైద్యులను సంప్రదించి సమగ్ర పరీక్షలు చేయించుకోవడం మంచిది.


More Articles