ఫోన్లలో డ్యుయల్ కెమెరాలతో లాభమేంటి?

వన్ ప్లస్5 ఫోన్ డ్యుయల్ కెమెరాలతో దేశ మార్కెట్లోకి విడుదలైంది. దీంతో మరోసారి డ్యుయల్ కెమెరాల (ఫోన్ కు ఒకవైపే ఒకటికి బదులు రెండు కెమెరాలు ఉండడం) అంశం చర్చకు వచ్చింది. ఒక్క కెమెరా సరిపోదా? అన్న సందేహం కొందరికి వచ్చి ఉండొచ్చు. డ్యుయల్ కెమెరాల వల్ల ఒరిగే లాభమేంటన్నది తెలుసుకుందాం.


డ్యుయల్ కెమెరా ఫోన్ అంటే ముందు, వెనుకా ఫోన్ ఉన్నదని కాదు అర్థం. వెనుక లేదా ముందు భాగంలోనే రెండు కెమెరాలతో ఉన్న ఫోన్ అని అర్థం. వాస్తవానికి డ్యుయల్ కెమెరా ఫోన్లు అన్నవి ఇప్పుడు కొత్తగా వచ్చినవి కావు. 2011కు ముందే హెచ్ టీసీ ఎవో3డీ స్మార్ట్ ఫోన్ ను రెండు రియర్ కెమెరాలతో తీసుకొచ్చింది. తదనంతరం మరికొన్ని కంపెనీలు ఈ టెక్నాలజీపై దృష్టి పెట్టాయి. 2014లో హెచ్ టీసీ మరోసారి డ్యుయల్ కెమెరాల సెటప్ తో హెచ్ టీసీ వన్ ఎం8ను తీసుకొచ్చింది. స్మార్ట్ ఫోన్లలో పరిమిత స్పేస్ లో మెరుగైన ఫోటోల కోసం గాను రెండు కెమెరాల టెక్నాలజీని ప్రవేశపెట్టడం జరిగింది. తాజాగా విడుదలైన వన్ ప్లస్5లో అయితే ఏకంగా 20+20 మెగా పిక్సల్స్ కెమెరాలున్నాయి. గతేడాది హువే పీ9, ఎల్జీ జీ5, ఐఫోన్ 7ప్లస్ కూడా దేశంలోకి అడుగు పెట్టాయి. వీటి ధరలు రూ.35,000పైనే. కూల్ ప్యాడ్ కూల్1, హానర్ 6ఎక్స్ మంచి ఫోటోలను ఇచ్చే మోడల్స్.

representational imageఉపయోగాలేంటి....?
సెన్సార్ సైజు, పిక్సల్ సైజు, అపెర్చూర్ తదితర విషయాల్లో డ్యుయల్ కెమెరాలతో మంచి ఫలితాలను ఆశించొచ్చు. ఎందుకంటే డ్యుయల్ కెమెరా అంటే రెండు లెన్స్, సెన్సార్ లున్న కెమెరాగా అర్థం చేసుకోవాలి. త్రీ డైెమెన్షనల్ ఇమేజ్ లు తీసుకోవడం సాధ్యమవుతుంది. దీన్నే స్టీరియో ఫొటోగ్రఫీగా పేర్కొంటారు. రెండు కెమెరాలు ఉండడం వల్ల ఫోటోలు షార్ప్ నెస్, మరింత స్పష్టత, వివరాలతో వస్తాయి. డ్యుయల్ కెమెరాలు ఒకదానితో ఒకటి సమన్వయమై పనిచేస్తాయి. ఈ టెక్నాలజీ ఫోటో మరింత స్పష్టంగా, వివరణాత్మకంగా వచ్చేందుకు ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఒకే లెన్స్ ఉన్న కెమెరాతో తీస్తున్న ఫోటోలను గమనించి చూస్తే... వాటిలో ఫేస్ లేదా ప్రధాన వస్తువు స్పష్టంగా ఉండడం, మిగిలిన భాగం స్పష్టంగా లేకపోవడాన్ని గుర్తించొచ్చు. బైనాక్యులర్ విజన్ తరహాలో చిత్రాలను బంధించేందుకు డ్యుయెల్ కెమెరా ఉపయోగపడుతుంది. అంటే మనకు రెండు కళ్లున్నాయి కదా. వాటిలో ఒకటి మూసి రెండో కంటితో చూడండి. రెండు కళ్లతో చూసిన ఏరియా కంటే ఒక్క కంటితో చూసే ఏరియా తక్కువగా ఉంటుంది. పైగా రెండు కళ్లతో చూసినంత స్పష్టంగా, వివరంగా ఒక కన్నుతో కనిపించదు.

డ్యుయల్ కెమెరాల్లోనూ రెండో కెమెరా కన్ను వల్ల స్పష్టత, ఫోటో తీసే ఏరియా పెరుగుతుంది. ప్రతీ లెన్స్ కు ఫిల్మ్ ఫ్రేమ్ విడిగా ఉంటుంది. శామ్ సంగ్ గెలాక్సీ ఎస్7, ఎస్7 ఎడ్జ్, గూగుల్ పిక్సల్, వన్ ప్లాస్ 3, ఎల్జీ జీ5, హెచ్ టీసీ 10 తక్కువ వెలుగులోనూ మంచి ఫలితాలను ఇస్తాయి. ఇతర డ్యుయల్ కెమెరాలతో పోలిస్తే మెరుగైన పనితీరును ఇస్తాయి. సాధారణంగా డ్యుయెల్ కెమెరా ఫోన్లలో మొదటి కెమెరా ఫోటోలు తీసే పనిని చూస్తుంది. రెండో కెమెరా స్పష్టతను పెంచేందుకు జూమ్ కోసం ఉపయోగపడేలా ఏర్పాటు ఉంటుంది. మొదటి కెమెరా చేయని పనులను రెండో కెమెరా చేస్తేంది. సింగిల్ రియర్ కెమెరాల్లో జూమ్ చేస్తే ఇమేజ్ క్వాలిటీ తగ్గుతుంది. కానీ, డ్యుయల్ కెమెరా ఫోన్లలో జూమ్ చేసినా పిక్చర్ క్వాలిటీ దెబ్బతినదు. డ్యుయల్ లెన్స్ లు ఉండడం వల్ల ఎక్కువ వెలుగును తీసుకుంటాయి. వెలుగు తక్కువ ఉన్న చోట కూడా మంచి ఫొటోలు తీయడం సాధ్యమవుతుంది. షేక్ అవడం వల్ల ఇమేజ్ బ్లర్ అవుతుందన్న భయం అక్కర్లేదు.  

representational imageఫ్రంట్ డ్యుయెల్ కెమెరా
మెరుగైన సెల్ఫీ ఫొటోల కోసం గాను ముందు భాగంలోనూ రెండు కెమెరాలతో వచ్చిన స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. లెనోవో వైబ్ ఎస్1 ఈ తరహాదే. ఇందులో ముందు భాగంలో 8 మెగా పిక్సల్స్, 2 మెగా పిక్సల్స్ తో రెండు కెమెరాలున్నాయి.  వివో వీ5 ప్లస్ లోనూ ముందు భాగంలో 20 మెగాపిక్సల్స్, 8 మెగా పిక్సల్స్ తో రెండు కెమెరాలున్నాయి. ధర రూ.26,000 (ఫ్లిప్ కార్ట్).

ప్రతికూలతలు
డ్యుయెల్ కెమెరా ఫోన్లు అధిక బ్యాటరీ శక్తిని వినియోగించుకుంటాయి. పైగా డ్యుయల్ కెమెరా ఫోన్ కు ఎక్కువ ధర వెచ్చించాల్సి ఉంటుంది. డ్యుయల్ కెమెరా ఫోన్లలో నాణ్యమైన కెమెరాలను ఏర్పాటు చేయకపోతే ఫోటోలు అంత మంచిగా రావు. డ్యుయల్ కెమెరాలతో తీసే ఫోటోలు ఎక్కువ స్పేస్ తీసుకుంటాయి. కనుక అధిక సామర్థ్యం ఉన్న బ్యాటరీ ఉండి ఉండాలి. నాణ్యత లేని డ్యుయల్ కెమెరా ఫోన్ కు బదులు ఒక్క కెమెరా ఉన్నప్పటికీ మంచి సామర్థ్యం, నాణ్యత గల కెమెరా, రంగుల కచ్చితత్వం ఉన్న ఫోన్ తీసుకోవడం మంచిదన్నది నిపుణుల సూచన.


More Articles