ఇలా చేస్తే మీ స్మార్ట్ ఫోన్ తో అద్భుతమైన ఫోటోలు తీయెచ్చు!

స్మార్ట్ ఫోన్ సమాచార అవసరాలకే అన్న దశ ఎప్పుడో దాటిపోయింది. సమస్త ప్రపంచమూ స్మార్ట్ ఫోన్ కు దాసోహమైందన్న స్థాయికి వచ్చేసింది. ఎన్నో మధుర ఘట్టాలను, అందమైన దృశ్యాలను బంధించి చిరస్మరణీయంగా ఉంచడంలో స్మార్ట్ ఫోన్ కెమెరా ప్రధాన పాత్ర పోషిస్తోంది. మీ స్మార్ట్ ఫోన్ లో ఇమిడిపోయిన కెమెరాను ఎంత సమర్థవంతంగా వినియోగించుకోవచ్చు...? ఫొటోలను అందంగా ఎలా చిత్రీకరించవచ్చో తెలుసుకుందాం.


representational imageషేక్ కావద్దు
ఫొటోలు తీస్తున్న సమయంలో ఫోన్ షేక్ అవకుండా ఉండాలి. అప్పుడే ఇమేజ్ క్లారిటీ బాగుంటుంది. కెమెరాను ఒక చేత్తో పట్టుకుని స్క్రీన్ పై ట్యాప్ చేస్తే ఫొటో వచ్చేస్తుంది. అయితే, స్క్రీన్ బదులు బటన్ ను ఉపయోగించడం వల్ల షేక్ అవకుండా చూడడం ఈజీ. స్క్రీన్ పై సెలక్షన్ కోసం చేయిని కదిలించడం వల్ల షేక్ కావచ్చు. దీనికి బదులు ఫోన్ ను రెండు చేతులతో ల్యాండ్ స్కేప్ (అడ్డంగా) విధానంలో పట్టుకుని ఫొటోలు తీసుకోవాలి. ఈ సమయంలో పైన ఉండే వ్యాల్యూమ్ బటన్ ను క్లిక్ చేస్తే ఫొటో తీయడం పూర్తవుతుంది. కొన్ని ఫోన్లలో డిఫాల్ట్ గానే వ్యాల్యూమ్ బటన్ కెమెరా బటన్ గానూ ఉపయోగపడుతుంది. కొన్నింటిలో మాత్రం సెట్టింగ్స్ లోకి వెళ్లి వ్యాల్యూమ్ బటన్ ను షట్టర్ బటన్ గా ఎంపిక చేసుకునే అవకాశం ఉందేమో చూడాలి. ఇలా అవకాశం లేకపోతే ఆండ్రాయిడ్ థర్డ్ పార్టీ యాప్స్ అందుబాటులో ఉన్నాయి. గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఈ యాప్స్ లో సెట్ స్టబిలెటీ ఆప్షన్ ను కూడా ఓకే చేసుకోవాలి. అప్పుడు కొంచెం షేక్ అయినా ఇమేజ్ దెబ్బతినకుండా ఉంటుంది.

representational imageవెలుగు
ఫొటోగ్రఫీకి వెలుగు ప్రాణావసరం. మరి ఈ వెలుగు ఎంత ఉండాలన్నది తెలిస్తే ఫొటోలను అద్భుతంగా తీయడం సాధ్యపడుతుంది. కొన్ని ఫొటోలకు గోల్డెన్ అవర్ కీలకం. సూర్యోదయం అయిన వెంటనే అలాగే, సూర్యాస్తమయానికి ముందు సమయాన్ని ఫొటోగ్రఫీ పరంగా గోల్డెన్ అవర్ గా పేర్కొంటారు. ఈ సమయంలో వెలుగు స్థిరంగా ఉంటుంది. ల్యాండ్ స్కేప్ షాట్స్ కు ఇది చాలా అనుకూలమని ఫొటోగ్రఫీ నిపుణుల అభిప్రాయం. మిట్ట మధ్యాహ్నం, మంచుతో కూడిన, మేఘాలతో కూడిన పరిస్థితులు ఫొటోగ్రఫీకి అనుకూలం కాదు. అయినా ఈ సమయాల్లో ఫొటోలు మెరుగ్గా ఉండాలంటే పోట్రయిట్ లో తీసుకోవాలి. దీనివల్ల ఇమేజ్ లో ఇతర విషయాలు పెద్దగా పడవు. ఇండోర్ (భవనాల్లోపల)లో ఫోటోలు తీస్తున్నట్టయితే తగినంత వెలుగు ఉందా? లేదా? అన్నది చెక్ చేసుకోవాలి.

వెలుగు తక్కువగా ఉంటే ఫ్లాష్ లైట్ వాడొద్దు. దీనివల్ల ఫొటోల నాణ్యత ఏమంత మెరుగ్గా రాదు. కెమెరా ఎక్స్ పోజర్, ఐఎస్ వో లెవల్స్ ను పెంచడం కంటే కూడా విడిగా ఐ బ్లేజర్ (వెలుగును ఇచ్చేది) ను వాడడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది. ఇంకా రాత్రి సమయాల్లో ఫొటోగ్రఫీకి అనుకూలంగా నైట్ కెమెరా (ఆండ్రాయిడ్) నైట్ క్యామ్ (ఐవోఎస్) యాప్స్ ను డౌన్ లోడ్ చేసుకోవడం వల్ల మంచి ఫొటోలు తీసుకోవచ్చు. అలాగే, ఫోటోలకు ఎంచుకునే దృశ్యం వెనుక లైటింగ్ ఎక్కువగా ఉండకూడదు. కెమెరా యాప్ ఆన్ చేసిన వెంటనే స్నాప్ తీసేయడం కరెక్ట్ కాదు. దీనివల్ల పిక్చర్ ఆరంజ్ కలర్ లో వస్తుంది. కొన్ని సెకన్ల పాటు ఆగితే కెమెరా యాప్ అక్కడున్న వెలుగుకు తగ్గట్టు అడ్జస్ట్ అవుతుంది. దాంతో పిక్చర్ క్వాలిటీగా వస్తుంది.

representational imageఫొటో కూర్పు
ఫొటోలు తీసే విషయంలో అనుభవం లేని కొత్త వారు గ్రిడ్ వ్యూ సాయం తీసుకోవచ్చు. చాలా స్మార్ట్ ఫోన్లలో ఈ ఆప్షన్ ఉంటోంది. దీన్ని ఆన్ చేస్తే స్క్రీన్ పై గీతలతో కూడిన తొమ్మిది గళ్లు ఏర్పడతాయి. అప్పుడు తీయాలనుకున్న చిత్రం (సబ్జెక్ట్) ఈ గ్రిడ్స్ లైన్స్ రెండు కలిసే చోట ఉండేలా చూసుకోవాలి. దీనివల్ల మరింత బ్యాలన్స్ తో సహజంగా వచ్చేందుకు ఈ విధానం ఉపయోగపడుతుంది. ఫోటోలో బంధించే దృశ్యం మొత్తం ఫోటోను కవర్ చేసేలా ఉండకూడదు. మూడింట ఒక వంతునకే పరిమితం కావాలని నిపుణులు సూచిస్తున్నారు. మిగిలిన రెండు వంతులు నెగటివ్ స్పేస్ కు కేటాయించాలి (ఉదాహరణకు ఓ పాపను ఫోటో తీయాలనుకుంటే ఫోటో మొత్తం కేవలం పాపే ఉండేలా తీయకూడదు). దానివల్ల సబ్జెక్ట్ ప్రముఖంగా కనిపిస్తుంది.
 
బ్యాక్ గ్రౌండ్
ఓ అంశాన్ని తెలియజేసేందుకు బ్యాక్ గ్రౌండ్ ను కూడా ఉపయోగించుకోవచ్చు. ముగ్గురు వ్యక్తులు భవనం కింద కూర్చుంటే, జూమిన్ కు బదులు జూమవుట్ చేసి ఆ భవనాన్ని చూపించి ఇది కూలడానికి సిద్ధంగా ఉందని తెలియజేయవచ్చు. ప్రకృతి విపత్తుకు గురైన ప్రదేశంగా చూపించొచ్చు. ముందు భాగంలో కనిపించే ప్రదేశం కూడా ఫొటోకు బలాన్నిచ్చేదే.

ఆ క్షణాలు కీలకం
ఫొటోలు తీసే విషయంలో ఓపిక చాలా అవసరం. ఓ కార్యక్రమం జరుగుతోంది. అందులో అద్భుతమైన క్షణాలను కెమెరాలో బంధించాలంటే అనుక్షణం వేచి చూడాలి. భావోద్వేగాలు, ఆశ్చర్యం, అద్భుతం, విస్మయం కనిపించిన వెంటనే బంధించాలి. అప్పుడు అవి అద్భుత చిత్రాలుగా నిలబడతాయి.

ఒకటికి మించిన ఫొటోలు
స్మార్ట్ ఫోన్ లో ఫొటోలు తీసే విషయంలో గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకే క్లిక్ తో ఆగిపోవద్దు. ఒక ఘటన లేదా దృశ్యాన్ని కనీసం రెండు, మూడు ఫొటోలైనా తీసుకోవాలి. ఆ తర్వాత ఏది మెరుగ్గా ఉందో దాన్ని ఉంచి మిగిలినవి ఎరేజ్ చేయవచ్చు. ముఖ్యంగా గ్రూప్ ఫొటోలు, సెల్ఫీలకు ఒకటి కంటే ఎక్కువ ఫొటోలు తీయడం తప్పనిసరి. ఎందుకంటే ఒక్కోసారి చేయి షేక్ అవొచ్చు. గ్రూపులోని వారిలో ఒకరో ఇద్దరో పక్కకు చూడడం, కను రెప్పలు ఆర్పడం వంటివి చేయవచ్చు.

representational imageసెట్టింగ్స్
స్మార్ట్ ఫోన్ కెమెరాకు సంబంధించి డిఫాల్ట్ మోడ్ సెట్ చేసి ఉంటుంది. కొంత మంది ఫోన్ కొని వాడేస్తారు తప్పితే వీటిని ఒక్కసారి కూడా పరిశీలించరు. పిక్చర్ నాణ్యత మెరుగ్గా ఉండాలంటే ఈ సెట్టింగ్స్ ను మార్చుకుంటూ ఉండాలి. ఫోకస్, ఎక్స్ పోజర్, వైట్ బ్యాలన్స్, ఐఎస్ వో ఇలా పలు ఆప్షన్లు సెట్టింగ్స్ లో ఉంటాయి. వైట్ బ్యాలన్స్ లో నాలుగు సెట్టింగ్స్ ఉంటాయి. ఫొటో తీసే చోట ఉండే వెలుతురును బట్టి తగిన ఆప్షన్ ఎంచుకోవాలి. క్లౌడీ, డే లైట్, ఫ్లోరసెంట్, ఇన్ కాండెసెంట్, ఆటో తదితర ఆప్షన్లు ఉండొచ్చు. వీటిలో క్లౌడీ, డే లైట్ ఆప్షన్లు అవుట్ డోర్ లో (బయట) ఫొటోలు తీసేందుకు అనువైనవి. ఫ్లోరోసెంట్, ఇన్ కాండెసెంట్ భవనం లోపల ఫొటోలకు ఉపకరించేవి. రిజల్యూషన్ ను అధిక స్థాయిలో సెట్ చేసుకుంటే దృశ్యాల నాణ్యత మెరుగ్గా ఉంటుంది. లార్జ్ ఆప్షన్ సెట్ చేసుకుంటే జేపీఈజీ క్వాలిటీ 100 శాతం ఉంటుంది.

జూమ్ చేయొద్దు
స్మార్ట్ ఫోన్ కెమెరాల పరంగా జూమ్ ఇన్ ఆప్షన్ సెలక్ట్ చేసుకోవడానికి బదులు కొంచెం దగ్గరగా వెళ్లి ఫోటో తీస్తేనే క్వాలిటీ బాగుంటుంది. దీనివల్ల మంచి రిజల్యూషన్ తో ఫొటోలు వస్తాయి. కాకపోతే దీనివల్ల ఎక్కువ స్టోరేజీ కావాల్సి ఉంటుంది. ఈ రోజు అది పెద్ద సమస్య కాబోదు. మెమొరీ కార్డు ద్వారా స్టోరేజీని పెంచుకోవడం లేదా క్లౌడ్ స్టోరేజీ సదుపాయం వినియోగించుకోవడం ద్వారా ఫోన్ మెమొరీకి వెలుపల వీటిని స్టోర్ చేసుకోవచ్చు.

థర్డ్ పార్టీ కెమెరా యాప్స్
స్మార్ట్ ఫోన్ కెమెరాలో పరిమిత ఫంక్షన్లే ఉండే అవకాశం ఉంది. కనుక థర్డ్ పార్టీ యాప్స్ ను డౌన్ లోడ్ చేసుకోవడం ద్వారా మరిన్ని సదుపాయలను వినియోగించుకోవచ్చు. వీటిలో ఐవోఎస్ కోసం కెమెరా+, ఆండ్రాయిడ్ యూజర్లకు ప్రో క్యాప్చర్ ఫ్రీ అన్నవి అదనపు ఫీచర్లను జోడిస్తాయి. ఇంకా నైట్ క్యామ్, ప్రో హెచ్ డీఆర్ (ఐవోఎస్, ఆండ్రాయిడ్)  యాప్స్ ను కూడా పరిశీలించొచ్చు. ఈ యాప్స్ ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతుంటాయి.

ఫొటో ఎడిటింగ్ యాప్స్
ఫొటోలకు ఫోటో ఎడిట్ యాప్స్ ద్వారా మరింత మెరుగులు అద్దుకోవచ్చు. ఇందుకోసం కెమెరా+, కెమెరా ఎఫ్ వీ 5 ఇంకా ఎన్నో అందుబాటులో ఉన్నాయి. ఫోటో షాప్ ఎక్స్ ప్రెస్ (ఐవోఎస్, యాండ్రాయిడ్), పిక్స్ ఎల్ఆర్ ఎక్స్ ప్రెస్ (ఐవోఎస్, ఆండ్రాయిడ్) వంటి యాప్స్ క్రాప్, రొటేట్, ఫ్లిప్ వంటి సదుపాయాలు వీటిలో ఉన్నాయి.

ఐఎస్ వో
అడ్వాన్స్ డ్ కెమెరాల్లో ఐఎస్ వో అప్షన్ అని ఒకటి ఉంటుంది. ఇది వెలుగుకు ఇమేజ్ సెన్సార్ స్పందించడాన్ని అడ్జస్ట్ చేస్తుంది. తక్కువలో ఉంచితే వెలుగుకు సెన్సార్ స్పందించడం తక్కువగా ఉంటుంది. పెంచితే స్పందించే తత్వం వేగంగా మారుతుంది. స్పష్టమైన ఫోటోలు తీసుకోవాలనుకుంటే ఐఎస్ వో తక్కువలోనే ఉంచుకోవాలి.

representational imageషట్టర్ స్పీడ్
ఫొటోలోని దృశ్యం కనిపించే తీరు, ఫొటోల నాణ్యత, ముఖ్యంగా కదిలే వస్తువులకు సంబంధించి చిత్రాల నాణ్యతను షట్టర్ స్పీడ్ నిర్ణయిస్తుంది. షట్టర్ స్పీడ్ అంటే కెమెరాలోని ఇమేజ్ సెన్సార్ వెలుగును గ్రహించే సమయం. దీన్నే ఎక్స్ పోజర్ టైమ్ గా పేర్కొంటారు. ఫోటో తీసుకునేందుకు కెమెరా యాప్ ఆన్ చేయగానే అందులో ఉండే సెన్సార్ కు వెలుగు చేరే సమయం వేగం. ఈ సమయం ఎక్కువ ఉంటే ఎక్కువ వెలుగు సెన్సార్ ను చేరి, పిక్చర్ మరింత బ్రైట్ గా వస్తుంది. ఫోటో క్యాప్చర్ టైమ్ ఎక్కువగా ఉండేందుకు ఐఎస్ వో తక్కువగా సెట్ చేసుకోవాలి. పిక్చర్ క్వాలిటీ కోసం షట్టర్ స్పీడ్, ఐఓఎస్ వో మధ్య సమతుల్యం అవసరం. ఎక్కువ షట్టర్ స్పీడ్ అన్నది నీటి ప్రవాహాలకు ఉపయోగించొచ్చు. తక్కువ షట్టర్ స్పీడ్ చాలా వేగంగా కదిలే వాటిని క్యాప్చర్ చేసేందుకు ఉపయోగించుకోవాలి. అంటే నడుస్తున్న కారులోంచి బయటనున్న ప్రకృతి ఫోటోలు తీయడం వంటివి. మరీ తక్కువ షట్టర్ స్పీడ్ వల్ల ఫోటోలు డార్క్ గా వస్తాయి.


More Articles