జీఎస్టీతో సరుకుల ధరలు పెరగనున్నాయా...? ఈ పన్ను వ్యవస్థతో లాభమా? నష్టమా..?

సరుకులు (జీ), సేవల (ఎస్)పై పన్ను (టీ)నే సంక్షిప్తంగా జీఎస్టీ అని అంటున్నాం. ప్రస్తుతం దేశంలో అమల్లో ఉన్న ఎన్నో పన్ను చట్టాల స్థానంలో ఏకైక పన్ను చట్టమైన జీఎస్టీని అమల్లోకి తీసుకురానున్నారు. 2017 జూలై 1 నుంచి దీన్ని అమలు చేయనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. నిజానికి ఈ పన్ను వ్యవస్థ గురించి చాలా మందికి ఏమీ అర్థం కాని పరిస్థితి నెలకొంది. వినియోగదారుడికి అంతిమంగా లాభమా, నష్టమా... సరుకుల ధరలు పెరుగుతాయా? తగ్గుతాయా? అన్న దానిపై సందేహాలున్నాయి. ఈ క్రమంలో ప్రస్తుత పన్ను వ్యవస్థ, కొత్త పన్ను వ్యవస్థ మధ్య ఉన్న తేడా ఏంటి? వేటిపై పన్ను ఎంత? తదితర విషయాల గురించి అర్థం చేసుకునేందుకు ఈ ఆర్టికల్ సహాయపడుతుంది.


ప్రస్తుత పన్ను వ్యవస్థ
రాజ్యాంగం పన్ను అధికారాలను కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య విభజించింది. అంటే పన్ను ఆదాయంలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు వాటా కల్పించింది. ఆదాయపన్ను (ఇన్ కమ్ ట్యాక్స్) ను ప్రత్యక్ష పన్ను(డైరెక్ట్ ట్యాక్స్) గా పేర్కొంటారు. దీనిపై హక్కు కేంద్రానిదే. వస్తువుల తయారీ, సేవల పంపిణీపై విధించే వివిధ రకాల పన్నులను పరోక్ష పన్ను(ఇండైరెక్ట్ ట్యాక్సెస్)లు గా పేర్కొంటారు. దిగుమతులపై కస్టమ్స్ సుంకం, తయారీపై ఎక్సైజ్ సుంకాలు ఇండైరెక్ట్ ట్యాక్స్ లో భాగం. దీనిపైనా కేంద్రానికే హక్కులు. వీటి విక్రయాలు, వినియోగంపై విధించే సేల్స్ ట్యాక్స్, వ్యాల్యూ యాడెడ్ ట్యాక్స్ (వ్యాట్)పై అధికారం రాష్ట్ర ప్రభుత్వాలది. ఇక కేంద్ర ప్రభుత్వం సర్వీస్ ట్యాక్స్ అంటూ సేవలపై 15 శాతం పన్నును అమలు చేస్తోంది. పెట్రోలియం తదితర ఉత్పత్తులపై సెస్సును కూడా వసూలు చేస్తోంది. వినోదపు పన్ను, లగ్జరీ ట్యాక్స్, సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ కూడా ఉన్నాయి. ఇది ప్రస్తుత పన్ను చట్ట నిర్మాణం.

representative imageదీని వల్ల సమస్యలేంటి...?
ఉదాహరణకు ఓ వస్తువుపై ప్రస్తుత విధానంలో పలు దశల్లో పన్నుల భారం పడుతోంది. కేంద్రం స్థాయిలో విధించే పన్ను రేటు దేశవ్యాప్తంగా ఒకటే రీతిలో ఉంటుండగా... అది రాష్ట్రాలకు చేరేప్పటికీ ఆయా రాష్ట్ర ప్రభుత్వాల విధానాల కారణంగా పన్ను రేటు మారుతోంది. ఉదాహరణకు పెట్రోలియం ఉత్పత్తులపై కొన్ని రాష్ట్రాలు తక్కువ పన్నునే వసూలే చేస్తుండగా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా మరికొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా పన్ను వేస్తున్నాయి. దీనివల్ల ఒక వస్తువు కొన్ని రాష్ట్రాల్లో చౌకగా, కొన్ని రాష్ట్రాల్లో ఖరీదుగా మారుతోంది. దీనివల్ల ఎక్కువ పన్నుగల రాష్ట్రాలకు తక్కువ పన్ను ఉన్న రాష్ట్రం నుంచి గూడ్స్ అక్రమంగా రవాణా అవడం వల్ల పన్ను ఆదాయానికి గండి పడుతోంది.

తయారీ అయ్యే చోట ఓ వస్తువుపై కేంద్రం ఎక్సైజ్ సుంకం విధిస్తుంది. దానిపై అమ్మకం సమయంలో రాష్ట్రాల స్థాయిలో వ్యాట్ ను వసూలు చేస్తున్నారు. దీంతో రెండు దశల్లో పన్ను పడుతోంది. ఇక్కడ కేంద్రం విధించిన ఎక్సైజ్ సుంకంపైనా పన్ను చెల్లించాల్సి రావడం గమనించాల్సిన అంశం. ఉదాహరణకు ఆంధ్రప్రదేశ్ లో ఓ వస్త్ర తయారీ కంపెనీ రంగులను తెలంగాణ నుంచి కొనుగోలు చేసిందనుకుందాం. ఈ సమయంలో సెంట్రల్ ఎక్సైజ్ సుంకంతోపాటు తెలంగాణ రాష్ట్రంలో అమల్లో ఉన్న అమ్మకం పన్నును చెల్లిస్తుంది. వస్త్రాలను తయారు చేసిన తర్వాత వాటిని వివిధ రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంది. అప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ కంపెనీ నుంచి సెంట్రల్ సేల్స్ ట్యాక్స్ ను రాబడుతుంది. ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని పన్నులు కలిపి 30 శాతం వరకు మోత మోగుతోంది. పైగా గందరగోళం. ఏ వస్తువుపై ఎంత పన్ను అని అడిగితే చెప్పడానికి క్లారిటీ లేనంత అయోమయం ప్రస్తుత పన్ను చట్టంలో ఉంది. దీనికి తెరదించుతూ... ఇక దేశవ్యాప్తంగా ఒక వస్తువు (ఉదాహరణకు ఏసీ లేదా ఫ్యాన్ ఇలా), ఒక సేవ (టెలికం సేవలు)పై ఒకటే పన్ను రేటు అమలవుతుంది. దీంతో గందరగోళం పోయి స్పష్టత ఏర్పడుతుంది. అందుకే ఒకటే దేశం, ఒకటే మార్కెట్, ఒకటే పన్ను = జీఎస్టీ అని కేంద్రం నినదిస్తోంది.

representative imageజీఎస్టీ మూడు భాగాలు...
సెంట్రల్ జీఎస్టీ(సీజీఎస్టీ), స్టేట్ జీఎస్టీ(ఎస్ జీఎస్టీ), ఇంటెగ్రేటెడ్ జీఎస్టీ(ఐ జీఎస్టీ) అని మూడు వర్గీకరణలు చేశారు. కేంద్రం స్థాయిలో పన్నులన్నీ సీ జీఎస్టీలో కలసిపోతాయి. రాష్ట్రాల స్థాయిలో పన్నులన్నీ ఎస్ జీఎస్టీ అమల్లోకి వస్తుంది. రెండు రాష్ట్రాలకు చెందిన సంస్థల మధ్య లావాదేవీలు ఐజీఎస్టీ పరిధిలోకి వస్తాయి.

ఒక వస్తువు లేదా సేవ ఓ రాష్ట్రంలో తయారై అదే రాష్ట్రంలో వినియోగమైతే దానిపై సీ జీఎస్టీ, ఎస్ జీఎస్టీ అమలవుతుంది. ఒక వస్తువు, సేవ ఒక రాష్ట్రంలో తయారై మరో రాష్ట్రంలో వినియోగమైతే (అంతర్రాష్ట్ర) అప్పుడు ఇంటెగ్రేటెడ్ జీఎస్టీ అమల్లోకి వస్తుంది. ఎగుమతులు చేసే వస్తు, సేవలకు జీఎస్టీ వర్తించదు. దిగుమతి చేసుకునే వస్తు, సేవలపై సీ జీఎస్టీ, ఎస్ జీఎస్టీ విధిస్తారు.

representative imageవినియోగదారుడిపైనే పన్ను
జీఎస్టీలో ప్రతీ వస్తువు, సేవ ప్రతీ విక్రయ దశలోనూ పన్ను పడుతుంది. ఎలాగంటే తయారీదారుడు హోల్ సేలర్ కు విక్రయించినప్పుడు, హోల్ సేలర్ రిటైలర్ కు విక్రయించినప్పుడు... పన్ను చెల్లించాల్సి ఉంటుంది. నికరంగా ఈ పన్ను వినియోగదారుడు చెల్లించే ధరకు కలుస్తుంది. తయారీదారుడు, హోల్ సేలర్, రిటైలర్లు తాము చెల్లించిన ట్యాక్స్ ను ఇన్ పుడ్ ట్యాక్స్ క్రెడిట్ రూపంలో తిరిగి పొందొచ్చు. గతంలో ఈ అవకాశం లేకపోవడంతో పన్నుపై పన్ను భారం పడుతూ చివరికి వినియోగదారుడి వద్దకు వచ్చే సరికి పన్ను అధికమయ్యేది.

ఇన్ పుట్ ట్యాక్స్ క్రెడిట్
ఇదో అదనపు ప్రయోజనం. ఉదాహరణకు ఓ వ్యాపారి రూ.10 లక్షల పన్ను చెల్లించాడనుకుందాం. అందులో 40 శాతం అంటే రూ.4 లక్షలను ఇన్ పుట్ ట్యాక్స్ క్రెడిట్ రూపంలో వెనక్కి పొందొచ్చు. ఇందుకోసం చట్టంలో ప్రత్యేకంగా ఒక క్లాజును కూడా చేర్చారు. అంటే ఈ మేరకు వినియోగదారులకు ధరల తగ్గింపు ప్రయోజనాన్ని బదిలీ చేయాలి. దీనివల్ల ధరలు తగ్గుతాయన్నది కేంద్రం వాదన.

చిన్న వ్యాపారులకు మినహాయింపు
ప్రస్తుతం వార్షికంగా రూ.7.5 లక్షల వ్యాపారమే కలిగి ఉన్న సంస్థలకు వ్యాట్ నుంచి మినహాయింపు ఉంది. అది దాటితే వ్యాట్ చెల్లించాలి. జీఎస్టీలో మాత్రం వార్షికంగా రూ.20 లక్షలు దాటిన వ్యాపారులే పన్ను పరిధిలోకి వస్తారు.

వినియోగదారులకు లాభమా...?
నిజానికి ప్రస్తుతం మన దేశంలో చాలా రకాల ఉత్పత్తులపై ఎంత పన్ను చెల్లిస్తున్నామో వినియోగదారులకు తెలియని విషయం. ఏదైనా వస్తువు కొని బిల్లు తీసుకుంటే దానిపై వ్యాట్ తప్ప ఇంకేమీ కనిపించదు. మరికొందరు దీన్ని కూడా పేర్కొనరు. కానీ, ఎక్కువ శాతం ఉత్పత్తులపై 20 శాతానికి పైనే పన్ను చెల్లిస్తున్నాం. కానీ, జీఎస్టీలో అలా ఉండదు. కొన్నింటిపై అసలు పన్ను లేదు. కొన్నింటిపై 3 శాతం, కొన్నింటిపై 5 శాతం, కొన్నింటిపై 12, 18, 28 ఇలా వస్తు సేవలను బట్టి కేటగిరీలు చేశారు. దాదాపు 60 శాతం వస్తువులను 12 - 18 శాతం పన్నుల్లోనే చేర్చారు. దీంతో అవి చౌకగా మారతాయి. ముఖ్యంగా నిత్యావసర వస్తువుల బడ్జెట్ కొంత తగ్గుతుందని ప్రముఖ రిటైల్ సంస్థలు సైతం చెబుతున్నాయి. 19 శాతం వస్తువులను 28 శాతం పన్ను పరిధిలో చేర్చారు. వీటిలో కొన్ని ఇప్పటికే ఈ స్థాయిలో పన్ను ఉన్నవే. కొన్నింటి ధరలు మాత్రం పెరుగుతాయి. ఒక వస్తువు ఏ రాష్ట్రంలో అయినా దాదాపు ఒకటే ధరలో లభిస్తుంది. కానీ, ఒక రాష్ట్రంలో తయారైన వస్తువును మరో రాష్ట్రంలో విక్రయిస్తుంటే మాత్రం రవాణా వ్యయాల రూపంలో కొంచెం ఎక్కువ ఉండొచ్చు.

representative imageసినిమా టికెట్లు పేలిపోనూ...!
ప్రస్తుతం సినిమా టికెట్లపై గరిష్టంగా 20 శాతం పన్నే పడుతోంది. జీఎస్టీలో దీన్ని వినోదం కింద పరిగణించి 28 శాతం పన్ను పరిధిలో చేర్చారు. కాకపోతే ఆ తర్వాత రూ.100 లోపున్న టికెట్లను బాదుడు నుంచి మినహాయించి 18 శాతం పన్ను కిందకు మార్చారు. అంతకుమించితే పన్ను 28 శాతంగానే అమలవుతుంది. అంటే ఐమ్యాక్స్ తరహా థియోటర్లలో సినిమా టికెట్ల ధర రూ.100కుపైనే ఉన్న విషయం తెలిసిందే.

బియ్యం, గోధుమలు, కూరగాయలు
బ్రాండెడ్ బియ్యం, గోధుమలు, కూరగాయలపై 5 శాతం జీఎస్టీ చెల్లించాలి. ఏపీ, తెలంగాణలో బియ్యం, గోధుమలు వంటి వాటిపై ఇప్పటికే 5 శాతం వ్యాట్ అమల్లో ఉంది. జీఎస్టీలోనూ ఇంతే పన్ను వేశారు. అయితే, బ్రాండెడ్ కాకుండా లూజ్ గా విక్రయిస్తే మాత్రం పన్ను మినహాయించారు.

బంగారం, వజ్రాలపై
ఈ రెండింటినీ ప్రత్యేక కేటగిరీగా ప్రభుత్వం ఖరారు చేసింది. బంగారంపై 3 శాతం, ముడి వజ్రాలపై 0.25 శాతం పన్నును నిర్ణయించింది. ప్రస్తుతం బంగారంపై 2 శాతం పన్ను అమలవుతోంది.

ఔషధాల ధరలకు రెక్కలు
ఇప్పటి వరకు ఔషధాలపై సగటున పన్ను 10 శాతం లోపే ఉంది. కానీ, జీఎస్టీలో మందులపై 12 శాతం పన్ను వేశారు. అత్యవసర ఔషధాలు, ఇన్సులిన్ కు మాత్రం 5 శాతం పన్ను ఖరారు చేశారు. ఇవి మినహా మిగిలిన మందుల ధరలు పెరగనున్నాయి.

వీటిపై పన్ను లేదు...
అన్ని రకాల ధాన్యాలు, బార్లీ, ఓట్స్, కార్న్, కూరగాయలు, పాలు, గుడ్లు, మాంసం, మజ్జిగ, పెరుగు, సహజ నూనె (అన్ బ్రాండెడ్), బ్రెడ్డు, ఉప్పు, ప్రసాదం, పండ్లు, కొబ్బరి, కాఫీ గింజలు (లూజ్), అప్పడాలు, అన్ని రకాల ఉప్పు, శుద్ధి చేయని తేయాకు (లూజ్), సింధూరం, కాటుక, బొట్టు బిళ్లలు, గాజులు, స్టాంపులు, జ్యుడీషియల్ పేపర్లు, ప్రింటెడ్ పుస్తకాలు, చిన్న పిల్లలు వాడే డ్రాయింగ్స్ బుక్స్, వార్తా పత్రికలు, జ్యూట్ మొదలైనవి. కండోమ్ లను కూడా ఈ రేటు పరిధిలోనే చేర్చారు.

representative image5 శాతం పన్ను పడేవి
రూ.1,000లోపు ధర ఉన్న వస్త్రాలు, ప్యాకేజ్డ్ ఫుడ్స్, రూ.500లోపు ధర ఉన్న పాదరక్షలు, పాల పొడి, బ్రాండెడ్ కాఫీ, టీ, దినుసులు, అగర్ బత్తి, బాదం గింజలు, పిజ్జా, బ్రెడ్, రస్క్, పంచదార, సాబుదానా, కిరోసిన్, బొగ్గు, అత్యవసర మందులు, ఇన్సులిన్, స్టెంట్, టీకాలు, డయాగ్నస్టిక్ కిట్స్, లైఫ్ బోట్లు, ఫ్రోజెన్ వెజిటబుల్స్, ఐస్ పై 5 శాతం పన్ను పడనుంది. ఎల్పీజీ గ్యాస్, బయోగ్యాస్, పతంగులు, కొబ్బరి పీచుతో చేసిన పరుపులు, ఫ్లోర్ కవరింగ్ లు, పోస్టేజీ, రెవెన్యూ స్టాంపులు, వాహనాల ట్యూబులు, రూఫింగ్ టైల్స్ పైనే ఇదే పన్ను.

ఇక, రైలు సేవలు, విమానయాన, హెలికాప్టర్ సేవలు, చిన్న రెస్టారెంట్లు అందించే సేవలను కూడా 5 శాతం పన్ను పరిధిలోకి తీసుకొచ్చారు. టెక్స్ టైల్స్, ఆభరణాల కంపెనీలు వాటిని ఇతరులతో తయారు చేయించుకుంటే ఆ సేవలపై 5 శాతం పన్ను విధిస్తారు.

representative image12 శాతం పన్ను వర్తించేవి
నెయ్యి, డ్రై ఫ్రూట్స్, ఆయుర్వేదం, యునాని, హోమియోపతి మందులు, నమ్కీన్, పళ్ల పొడి, బటర్, చీజ్, గొడుగులు, సెల్ ఫోన్లు, సాస్ లు, జామ్ లు,  ప్యాకేజ్డ్ ఫుడ్ ఐటమ్స్,  పండ్లను నిల్వ చేసేందుకు ఉపయోగించే ప్రిజర్వేటివ్ లు, పచ్చళ్లు, పండ్ల రసాలు, ఫ్లై యాష్ బ్రిక్స్, బ్లాకులు, మార్బుల్, గ్రానైట్ బ్లాకులు, ప్లేయింగ్ కార్డ్స్, చెస్, క్యారమ్ బోర్డులు, కళ్లద్దాలు, ఇంట్రా ఆక్యులర్ లెన్స్, స్పూన్లు, ఫోర్క్ లు, సర్జికల్ పరికరాలు, క్రిమి సంహారక మందులు, ఇంక్, టూత్‌ పౌడర్, కొవ్వొత్తులు, ఎక్స్‌రే ఫిల్మ్, ఫీడింగ్‌ బాటిల్స్, లెదర్‌ ఉత్పత్తులు,  వాకింగ్‌ స్టిక్స్, ప్యాకేజింగ్‌ ఉత్పత్తులు, అల్లికల ఉత్పత్తులు, ల్యాబ్ పరికరాలు, గ్యాస్‌ చిమ్నీలు, మ్యాథమేటిక్ బాక్సులు, రాగి పాత్రలు, విద్యుత్‌ పంపులు, 1800 సీసీ కంటే ఎక్కువ ఇంజిన్‌ సామర్థ్యంగల ట్రాక్టర్లు, ఎలక్ట్రిక్‌ ద్విచక్ర, త్రిచక్ర, నాలుగు చక్రాల వాహనాలు, సైకిళ్లు, ఆర్థోపెడిక్‌ ఉత్పత్తులు, రేడియోథెరపీ ఉపకరణాలు, ఎల్‌ఈడీ లైట్లు,  శారీరక వ్యాయామానికి ఉపయోగించే యంత్రాలు పై 12 శాతం పన్ను పడుతుంది. సేవల విషయానికొస్తే... విమానాల్లో బిజినెస్ తరగతి టికెట్లు, నాన్ ఏసీ హోటల్స్ అందించే సేవలపై 12 శాతం పన్ను ఉంటుంది.

representative image18 శాతం పన్నులోకి
బిస్కట్లు, మినరల్ వాటర్, స్కూల్ బ్యాగులు, కంప్యూటర్ ప్రింటర్లు, రూ.1,000 దాటిన వస్త్రాలు, ఐస్ క్రీమ్, ఇన్ స్టంట్ ఫుడ్ మిక్స్ లు, వనస్పతి, కేక్స్, నోట్ పుస్తకాలు, పేపర్ పంచర్లు, స్టాప్లర్లు, డ్రాయింగ్, కలరింగ్ బుక్స్, బేబీ క్యారియర్లు, స్విమ్మింగ్ పూల్స్, ప్లాస్టిక్ టార్పాలిన్లు, వెదురు ఫర్నిచర్, సెట్ టాప్ బాక్స్ లు, 17 అంగుళాలలోపు కంప్యూటర్ మానిటర్లు, సీసీటీవీ కెమెరాలు, సెల్ ఫోన్లు, బ్యాటరీలు, ఎలక్ట్రానిక్ తూకం యంత్రాలు, ఎన్వలప్ కవర్లు, కెమెరాలు, స్పీకర్లు, మానిటర్లు, బీడీలు, రూ.100లోపు ధర ఉన్న సినిమా టికెట్లపై, ఎరువులు మొదలైన వాటిని 18 శాతం పన్ను పరిధిలో చేర్చారు. ఇక ఏసీ హోటళ్లు, టెలికం సేవలు, ఐటీ సేవలు కూడా 18 శాతం పన్ను పరిధిలోకే వస్తాయి.

28 శాతం పన్ను పరిధిలో...
చూయింగ్ గమ్, చాక్లెట్ (కోకోవా లేనివి), చాక్లెట్ వేఫర్లు, పాన్ మసాలా, పెయింట్స్, షాంపూలు, డియోడరెంట్స్, ఏరేటెడ్ వాటర్, షేవింగ్ క్రీములు, షేవింగ్ ఉత్పత్తులు, టైల్స్, వాటర్ హీటర్, డిష్ వాషర్ మెసిన్, వాషింగ్ మెషిన్, ఏసీలు, వ్యాక్యూమ్ క్లీనర్లు, జుట్టుకు పెట్టుకునే క్లిప్పులు, మోటారు సైకిళ్లు, ఆటోమైబైల్ వాహనాలపై 28 శాతం పన్ను వేశారు. 5 స్టార్ హోటల్స్, రేస్ క్లబ్ ల్లో జూదాలు, రూ.100 దాటిన సినిమా టికెట్లపై 28 శాతం పన్ను ఖరారు చేశారు.  

మోటారు సైకిళ్లపై 28 శాతంrepresentative image
అన్ని రకాల కార్లు, బస్సులు, ట్రక్కులు, మోటారు సైకిళ్లు, మోపెడ్లపై 28 శాతం పన్నును ఖరారు చేశారు. 350 సీసీ సామర్థ్యం మించిన పవర్ బైక్స్ పై అదనంగా మూడు శాతం సెస్సు కూడా విధిస్తారు. అలాగే, 1200సీసీ సామర్థ్యం వరకు గల కార్లపై ఒక శాతం సెస్సు, ఆపై 1500 సామర్థ్యం గల కార్లపై 3 శాతం సెస్సు విధిస్తారు. ఇక మధ్య స్థాయి కార్లు, ఎస్ యూవీలు, లగ్జరీ కార్లు, 1500 సీసీ సామర్థ్యం దాటిన హైబ్రిడ్ కార్లు, 10మందికి మించి రవాణా చేసే సామర్థ్యం గల వ్యాన్లపైనా జీఎస్టీ రేటుకు అదనంగా 15 శాతం సెస్సు ఉంటుంది.

గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై
ఏసీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషిన్లు, వ్యాక్యూమ్ క్లీనర్లు, డిష్ వాషర్లు, టీవీలు, కంప్యూటర్లు, ల్యాప్ టాప్ లు, డీఎస్ఎల్ఆర్ కెమెరాలు, స్పీకర్లు, మానిటర్లుపై 28 శాతం పన్నువిధించారు. ప్రస్తుతం వీటిపై గరిష్ఠంగా 23 శాతమే పన్ను ఉంది. షేవర్లు, ట్రిమ్మర్లు, ఎలక్ట్రిక్ ఐరన్, జ్యూసర్లు, మిక్సర్ గ్రైండర్లపై కూడా ఇంతే పన్ను ఖరారు చేశారు.

representative imageరేట్లు తగ్గనున్నవి
వంటగ్యాస్, అగర్ బత్తి, ఇన్సులిన్, అత్యవసర మందులు, పాలపొడి, పెరుగు, మజ్జిగ, బ్రాండ్ పేరు లేని తేనె, జున్ను, వంట దినుసులు, టీ, గోధుమలు, పిండి, పల్లీ నూనె, పామాయిల్, సన్ ఫ్లవర్ ఆయిల్, కొబ్బరి నూనె, ఆముదం నూనె, పంచదార, స్వీట్లు, నూడుల్స్, పండ్లు, కూరగాయలు, పచ్చళ్లు, సాస్ లు, ఇన్ స్టంట్ ఫుడ్ మిక్స్, మినరల్ వాటర్, ఐస్, సిమెంట్, బగ్గు, పళ్లపొడి, టార్పాలిన్, స్కూల్ బ్యాగులు, నోట్ పుస్తకాలు, వ్యాయామ పుస్తకాలు, డ్రాయింగ్ పుస్తకాలు, గాలి పటాలు, సిల్క్, వులెన్, కాటన్ రెడీమేడ్ వస్త్రాలు, రూ.500లోపు ధర ఉన్న పాదరక్షలు, హెల్మెట్లు, బూడిదతో చేసిన ఇటుకలు, కళ్లద్దాలు, ఎల్పీజీ స్టవ్ లు, స్పూన్లు, ఫోర్క్ లు.

జీఎస్టీ హైలైట్స్
దేశవ్యాప్తంగా ఒకటే మార్కెట్. ఒక వస్తువుపై దేశవ్యాప్తంగా ఒకటే పన్ను. దీనివల్ల పన్ను చట్టం సులభతరం అవుతుంది. వ్యాపార వ్యయాలు తగ్గుముఖం పడతాయి. పారదర్శకత పెరుగుతుంది. ఎన్నో శాఖలతో అవసరం ఉండదు గనుక అవినీతి తగ్గుముఖం పడుతుందని భావిస్తున్నారు. గతంలో మాదిరిగా ఒక వస్తువుపై ఒక పన్ను కట్టిన తర్వాత, ఆ పన్నుపైనా పన్ను చెల్లించడం అన్నది ఇక ఉండదు. కేవలం ఒక వస్తువు, సేవను అమ్మేటప్పుడే పన్ను వసూలు చేస్తారు. రాష్ట్రాలు ఇప్పటి వరకూ వస్తువులపై పన్నును నిర్ణయించేవి. ఇకపై వాటి పెత్తనానికి చెల్లు. జీఎస్టీ మండలిదే అంతిమ నిర్ణయం. ఎగుమతి చేసే వస్తు, సేవలపై జీఎస్టీ ఉండదు గనుక వాటికి ప్రోత్సాహం లభిస్తుంది.

అంతిమంగా....
జీఎస్టీ వల్ల ఆదాయం కోల్పోకుండా కేంద్రం పన్ను రేట్ల పరంగా సమతుల్యం చేసింది. అవ్యవస్థీకృత రంగంలోని వ్యాపారాలనూ పన్ను పరిధిలోకి తీసుకురావడం ద్వారా... అంటే పన్ను వ్యవస్థలో అందరినీ భాగం చేయడం ద్వారా పన్ను ఆదాయం పెంచుకోవాలన్న లక్ష్యమూ దాగుంది. కాకపోతే స్వల్పకాలంలో జీఎస్టీ అమలులో అస్పష్టత, గందరగోళం కారణంగా కొంత ఆదాయం తగ్గినా, దీర్ఘకాలంలో పెరుగుతుందన్న అంచనాలున్నాయి. కాకపోతే సామాన్యుడి పరంగా బడ్జెట్ భారం తగ్గుతుందని కేంద్రం చెబుతోంది. అతి ఎంత వరకు అన్నది జీఎస్టీ అమలైన తర్వాత అనుభవంలోకి వస్తుంది.

ఏ వస్తువుపై ఎంత పన్ను పూర్తి వివరాలకు

http://abcaus.in/wp-content/uploads/2017/05/chapter-wise-rate-wise-gst-schedule-18.05.2017.pdf
 
http://www.cbec.gov.in/resources//htdocs-cbec/gst/chapter-wise-rate-wise-gst-schedule-03.06.2017.pdf;jsessionid=5FCCDCE9AB69F05BD429D75967372A7D

http://www.cbec.gov.in/resources//htdocs-cbec/gst/gst_rates_approved%20_by_gst_council%20_11.06.2017.pdf


More Articles