ల్యాప్ టాప్ కొనుగోలుకు ప్లాన్ చేసుకుంటున్నారా...?

వ్యాపారం, ఉద్యోగాల్లో ఉన్న వారికి ల్యాప్ టాప్ అవసరం ఎంతో ఉంటుంది. డెస్క్ టాప్ తో పోలిస్తే ల్యాప్ టాప్ ను ఎక్కడికైనా వెంట తీసుకెళ్లగల సౌలభ్యం ఉండడంతో ఎక్కువ మంది దీని కొనుగోలుకే మొగ్గు చూపుతుంటారు. ముఖ్య ఉపకరణాల్లో ఒకటైన ల్యాప్ టాప్ కొనే ముందు కొన్ని ఫీచర్లు, టెక్నాలజీ తదితర అంశాలను గమనించిన తర్వాతే నిర్ణయం తీసుకోవడం మంచిది.

డిజైన్, హార్డ్ వేర్ ఫీచర్ల పరంగా ల్యాప్ టాప్ లలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. 360 డిగ్రీల కోణంలో ఎటువైపు తిప్పినా నాజూగ్గా తిరిగిపోయేవీ వచ్చేశాయి. డిస్ ప్లేను తీసి పక్కన పెట్టుకునేవీ ఉన్నాయి. అంటే, కీ బోర్డు నుంచి స్క్రీన్ ను వేరు చేసి టాబ్ గానూ వాడుకోవచ్చు. వీటినే టూ ఇన్ వన్ గా పేర్కొంటారు. ప్రారంభ స్థాయి, మధ్య స్థాయి బడ్జెట్ ల్యాప్ టాప్ లలో ఇప్పుడు యూఎస్ బీ 3.0 పోర్టులు, హెచ్ డీఎంఐ, ఎథర్ నెట్, మల్టీ కార్డు రీడర్, ఆడియో, మైక్రోఫోన్ జ్యాక్ ఉంటున్నాయి. మధ్య స్థాయి, ఖరీదైన నోట్ బుక్కుల్లో యూఎస్ బీ టైప్ సీ పోర్ట్ ఉంటోంది. ఇది విద్యుత్ కు, ఇతర పరికరాల అనుసంధానానికి ఉపయోగపడుతుంది.

టచ్ స్క్రీన్
representational imageటచ్ స్క్రీన్ సదుపాయంతో ల్యాప్ టాప్ లు వస్తున్నాయి. విండోస్ 10 ఆపరేటింగ్ సాఫ్ట్ వేర్ టచ్ స్క్రీన్ కు అనుకూలంగా ఉంటుంది. టచ్ స్క్రీన్ ఉంటే వేగంగా ఆపరేట్ చేయడానికి వీలుంటుంది. ఫొటోలు చూసుకోవడం, గేమ్ లు ఆడుకోవడం కూడా ఈజీనే. వెబ్ పేజీలను సులభంగా, వేగంగా స్క్రోల్ చేసుకోవచ్చు. అయితే, టచ్ స్క్రీన్ సదుపాయంతో ఉన్న ల్యాప్ టాప్ ల ధర అధికంగా ఉంటుంది. మిగతా ల్యాప్ టాప్ లతో పోలిస్తే  సౌకర్యాల పరంగా ఒకే విధంగా ఉన్నా ఒక్క టచ్ స్క్రీన్ ఫీచర్ కారణంగా ల్యాప్ టాప్ ధర పెరిగిపోతుంది. అయినప్పటికీ ఖర్చు పెట్టగలను అనుకుంటే మాత్రం టచ్ స్క్రీన్ ఉన్న ల్యాప్ టాప్ కొనడమే బెస్ట్.  

స్క్రీన్ సైజు
representational imageమార్కెట్లో ఉన్న ల్యాప్ టాప్ లలో అధిక శాతం 15.6 అంగుళాల స్క్రీన్ సైజు గలవే. చాలా మందికి ఇవి నప్పుతాయి. ఇంతకుమించి ఎక్కువ సైజున్న వాటి కారణంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. స్క్రీన్ పెరిగిందంటే బరువు కూడా పెరిగిపోతుంది. ఎక్కువ ప్రయాణించేవారికి 12, 13.3 అంగుళాలలో ఉన్న ల్యాప్ టాప్ లు అనుకూలం. వీటిలో బ్యాటరీ బ్యాకప్ సామర్థ్యం కూడా ఎక్కువే. మధ్యస్థం అంటే 14 అంగుళాలు, 15.6 అంగుళాలవి. కేవలం ఫొటోలు, వీడియోలు, గేమ్ ల కోసమే అయితే 17.3 అంగుళాల స్క్రీన్ ఉన్న వాటిని పరిశీలించొచ్చు. నోట్ బుక్కుల్లో 10, 11 అంగుళాలవీ ఉన్నాయి.స్క్రీన్ నాణ్యత కూడా చాలా అవసరం. రిజల్యూషన్, ప్యానెల్ టైప్ అనేవి కూడా కీలక అంశాలవుతాయి. ఐపీఎస్ డిస్ ప్లే కావాలనుకుంటే రూ.40వేల పైనే ఖర్చు చేయాల్సి ఉంటుంది. అధిక రిజల్యూషన్ ఉన్న ల్యాప్ టాప్ లు మంచివి. ఫుల్ హెచ్ డీ స్క్రీన్ ఉన్నవి కావాలనుకుంటే బడ్జెట్ రూ.40వేల వరకు ఉండాల్సిందే.

స్టోరేజీ/హార్డ్ డిస్క్
బేసిక్ ల్యాప్ టాప్ లలోనూ 500 జీబీ స్టోరేజీ ఉంటోంది. కనీస అవసరాలకు ఈ  స్టోరేజీ సరిపోతుంది. డాక్యుమెంట్లు, పాటలు, సినిమాలు స్టోరేజీ చేసుకోవచ్చు. కానీ, ఎక్కువ డేటా స్టోరేజీ కోసం అయితే 1టీబీ హార్డ్ డిస్క్ ఉండాల్సిందే. చాలా మంది 500 జీబీ స్టోరేజీ సరిపోదనే చెబుతుంటారు. ఎప్పటికప్పుడు మరింత డేటా వచ్చి ల్యాప్ టాప్ లో చేరుతుంటే మాత్రం అధిక స్టోరేజీ సామర్థ్యం ఉన్నవి కావాల్సిందే. కావాలంటే పోర్టబుల్ ఎక్స్ టర్నల్ హార్డ్ డ్రైవ్ ను ఉపయోగించుకోవచ్చు.
representational imageఇంకో ముఖ్య విషయం ఏమిటంటే సీపీయూ వేగం స్టోరేజీ డ్రైవ్ ను బట్టే ఉంటుంది. స్టోరేజీ డ్రైవ్ లలో రెండు రకాలున్నాయి. ఎస్ఎస్ డీ (సాలీడ్ స్టేట్ డ్రైవ్), హెచ్ డీడీ (హార్డ్ డిస్క్ డ్రైవ్). వీటిలో ఎస్ఎస్ డీలో వేగం ఎక్కువ. ఎస్ఎస్ డీలో సమాచారం మైక్రో చిప్ లలో స్టోర్ అవుతుంది. అందుకే ఎస్ఎస్ డీ లేదా ఎస్ఎస్ డీ క్యాచె తో ఉన్న ల్యాప్ టాప్ ల పనితీరు వేగంగా ఉంటుంది. వీటిలో హార్డ్ డిస్క్ 500జీబీ ఉన్నాగానీ పనితీరు వేగంగా ఉంటుంది. గేమింగ్ ల్యాప్ టాప్ కోరుకుంటే  గ్రాఫిక్ కార్డుపై దృష్టి పెట్టాలి. ఈ విషయంలో జీటీఎస్ కంటే జీటీఎక్స్ ఉత్తమం. జీటీ కంటే జీటీఎస్ బెటర్.

గ్రాఫిక్ చిప్
గ్రాఫిక్ కార్డు చిత్రాలతో కూడిన డేటాను వేగంగా మూవ్ చేస్తుంది. గేమ్స్ అడే పని లేకుంటే, హై డెఫినిషన్ వీడియోలు ఎడిటింగ్ చేసే అవసరం లేని వారికి ఇంటెగ్రేటెడ్ గ్రాఫిక్స్ చిప్ సరిపోతుంది. అలా కాకుండా గేమ్ లు, హై డెఫినిషన్ వీడియోల ఎడిటింగ్ వంటి పనులు ఉంటే మాత్రం ఏఎండీ, ఎన్ విదియా గ్రాఫిక్స్ చిప్ అనుకూలంగా ఉంటుంది. వీటిలో హై ఎండ్ గ్రాఫిక్ చిప్స్ ఉన్నాయి. గ్రాఫిక్ కార్డు కనీసం 1జీబీ ఉండాలి.  

ర్యామ్
representational imageల్యాప్ టాప్ పనితీరును నిర్ణయించే వాటిలో ర్యామ్ సామర్థ్యం కూడా ఒకటి. మంచి అనుభవం పొందాలంటే కనీసం 4జీబీ ర్యామ్ ఉండాలి. 8జీబీ ఉంటే ఇంకా మంచిది. వీడియో, ఫొటోల ఎడిటింగ్ వంటి పనుల కోసం అయితే 16జీబీ ర్యామ్ ఉన్నవి సౌకర్యంగా ఉంటాయి.

సీపీయూ/ప్రాసెసర్
కంప్యూటర్ పనితీరు ప్రాసెసర్ పై ఆధారపడి ఉంటుంది. కనుక తమ అవసరాలు తీర్చే సామర్థ్యం గల ప్రాసెసర్ ఉన్నది తీసుకోవడం బెటర్. 2.3 గిగాహెర్జ్ అంతకంటే ఎక్కువ సామర్థ్యం ఉన్నవి తీసుకోవాలి. ప్రాసెసర్ క్యాచె 3ఎంబీ ఉండాలి. ప్రాసెసర్ సామర్థ్యం ఎక్కువగా ఉంటే సిస్టమ్ లో అప్లికేషన్లను వేగంగా రన్ చేస్తుంది. స్ట్రక్ అవడం ఉండదు.
 
ఇంటెల్ కోర్ ఐ5 : మంచి పనితీరు కోరుకుంటే కోర్ ఐ5 సీపీయూ ఎంచుకోవచ్చు. మోడల్ చివర్లో (కోర్ ఐ5-7200యూ) యూ ఉండడం ఎక్కువగా కనిపిస్తుంది. చివర్లో వై ఉంటే మాత్రం తక్కువ పవర్ ను వినియోగించుకుంటాయి. వీటి పనితీరు కూడా యూ వాటితో పోలిస్తే కొంచె నిదానంగా ఉంటుంది.  
కోర్ ఐ7: గేమ్ లు ఎక్కువగా ఆడేవారికి ఈ ప్రాసెసర్ మంచి అనుభవాన్నిస్తుంది. చివర్లో హెచ్ క్యూ లేదా కేతో ఉన్నవి ఎక్కువ విద్యుత్ ను వినియోగించుకుంటాయి. కోర్ ఐ7 వై సిరీస్ చిప్ ఉంటే విద్యుత్ వినియోగంలోనూ, పనితీరులోనూ కొంచెం తక్కువగా ఉంటాయి.representational imageకోర్ ఐ3: కోర్ ఐ5తో పోలిస్తే పనితీరు కొంచెం తక్కువే. కాకపోతే కొంచెం ధర పెట్టుకునేట్టు అయితే కోర్ 5కి వెళ్లడమే నయం.
ఏఎండీ, ఎఫ్ఎక్స్ లేదా ఈ సిరీస్ : తక్కువ ధర ఉన్న ల్యాప్ టాప్ లలో ఈ చిప్ కనిపిస్తుంది. వెబ్ సర్ఫింగ్ కోసం, మీడియా చూసేందుకు అయితే చక్కగా సరిపోతుంది.
ఇంటెల్ ఆటమ్, పెంటియమ్/సెల్ రాన్ : ఇంటెల్ ఆటమ్ పాత తరం ప్రాసెసర్. చాలా తక్కువ ధర కలిగిన వాటిల్లో ఇది ఉంటుంది. ఇది కనీస పనితీరును మాత్రమే ఇవ్వగలదు. ఇంటెల్ పెంటియమ్ / సెల్ రాన్ ప్రాసెసర్ లో పనితీరు ఆటమ్ కంటే కొంచెం వేగంగా ఉంటుంది. కానీ, బ్యాటరీ ఎక్కువ సేపు నిలవదు. వీటికి బదులు కోర్ 3కి వెళ్లడమే మంచిది.  

పల్చగా, తేలికగా...
representational imageల్యాప్ టాప్ కొనేది ఎందుకు...? ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లవచ్చనే కదా...? ఎక్కువ మంది ఈ కారణంతోనే ల్యాప్ టాప్ ను ఎంపిక చేసుకుంటారు. ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు ల్యాప్ టాప్ లు మరింత స్లిమ్ గా మారిపోయాయి. కనుక బరువు విషయంలో ఎటువంటి ఇబ్బందీ అక్కర్లేదు. 13.3 అంగుళాలు, 14 అంగుళాలతో వస్తున్న ల్యాప్ టాప్ మోడళ్ల బరువు 1.5 నుంచి 2 కిలోలలోపు ఉంటుంది. ల్యాప్ టాప్ కంటే పల్చగా, మరింత బరువు తక్కువ బరువు ఉండే నోట్ బుక్ ధర మరీ ఎక్కువగా ఉంటుంది. ఇంట్లో వాడేందుకు తీసుకునే ల్యాప్ టాప్ మాత్రం బరువు, సైజు ఎక్కువ ఉన్నా ఇబ్బందేమీ ఉండదు. అల్ట్రాబుక్ అని కూడా ఉన్నాయి. ఇవి స్లిమ్ గా, తక్కువ బరువుతో స్టయిలిష్ గా ఉంటాయి.

ఓఎస్ తో, ఓఎస్ లేకుండా...
ఖరీదైన ల్యాప్ టాప్ లు ముందుగానే ఇన్ స్టాల్ చేసిన ఓఎస్ తో వస్తున్నాయి. అదే సమయంలో ఓఎస్ లేనివి కూడా ఉంటున్నాయి. వీటి మధ్య ధర విషయంలో తేడా ఉంటుంది. ఓఎస్ లేని ల్యాప్ టాప్ తీసుకుని విడిగా ఓఎస్ కొనుగోలు చేసి వేసుకోవడం కంటే... ఓఎస్ తోవచ్చే ల్యాప్ టాప్ ల ధరే తక్కువ.

కీబోర్డు, టచ్ ప్యాడ్
representational imageల్యాప్ టాప్ పై ఎక్కువ సమయం పాటు పనిచేయాల్సి ఉంటే మాత్రం కీబోర్డు సౌకర్యంగా ఉండడం చాలా ముఖ్యం. కీల మధ్య తగినంత ఖాళీ ఉండాలి. ఒక కీని ప్రెస్ చేస్తే మరో కీ సెలక్ట్ అవకుండా ఉండాలి.

బ్యాటరీ, ఇతర అంశాలు
బ్యాటరీ సామర్థ్యం కూడా ప్రధానమే. ఎక్కువ సమయం పాటు బ్యాకప్ కోరుకుంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న వాటిని ఎంచుకోవాల్సి ఉంటుంది. టూ ఇన్ వన్ వాటిల్లో బ్యాటరీ లైఫ్ తక్కువే ఉంటుంది. ల్యాప్ టాప్ లో డీవీడీ డ్రైవ్ అవసరం నేడు చాలా వరకు తగ్గిపోయింది. ప్రత్యేకమైన అవసరం ఉంటే తప్పితే డీవీడీ లేనివే తీసుకోవడం బెటర్.

బ్రాండ్, సర్వీసు
ల్యాప్ టాప్ కొనే ముందు పరిశీలించాల్సిన ముఖ్య అంశాల్లో బ్రాండ్, కస్టమర్ సర్వీసు. లెనోవో, డెల్, హెచ్ పీ సర్వీసు బాగుంటుందని ఎక్కువ మంది చెబుతుంటారు. వాస్తవానికి ప్రతీ కంపెనీ విషయంలో ప్రతికూల అంశాలను చెప్పేవారు ఉంటారు. మొత్తం మీద ఎక్కువ మంది అభిప్రాయం ఆధారంగానే నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. కనుక మీ స్నేహితులు, బంధువుల్లో ల్యాప్ టాప్ ఉన్న వారిని విచారించి అప్పుడు తగిన ల్యాప్ టాప్ ను ఎంచుకోండి.


More Articles