ప్రతీ మహిళ తన భర్తను అడగాల్సిన ఆర్థిక కోరికలు ఇవే...!

ప్రతీ కుటుంబంలో స్త్రీ పాత్ర ఎంతో విలువైనది. ఇంటి ఇల్లాలి పాత్రను వేరెవరూ భర్తీ చేయలేరు. జరగరానిది జరిగితే, ఆర్థిక విపత్తులు ఎదురైతే ఇంటి ఇల్లాలు ఎంతో సతమతం అవుతుంది. ముఖ్యంగా భర్తపై ఆధారపడిన ఇల్లాలి పరిస్థితి మరింత ఇబ్బందికరం. అందుకే కుటుంబానికి ఆధారంగా ఉన్న ప్రతీ భర్త తన కుటుంబం కోసం కొన్ని రకాల ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటి ఇల్లాలు సైతం ఈ విషయంలో అవగాహనతో ఉండాలి. భర్త మరిచినా, అలక్ష్యం చేసినా తనే శ్రద్ధ తీసుకుని తన కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించాలి. అందుకే ఏం చేయాలన్నది చూద్దాం...


కుటుంబానికి ఆధారమైన భర్త అకాల మరణం చెందితే... కుటుంబ పోషకుడు పాక్షిక అంగవైకల్యం బారిన పడితే, వైద్యపరమైన సమస్యలు ఎదురైతే ఇల్లాలిని ఆర్థిక సమస్యలు చుట్టుముడతాయి. పిల్లల విద్య, వివాహం బాధ్యతలు నెరవేర్చాలి. ఏవైనా రుణాలు ఉంటే వాటికి చెల్లింపులు, క్రెడిట్ కార్డుల బిల్లులు చెల్లించాలి. లేదా గృహ రుణం, కారు, వ్యక్తిగత రుణాలుంటే అవి చెల్లించేయాలి.  అందుకే ఇటువంటివి ముందే ఊహించాలి. రాకూడని ఆ సందర్భాలు వస్తే ఎదుర్కొనేందుకు వీలుగా ముందుగా చర్యలు చేపట్టాలి. ఆర్థిక భరోసాకు వీలుగా భద్రమైన భవిష్యత్తుకు కొన్ని నిర్ణయాలు తీసుకోవాలని భర్తను ముందుగానే కోరాల్సి ఉంటుంది. కుటుంబానికి ఆధారంగా ఉన్న వారు, భర్త స్థానంలో ఉన్న వారు కూడా ముందు చూపుతో ఆలోచించి తగిన నిర్ణయాలు తీసుకోవాలి.
 
అన్ని రకాల ఇన్వెస్ట్ మెంట్లు...
representational imageభర్త చేసే అన్ని రకాల పెట్టుబడుల గురించి భార్యకూ తెలియడం ఎంతో అవసరం. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు కానీయండి, మ్యూచువల్ ఫండ్స్, ఫిక్స్ డ్ డిపాజిట్లు ఇలాంటివన్నీ. మహిళ సైతం ఈ పెట్టుబడి సాధనాల గురించి, వాటి రాబడులు, ఇతర విషయాల గురించి పూర్తిగా అర్థం చేసుకోవడం కూడా తప్పనిసరి. దీనివల్ల భర్త దూరమైతే ఆయా ఆర్థిక విషయాలు, పెట్టుబడుల సాధనాల నిర్వహణను ఆమె తేలిగ్గా నిర్వహించగలుగుతుంది.

ప్రతీ సాధనం గురించి
representational imageపెట్టుబడుల సాధనాలు, గందరగోళ పరిచే ఆ సూత్రాల గురించి తెలుసుకునేందుకు కాస్త ఆర్థికపరమైన ఆసక్తి అన్నది అవసరం. కొన్ని అంత తేలిగ్గా కొరుకున పడవు. ముఖ్యంగా స్టాక్ మార్కెట్. అలా అని ఆర్థిక విషయాల్లో ఇల్లాలిని తలదూర్చవద్దనడం పూర్తిగా తప్పే అవుతుంది. ఆమె ప్రతీది అర్థం చేసుకోలేకపోయినా సరే ఆర్థిక వ్యవహారాల్లో భాగం చేయడం వల్ల ఎంతో కొంత తెలుసుకుంటుంది. రేపు భర్త దూరమైన పరిస్థితి వస్తే ఆ కాస్త ఆర్థిక పరిజ్ఞానమే ఆమెకు ఉపయోగపడుతుంది. అందుకే భర్త చెప్పకపోయినా, చొరవ తీసుకోకపోయినా ప్రతీ గృహిణి తనే ఆసక్తితో భర్త నుంచి అన్ని ఆర్థిక పరమైన విషయాల గురించి తెలుసుకోవాలి. విజ్ఞానం ఎప్పుడూ వృథా కాదు. ఇలా నేర్చుకున్న సమాచారం ఇవాళ కాకపోయినా, రేపయినా తగిన విధంగా ఉపయోగపడుతుంది. ఇతరులకు తెలియజేయడానికి అయినా అక్కరకు వస్తుంది.

నామినీగా చేర్చాలి
ఎందుకోగానీ మన సమాజంలో చాలా మంది నామినీ కాలమ్ ను ఖాళీగా వదిలేస్తుంటారు. ముఖ్యంగా వివాహమైన వారు, కుటుంబ పోషణ చూస్తున్న పురుషులు తమ పేరిట ఉన్న అన్ని రకాల పెట్టుబడి సాధనాలకు, బీమా పాలసీలకు నామినీగా భార్య పేరును రిజిస్టర్ చేయించడం ఎంతో అవసరం. బ్యాంకు ఖాతాలు, ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ పథకాల్లో, ఫిక్స్ డ్ డిపాజిట్లలో ఇలా అన్నింటిలోనూ నామినీ పేరు పేర్కొనడం అవసరం. ఉదాహరణకు ఫిక్స్ డ్ డిపాజిట్ లో నామినీ పేరును ఇవ్వకుంటే డిపాజిట్ దారుడు కాలం చేశారనుకోండి... అప్పుడు చట్టబద్ధమైన వారసులు అన్న ధ్రువీకరణను అందజేయాల్సి వస్తుంది. ఇది కాస్త ఇబ్బంది కలిగించేదే.
 
ఉమ్మడిగా బ్యాంకు ఖాతా
representational imageభార్యా భర్తలు ఇద్దరూ జాయింట్ బ్యాంకు ఖాతాను నిర్వహించడం ఎంతో అవసరం. ప్రతీ ఇల్లాలూ జాయింటు ఖాతా తెరుద్దామని తన భర్తను కోరాలి. జాయింటు అకౌంట్ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అన్ని రకాల ఖర్చులను పరిశీలించే అవకాశంతోపాటు ఇద్దరూ ఖాతాను నిర్వహించుకునే స్వేచ్ఛ ఉండడం అనుకూలం. ఒకవేళ ఒకరు మరణిస్తే ఖాతాపై హక్కులు వేరొకరికి సులభంగా బదిలీ అవుతాయి. అయితే, జాయింట్ ఖాతాల్లోనూ చాలా రకాలున్నాయి. అందులో ఐదర్ ఆర్ సర్వైవర్ అన్న జాయింట్ ఖాతా భార్యాభర్తలకు అనుకూలంగా ఉంటుంది.

ఆరోగ్య బీమా
representational imageనేడు ఆహారపరమైన జాగ్రత్తలు తీసుకున్నా సంపూర్ణ ఆరోగ్యంగా ఉండగలరన్న భరోసా లేదు. కాలుష్యం భారీగా పెరిగిపోతున్న కాలంలో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు పుట్టుకొస్తున్నాయి. వైద్య చికిత్సల వ్యయాలు సైతం బాగా ఖరీదవుతున్నాయి. కనుక ప్రతీ కుటుంబానికి ఆరోగ్య బీమా అన్నది చాలా అవసరం. వైద్య బీమా లేకపోతే కుటుంబానికి ఆధారమైన వ్యక్తి తీవ్ర అనారోగ్యం పాలైతే, ప్రమాదంలో తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరితే ఆ కుటుంబం పొదుపు మొత్తం హరించుకుపోయే పరిస్థితి ఉంది. అందుకే తగినంత కవరేజీతో వైద్య బీమా ఉంటే పొదుపు ఖర్చయిపోకుండా ఉంటుంది. వైద్య బీమా ఉంటే నగదు రహిత చికిత్సలను  ప్రీ, పోస్ట్ హాస్పిటలైజేషన్ ఖర్చులను బీమా సంస్థే భరిస్తుంది.

టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్
కుటుంబానికి ఏకైక ఆధారంగా ఉన్న వ్యక్తి హఠాత్తుగా మరణిస్తే పరిస్థితి ఏంటో ఒక్కసారి ఆలోచించండి. ఆ వ్యక్తి పిల్లల్ని ఎవరు చూసుకుంటారు, వారి విద్య, వివాహాలు, పోషణ వ్యవహారాల బాధ్యతలు ఎవరిపై పడతాయి...? ఇల్లాలే ఇవన్నీ చూసుకోవాలి. ఇల్లాలు కూడా ఆర్జనాపరురాలైతే ఫర్వాలేదు. ఒకవేళ గృహిణిగా ఉంటే పైన చెప్పుకున్న బాధ్యతలన్నీ పెద్ద బరువుగా మారతాయి. అందుకే తాను లేకపోయినా తన కుటుంబం ఆర్థికంగా సమస్యల్లో చిక్కుకుపోకుండా టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవాలి. ఇలా తీసుకోవాలని ఇల్లాలు సైతం తన భర్తకు సూచించాలి. అప్పుడే ఆ కుటుంబానికి రక్షణ లభిస్తుంది. టర్మ్ పాలసీ అంటే కట్టిన ప్రీమియంలను వెనక్కి ఇచ్చేది కాదు. తక్కువ ప్రీమియంతో ఎక్కువ కవరేజీ లభిస్తుంది.  

పిల్లల కోసం పథకాల్లో పెట్టుబడులు
representational imageతమ పిల్లలకు మెరుగైన విద్యను అందించాలని అందరూ భావిస్తారు. విద్యా వ్యయాలు ఏటేటా బాగా పెరిగిపోతున్నాయి. స్కూళ్లు ఫీజులను గణనీయంగా పెంచేస్తున్నాయి. ఈ క్రమంలో ఖరీదైన విద్యను అందించడమన్నది ఓ కఠిన లక్ష్యమే అవుతుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబానికి ఆధారమైన వ్యక్తి దూరమైతే పిల్లల విద్యా భారాన్ని మోసేది ఎవరు? అందుకే తాను లేకపోయినా పిల్లల విద్య ఆగిపోకుండా ఉండేందుకు చైల్డ్ ఇన్సూరెన్స్ పాలసీలు తీసుకుంటే రక్షణగా నిలుస్తాయి. ఈ పాలసీలు క్రమానుగతంగా పాలసీలో పేర్కొన్న మేరకు చెల్లింపులు చేస్తాయి. పైగా భవిష్యత్తు ప్రీమియాల చెల్లింపులు సైతం రద్దవుతాయి. పాలసీ పిల్లల విద్య పూర్తయ్యే వరకూ లేదా పాలసీ కాల వ్యవధి వరకు కొనసాగుతుంది. అందుకే పిల్లల పేరిట పాలసీ తీసుకోవాలని ప్రతీ గృహిణి తన భర్తను కోరడం ఎంతో మంచిది.

విల్లు రాయండి
కుటుంబానికి ఆధారమైన భర్త మరణిస్తే అతడి పేరిట ఉన్న ఆస్తులన్నీ సరైన వారి చేతికే వెళ్లాలి. ఇల్లు లేదా షాపు, బంగారం, ఆభరణాలు ఏవైనా గానీ వీటిపై కుటుంబ సభ్యులకు హక్కులుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో విల్లు రాసి ఉండడం వల్ల పని సులువవుతుంది. అందుకే విల్లు రాయాల్సిన అవసరం ప్రతీ భర్తపై ఉంటుంది. అందులో తన భార్య, పిల్లల పేర్లను పేర్కొనాలి. ఈ ఆస్తులన్నవి కుటుంబ భవిష్యత్తు అవసరాలు తీర్చుకునేందుకు ఉపయోగపడతాయి. ఇలా విల్లు లేని సందర్భాల్లో సంబంధిత ఆస్తులపై హక్కుల కోసం న్యాయ స్థానాలను ఆశ్రయించాల్సి వస్తుంది. కానీ, ఇది సుదీర్ఘమైన కాలహరణ ప్రక్రియ అన్నది తెలిసిందే కదా.

ప్రణాళిక, పెట్టుబడులు కలసి ఉమ్మడిగా
representational imageసాధారణంగా ఖర్చు విషయంలో భార్యలు సంప్రదాయంగానే ఉంటారు. కానీ పురుషులు దూకుడుగా ఉంటారు. ఇదే తీరు పెట్టుబడులకు పనికిరాదు. పెట్టుబడుల విషయలో ఆలోచన అవసరం. ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. ఇందుకు భార్య ఆలోచన ఉపయోగపడవచ్చు. దాంతో తొందరపాటు పెట్టుబడులకు బ్రేక్ పడుతుంది. ఇద్దరూ కలసి పెట్టుబడులపై నిర్ణయం తీసుకోవడం అన్ని విధాలా మేలు.

అన్ని డాక్యుమెంట్లు
పెట్టుబడులకు సంబంధించిన అన్ని రకాల డాక్యుమెంట్లు, అలాగే ఆస్తులు, రుణాలకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్ల గురించి ఇంటి ఇల్లాలు తప్పకుండా తెలుసుకోవాలి. లేదంటే భర్త మరణం సందర్భంలో అవి లభించకుంటే భారీగా నష్టపోవాల్సి వస్తుంది. కీలకమైన డాక్యుమెంట్లు అన్నింటినీ ఓ ర్యాక్ లో పెట్టడం మంచిది.

పాస్ వర్డులు
పాస్ వర్డులు అన్నవి చాలా సున్నితమైనవి. చాలా కీలకమైనవి. పడరాని వారి చేతిలో పడితే పెద్ద నష్టమే కలుగుతుంది. కానీ భార్యా భర్తల విషయంలో ఇటువంటి సందేహాలు అక్కర్లేదు. పెట్టుబడులు ఎలక్ట్రానిక్ రూపంలో ఉన్నప్పుడు పాస్ వర్డ్ లు ఎంతో ఉపయోగపడతాయి. షేర్లు, మ్యూచువల్ ఫండ్స్ వంటివి. భార్యా భర్తల మధ్య ఆర్థిక విషయాల్లో దాపరికం లేకుండా అన్నింటి గురించి సమగ్రంగా తెలుసుకోవడం, నామినిగా ఒకరికి మరొకరు వ్యవహరించడం, కుటుంబానికి ఆర్థికపరమైన రక్షణ కల్పించడం ప్రతి ఒక్కరు కర్తవ్యంగా భావించాలి.


More Articles