ఏసీ కొంటున్నారా.. ముందు ఇవి తెలుసుకోండి

రోజు రోజుకూ వాతావరణంలో వేడి పెరిగిపోతోంది. అందువల్ల ఎయిర్ కండిషనర్ల (ఏసీల) వినియోగం కూడా బాగా పెరుగుతోంది. ఇటీవలి కాలంలో మధ్య తరగతి వారికి కూడా అందుబాటు ధరల్లో ఏసీలు లభిస్తున్నాయి. కానీ చాలా మందికి ఏసీల గురించి సరైన అవగాహన లేదు. ఏసీ కొనుగోలు చేద్దామని ఉన్నా.. వినియోగం, నిర్వహణ, కరెంటు బిల్లు వంటి అంశాలపై సందేహాల కారణంగా వెనుకంజ వేస్తున్న వారే ఎక్కువ. 


ఈ నేపథ్యంలో అసలు ఏసీలు ఎలా పనిచేస్తాయి? వాటికి ఖర్చయ్యే విద్యుత్ ఎంత? ఎంత పెద్ద గదికి ఎంత సామర్థ్యమున్న ఏసీ సరిపోతుంది? ఏసీ నుంచి చల్లదనం సరిగా రావాలంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? ఇన్వర్టర్ ఏసీ-సాధారణ ఏసీల మధ్య తేడాలేమిటి? ఏసీలు ఎక్కడ కొనుగోలు చేయాలి? కొనేముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనలేమిటనే అంశాలు తెలుసుకుందాం..


ఎలా పని చేస్తుంది?
నిజానికి ఏసీ అంటే చల్లని గాలిని ఇస్తుంది అనుకుంటారు. సాధారణంగా చూస్తే ఇది సరైనదే అయినా సాంకేతికంగా చూస్తే ఏసీ చల్లని గాలిని ఇచ్చే పరికరం కాదు.. గదిలో ఉన్న వేడిని తీసుకెళ్లి బయట వదిలేసే యంత్రం. సాంకేతికంగా కండెన్సర్, కంప్రెసర్, ఎవాపరేటర్ అనే మూడు ప్రత్యేక పరికరాలు, రిఫ్రిజిరెంట్ గా పిలిచే లిక్విడ్/గ్యాస్ తో ఏసీ పనిచేస్తుంది. విండో ఏసీలో ఈ మూడు పరికరాలూ ఒకే చోట ఉంటాయి. అదే స్ప్లిట్ ఏసీలో ఔట్ డోర్ యూనిట్లో కండెన్సర్, కంప్రెసర్లు ఉండగా.. ఇండోర్ యూనిట్ (గదిలోపల అమర్చే భాగం)లో ఎవాపరేటర్ ఉంటుంది. రిఫ్రిజిరెంట్ ఈ మూడింటి మధ్య సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. ఇవేగాకుండా ఉష్ణోగ్రతను లెక్కించే పరికరం (థర్మోస్టాట్), ఎవాపరేటర్ పై నుంచి గాలిని గదిలోకి విడుదల చేసేలా ఫ్యాన్ వంటివి ఏసీలో ఉంటాయి.
  • తొలుత కంప్రెసర్ రిఫ్రిజిరెంట్ గ్యాస్ ను తీవ్ర పీడనం వద్ద లిక్విడ్ (ద్రవం)గా మార్చుతుంది. ఇలా చాలా గ్యాస్ కొంచెం ద్రవంగా మారుతుంది. ఆ సమయంలో అంత గ్యాస్ లో ఉన్న వేడి అంతా కొంచెం లిక్విడ్ లో ఒక్కచోటుకి వచ్చి.. బాగా వేడిగా ఉంటుంది. కంప్రెసర్ ఈ వేడి ద్రవ రిఫ్రిజిరెంట్ ను కండెన్సర్ లోకి విడుదల చేస్తుంది.
  • కండెన్సర్ అంటే ఎక్కువ, తక్కువ ఉష్ణోగ్రతల మధ్య సమతౌల్యం చేసేదని అర్థం. వేడిగా ఉన్న లిక్విడ్ రిఫ్రిజిరెంట్ కండెన్సర్ లోకి విడుదల కాగానే.. అందులోని వేడి అంతా కండెన్సర్ ద్వారా బయట గాలిలోకి విడుదలవుతుంది. రిఫ్రిజిరెంట్ బయట వాతావరణంతో సమానంగా చల్లబడి.. ఎవాపరేటర్ లోకి విడుదల చేయబడుతుంది.
  • ఎవాపరేటర్ అంటే లిక్విడ్ రూపంలో ఉన్న రిఫ్రిజిరెంట్ పై ఒత్తిడి (పీడనం) తగ్గిపోయేలా కొద్ది కొద్దిగా విడుదల చేసే పరికరం. లిక్విడ్ రిఫ్రిజిరెంట్ ఎవాపరేటర్ నుంచి విడుదలవుతున్న కొద్దీ పీడనం తగ్గిపోయి.. వ్యాకోచిస్తూ గ్యాస్ రూపంలోకి మారుతుంది. ఇలా పరిమాణం పెరగడంతో ఉష్ణోగ్రత తగ్గిపోయి.. గదిలోని ఉష్ణోగ్రతను స్వీకరించి, వేడెక్కుతుంది.
  • ఎవాపరేటర్ లో వేడెక్కిన రిఫ్రిజిరెంట్ తిరిగి కంప్రెసర్ కు వెళ్లి వేడి లిక్విడ్ గా మారుతుంది. అక్కడి నుంచి కండెన్సర్ కు, మళ్లీ ఎవాపరేటర్ కు ఇలా సర్క్యులేట్ అవుతూ.. గదిలోని వేడిని తీసుకెళ్లి బయట వదిలేస్తుంది.
విండో ఏసీ.. స్ప్లిట్ ఏసీ.. సెంట్రల్ ఏసీ
ఏసీల్లో విండో ఏసీలు, స్ప్లిట్ ఏసీలు, సెంట్రల్ ఏసీ అని మూడు రకాలు ఉంటాయి. మూడింటి పనితీరూ ఒక్కటే. అవసరాన్ని, ఖర్చుపెట్టగల స్థాయిని బట్టి వినియోగం ఉంటుంది. విండో ఏసీ అంటే ఒకే పెట్టె మాదిరిగా ఉండి, గది కిటికీ వద్ద అమర్చుతారు. స్ప్లిట్ ఏసీ అంటే ఎవాపరేటర్ భాగం గది లోపల అమర్చబడి.. కంప్రెసర్, కండెన్సర్లతో కూడిన భాగం బయట అమర్చబడి ఉంటాయి. ఈ రెండింటి మధ్య అనుసంధానం ఉంటుంది. ఇక సెంట్రల్ ఏసీ అంటే ఏసీకి సంబంధించి అన్ని పరికరాలూ బయటే ఉండి చల్లని గాలిని మాత్రం లోపలికి తీసుకువచ్చేలా ఉండే ఏర్పాటు. సాధారణంగా మొత్తం ఇంటికి, పెద్ద పెద్ద భవనాలు, ఆఫీసుల్లో ఈ ఏర్పాటు ఉంటుంది. భవనం లేదా ఇంటిలోని అన్ని చోట్లకు చల్లటి గాలిని లోపలికి తీసుకెళ్లే ఏర్పాటు చేస్తారు.

రిఫ్రిజిరెంట్ తీరు ఏమిటి?
మొదట రిఫ్రిజిరెంట్ అంటే ఏమిటో తెలుసుకుందాం. సాధారణ ఉష్ణోగ్రత వద్ద వాయు (గ్యాస్) రూపంలో ఉండి, ఒత్తిడికి (పీడనానికి) గురిచేసినప్పుడు ద్రవ రూపంలోకి మారే రసాయనమే రిఫ్రిజిరెంట్. గ్యాస్ నుంచి నుంచి ద్రవంగా మార్చినప్పుడు అందులోని వేడి అంతా ఒక్క చోటికి వచ్చి.. వేడి ద్రవంగా మారుతుంది. ద్రవ రూపం నుంచి గ్యాస్ గా మారినప్పుడు దానిపై ఒత్తిడి (పీడనం) తగ్గి, వ్యాకోచించి ఒక్కసారిగా చల్లబడుతుంది.
  • దీనికి ఒక ఉదాహరణ కూడా చెప్పుకోవచ్చు. మన శరీరంలో వేడి ఉంటుంది. అందువల్ల ఊపిరితిత్తుల్లోకి వెళ్లిన గాలి బయటికి వచ్చేటపుడు వేడిగా వస్తుంది కదా. కానీ ఒక పని చేసి చూడండి. నోటిని పూర్తిగా తెరిచి అరచేతిపైకి గాలిని ఊదండి. వేడిగా తగులుతుంది. అదే పెదవులను మూసేసి, కొంచెం సందు వదిలి కాసేపు అరచేతిపైకి గాలిని ఊదితే.. గాలి బాగా చల్లగా తగులుతుంది. ఇదే ఎవాపరేటర్, రిఫ్రిజిరెంట్ పనిచేసే విధానం.
  • ఏసీలు కొనుగోలు చేసేటప్పుడు రిఫ్రిజిరెంట్ గా దేనిని వాడారనేదీ తెలుసుకుంటే మంచిది. రిఫ్రిజిరెంట్లలో R-22, R410A, R32, R134A, R290, R600A అనే రకాలు ఉంటాయి. వీటిలో R-22, R32, R410A లకు పెద్దగా మండే (ఇన్ ఫ్లేమబుల్) లక్షణం ఉండదు. R134A కొంత వరకు మండే స్వభావమున్నదికాగా.. R290, R600A రెండూ తీవ్రంగా మండే స్వభావమున్న పదార్థాలు. అయితే రిఫ్రిజిరేషన్ సామర్థ్యం, పర్యావరణానికి చెడు చేయకపోవడం మూలంగా R290, R600A రిఫ్రిజిరెంట్లను ఎక్కువగా వినియోగిస్తున్నారు. కంపెనీలు కూడా రిఫ్రిజిరెంట్లతో ఎలాంటి ప్రమాదాలూ లేకుండా పరికరాలను రూపొందిస్తున్నాయి.
ఏసీలో ఉండే ఫ్యాన్ పనేమిటి?
ఎవాపరేటర్ లో గ్యాస్ రూపంలోకి మారిన రిఫ్రిజిరెంట్ గదిలోని ఉష్ణోగ్రతను గ్రహించడానికి ఏసీ ఇండోర్ యూనిట్ లోని ఫ్యాన్ తోడ్పడుతుంది. ఆ ఫ్యాన్ తిరుగుతూ గదిలోని గాలి గ్రహించి.. ఎవాపరేటర్ కాయిల్స్ మీదుగా విడుదల చేస్తుంది. ఈ సమయంలో ఎవాపరేటర్ లోని రిఫ్రిజిరెంట్ వేడిని గ్రహించడంతో గాలి చల్లబడుతుంది. దాంతో మనకు ఏసీ నుంచి చల్లని గాలి వీస్తున్న అనుభూతి కలుగుతుంది.
  • అటు ఏసీ ఔట్ డోర్ యూనిట్ లో ఉండే ఫ్యాన్ దాదాపుగా ఇండోర్ యూనిట్ తరహాలోనే పనిచేస్తుంది. వేడి లిక్విడ్ రిఫ్రిజిరెంట్ ఉన్న కండెన్సర్ పై నుంచి ఈ ఫ్యాన్ గాలిని పంపుతుండడంతో.. రిఫ్రిజిరెంట్ చల్లబడుతుంది.
ఉష్ణోగ్రతను కనిపెట్టుకుని ఉండే థర్మోస్టాట్
ఏసీ వినియోగిస్తున్నప్పుడు ఎంత చల్లగా ఉండాలో మనం ఎంపిక చేసుకుంటాం. గదిలో సరిగా ఆ ఉష్ణోగ్రత ఉండేలా థర్మోస్టాట్ నియంత్రిస్తుంది. నిర్ణీత ఉష్ణోగ్రతకు చల్లబడగానే కంప్రెసర్ ను ఆపేస్తుంది. దాంతో రిఫ్రిజిరెంట్ సర్క్యులేషన్ నిలిచిపోతుంది. గదిలో తిరిగి వేడి పెరగగానే కంప్రెసర్ ను తిరిగి ఆన్ చేస్తుంది. దాంతో తిరిగి గది చల్లబడడం మొదలవుతుంది. అయితే ఈ సమయంలో ఏసీ ఇండోర్ యూనిట్ లోని ఫ్యాన్ మాత్రం తిరుగుతూనే ఉంటుంది.

కూలింగ్ సామర్థ్యాన్ని లెక్కించేది ఇలా..
ఎంత వైశాల్యానికి, ఎంత పెద్ద గదికి ఏ ఏసీ సరిపోతుందో ఎలా లెక్కించాలనే సందేహం చాలా మందికి వస్తుంది. సాధారణంగా ఏసీల కూలింగ్ సామర్థ్యాన్ని ఒక టన్, 1.2 టన్, 1.5 టన్, 2 టన్.. ఇలా పేర్కొంటుంటారు. ఒక టన్ను ఏసీ అంటే.. గంటకు 12,000 బీటీయూ (బ్రిటిష్ థర్మల్ యూనిట్లు) లేదా 3,517 కూలింగ్ వాట్ల చల్లదనాన్ని అందించగలదని అర్థం. టన్స్ పరంగా ఎంత ఎక్కువ టన్స్ ఉంటే ఆ ఏసీ అంత చల్లదనాన్ని అందించగలదు.
  • అసలు ఇలా ఏసీల సామర్థ్యాన్ని టన్నుల్లో లెక్కించడమేమిటనే సందేహం వస్తుంది. ఒక టన్ను మంచు కరగడానికి ఎంత వేడి అవసరమనేది లెక్కించి.. అంత వేడిని గ్రహించగలిగే సామర్థ్యాన్ని ఏసీలకు వర్తింపజేశారు. అంటే ఒక టన్ను మంచును కరిగించడానికి అవసరమయ్యే వేడిని గది నుంచి తొలగించ గలిగే ఏసీని ఒక టన్ను సామర్థ్యమున్న ఏసీగా లెక్కించారు. సాధారణంగా వేడిని బీటీయూల్లో కొలుస్తారు. గంటలో ఒక టన్ను మంచును కరిగించేందుకు 12,000 బీటీయూ వేడి కావాలి. అంటే ఒక టన్ సామర్థ్యమున్న ఏసీ.. గదిలోంచి 12,000 బీటీయూ వేడిని తొలగించగలదని అర్థం.
  • సాధారణంగా 10X10 అడుగుల పరిమాణం ఉన్న గదికి 0.8 టన్నుల సామర్థ్యమున్న సాధారణ ఏసీ సరిపోతుంది. అదే గదిలోకి నేరుగా ఎండ పడేలా ఉన్నా.. ఒకే అంతస్తు ఇల్లు అయి ఉండి, సీలింగ్ పై నేరుగా ఎండ పడుతున్నా.. కనీసం ఒక టన్ను నుంచి 1.2 టన్నుల సామర్థ్యమున్న ఏసీ తీసుకోవాలి.
  • 10X12, 12X15 అడుగుల కన్నా ఎక్కువ పరిమాణమున్న గదికి 1.2 టన్నుల నుంచి 1.5 టన్నుల సామర్థ్యమున్న ఏసీ తీసుకోవాలి.
ఎంత విద్యుత్ ఖర్చవుతుంది?
సాధారణంగానే ఏసీల విద్యుత్ వినియోగం చాలా ఎక్కువ. ఒక టన్ను సామర్థ్యమున్న ఏసీ గంటకు ఒక యూనిట్ వరకు విద్యుత్ ఖర్చు చేస్తుంది. 0.8 టన్నుల సామర్థ్యమున్న ఏసీ గంటన్నరకు ఒక యూనిట్ విద్యుత్ వినియోగించుకుంటుంది. 1.2 నుంచి 1.5 టన్నుల సామర్థ్యమున్నవి గంటకు 1.5 నుంచి రెండు యూనిట్ల విద్యుత్ ను వినియోగించుకుంటాయి. 2 టన్నుల సామర్థ్యమున్న ఏసీ గంటకు 2.5 నుంచి 3 యూనిట్ల వరకు విద్యుత్ ఖర్చు చేస్తుంది. అయితే ఇది సంవత్సరం పొడవునా ఒకే స్థాయిలో ఉండదు. చలికాలంలో తక్కువగా, వేసవి కాలంలో ఎక్కువగా విద్యుత్ వినియోగించుకుంటాయి.
  • ఇన్వర్టర్ ఏసీలు కూడా వాటి సామర్థ్యాన్ని బట్టి ఇదే స్థాయిలో విద్యుత్ ను వినియోగించుకున్నా.. గదిలో ఉష్ణోగ్రతకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కంప్రెసర్ వేగం మారిపోతుండడంతో సగటు విద్యుత్ వినియోగం బాగా తగ్గుతుంది. వినియోగాన్ని బట్టి ఇన్వర్టర్ ఏసీలు సుమారు 30% నుంచి 60 శాతం వరకు విద్యుత్ ను పొదుపు చేస్తాయి.
  • ఉదాహరణకు ఒక టన్ను సామర్థ్యమున్న సాధారణ ఏసీని రోజుకు ఆరేడు గంటల పాటు వినియోగిస్తే.. సంవత్సరానికి సుమారు 1500 యూనిట్ల విద్యుత్ ఖర్చవుతుంది. ఇదే ఇన్వర్టర్ ఏసీ అయితే 1000 నుంచి 1200 యూనిట్లే వినియోగించుకుంటుంది.
ISEER, EER, BEE రేటింగులు చూడాలి
సాధారణ ఎలక్ట్రానిక్ పరికరాలకు BEE (భారత్ ఎనర్జీ ఎఫిషియెన్సీ), EER (ఎనర్జీ ఎఫిషియెన్సీ రేషియో) రేటింగులు ఉంటాయి. వాటి విద్యుత్ వినియోగ సమర్థత ఆధారంగా ఈ రేటింగులు ఇస్తారు. అయితే ఏసీలకు రేటింగ్ ఇవ్వడం కష్టం. ఎందుకంటే వివిధ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ఏసీల పనితీరు బాగా ప్రభావితం అవుతుంది. ఉదాహరణకు ఎండాకాలంలో బయట 40 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నప్పుడు ఏసీ ఎక్కువగా పనిచేయాల్సి వస్తుంది. అదే చలికాలంలో బయట 25 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నప్పుడు ఏసీపై భారం చాలా తక్కువ. అంతేగాకుండా వివిధ ప్రాంతాలను బట్టి ఏసీల వినియోగం మారుతుంటుంది. అందువల్లే SEER (సీజనల్ ఎనర్జీ ఎఫిషియెన్సీ రేషియో) ను అమల్లోకి తెచ్చారు. దీనిలో భారత ప్రమాణాలనే ISEER (ఇండియన్ సీజనల్ ఎనర్జీ ఎఫిషియెన్సీ రేషియో అంటారు. దీనిని 3.10 నుంచి 4.50 వరకు చూపిస్తుంటారు. ఈ రేషియో ఎంత పెరిగితే ఏసీ అంత విద్యుత్ ను ఆదా చేస్తుందని లెక్క.
  • ISEER రేటింగ్ ను స్టార్ రేటింగ్ తోనూ పోల్చి చూడవచ్చు. ISEER 3.10 నుంచి 3.29 వరకు ఉంటే 1 స్టార్ రేటింగ్ గా.. 3.30 నుంచి 3.49 వరకు ఉంటే 2 స్టార్.. 3.50 నుంచి 3.99 వరకు ఉంటే 3 స్టార్.. 4.00 నుంచి 4.49 వరకు ఉంటే 4 స్టార్.. 4.50 కంటే ఎక్కువగా ISEER రేటింగ్ ఉంటే 5 స్టార్ రేటింగ్ గా పరిగణించవచ్చు.
  • ప్రస్తుతం సాధారణ ఏసీలకు మాత్రమే ISEERతో పాటు స్టార్ రేటింగ్ అమల్లో ఉంది. 2017 సంవత్సరం చివరి వరకు ఇన్వర్టర్ ఏసీలకు రేటింగ్ తప్పనిసరిగా  ఇవ్వాలనే నిబంధన లేదు. అందువల్లే పలు కంపెనీలు, మోడళ్ల ఇన్వర్టర్ ఏసీలకు రేటింగ్ పేర్కొనడం లేదు కూడా. 2018 నుంచి మాత్రం అన్ని ఏసీలకూ తప్పనిసరిగా రేటింగ్ ఇస్తారు.
కంప్రెసర్ మోడల్ లోనూ తేడాలు
ఏసీలలో ప్రధాన భాగమైన కంప్రెసర్ ఏ తరహాకు చెందినదనేది కూడా ముఖ్యమే. ఇందులో ప్రధానంగా రెసిప్రొకేటింగ్ (పిస్టిన్ తరహా), రోటరీ తరహా అని రెండు రకాల కంప్రెసర్లు ఉంటాయి.
  • రెసిప్రొకేటింగ్ కంప్రెసర్ల నిర్వహణ చాలా సులభం, ఏసీ పూర్తి స్థాయిలో పనిచేయాల్సి వచ్చినప్పుడు సమర్థవంతంగా పనిచేస్తాయి. కానీ ఈ తరహా కంప్రెసర్ల నుంచి కొంత శబ్దం వెలువడుతుంది. స్వల్పంగా కంపిస్తాయి కూడా. చాలా వేడి కూడా వెలువడుతుంది. అయితే వీటి ధర తక్కువ.
  • పెద్ద ఆఫీసులు, పారిశ్రామిక స్థాయి కూలింగ్ అవసరాలకు రోటరీ తరహా కంప్రెసర్లు బాగా పనికి వస్తాయి. వీటి నుంచి శబ్దం తక్కువగా వస్తుంది, వెలువడే వేడి కూడా తక్కువ. అయితే వీటి ధర ఎక్కువ. తరచూ వినియోగించాల్సి ఉంటుంది. లేకపోతే పాడైపోతాయి.
ఏసీలో ఉన్నది కాపర్ కాయిలా.. అల్యూమినియం కాయిలా?
ఏసీల్లో రెండు రకాల కాయిల్స్ ను వినియోగిస్తుంటారు. ఇటు గదిలోని వేడిని గ్రహించడానికిగానీ, అటు బయట వేడిని వదిలేయడానికి గానీ రిఫ్రిజిరెంట్ ప్రవహించేది ఈ కాయిల్స్ లోనే. అందువల్ల ఏసీల సామర్థ్యం కాయిల్స్ తయారైన లోహంపైనా ఆధారపడి ఉంటుంది. అయితే కాపర్ ధర ఎక్కువ కావడం వల్ల వాటిని వినియోగించే ఏసీల ధరలు చాలా ఎక్కువగా ఉంటాయి. అల్యూమినియం కాయిల్స్ ఉన్న ఏసీల ధరలు తక్కువగా ఉంటాయి.
  • కాపర్ కాయిల్స్ వేడిని గ్రహించడం, వదిలేయడంలో అల్యూమినియం కన్నా సమర్థవంతంగా పనిచేస్తాయి. అందువల్ల ఏసీ పనితీరు వేగంగా, సమర్థవంతంగా ఉంటుంది.
  • కాపర్ కాయిల్స్ దృఢంగా ఉంటాయి. వాటిలో ఏదైనా లోపం ఏర్పడినా, దెబ్బతిన్నా మరమ్మతు చేయడానికి అవకాశం ఉంటుంది. అదే అల్యూమినియం కాయిల్స్ అయితే చాలా వరకు రీప్లేస్ చేయాల్సి వస్తుంది.
  • సాధారణంగా ఏసీల ఔట్ డోర్ యూనిట్ లో కాయిల్స్ ఉంటాయి. బయట వాతావరణ పరిస్థితులు, దుమ్ము, తేమ వంటి వాటి కారణంగా.. అప్పుడప్పుడు కాయిల్స్ ను శుభ్రం చేయాల్సి ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లలో కాపర్ కాయిల్స్ ను శుభ్రం చేయడం సులువు. అదే అల్యూమినియం కాయిల్స్ అంత దృఢంగా ఉండనందున వాతావరణ పరిస్థితుల నుంచి రక్షించేందుకు ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది.
  • కాపర్ కాయిల్స్ కు సంబంధించి తుప్పు సమస్య పెద్దగా ఉండదు. కానీ అల్యూమినియం కాయిల్స్ లోని అతుకులు, కంప్రెషర్, ఎవాపరేటర్ తో అనుసంధానమయ్యే భాగాలు తుప్పు పట్టి పాడైపోయే అవకాశం ఉంటుంది.
  • అయితే ఇటీవల చాలా కంపెనీలు ఏసీల ధరలు తగ్గించడానికి తక్కువ మందం ఉన్న కాపర్ కాయిల్స్ ను వినియోగిస్తున్నాయి. మరోవైపు అత్యంత ప్రెషర్ వద్ద పనిచేసే కొత్త తరహా రిఫ్రిజిరెంట్లను వినియోగిస్తున్నాయి. దీనివల్ల తక్కువ మందమున్న కాపర్ కాయిల్స్ దెబ్బతిని.. లీకేజీ జరగడం వంటివి తలెత్తుతున్నాయి. ఈ లెక్కన తక్కువ మందమున్న కాపర్ కాయిల్స్ కంటే అల్యూమినియం కాయిల్స్ ఉత్తమం.
గది ఎందుకు వేడెక్కుతుంది?
సాధారణంగా బయటి వాతావరణం ఎండగా, ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు.. ఆ వేడి ద్వారాలు, కిటికీల గుండా ఇంట్లోకి ప్రసరిస్తుంది. అలాగే మన నుంచి నిత్యం వేడి విడుదలవుతూనే ఉంటుంది. ఫ్రిజ్ లు, టీవీలు, ఫ్యాన్లు వంటి ఎలక్ట్రానిక్ ఉపకరణాలన్నీ కూడా అవి నడుస్తున్నంత సేపూ వేడిని విడుదల చేస్తూనే ఉంటాయి. ఎక్కువ మంది ఉండిపోవడం, ఎక్కువ ఉపకరణాలు నడుస్తుండడం, తలుపులు, కిటికీల ద్వారా ఎండ నేరుగా గదిలోకి పడుతుండడం వంటి సమయాల్లో గదిలో వేడి మరింత ఎక్కువగా ఉంటుంది. దాంతో ఏసీపై అధిక భారం పడుతుంది.
  • అందువల్ల ఏసీని ఏర్పాటు చేసే గదిలో అనవసరపు ఎలక్ట్రానిక్ ఉపకరణాలు ఉండకుండా చూసూకోవడం, వాటి ఇతర గదుల్లోకి మార్చడం, ద్వారాలు, కిటికీలద్వారా ఎండ, వేడిమి లోనికి రాకుండా చర్యలు చేపట్టడం మంచిది. దానివల్ల గది చల్లగా ఉంటుంది. ఏసీపై భారం తగ్గి.. విద్యుత్ బిల్లులు కూడా తగ్గుతాయి.
ఒక ఏసీతో రెండు గదులకూ చల్లదనం
ఒక ఏసీతో రెండు గదులకూ చల్లదనాన్ని అందించవచ్చు. ఇందుకోసం ఎక్కువ సామర్థ్యమున్న ఏసీని కొనుగోలు చేయడంతోపాటు.. దానిని రెండు గదులకు మధ్యలో ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. అంతేగాకుండా రెండు గదుల మధ్య గాలి ప్రసారం జరిగేలా కిటికీలుగానీ, తలుపు తెరిచి ఉంచడం గానీ బెటర్. లేకుంటే ఏసీ ఉన్న గదిలో ఎక్కువ చల్లదనం ఉండి.. మరోదానిలో తక్కువ చల్లదనం ఉంటుంది.

ఇన్వర్టర్ ఏసీలతో ఎన్నో ప్రయోజనాలు
సాధారణంగా ఇన్వర్టర్ అనగానే కరెంటును నిల్వ చేసుకుని.. సరఫరా లేనప్పుడు వినియోగించుకునేందుకు తోడ్పడేదని మనం భావిస్తుంటాం. అయితే ఈ ఇన్వర్టర్లకు ఏసీ, రిఫ్రిజిరేటర్లు వంటి పరికరాల్లో ఇన్వర్టర్ టెక్నాలజీ వినియోగానికి సంబంధం లేదు. ఇన్వర్టర్ టెక్నాలజీ అంటే ఆయా పరికరాల్లో ఉండే మోటార్ల వేగాన్ని అవసరానికి, పరిస్థితులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు మార్చగలిగే సాంకేతికత మాత్రమే. ఈ ఇన్వర్టర్ టెక్నాలజీతో కూడిన ఎయిర్ కండిషనర్లతో ఎన్నో ప్రయోజనాలున్నాయి.
  • సాధారణ ఏసీలతో గదిలోని ఉష్ణోగ్రత ఎప్పుడూ సమ స్థితిలో ఉండదు. నాలుగైదు డిగ్రీల వరకు పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. ఎందుకంటే నిర్ణీత ఉష్ణొగ్రత స్థాయి రాగానే కంప్రెసర్ ఆగిపోతుంది. ఆ సమయంలో గదిలోని ఉష్ణోగ్రత పెరుగుతుంటుంది. ఇది ఒక నిర్ణీత స్థాయికి పెరగగానే తిరిగి కంప్రెసర్ పనిచేయడం మొదలై.. గది చల్లబడుతుంటుంది. ఇలా జరిగే క్రమంలో గదిలో వేడి పెరుగుతూ, తగ్గుతూ ఉంటుంది. ఇదే ఇన్వర్టర్ ఏసీల్లో గది ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులకు అనుగుణంగా.. కంప్రెసర్ వేగం పెరుగుతూ, తగ్గుతూ ఉండేలా ఏర్పాట్లు ఉంటాయి. దాంతో గదిలో ఉష్ణోగ్రత దాదాపు స్థిరంగా ఉంటుంది.
  • సాధారణ ఏసీల్లో విద్యుత్ వినియోగం చాలా ఎక్కువ. అవి పనిచేసినంత సేపూ పూర్తి స్థాయిలో విద్యుత్ వినియోగించుకుంటూనే ఉంటాయి. అదే ఇన్వర్టర్ ఏసీలైతే గదిలో ఉష్ణోగ్రతకు తగినట్లుగా పనితీరు మార్చుకుంటాయి కాబట్టి విద్యుత్ వినియోగం తక్కువ.
  • సాధారణ ఏసీలను ఇన్వర్టర్లతో వినియోగించుకోవడం కష్టం. అదే ఇన్వర్టర్ టెక్నాలజీ ఏసీలను సులువుగా వినియోగించుకోవచ్చు.
  • అయితే సాధారణ ఏసీల కంటే ఇన్వర్టర్ ఏసీల ధరలు ఎక్కువగా ఉంటాయి.
హీటర్ కమ్ ఏసీలూ లభిస్తాయి
సాధారణంగా ఏసీలు అంటే చల్లదనాన్ని ఇచ్చేవే. అయితే అటు హీటర్ లా, ఇటు ఏసీలా పనిచేసే.. డ్యూయల్ ఏసీలు కూడా అందుబాటులోకి వచ్చాయి. సాధారణ ఏసీలు గదిలోపలి వేడిని తీసుకెళ్లి బయట వదిలేస్తాయి. ఈ డ్యూయల్ ఏసీలు గదిలోపలి వేడిని తీసుకెళ్లి బయట వదిలేయడంతోపాటు అవసరమైనప్పుడు బయట నుంచి వేడిని గ్రహించి గది లోపల విడుదల చేస్తాయి. అంటే చలికాలంలోనూ గదిలో హాయిగా వెచ్చగా ఉండవచ్చన్న మాట. అయితే బయటి ఉష్ణోగ్రతలకు 4 డిగ్రీలకన్నా తక్కువకు పడిపోతే డ్యూయల్ ఏసీలు హీటింగ్ ను అందించలేవు.
  • సాధారణంగా ఇళ్లలో వెచ్చదనాన్ని కలిగించేందుకు రూమ్ హీటర్లు అందుబాటులో ఉన్నాయి. అవి లోహాన్ని లేదా ఫిలమెంటులో విద్యుత్ ప్రసారం చేయడం ద్వారా విపరీతంగా వేడెక్కి.. గదిలో ఉష్ణోగ్రతను పెంచుతాయి. ఆ విధానంలో విపరీతంగా విద్యుత్ ఖర్చవుతుంది.
  • అదే డ్యూయల్ ఏసీల ద్వారా గదిలో వేడిని పెంచుకునేందుకు రూమ్ హీటర్ల కన్నా తక్కువగా విద్యుత్ ఖర్చవుతుంది. అందువల్ల చాలా వరకు శీతల ప్రాంత దేశాల్లో డ్యూయల్ ఏసీలను వినియోగిస్తారు.
కొనే ముందు ఇవి గమనించండి
  • మీరు ఏసీ ఏర్పాటు చేయాలనుకుంటున్న గది లేదా హాలు పరిమాణాన్ని బట్టి ఎంత సామర్థ్యం అవసరమనేది ఎంచుకోవాలి. అవసరానికన్నా తక్కువ సామర్థ్యముంటే సరైన చల్లదనం అందదు. అవసరానికి మించినది తీసుకుంటే.. సొమ్ము వృథాతోపాటు విద్యుత్ బిల్లులు మోత మోగిపోతాయి.
  • వీలైనంత వరకూ ఎక్కువ రేటింగ్ ఉన్న ఏసీని కొనుగోలు చేయడమే మేలు. వినియోగం చాలా తక్కువగా ఉంటే మాత్రం కొంత తక్కువ స్టార్ రేటింగ్ ఉన్నా ఫరవాలేదు. ఎందుకంటే ఎక్కువ రేటింగ్ ఉండే ఏసీల ధరలు చాలా ఎక్కువ. అయితే ఎలా చూసినా కనీసం 3 స్టార్ ఆపైన రేటింగ్ ఉన్నవి తీసుకోవడం మేలు.
  • ఇన్వర్టర్ టెక్నాలజీ ఉన్న ఏసీలు తీసుకుంటే.. 30% నుంచి 60% వరకు విద్యుత్ ఆదా అవుతుంది.
  • పలు ఏసీల్లో ఆటో క్లీన్ మోడ్ ఉంటుంది. దానివల్ల తరచూ శుభ్రం చేయాల్సిన పని తప్పుతుంది.
  • ఏసీ కాయిల్స్ తుప్పు పట్టకుండా (కొరిజన్ ప్రొటెక్షన్) కోటింగ్ రక్షణ ఉందో లేదో గమనించాలి. బ్లూఫిన్ కండెన్సర్ లేదా మైక్రో చానల్ కండెన్సర్ అయితే మేలు.
  • కొన్ని కంపెనీల ఏసీలలో అదనంగా వాటర్ కూల్డ్ కండెన్సర్ ను అందిస్తున్నారు. మిగతావాటితో పోల్చితే ఈ ఏసీలు మరింత సమర్థవంతంగా పనిచేస్తాయి. ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్న సమయంలోనూ మెరుగైన చల్లదనాన్ని అందిస్తాయి. అయితే నీటిని వినియోగించాల్సి వస్తుంది.
ఏసీ వినియోగంలో ఈ జాగ్రత్తలు తప్పనిసరి
  • బయటి నుంచి గాలి చొరబడేలా, ఎండ పడేలా ఉన్న గదిలో ఉష్ణోగ్రతలు పెరుగుతూంటాయి. దాంతో ఏసీపై చాలా భారం పడుతుంది. అందువల్లే ఏసీ ఉన్న గదుల కిటికీలు వంటి వాటిని గాలి చొరబడకుండా ఏర్పాటు చేసుకోవాలి.
  • ఏసీలోని ఔట్ డోర్ యూనిట్ పై నేరుగా ఎండ పడకుండా చూసుకోవాలి. లేకపోతే ఏసీ సమర్థవంతంగా పనిచేయదు. విద్యుత్ కూడా ఎక్కువగా వినియోగించుకుంటుంది.
  • సముద్ర తీర ప్రాంతాల్లో గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉంటుంది. దాంతో ఏసీలలోని కాయిల్స్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందువల్ల వాటిని తరచూ శుభ్రం చేస్తుండడం మంచిది.
  • ఏసీ ఉన్న గదిలో ఫ్యాన్ కూడా వేసి ఉంచడం ద్వారా ఏసీపై భారాన్ని తగ్గించవచ్చు. ఎందుకంటే ఏసీ నడుస్తున్నప్పుడు ఏసీకి దగ్గరగా ఉన్న చోట చల్లగా ఉంటుంది. మిగతా మూలల్లో వేడిగా ఉంటుంది. ఏసీ వద్ద ఉన్న ప్రాంతం కూడా వేడయ్యే వరకు అందులోని థర్మోస్టాట్ ఉష్ణోగ్రతను దానిని గుర్తించలేదు. దాంతో గదిలో ఉష్ణోగ్రత మనం అనుకున్నదానికన్నా నాలుగైదు డిగ్రీలు పెరుగుతూ తగ్గుతూ ఉండి.. ఏసీపై భారం పడుతుంది. అదే సీలింగ్ ఫ్యాన్ కూడా వేసి ఉంచితే.. చల్లదనం గది నిండా సమానంగా పరుచుకుంటుంది.
  • ఏసీలలో పీసీబీ సున్నితమైన భాగం. దానిని దెబ్బతినకుండా చూసుకోవాలి.
  • ఫిల్టర్లలో చెత్త చేరడం ఏసీల నుంచి వెలువడే కూలింగ్ తగ్గిపోతుంది. కాబట్టి ప్రతి 6 నెలలకు ఒక సారైనా సర్వీసింగ్ చేయించుకుంటే మంచిది.
  • కెపాసిటర్ లేదా కంప్రెసర్ సమస్యల కారణంగా ఒక్కోసారి ఏసీ ఔట్ డోర్ యూనిట్ ఆన్ కాదు. వాటిని చెక్ చేసి సంబంధిత భాగాన్ని మార్చాల్సి ఉంటుంది.
  • ఇండోర్ యూనిట్ లోని బ్లోయర్ (ఫ్యాన్) మోటార్ దెబ్బతినడం వల్ల గాలి రాదు.
  • రిఫ్రిజిరెంట్ లెవల్ తగ్గిపోతే సరిగా కూలింగ్ ఉండదు. అలాంటప్పుడు గ్యాస్ లెవల్ ను చెక్ చేసి.. నింపితే సరిపోతుంది. ఒక్కోసారి కంప్రెసర్ ఆన్ కాకున్నా కూలింగ్ రాదు.
  • ఏసీ ఎక్కువ కాలం మన్నికగా పనిచేయాలంటే 6 నెలలకు ఒకసారైనా సర్వీసింగ్ చేయించుకోవడం మంచిది.


More Articles