ముచ్చటైన పెళ్లికి తీసుకున్నారా... ఇన్సూరెన్స్?

పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో అతి ముఖ్యమైన, ఖరీదైన వేడుక. రెండు కుటుంబాలను, ఎంతో మందిని ఒక్కచోట కలిపే వేదిక. అపురూపమైన ఈ వేడుకకు బీమా రక్షణ అవసరం అన్నది నిపుణుల సూచన... ఎందుకన్నది చూద్దాం...

పెళ్లికైనా, సొంతిల్లుకైనా భారీగా డబ్బుతో పని పడుతుంది. పెళ్లికి డ్రెస్ లు, ఆహారం, ఆభరణాలు, కల్యాణ వేదిక, లైటింగ్ ఏర్పాట్లు ఇవన్నీ ఖర్చుతో కూడుకున్నవే. వారి వారి స్థాయులను బట్టి ఈ ఖర్చు ఉంటుంది. మధ్య తరగతి వారు సైతం వధువు, వరుడి వైపు వారు కలసి కనీసం రూ.5 లక్షలకు తక్కువ కాకుండా ఖర్చు చేస్తున్న రోజులివి. ఇక సంపన్నులైతే కోట్ల రూపాయల వ్యయం చేయడానికి కూడా వెనుకాడరు. కర్ణాటకకు చెందిన మాజీ మంత్రి గాలి జనార్దన్  రెడ్డి అయితే తన కుమార్తె వివాహానికి ఏకంగా రూ.500 కోట్ల వరకు ఖర్చు చేసినట్టు వార్తలు వచ్చాయి. 

ద్విచక్ర వాహనానికి బీమా తీసుకోవడం ఎక్కువ మందికి తెలిసిన విషయమే. చట్టం ప్రకారం తప్పనిసరిగా వాహన బీమా కలిగి ఉండాలి. కనుక మనలో చాలా మంది వాహనబీమా తీసుకోవడం సర్వసాధారణం. వాహనం చోరీకి గురైనా, ప్రమాదానికి గురైనా నష్టపోకుండా ఈ పాలసీ ఉపయోగకరంగా ఉంటుంది. నిజానికి ఈ సూత్రం అన్నింటికీ వర్తిస్తుంది. కుటుంబానికి ఆధారమైన వ్యక్తి పోతే ఆ కుటుంబం ఆర్థిక సమస్యల బారిన పడకుండా బీమా పాలసీ తీసుకుంటుంటారు. వీటి మాదిరిగానే వెడ్డింగ్ ఇన్సూరెన్స్ కూడా పనిచేస్తుంది. అనుకోని ఘటనలు ఎదురైతే వివాహ వేడుక పరంగా కలిగే నష్టాలను భరించడానికి ఈ బీమా పనికివస్తుంది.  

representative image

ఏదేనీ కారణం వల్ల వివాహం ఆఖరి క్షణాల్లో ఆగిపోతే ఏమవుతుందో ఒక సారి ఆలోచించండి. కల్యాణ వేదికలకు చెల్లించిన డబ్బులు, లైటింగ్, డెకరేషన్, వాహనాల కోసం బుకింగ్, భాజా భజంత్రీలు, ఇతరులకు ఇచ్చిన అడ్వాన్స్ లలో చాలా వరకు నష్టపోవాల్సిందే. ఈ నష్టం కొన్ని సందర్భాల్లో తక్కువగా ఉండొచ్చు... మరికొన్ని సందర్భాల్లో ఎక్కువగా ఉండొచ్చు. ఈ విధంగా ఎదురయ్యే నష్టాన్ని పెళ్లి బీమా భర్తీ చేస్తుంది. 

చాలా అరుదైన సందర్భాల్లో... పెళ్లి వేదికల వద్ద అగ్ని ప్రమాదాలు జరుగుతుంటాయి. పెళ్లి దగ్గర లైటింగ్ ఏర్పాట్లు భారీగా ఉంటాయి. ఇక వీడియో షూటింగ్ కోసం కూడా పవర్ తీసుకుంటారు. దీపారాధనలు చేస్తుంటారు. వేదిక సమీపంలో వంటలు కూడా జరుగుతుంటాయి. అగ్ని ప్రమాదాలకు ఆస్కారం ఉండే అవకాశం ఉంది. దురదృష్టవశాత్తూ ఫైర్ యాక్సిడెంట్ అయితే నష్టాన్ని పెళ్లి బీమా పూరిస్తుంది.

representative image

పెళ్లి బీమాతో వేటికి రక్షణ...?

పెళ్లి బీమాను చాలా రకాల కంపెనీలు ఆఫర్ చేస్తున్నాయి. ఇరువైపుల కుటుంబాల్లో ఎవరైనా అకాల మరణం చెందితే పెళ్లి ఆగిపోతుంది. లేదా ఏదైనా అనుకోనిది జరిగినా ఇదే పరిస్థితి ఎదురవుతుంది. ఇలాంటి సమయాల్లో పెళ్లి కార్డుల ప్రింటింగ్ కు అయిన ఖర్చు, వాటి పంపిణీ వ్యయం, కేటరర్లు, వెండర్లు, ఆభరణాల కొనుగోలు, వేదిక అలంకరణకు అయిన వ్యయంలో కొంత మేర పరిహారంగా బీమా కంపెనీ అందిస్తుంది. ఈ పాలసీలో ఏవేవీ కవర్ అవుతాయన్నది కంపెనీలను బట్టి మారిపోతుంటుంది. అందుకే వివిధ కంపెనీల పాలసీ వివరాలను తెలుసుకున్న తర్వాత తమ అవసరాలకు సరిపోలే పాలసీని తీసుకోవాలి. కొన్ని సందర్భాల్లో పెళ్లి వాయిదా పడినా గానీ నష్టం ఎక్కువే ఉండవచ్చు. ఈ నేపథ్యంలో థర్డ్ పార్టీకి కూడా నష్టం ఎదురవుతుంది. వీటికి కవరేజీ ఉంటుందా అన్నది తెలుసుకోవాలి.

ప్రమాదవశాత్తూ ఎదురయ్యే మరణానికి కూడా పరిహారం పెళ్లి బీమాలో ఉంటుంది. రక్తసంబంధీకులకూ ఈ విధమైన రక్షణ ఉంటుంది. అయితే, నిర్లక్ష్యంతో జరిగిన ప్రమాదాలకు కంపెనీలు పరిహారం ఇవ్వవని తెలుసుకోవాలి.

దొంగతనం, దోపిడీకి పెళ్లి వేడుకల్లో అవకాశం లేకపోలేదు. విలువైన ఆభరణాలను పెళ్లి సమయంలో పెట్టుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. ముఖ్యంగా స్త్రీలు అయితే వారి బీరువాల్లో మూలుగుతున్న నగలన్నింటినీ బయటకు తీసి ధరించేది ఇలాంటి అందమైన వేడుకల్లోనే. చోరీలకూ అవకాశం ఉంటుంది. కనుక పెళ్లి బీమా ఇలాంటి వాటికీ రక్షణనిస్తుంది. 

వీటికి పరిహారం రాదు...

అగ్ని ప్రమాదం జరిగితే వాటిల్లే నష్టానికి పరిహారాన్ని పెళ్లి బీమా పాలసీల కింద కంపెనీలు అందిస్తాయి. కానీ, విద్యుత్ పరికరాలను నిర్లక్ష్యంగా నిర్వహించడం వల్ల ప్రమాదం జరిగి నష్టం ఎదురైతే కంపెనీలు పరిహారం ఇవ్వవు. బంద్ లు, అల్లర్ల కారణంగా పెళ్లిని రద్దు చేసుకుంటే కొన్ని బీమా కంపెనీలు తమ పాలసీల్లో భాగంగా పరిహారం ఇవ్వడం లేదు. 

క్లెయిమ్ విధానం...

పరిహారం కోరేందుకు సమర్పించే దరఖాస్తు పత్రంలో పెళ్లి తేదీ, నష్టం వివరాలను పేర్కొనాలి. గుర్తింపు పత్రంతోపాటు పాలసీలో కోరిన ఇతర పత్రాలను కూడా సమర్పించాలి. దాదాపు అన్ని కంపెనీలు పెళ్లి బీమా పాలసీని అందిస్తున్నాయి. అయితే, ఈ పాలసీలో అందే ప్రయోజనాలు, మినహాయింపుల గురించి ముందే స్పష్టంగా తెలుసుకోవాలి. అందులో కవరేజీ సౌకర్యాలు, ప్రీమియం రేటు, క్లెయిమ్ సెటిల్ మెంట్ రేషియో ఇవన్నీ పాలసీ తీసుకునే ముందే పరిశీలించుకోవాలి. అదే సమయంలో పెళ్లి పరంగా అవసరాలు ఏంటో తెలుసుకుని వాటికి అనుగుణంగా పాలసీ తీసుకోవడం మంచిది. 


More Articles