నోటిలోపల పుండ్లు... ఎందుకొస్తున్నాయో చెక్ చేసుకోండి

ఉన్నట్టుండి నోటిలోపల ఎక్కడో ఓ భాగంలో చిన్న పొక్కు మొదలవుతుంది. అదో పుండులా మారి కొన్ని రోజుల పాటు నొప్పితో బాధపెట్టేస్తుంది. ఆహారం తీసుకోవడం కష్టతరంగా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదు. నోరంతా పూస్తుంది. ఏదైనా ఆహారం నోట్లో పెట్టుకున్నామా... భగ్గున మండిపోతుంది. ఇలాంటి సమస్యలు చాలా మందిలో కనిపిస్తుంటాయి. కానీ వీటి వెనుక కారణం ఏమై ఉండవచ్చు...?

మన శరీరంలో సున్నితమైన అంతర్గత భాగాల్లో నోరు కూడా ఒకటి. ఈ నోటి లోపల గోడలకు, నాలుకకు, పెదాల లోపలి అంచులకు, చిగుళ్లపై పొక్కులు మొదలై పుండ్లుగా మారి తీవ్రంగా బాధపెట్టడం చాలా మందిలో కనిపిస్తూ ఉంటుంది. వీటినే మౌత్ సోర్, మౌత్ అల్సర్లు అని అంటుంటారు. కొందరిలో తరచుగా, కొందరిలో అప్పుడప్పుడు ఎదురయ్యే సమస్య ఇది. సాధారణంగా ఇవి వాటంతట అవే తగ్గిపోతాయి. తగ్గలేదంటే సమస్య ఏదో ఉన్నట్టే. ఓ సారి వైద్యుడిని సంప్రదించడం అవసరం.

అయితే, ఎక్కువ మందిలో కనిపించేవి మౌత్ సోర్ (నోటి పుండ్లు). వీటిలో కేంకర్ సోర్ అని వేరే ఉంటాయి. నొప్పి తప్ప వీటితో ఇతరత్రా ఇబ్బంది ఏమీ ఉండదు. ఓ వారం నుంచి రెండు వారాల పాటు ఇవి తమ ప్రభావాన్ని చూపిస్తుంటాయి. కానీ, వీటిని తేలిగ్గా తీసుకోవద్దన్నది వైద్యుల సలహా. కేన్సర్ లేదా ఇన్ఫెక్షన్, హెర్పెస్ సింప్లెక్స్ వైరస్ ప్రభావంతో వచ్చి ఉండవచ్చేమో?

representation image

మౌత్ సోర్ లక్షణాలు

ఎర్రగా ఉండి చాలా నొప్పిని కలిగిస్తాయి. ముఖ్యంగా తింటున్నప్పుడు, ఏదైనా తాగుతున్నప్పుడు (నీరు కూడా) చాలా నొప్పి అనిపిస్తుంది. నోటిలో ఎక్కడ వచ్చిందన్న దాన్నిబట్టి ఈ నొప్పి ఆధారపడి ఉంటుంది.

ఎందుకు వస్తాయి...?

ఇవి రావడానికి రకరకాల కారణాలు ఉన్నాయి. తినే సమయంలో కొందరు నాలుకను, చర్మాన్ని, పెదాలను కొరుకుతారు. తినే విధానాన్ని బట్టి అవి పళ్ల మధ్య పడడం వల్ల గాయం అవుతుంది. ఆ గాయం పుండుగా మారుతుంది. వేడి పదార్థాలను ఒకేసారి నోటిలో పెట్టుకున్నప్పుడు, బాగా వేడితో ఉన్న టీ, కాఫీ, సూపులను నోట్లోకి తీసుకున్నప్పుడు కూడా ఇలానే గాయాలు ఏర్పడవచ్చు. కట్టుడు పళ్లు గుచ్చుకుపోవచ్చు. లేదా పదునైన పరికరాలను నోట్లో పెట్టుకున్నప్పుడు గాయపడవచ్చు. గట్టిగా ఉన్న బ్రష్ తో పళ్లను చాలా కఠిన విధానంలో బ్రష్ చేసినప్పుడు, టుబాకో నమలడం వల్ల నోటిలో పుండ్లు ఏర్పడతాయి. హెర్పెస్ సింప్లెక్స్ వైరస్ వల్ల కూడా ఈ విధమైన పుండ్లు కనిపిస్తాయి. అయితే, హెర్పెస్ వైరస్ ద్వారా వచ్చే సోర్ మాత్రమే ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది.

అనారోగ్యానికి గురైనప్పుడు, ఒత్తిడికి లోనైనప్పుడు, శరీరంలోని రోగ నిరోధక వ్యవస్థ బలహీనపడడం వల్ల, హార్మోన్లలో మార్పులు చోటు చేసుకున్నప్పుడు ఇవి వస్తాయి. అలాగే, విటమిన్ల లోపం ముఖ్యంగా ఫొలివైట్, రిబోఫ్లావిన్ (విటమిన్ బీ2), బీ12 లోపం ఏర్పడినప్పుడు, పేగు సంబంధిత సమస్యలు ఉన్నా ఇవి కనిపిస్తాయి. క్రాన్స్ వ్యాధి లేదా ఇర్రిటబుల్ బవెల్ సిండ్రోమ్ సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా నోటిలో పుండ్ల సమస్య ఎదురవుతుంది. 

representation image

కొన్నిసందర్భాల్లో ఇలానూ వస్తాయ్...

వైద్యుని సిఫారసులు లేకుండా మెడికల్ షాపులో కొని వేసుకునే మందుల వల్ల కూడా ఈ సమస్య ఎదురవుతుంది. రేడియేషన్, కీమోథెరపీ, రోగనిరోధక వ్యవస్థలో లోపాలు, బ్లీడింగ్ డిజార్డర్, కేన్సర్, బ్యాక్టీరియల్, వైరల్, ఫంగల్ ఇన్ఫెక్షన్లు, ఎయిడ్స్ వ్యాధి లేదా ఇటీవల శరీరంలో ఏదేనీ అవయవ మార్పిడి జరిగినా ఇవి రావచ్చు. 

వ్యాధి నిర్ధారణ అవసరమా...?

నోటిలో తెల్లటి ప్యాచెస్ కనిపిస్తే, హెర్పెస్ సింప్లెక్స్ వైరస్ ఇన్ఫెక్షన్ ఉందని అనుమానిస్తే, నోటిలో సోర్ వచ్చి మూడు వారాలైనా తగ్గకుండా ఉంటే, కేన్సర్ చికిత్స తీసుకుంటుంటే, కొత్తగా ఏదైనా మందు ప్రారంభించి ఉంటే, ఇటీవల ఏదైనా అవయవ మార్పిడి చేయించుకుని ఉంటే, జ్వరం, శ్వాస తీసుకోవడం కష్టంగా ఉండడం ఇలాంటి సమస్యలతో ఉంటే వైద్యున్ని తప్పకుండా సంప్రదించాలి. వైద్యులు ఈ పుండ్లను పరిశీలించి ఒకవేళ కేన్సర్ ఉందని అనుమానిస్తే బయాప్సీ పరీక్ష సిఫారసు చేస్తారు. లేదంటే తగిన మందులు సూచిస్తారు. 

చికిత్స ఎలా..?

చిన్నవైతే పెద్ద ఇబ్బంది లేకుండా వాటంతట అవే తగ్గిపోతాయి. సాధారణంగా ఇందుకు 10 నుంచి 14 రోజుల సమయం తీసుకుంటుంది. ఇంట్లోనే కొన్ని చర్యలు తీసుకోవడం ద్వారా తొందరగా మానేట్టు కూడా చేసుకోవచ్చు. అలానే నొప్పి నుంచి ఉపశమనం కూడా పొందవచ్చు. గ్లాస్ వాటర్ లో ఒక స్పూన్ సాల్ట్ కలిపి ఆ నీటితో పుక్కిలించాలి. ఇలా కొన్ని నిమిషాల పాటు చేయాలి. నిద్రించే ముందు గోరువెచ్చని నీటిలో నిమ్మరసం మాత్రమే కలిపి తీసుకోవాలి. దీని వల్ల రోగ నిరోధక వ్యవస్థ శక్తిమంతం అవుతుంది.

ఉపశమనం కోసం చల్లటి పదార్థాలను తీసుకోవచ్చు. నొప్పి తగ్గేందుకు పెయిన్ రిలీవర్ టాబ్లెట్లను వైద్యుల సూచనల మేరకు వాడుకోవచ్చు. మౌత్ సోర్స్ వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్ వల్ల వచ్చిందని భావిస్తే స్టెరాయిడ్ జెల్ ను సూచించవచ్చు. దాన్ని పుండుపై రాసుకోవాల్సి ఉంటుంది. 

వీటికి దూరం...

వేడి, కారం, ఉప్పు, పులుపు, అధిక తీపి ఉన్న పదార్థాలకు దూరంగా ఉండాలి. టుబాకో ఉత్పత్తుల వినియోగానికి, ఆల్కహాల్ కు దూరంగా ఉండాలి.  

నివారించవచ్చా...?

అన్ని రకాల మౌత్ సోర్ లను రాకుండా నియంత్రించలేము. అయితే తినేప్పుడు కంగారు కంగారుగా తినవద్దు. నిదానంగా నమిలి తినాలి. వేడివేడి ఫుడ్స్, డ్రింక్స్ తీసుకోవద్దు. టూత్ బ్రష్ సరైనది వాడాలి. ఏదైనా పన్ను అసౌకర్యంగా ఉందనిపిస్తే డెంటల్ వైద్యున్ని సంప్రదించాలి. వంటికి సరిపడని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. ఒత్తిడి తగ్గించుకోవాలి. సమతులాహారం తీసుకోవాలి. పొగ తాగడం, గుట్కాలు, పాన్ మసాలా, జర్దాలకు దూరంగా ఉండాలి. వీలైతే ఆల్కహాల్ కు దూరంగా ఉండడం లేదా కనీసం తగ్గించడం అయినా చేయాలి. విటమిన్ బీ సప్లిమెంట్లు తీసుకోవాలి. మలబద్ధకం లేకుండా చూసుకోవాలి.

ఏదైనా సమస్య ఉందా..?

సాధారణ కారణాలతో వచ్చే నోటిలో పుండ్ల వల్ల ఎలాంటి సమస్య లేదు. కాకపొతే తరచుగా వస్తుంటే అవి ఎందువల్ల వస్తున్నాయో కారణాలను అన్వేషించడం అవసరం. కేన్సర్ కారణంగా వచ్చినవి అయితే తగ్గుముఖం పట్టవు. ఒకవేళ హెర్పెస్ సింప్లెక్స్ వైరస్ ఇన్ఫెక్షన్ అయితే తగ్గినా మళ్లీ వస్తుంటాయి. 

representation image

కేంకర్ సోర్ ను చూసి మౌత్ సోర్ అనుకునేరు!

కేంకర్ సోర్, మౌత్ సోర్ ఒకేలా ఉన్నాయని ఈ రెండూ ఒకటే అని చాలా మంది పొరపాటు పడుతుంటారు. కానీ ఈ రెండూ వేర్వేరు. మౌత్ సోర్ చుట్టూ ఎర్రగా మధ్యలో తెల్లగా లేదా లేత పసుపు రంగులో వుండి ... అలా ఉన్న చోట గుంట మాదిరిగా ఉంటుంది. ప్రారంభంలో ఎర్రగానే ఉంటుంది. రోజులు గడిచేకొద్దీ అదో పుండుగా మారి మధ్య గుంట ఏర్పడి అక్కడ రంగు మారుతుంది. కానీ కేంకర్ సోర్ చుట్టూ ఎర్రగా ఉండి మధ్యలో బొబ్బల వలే ఉంటాయి. రెండింటికీ స్పష్టమైన తేడా ఉంటుంది. నిజానికి ఈ రెండూ కూడా ఒత్తిడి, గాయాలు, హర్మోన్లలో మార్పుల వల్ల చోటు చేసుకుంటాయి. చాలా నొప్పిగా కూడా ఉంటాయి. అయితే, కేంకర్ సోర్ మాత్రం ఈ కారణాలకు అదనంగా హెర్పెస్ సింప్లెక్స్ అనే వైరస్ వల్ల కూడా సంభవిస్తుంది.  

మౌత్ సోర్ అనేవి నోటిలోపల మాత్రమే వచ్చేవి. కానీ, కేంకర్ సోర్ మాత్రం పెదాల లోపల, బయట రెండువైపులా రావచ్చు. ఎక్కువ శాతం నోటి బయటివైపే ఏర్పడతాయి. మౌత్ సోర్ ఒకటి లేదా రెండు మూడు మాత్రమే ఒకేసారి కనిపిస్తాయి. కేంకర్ సోర్ మాత్రం చాలా సంఖ్యలో గ్రూపుగా ఒకేసారి ఏర్పడతాయి. మౌత్ సోర్ అంటువ్యాధి కాదు. కానీ, కేంకర్ సోర్ మాత్రం ఒకరి నుంచి మరొకరికి తాకడం ద్వారా వ్యాపిస్తాయి. కేంకర్ సోర్ 10 నుంచి 20 ఏళ్ల వయసు మధ్య వారికి ఏడాదిలో మూడు నుంచి నాలుగు సార్లు మాత్రమే వస్తాయి. వీటిని సింపుల్ కేంకర్ సోర్ అంటారు. ఓ వారం పాటు ఉండి పోతాయి. కాంప్లెక్స్ కేంకర్ సోర్ తరచుగా వచ్చేవి అన్నమాట. 

నోటిలోపల రాషెస్/పూత

కొందరికి ఉన్నట్టుండి నోటిలోపల చర్మం ఎర్రబారిపోయి ఏదైనా ఆహారం తీసుకుంటే భగ్గున మండిపోతుంటుంది. దురదగా కూడా ఉంటుంది. అలెర్జీకి లోనైనప్పుడు రక్షణ కోసం శరీరం హిస్టామిన్స్ అనే రసాయనాలను విడుదల చేస్తుంది. ఈ రసాయనాలే రాషెస్ కు కారణం అవుతాయి. ఒకవేళ ఈ రాషెస్ తో పాటు శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటే మాత్రం అది ప్రాణాంతక అనాఫిలాక్సిక్ సమస్యగా అనుమానించి వైద్యులను సంప్రదించాలి. విష ప్రభావం, ఫుడ్ పాయిజన్ కు లోనైనప్పుడు ఈ సమస్య ఏర్పడుతుంది. ఇక వైరల్, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ల వల్ల కూడా ఈ రాషెస్, గొంతు మంట సమస్యలు ఏర్పడతాయి. కనుక వైద్యులను కలసి అసలు సమస్య ఏంటన్నది నిర్ధారించుకుని తగిన చికిత్స తీసుకోవాలి.

representation image

కోల్డ్ సోర్ వేరే...

కోల్డ్ సోర్ కూడా పైన చెప్పుకున్న కేంకర్ సోర్ మాదిరిగానే ఉంటాయి. కానీ ఇవి వేరు. ఎర్రగా, ద్రవంతో నిండినట్టు నోటికి సమీపంలో లేదా ముఖంపై ఏర్పడతాయి. అరుదుగా అలాగే వేళ్లు, ముక్కు, నోటిలోపల కూడా రావచ్చు. రెండు వారాల వరకు ఉంటాయి. హెర్పెస్ సింప్లెక్స్ వైరస్ దీనికి కారణం. ఇవి ఒకరి నుంచి మరొకరికి తాకడం ద్వారా వ్యాప్తి చెందుతాయి. కోల్డ్ సోర్ కు చికిత్స లేదు. వాటంతట అవే తగ్గిపోతాయి.

హెర్పెస్ సింప్లెక్స్ టైప్ 1వైరస్ సాధారణంగా కోల్డ్ సోర్ కు కారణమవుతుంది. ఇందులో టైప్ 2 వైరస్ అని ఉంది. ఇది జననాంగాలకు వ్యాపించేది. అరుదుగా ఈ వైరస్ నోటి దగ్గర కూడా ఏర్పడవచ్చు. ఒకసారి ఈ వైరస్ వచ్చి తగ్గిన తర్వాత అది నిద్రాణంగా శరీరంలోనే ఉంటుంది. తిరిగి శక్తి పుంజుకున్నప్పుడు మళ్లీ సోర్ రావచ్చు. ఒత్తిడి, అనారోగ్యం, రోగ నిరోధక శక్తి బలహీన పడిన సమయంలో వైరస్ నిద్రలేస్తుంది. 

లక్షణాలు

తిమ్మిరి, మంట అనే లక్షణాలు కనిపిస్తాయి. కోల్డ్ సోర్ రావడానికి ముందు నుంచే ఇవి వస్తాయి. ఈ సమయంలోనే వైద్యులను సంప్రదించినట్టయితే ఆ వైరస్ వ్యాప్తి చెందకుండా అదుపు చేయవచ్చు. 


More Articles