ఫోన్ లో ఎంత ఎక్కువ రిజల్యూషన్ (PPI) ఉంటే అంత మంచిది!

వేల రూపాయలు ఖర్చు పెట్టి స్మార్ట్ ఫోన్ కొంటాం. కానీ అందులో డిస్ప్లే సరిగా కనిపించకపోతే వృథాయే. ఎందుకంటే ఫోన్ లో ప్రాసెసర్, ర్యామ్, మంచి కెమెరా వంటి ఎన్ని సౌకర్యాలున్నా.. డిస్ప్లే చుక్కలుగా కనిపించడం, వీడియోలు స్పష్టంగా లేకపోవడం బాగుండదు. IPS LCD, AMOLED వంటి మంచి డిస్ప్లేలతో పాటు వీలైనంత ఎక్కువ రిజల్యూషన్ ఉన్నప్పుడే స్పష్టమైన దృశ్యాన్ని చూసిన అనుభూతి ఉంటుంది. అంతేకాదు రిజల్యూషన్ ఎక్కువగా ఉండడం వల్ల కళ్లకు కూడా పెద్దగా శ్రమ ఉండదు. ప్రతి ఫోన్ తయారీ సంస్థ రిజల్యూషన్ కు సంబంధించి QVGA, FWVGA, XGA, HD, Full HD, QHD... ఇలా వివిధ స్పెసిఫికేషన్లను చూపుతుంది. మరి ఏ రిజల్యూషన్ ఎంత? ఏది మంచిదనే వివరాలు తెలుసుకుందాం..

తక్కువగా ఉంటే కళ్లకు ఇబ్బందే

ఇప్పడు అందరూ 4.5, 5 అంగుళాల కన్నా పెద్ద స్క్రీన్ ఉన్న స్మార్ట్ ఫోన్లను వినియోగిస్తున్నారు. అందువల్ల ఎంత ఎక్కువ రెజల్యూషన్ ఉన్న మొబైల్ ఫోన్ తీసుకుంటే.. మనకు అంత స్పష్టమైన వ్యూయింగ్ క్వాలిటీ లభిస్తుంది. తక్కువ రిజల్యూషన్ ఉన్న ఫోన్లలో డిస్ప్లే చుక్కలు చుక్కలుగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఏవైనా వీడియోలు, ఫొటోలు చూస్తున్నప్పుడు దీనిని స్పష్టంగా గమనించవచ్చు. అంతేకాదు తక్కువ రిజల్యూషన్ ఉన్న ఫోన్లలో ఎక్కువ సేపు వీడియోలు చూడడం వల్ల కళ్లకు ఇబ్బందిగా ఉంటుంది.

మొత్తం రిజల్యూషన్ కాదు.. పిక్సెల్ సాంద్రత (PPI) ముఖ్యం

ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే... స్క్రీన్ రిజల్యూషన్ ను మొత్తం ఫోన్ పరంగా చూడొద్దు. ప్రతి అంగుళానికి ఉన్న పిక్సెల్ డెన్సిటీ (PPI - అంగుళం ప్రాంతంలో చుక్కల రూపంలో చూపగలిగిన సాంద్రత)ను మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలి. ఉదాహరణకు 4.5, 5 అంగుళాల డిస్ప్లేలు ఉండి, 720X1280 రిజల్యూషన్ ఉన్న రెండు మొబైల్స్ ను పరిశీలిస్తే... రెండింటిలోనూ ఒకే రిజల్యూషన్ ఉన్నా స్క్రీన్ స్పష్టతలో మాత్రం తేడా ఉంటుంది. ఎందుకంటే 720X1280 పిక్సెల్ డెన్సిటీని 4.5 అంగుళాల డిస్ప్లేపై చూస్తే.. ఒక్కో అంగుళంలో ఉండే సాంద్రత 326 PPI గా ఉంటుంది. అదే 5 అంగుళాల డిస్ప్లేపై చూస్తే 293 PPI గా ఉంటుంది. అంటే మొత్తం రిజల్యూషన్ ఒకేలా పేర్కొన్నా.. 4.5 అంగుళాల డిస్ల్పే స్పష్టత మరింత ఎక్కువగా ఉన్నట్లు. అంటే ఎంత ఎక్కువ PPI ఉన్న ఫోన్ తీసుకుంటే.. దాని డిస్ప్లే స్పష్టత (క్లారిటీ) అంత బాగుంటుందన్న మాట. వేర్వేరు రిజల్యూషన్లు.. వాటిని వ్యవహరించే పేర్లను పరిశీలిద్దాం..

QVGA (240x320)

240X320 రిజల్యూషన్ నే క్వార్టర్ వీడియో గ్రాఫిక్స్ అర్రే (QVGA)’గా పేర్కొంటారు. ప్రస్తుతమున్న వాటిలో అత్యంత తక్కువ, నాసిరకమైన రిజల్యూషన్ ఇది. తొలుత వచ్చిన బడ్జెట్ స్మార్ట్ ఫోన్లలో, మూడు నాలుగు అంగుళాల చిన్న డిస్ప్లే ఉన్న ఫోన్లలో ఈ రిజల్యూషన్ ను అందించారు. దీనిలో డిస్ప్లే చుక్కలు, చుక్కలుగా కనిపిస్తుంది. కళ్లకు ఇబ్బందిగా ఉంటుంది.

WQVGA (240x432)

240X432 రిజల్యూషన్ నే WQVGA గా పేర్కొంటారు. వెడల్పు కాస్త ఎక్కువగా ఉండే బడ్జెట్ ఫోన్లలో ఈ రిజల్యూషన్ ను ఇచ్చారు. ఇది కూడా తక్కువ స్థాయి రిజల్యూషన్. డిస్ప్లే చుక్కలుగా కనిపిస్తుంది. కళ్లకు ఇబ్బందిగా ఉంటుంది.

HVGA (320x480)

320X480 రిజల్యూషన్ ఇచ్చే డిస్ప్లేలను HVGA గా పేర్కొంటారు. HVGA అంటే Half లేదా Half size VGA అని చెప్పవచ్చు. తొలుత వచ్చిన చాలా ఫోన్లలో ఈ రెజల్యూషన్ ఇచ్చారు. ప్రస్తుతం లో ఎండ్, బడ్జెట్ ఫోన్లలో ఈ రెజల్యూషన్ ఉంటోంది. దీనిలోనూ డిస్ప్లే చుక్కలుగా కనిపిస్తుంది. కంటికి ఇబ్బందిగా ఉంటుంది.

nHD (360x640)

ఇది HVGA కంటె కొంచెం మెరుగైన రిజల్యూషన్. అయితే ఈ రిజల్యూషన్ డిస్ప్లేలతో వచ్చిన ఫోన్లు చాలా తక్కువ.

WVGA (480x640+)

ఫోన్ పొడవులో 480 పిక్సెల్ లు ఉండి వెడల్పులో 640 పిక్సల్ లు, అంతకన్నా ఎక్కువగా ఉన్న డిస్ప్లేలను WVGA గా పేర్కొంటారు. ఈ తరహాలో 480x800 రెజల్యూషన్ ఎక్కువగా వినియోగించబడింది. ప్రస్తుతమున్న చాలా బడ్జెట్ ఫోన్లలో ఈ రెజల్యూషన్ నే వినియోగించారు. వీటిలో డిస్ప్లే పిక్చర్ క్వాలిటీ కొంత మెరుగ్గా ఉన్నా.. దగ్గరి నుంచి చూస్తే పూర్తిగా చుక్కలు, చుక్కలుగా కనిపిస్తుంది.

FWVGA (480x854)

ప్రస్తుతం బడ్జెట్ ఫోన్లలో అత్యంత ఎక్కువగా వినియోగంలో ఉన్న డిస్ప్లే రిజల్యూషన్ 480x854. దీనినే Full Wide VGA (FWVGA) రిజల్యూషన్ అంటారు. 16:9 వీడియో ఆస్పెక్ట్ రేషియో (సినిమా వీడియో పొడవు, వెడల్పు నిష్పత్తి)కి ఈ డిస్ప్లే కచ్చితంగా సరిపోతుంది. అయితే ఈ రిజల్యూషన్ కూడా పెద్దగా స్పష్టతను ఇవ్వదు.

qHD (540x960)

హెచ్ డీ (HD) క్వాలిటీలో నాలుగో వంతు ఉండే 540x960 రిజల్యూషన్ నే క్వార్టర్ ఆఫ్ హెచ్ డీ (qHD)గా పిలుస్తారు. పలు రకాల బడ్జెట్ స్మార్ట్ ఫోన్లలో ఈ డిస్ప్లేను వినియోగిస్తున్నారు. ముందటి వాటికన్నా ఇది కొంచెం బెటర్ అయినా.. ఈ డిస్ప్లే పిక్చర్ క్వాలిటీ తక్కువే.

DVGA (640x960)

640x960 రిజల్యూషన్ నే డబుల్ వీజీఏగా పేర్కొంటారు. కొన్నేళ్ల కిందట వచ్చిన హైఎండ్ స్మార్ట్ ఫోన్లలో ఈ రిజల్యూషన్ ను ఉపయోగించారు. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న రిజల్యూషన్లతో పోల్చితే ఇది చాలా తక్కువ రిజల్యూషన్. ప్రస్తుతం ఇది పెద్దగా వినియోగంలో లేదు.

XGA (768x1024)

స్మార్ట్ ఫోన్ల హవా ప్రారంభమయ్యాక వచ్చిన తొలి అత్యుత్తమ డిస్ప్లే రిజల్యూషన్ 768x1024. దీనిని ‘Extended Graphics Arry (XGA)’ అని పేర్కొంటారు. ఇది HD రిజల్యూషన్ కన్నా కొంచెం తక్కువ. ఈ డిస్ప్లేలతో పిక్చర్ నాణ్యత బాగుంటుంది. సాధారణంగా కంప్యూటర్ మానిటర్లలో ఎక్కువగా వినియోగించే రిజల్యూషన్ కూడా ఇదే. అయితే దీనిని స్మార్ట్ ఫోన్లలో పెద్దగా వినియోగించలేదు.

HD (720x1280)

ప్రస్తుతం మంచి స్మార్ట్ ఫోన్లలో ఎక్కువగా వినియోగంలో ఉన్న రిజల్యూషన్ 720x1280. దీనినే హెచ్ డీ (HD - హై డెఫినేషన్) రిజల్యూషన్ గా పేర్కొంటారు. దీనినే 720p గా కూడా సూచిస్తుంటారు. దీనిలో పిక్చర్ క్వాలిటీ బాగుంటుంది. తొలుత హైఎండ్ ఫోన్లలో ఈ రిజల్యూషన్ ఇచ్చినా.. ఇప్పుడు ఓ మోస్తరు ఫోన్లలో కూడా హెచ్ డీ రిజల్యూషన్ ఉన్న డిస్ప్లేలను అందిస్తున్నారు.

WXGA (800x1280)

800x1280 కూడా హెచ్ డీ (హై డెఫినేషన్) రిజల్యూషనే. దీనినే ‘వైడ్ ఎక్స్ టెండెడ్ గ్రాఫిక్స్ అర్రే (WXGA)’గా పేర్కొంటారు. హెచ్ డీ కంటే ఎక్కువగా ఉండి.. ఫుల్ హెచ్ డీ కంటే తక్కువగా ఉండే మరికొన్ని రిజల్యూషన్లను కూడా WXGA గా చెబుతారు. వాటి పిక్చర్ నాణ్యత కూడా బాగుంటుంది.

Full HD (1080x1920)

1080x1920 రిజల్యూషన్ నే ఫుల్ హై డెఫినేషన్ (Full HD)గా పేర్కొంటారు. ప్రస్తుతం హైఎండ్ ఫోన్లు, ఓ మోస్తరు పెద్ద ఫోన్లలో ఈ రిజల్యూషన్ ఉన్న డిస్ప్లేలను అందిస్తున్నారు. దీనినే 1080p గా కూడా సూచిస్తారు. దీనిలో పిక్చర్ నాణ్యత చాలా బాగుంటుంది. మంచి నాణ్యత ఉన్న వీడియోలను, ఫొటోలను స్పష్టంగా వీక్షించవచ్చు. ఎక్కువ సేపు మొబైల్ ఉపయోగించినా కళ్లకు పెద్దగా ఇబ్బంది ఉండదు. అయితే ఈ డిస్ప్లేలు ఉన్న ఫోన్ల ధరలు ఎక్కువగా ఉంటాయి. ఇవి మిగతా వాటితో పోల్చితే బ్యాటరీనికి కొంత ఎక్కువగా వినియోగించుకుంటాయి.

QHD (1440x2560)

స్మార్ట్ ఫోన్లలో ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యంత ఎక్కువ రిజల్యూషన్ 1440x2560. దీనినే క్వాడ్ హెచ్ డీ (QHD)గా పేర్కొంటారు. అంటే HD రిజల్యూషన్ కు ఇది నాలుగింతలు అధిక రిజల్యూషన్ అన్న మాట. దీని ద్వారా అత్యంత నాణ్యమైన, స్పష్టమైన పిక్చర్ క్వాలిటీ లభిస్తుంది. డిస్ప్లేను చూసినప్పుడు కళ్లకు ఏ మాత్రం శ్రమ ఉండదు. ప్రస్తుతం హై ఎండ్ మొబైల్ ఫోన్లలో ఈ రిజల్యూషన్ ఉన్న డిస్ప్లేలను అందిస్తున్నారు. వీటి ధర కూడా ఎక్కువ. అయితే తక్కువ రిజల్యూషన్ అయిన qHDకు అత్యధిక రిజల్యూషన్ అయిన QHDలో ఒకే ఇంగ్లిషు అక్షరాలు ఉంటాయి. ఈ గందరగోళం లేకుండా కొన్ని చోట్ల QHD ని WQHDగా కూడా వ్యవహరిస్తుంటారు.

అల్ట్రా హెచ్ డీ (Ultra HD)

ప్రస్తుతం ప్రపంచం మొత్తంగా స్మార్ట్ ఫోన్లన్నింటిలోనూ అందుబాటులో ఉన్న అత్యధిక రిజల్యూషన్ 2160x3840. దీనినే Ultra HDగా 4K రిజల్యూషన్ గా పేర్కొంటారు. ఇది అత్యంత స్పష్టమైన పిక్చర్ క్వాలిటీని అందిస్తుంది. మనం సాధారణంగా డిస్ప్లేపై చుక్కల (పిక్సెల్)లను గుర్తించలేనంత అత్యుత్తమ రిజల్యూషన్ ఇది. అతికొద్ది మోడళ్లలో మాత్రమే ఈ రిజల్యూషన్ అందిస్తున్నారు. ఉదాహరణకు సోనీ ఎక్స్ పీరియా z5 ప్రీమియం ఫోన్. 5.5 అంగుళాల ఈ ఫోన్ డిస్ప్లే రిజల్యూషన్ ఏకంగా 806 PPI కావడం విశేషం.

క్లియర్ బ్లాక్ డిస్ప్లే (CBD)

ఎండలోను, ఎక్కువ వెలుతురులో కూడా డిస్ప్లే స్పష్టంగా కనిపించేందుకు తోడ్పడే టెక్నాలజీయే క్లియర్ బ్లాక్ డిస్ప్లే (CBD). ఫోన్ల డిస్ప్లేకు, టచ్ స్క్రీన్ లేయర్ కు మధ్య ఒక ప్రత్యేకమైన పోలరైజర్ లేయర్ ను ఏర్పాటు చేస్తారు. ఆ లేయర్ ఫోన్ పై పడిన వెలుతురు పరావర్తనం చెందకుండా నిరోధిస్తుంది. అదే సమయంలో కింద ఉన్న డిస్ప్లే మరింత బాగా కనబడేందుకు తోడ్పడుతుంది. ఎక్కువ సమయం ప్రయాణాల్లో, బయట గడిపేవారికి.. ఆరు బయట ఉండే ఫీల్డ్ ఉద్యోగాలు చేసేవారికి ఈ టెక్నాలజీ ఎంతో ఉపయోగకరం. కొన్ని హైఎండ్ స్మార్ట్ ఫోన్లలో ఈ సీబీడీ ఉన్న డిస్ప్లేలను అందిస్తున్నారు. వీటి ధరలు ఎక్కువగా ఉంటాయి.

ఈ జాగ్రత్తలు తప్పనిసరి

  • బడ్జెట్ ఫోన్లలో చాలా వరకు తక్కువ రిజల్యూషన్ ఉన్న డిస్ప్లేలనే అందిస్తుంటారు. అందువల్ల ఎక్కువ ధర పెట్టలేనప్పుడు స్క్రీన్ సైజు చిన్నగా ఉన్నా.. ఎక్కువ రిజల్యూషన్ ఉన్న ఫోన్ ను ఎంచుకోండి.
  • ఎక్కువ రిజల్యూషన్ ఉన్న డిస్ప్లేలు సాధారణంగా అదే పరిమాణమున్న మిగతా డిస్ప్లేలతో పోలిస్తే ఎక్కువ విద్యుత్ ను వినియోగించుకుంటాయి. అందువల్ల ఎక్కువ రిజల్యూషన్ డిస్ప్లే ఉన్న ఫోన్లు తీసుకునేటప్పుడు ఎక్కువ బ్యాటరీ సామర్థ్యం కూడా ఉండేలా చూసుకోవాలి.
  • పలు ఫోన్ల కంపెనీలు qHD డిస్ప్లేను అందిస్తూ HD డిస్ప్లే అందిస్తున్నట్లుగా ప్రకటనల్లో ఇస్తుంటాయి. వాటి ఫోన్ బాక్స్ లపై మాత్రం వాస్తవ రెజల్యూషన్ నే పేర్కొంటాయి. కొనేముందు ఇది గమనించాలి.
  • ఫోన్ మొత్తం రిజల్యూషన్ సంఖ్య కన్నా.. ప్రతి అంగుళానికి ఉండే పిక్సెళ్ల సంఖ్య (PPI)ని గమనించాలి.
  • కనీసం 250 PPI కన్నా ఎక్కువగా ఉంటే కొంచెం బెటర్. 300 PPI కన్నా ఎక్కువ రిజల్యూషన్ ఉండడం మంచిది.
  • ట్యాబ్లెట్లు కొనేటప్పుడు కూడా రిజల్యూషన్ అంశాన్ని పక్కాగా గమనించాలి. ఎందుకంటే బడ్జెట్ ట్యాబ్లెట్లలో డిస్ప్లే రిజల్యూషన్ మరీ తక్కువగా ఉంటుంది. దానివల్ల దృశ్య అనుభూతి బాగుండదు.


More Articles