కరెంట్ బిల్లు అధికంగా వస్తోందా?... ఒకసారి వీటిని చెక్ చేయండి!

వినియోగంలో మార్పు లేదు. కానీ, నెల తిరిగేసరికి విద్యుత్ బిల్లు భారీగా పెరిగిపోతోంది...? నెల క్రితం వచ్చిన బిల్లు కంటే ప్రస్తుతం వచ్చిన బిల్లు ఎక్కువగా ఉంది...? ఏడాది క్రితంతో పోలిస్తే ఇంట్లో ఎలక్ట్రిసిటీ ఉపకరణాలు ఏవీ పెరగలేదు. కానీ బిల్లు ఎందుకంత ఎక్కువగా వచ్చింది...? అయితే వీటిని ఓ సారి పరిశీలించాల్సిందే...

తాజాగా వచ్చిన విద్యుత్ బిల్లు, అంతకు ముందు నెల బిల్లు... ఏడాది క్రితం ఇదే నెలలో వచ్చిన బిల్లును ఓసారి బయటకు తీయండి. తాజా బిల్లులో ఎన్ని యూనిట్లు ఉన్నదీ పరిశీలించాలి. అంతకుముందు నెలల్లోనూ అన్నే యూనిట్ల వినియోగం ఉండి బిల్లు అమౌంట్ పెరిగిందంటే విద్యుత్ చార్జీలు పెరిగాయేమో చూసుకోవాలి. విద్యుత్ వినియోగ టారిఫ్ ను పెంచి ఉంటే కొత్త చార్జీల ప్రకారం లెక్కిస్తే తెలిసిపోతుంది. విద్యుత్ చార్జీలు పెరగకపోయినా బిల్లు మొత్తం పెరగడానికి సర్ చార్జీ, ఇతర చార్జీలు బిల్లులో వచ్చి చేరాయేమో పరిశీలించాలి.

స్నేహితుల ఇళ్లల్లో వినియోగం...

స్నేహితులు ఎంతో మంది ఉంటారు. మీ ఇంట్లో ఏఏ విద్యుత్ ఉపకరణాలు ఉన్నాయో ఓ సారి నోట్ చేసుకోండి. ఇప్పుడు అచ్చం అన్నే ఉపకరణాలు ఉన్న స్నేహితుల గురించి విచారించి... వారికి ఎంత బిల్లు వస్తుందో అడిగి తెలుసుకుంటే... సమస్య ఎక్కడ ఉందో తెలుస్తుంది.

మీటర్ చెకింగ్

తాజాగా వచ్చిన విద్యుత్ బిల్లులో వినియోగ యూనిట్లు, అంతకుముందు నెలల్లో ఉన్న వినియోగం కంటే పెరిగి ఉంటే... బిల్లు కాల వ్యవధిలో ఇంట్లో ఏవైనా వేడుకలు జరిగాయా, బంధువులు కొన్ని రోజులు ఇంట్లో ఉండి వెళ్లారా, వేసవి అయితే ఏసీ వాడకం పెరిగిందా ఇలాంటి అంశాలను ఓ సారి చెక్ చేసుకోవాలి. అయినా, మీ ఇంట్లో విద్యుత్ వినియోగం ఎప్పటిలానే ఉంటే... మీటర్ రీడింగ్ నమోదులో పొరపాటు జరిగిందా లేక సమస్య మీటర్ లో ఉందేమో పరిశీలించి విషయాన్ని రూఢీ చేసుకోవాల్సి ఉంటుంది.  

మీటర్ రీడింగ్ సరిగానే ఉంటే...?

ఒకవేళ మీటర్ రీడింగ్ సరిగానే ఉందనుకుంటే... విద్యుత్ సరఫరా పరంగా ఎక్కడైన లీకేజీలు ఉన్నాయేమో పరీక్షించాలి. ఇందు కోసం ముందుగా మెయిన్ ఆఫ్ చేయాలి. అప్పుడు కూడా మీటర్ తిరుగుతోందా...? అన్నది చెక్ చేయాలి. ఒకవేళ డిజిటల్ నంబర్ చూపించే మీటర్ అయితే... మెయిన్ ఆఫ్ చేసి ఉంచి రీడింగ్ నమోదు చేసి.... ఓ గంట రెండు గంటల తర్వాత తిరిగి రీడింగ్ చూడాలి. రీడింగ్ లో మార్పు ఉందా? గమనించాలి. మెయిన్ ఆఫ్ చేసి ఉంచినా మీటర్ రీడింగ్ పెరుగుతూనే ఉంటే సమస్య ఉన్నట్టు గుర్తించాలి.

మీటర్ పాడై అలా జరుగుతోందా...? లేక రహస్యంగా మీ మీటర్ కు వేరే వారి విద్యుత్ వైరు అనుసంధానమైందా? అన్నది ఎలక్ట్రీషియన్ సాయంతో తెలుసుకోవాలి. అలా వేరే ఏ ఇతర వైర్ కూడా మీ మీటర్ కు అనుసంధానమైనట్టు లేకపోతే సమస్య మరో చోట ఉన్నట్టే.

మెయిన్ ఆన్ చేసి... ఇప్పుడు ఒక్కో పరికరాన్ని మాత్రమే ఆన్ చేస్తూ రీడింగ్ సరిగ్గా ఉందేమో పరిశీలించాలి. ఒక కిలోవాట్ విద్యుత్ వినియోగంతో ఒక యూనిట్ మాత్రమే పెరగాలి. దీన్ని తెలుసుకోవాలంటే వన్ టన్ ఏసీ ఒక గంటపాటు ఆన్ చేసి ఉంచండి. ఒక యూనిట్ ఖర్చవుతుంది. లేదా 100 వాట్ల బల్బ్ ను 10 గంటల పాటు ఉంచినా ఒక యూనిట్ వ్యయం అవుతుంది. దాన్ని బట్టి మీటర్ రీడింగ్ సరిగ్గా ఉందో, లేదో తెలుస్తుంది.

మెయిన్ ఆఫ్ చేసినా, మరే ఇతర విద్యుత్ వైర్లు అనుసంధానం కాకపోయినా మీటర్ తిరుగుతూ ఉంటే సమస్య మీటర్ లో ఉందని అనుమానించవచ్చు. అప్పుడు విద్యుత్ విభాగానికి మీటర్ లో  సమస్య ఉన్నట్టు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే వారు ఆ మీటర్ ను మారుస్తారు. అధికంగా వసూలు చేసిన చార్జీలు వెనక్కి ఇవ్వాలని కోరితే మాత్రం మీటర్ ను టెస్టింగ్ కు పంపిస్తారు. టెస్టింగ్ చార్జీలను వినియోగదారుడే భరించాలి. పరీక్షల్లో మీటర్ లో సమస్య ఉందని నిర్ధారణ అయితే అధికంగా చెల్లించిన మొత్తాలను తర్వాతి బిల్లుల్లో సర్దుబాటు చేస్తారు.  

representation image

వినియోగాన్ని తగ్గించుకునే మార్గాలు....

అన్నీ సవ్యంగా ఉండి, విద్యుత్ వినియోగం అధికమై బిల్లు భారంగా మారితే... వినియోగాన్ని తగ్గించుకునే మార్గాలపై దృష్టి సారించాల్సి ఉంటుంది. ట్యూబ్ లైట్లు, ఇన్ కాండిసెంట్ బల్బ్ ఉంటే వాటి స్థానంలో ఎల్ ఈ డీ బల్బులు అమర్చుకోండి. 10/10 గదికి 9, 10 వాట్ల ఎల్ ఈడీ బల్బ్ వెలుగు సరిపోతుంది. 12/12 రూమ్ అయితే, 14 వాట్ బల్బ్ చాలు. దాంతో 20 వాట్స్ కు పైన ఆదా అవుతుంది. ముఖ్యంగా బాత్ రూమ్, దేవుని మందిరాలలో లైట్లు ఎప్పుడూ వెలుగుతూనే ఉంటాయి. వాటి స్థానంలో 1 లేదా 2 వాట్ల ఎల్ ఈడీ బల్బ్ లను అమర్చండి. గదుల్లో అవసరమైన ప్రదేశాల్లోనే లైటింగ్ పడేట్లు చూసుకోవడం వల్ల అవసరం లేని చోట బల్బ్ లను ఆఫ్ చేసుకోవడానికి వీలుంటుంది.

సీలింగ్ ఫ్యాన్లు 40, 50 వాట్లవి అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుత ఫ్యాన్ల స్థానంలో వాటిని వాడుకోవడం వల్ల ఎంతో ఆదా అవుతుంది. మామూలు లోకల్ బ్రాండ్ ఫ్యాన్లు 90 వాట్ల వరకు విద్యుత్ ను వినియోగించుకుంటాయి. అదే బ్రాండెడ్ లో రేటింగ్ లేనివి అయితే75 వాట్ల వరకు విద్యుత్ ను ఖర్చు చేస్తాయి. ఏ ఇంట్లో అయినా ఎప్పుడూ వినియోగంలో ఉండే పరికరాలు ఫ్యాన్లు, ఫ్రిడ్జ్ లు. అందుకే 5 స్టార్ రేటింగ్ ఉన్న సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ వాడుకోవడం వల్ల వినియోగాన్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు. పైగా ఫ్రిడ్జ్ లను వేడి తగిలే చోట కాకుండా, గోడ నుంచి కనీసం నాలుగైదు అంగుళాల దూరంలో ఉంచడ వల్ల వినియోగం తగ్గుతుంది.  

representation image

1 టన్ ఏసీ 25 డిగ్రీల కంటే ఎక్కువలో సెట్ చేసుకోవడం వల్ల వినియోగం చాలా వరకు తగ్గుతుంది. ఉదాహరణకు 1 టన్ను ఏసీ గంటకు ఒక యూనిట్ ఖర్చు చేస్తుందనుకుంటే.... అదే ఇన్వర్టర్ టెక్నాలజీతో ఉన్న ఏసీని వాడడం వల్ల 0.60యూనిట్ వరకే విద్యుత్ ఖర్చు అవుతుంది. అత్యవసర సమయాల్లో ఇంట్లో ఐరన్ చేసుకుంటే చేసుకున్నారు, కానీ మిగిలిన సమయాల్లో బయట చేయించుకోవడం నయం. ఎందుకంటే మొత్తం మీద యూనిట్లు పెరిగిపోతే శ్లాబ్ రేట్ మారిపోయి బిల్లు భారంగా మారుతుందని గుర్తించాలి. మరీ ముఖ్యంగా కొనే ఏ ఎలక్ట్రిక్ ఉపకరణం అయినా 5 స్టార్ రేటింగ్ లో ఉండి వినియోగం తక్కువగా ఉండేలా చూసుకోవాలి. 

ఇక స్విచాఫ్ చేసినా కూడా కొన్ని రకాల పరికరాలు విద్యుత్ వినియోగించుకునే పరిస్థితి ఉంటుంది. ఉదాహరణకు ఓవెన్ ఉంటుంది. అందులో ఆహారం పెట్టినప్పుడే ఆన్ అవుతుంది. కానీ, ఆన్ అయ్యేందుకు సిద్ధంగా ఉండేందుకు దానికి కొంత విద్యుత్ ఖర్చు అవుతుంది. కంప్యూటర్లు, టీవీలు, డీవీఆర్ లు వీటిల్లోనూ ఇదే పరిస్థితి ఉంటుంది. అందుకే వీటిని వాడేందుకు ఓ మార్గం ఉంది. ప్లగ్ సాకెట్లతో ఉండే పవర్ స్ట్రిప్ తెలిసే ఉంటుంది. ఎక్కువగా కంప్యూటర్, సీపీయూలను అనుసంధానించేందుకు ఉపయోగిస్తుంటారు. ఈ స్ట్రిప్ కు ఉపకరణాలను అటాచ్ చేయండి. వాడే అవసరం లేనప్పుడు మెయిన్ ప్లగ్ సాకెట్ లో, పవర్ స్ట్రిప్ వద్ద కూడా ఆఫ్ చేయడం వల్ల దుర్వినియోగం ఉండదు. 

డిష్ వాషర్లు, క్లాత్ వాషింగ్ మెషిన్లు బాగా విద్యుత్ ను వాడేస్తాయి. అందుకే రెండు మూడు వస్త్రాలను వాషింగ్  మెషిన్ లో వేసి ఆన్ చేయకండి. తక్కువ వస్త్రాలుంటే వారానికి ఒకసారి లేదా రెండు మూడు రోజులకు ఒకసారి మాత్రమే పూర్తి లోడ్ వరకు వస్త్రాలు వేసి వాషింగ్ మెషిన్ ను ఉపయోగించాలి. అలాగే వంట పాత్రలను కూడా పూర్తి లోడ్ మేరకు వేసి వినియోగించుకోవడం వల్ల దుర్వినియోగాన్ని తగ్గించుకోవచ్చు. representation image

పాత వాటితో ఇబ్బందే

మరీ ఎన్నో ఏళ్ల క్రితం కొన్న విద్యుత్ ఉపకరణాలు వాడడం వల్ల కూడా బిల్లు పెరిగిపోతుంది. అందుకే వాటి కాలపరిమితి దాటిందనుకుంటే మార్చివేయడం మంచిది. ఉదాహరణకు సీలింగ్ ఫ్యాన్ అయితే ఎనిమిదేళ్ల తర్వాత వాడకపోవడం ఉత్తమం. ఎనిమిదేళ్ల కాల వ్యవధి ఉన్న సీలింగ్ ఫ్యాన్ 90 వాట్లకు పైగా విద్యుత్ ను వాడుకుంటుందని పరీక్షల్లో తేలింది.


More Articles