ఈ ఆలయాల వద్ద గుట్టల కొద్దీ బంగారు రాసులు

ఈ సృష్టి దేవుడు చేసిందేనని అన్ని మతాల వారూ విశ్వసిస్తారు. దేవుడు మనకు ఇంత ఇవ్వగా లేనిది మనం శక్తి కొద్దీ ఆయనకు కొంతైనా సమర్పించుకోలేమా..? అన్న భావనలో కొందరు భగవంతుడికి విరాళాలు ఇస్తుంటారు. ఇలా భక్తులు అందించే విరాళాలు ప్రముఖ ఆలయాల్లో గుట్టలుగా పేరుకుపోతున్నాయి. ప్రపంచ బంగారు మండలి (వరల్డ్ గోల్డ్ కౌన్సిల్) అంచనాల ప్రకారం దేశ వ్యాప్తంగా 22వేల టన్నులకుపైన బంగారం నిల్వలు ఉండగా... వీటిలో మూడు నుంచి నాలుగు వేల టన్నుల బంగారం ఆలయాల్లోనే ఉన్నట్టు అంచనా. అలాంటి ఆలయాల్లో కొన్ని....representation image

ఆదిశేషుడు అనంత పద్మనాభుడై ఉన్న ఆలయం

దేశంలోని దేవాలయాలన్నింటిలోకీ సంపన్న దేవాలయంగా కేరళ రాష్ట్రం తిరువనంతపురంలో కొలువై ఉన్న అనంత పద్మనాభ స్వామి ఆలయం మొదటి స్థానంలో ఉంటుంది. 2011కు ముందు వరకు ఈ ఆలయానికి ఉన్న సంపద గురించి తెలిసిన వారు చాలా తక్కువ మంది. దేవాలయంలోని నేల మాళిగల్లో గుట్టలకొద్దీ బంగారం నిల్వలు ఒక్కసారిగా వెలుగు చూడడంతో అందరూ ఆశ్చర్యపోయారు. ట్రావెన్ కోర్ సంస్థానాన్ని పాలించిన రాజులు పన్నుల రూపంలో లభించిన ఆదాయాన్ని ఇలా బంగారం రూపంలో పద్మనాభస్వామి ఆలయంలో భద్రపరిచి ఉంటారని భావిస్తున్నారు. 

ఈ బంగారం విలువ లక్ష కోట్ల రూపాయలకు పై మాటేనని అంచనా. కానీ, పురాతన ఆభరణాలకు ఉన్న విలువ ప్రకారం చూస్తే మార్కెట్ లో పలికే విలువ దీనికి పది రెట్లు ఉంటుందని అంచనా. అందుకే, అప్పటి వరకు సంపన్న ఆలయంగా ప్రథమ స్థానంలో ఉన్న తిరుమల వెంకటేశ్వరస్వామి ఆలయం రెండో స్థానంలోకి వెళ్లగా... పద్మనాభ స్వామి ఆలయం ప్రథమ స్థానంలోకి వచ్చింది.

ఈ ఆలయంలో 1300 టన్నుల బంగారం ఉంటుందని అంచనా. ఆలయంలో కొలువై ఉన్న ఆదిశేషుని బంగారం విగ్రహం రూ.500కోట్లు.  వీటిలో పురాతన బంగారు ఆభరణాలు, ఓ గోనె సంచి నిండా వజ్రాలు. బంగారం కిరీటాలు, బంగారం దండం, రెండున్నర కిలోల బరువున్న 18 అడుగుల పొడవైన బంగారు హారం, 800 కిలోల గోల్డ్ కాయిన్స్ ఒక్కోటీ రూ.2.70కోట్ల విలువైనది. బంగారంపై వజ్రాలు పొదిగి చేసిన సింహాసనం. ఇంకా వేల సంఖ్యలో బంగారంతో చేసిన కుండలు, జార్లు, ఇతర వస్తువులు సైతం బయటపడినట్టు సమాచారం.

బీ మాళిగను ఇప్పటికీ తెరవలేదు...

ఆలయంలోని రహస్య నేలమాళిగల్లో ఉంచిన వాటిని పరిశీలించేందుకు వాటిని తెరవాలని సుప్రీంకోర్టు 2011 జూన్ లో ఆర్కియాలజీ విభాగాన్ని ఆదేశించింది. ఆలయంలో ఆరు నేల మాళిగలను జస్టిస్ సుబ్రహ్మణ్యం కమిటీ కనుగొన్నది. ఏ నుంచి ఎఫ్ వరకు ఉన్న ఈ నేల మాళిగల్లో బీ మాళిగను ఇప్పటి వరకు తెరవలేదు. ఏ, బీ రెండింటినీ అసలు తెరవడం లేదని గుర్తించగా... సీ నుంచి ఎఫ్ వరకు నేలమాళిగలను ఆలయ అర్చకులు అప్పుడప్పుడు తెరిచి మూసేస్తున్నట్టు కమిటీ తెలుసుకుంది. దీంతో ఏ, బీ లను కేవలం లోపలున్న బంగారం నిల్వల విలువను మదింపునకే తెరవాలని, తర్వాత మూసివేయాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 

అయితే బీ మాళిగను తెరిచినప్పటికీ లోపలున్న అసలైన చాంబర్ (గది)ను తెరవలేదు. కారణం ఈ చాంబర్ ఇనుప తలుపుతో మూసి ఉండి, దానిపై సర్పం చిత్రం వేసి ఉంది. దీన్ని తెరవడం అరిష్టంగా ట్రావన్ కోర్ రాజవంశీయులు తెలిపారు. బీ మాళిగను చివరిసారిగా 1931లో మహారాజు శ్రీ చిత్తిర తిరునాళ్ బలరామ వర్మ ఆదేశాల మేరకే తెరిచినట్టు ఆధారాలు ఉన్నాయి. బీ మాళిగలోని చాంబర్ లో శ్రీచక్రంతోపాటు అపార ధనరాసులున్నట్టు భావిస్తున్నారు. వీటి విలువ కూడా అనూహ్యంగా లక్షల కోట్ల రూపాయల్లో ఉంటుందని అంచనా. జస్టిస్ సుబ్రహ్మణ్యం 2014లో సుప్రీంకోర్టుకు సమర్పించిన నివేదికలో మరోసారి దేవప్రసన్నం కార్యక్రమాన్ని నిర్వహించి బీ మాళిగలోని చాంబర్ ను తెరవాలని సిఫారసు చేశారు. అయినా, ఇప్పటికీ ఆ చాంబర్ ను తెరవలేదు. 

representation image

తిరుపతి గోవిందుడు

ఏటా రూ.650కోట్ల నుంచి రూ.1,000 కోట్ల మేర విరాళాలు తిరుమల తిరుపతి దేవస్థానానికి సమకూరుతున్నాయి. 1000 కిలోల బంగారు ఆభరణాలు కూడా వస్తున్నాయి. ప్రతి నెల సుమారు 100 కిలోల బంగారం, 100 నుంచి 120 కిలోల వరకు వెండి ఆభరణాలు విరాళాల రూపంలో వస్తున్నాయి. 

రోజూ టన్నుల కొద్దీ తలనీలాలను భక్తులు గోవిందుడికి సమర్పించుకుంటున్నారు. ఒక్క తలనీలాల ద్వారానే టీటీడీకి వందల కోట్ల రూపాయల ఆదాయం లభిస్తుండడం విశేషం. మొత్తం వివిధ రూపాలలో ఏటా రూ.2,400 కోట్ల రూపాయలకు పైనే ఆదాయం వస్తోంది. టీటీడీకి అన్ని రకాల ఆస్తులు కలిపి రూ.32వేల కోట్లకు పైనే ఉన్నట్టు అంచనా. ఆలయం వద్ద ఉన్న స్మారక వస్తువుల విలువ రూ.1.2 లక్షల కోట్లు ఉంటుందని అంచనా. ఓ అంచనా ప్రకారం టీటీడీకి 200 టన్నుల నుంచి 300 టన్నుల వరకు బంగారం నిల్వలు ఉన్నట్టు తెలుస్తోంది. 

షిర్టీ సాయినాథుడు

మహారాష్ట్రలోని షిర్టీలో ఉన్న సాయినాథుడ్ని దేవుడిగా ఆరాధించే వారి సంఖ్య కోట్లల్లోనే ఉంటుంది. ఆ ఆలయానికి రూ.32కోట్ల విలువైన బంగారం, వెండి ఆభరణాలు ఉన్నాయి. ఏటా ఈ ఆలయానికి రూ.350 కోట్ల విరాళాలు వస్తున్నాయి. 2013 నాటికే షిర్టీ సాయి సంస్థాన్ ట్రస్ట్ రూ.627 కోట్లకుపైనే బ్యాంకుల్లో డిపాజిట్ చేసింది. ప్రతి రోజూ 20వేల మంది వరకు ఈ ఆలయాన్ని సందర్శిస్తుంటారు.representation image

సిద్ధివినాయక్

ముంబైలో కొలువై ఉన్న సిద్ధి వినాయక్ ఆలయం కూడా చాలా సంపన్నమైనది. దాదర్ ప్రాంతంలోని ఈ ఆలయాన్ని వీఐపీల ఆలయంగా పేర్కొంటారు. ఇక్కడ ఉన్న విఘ్నేశ్వరుడి విగ్రహానికి 3.7 కిలోల బంగారం తొడుగు ఉంటుంది. రోజూ వేల సంఖ్యలో ఆలయాన్ని దర్శించుకుంటారు. ఏటా భక్తుల ద్వారా వివిధ మార్గాల్లో వచ్చే ఆదాయం రూ.320కోట్లు. ఈ ఆలయం వద్ద 160 కిలోలకు పైనే బంగారం నిల్వలున్నాయి.  

పంజాబ్ గోల్డెన్ టెంపుల్

పంజాబ్ రాష్ట్రంలోని అమృత్ సర్ లో ఉన్న గోల్డెన్ టెంపుల్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఇది సిక్కుల పవిత్ర ప్రార్థనా స్థలం. ఇక్కడి మందిరం బంగారం, వెండి పూతతో నిర్మితమై ఉంటుంది. రోజూ 40 వేల మంది సందర్శిస్తారని అంచనా. అయితే, గోల్డెన్ టెంపుల్ కు ఉన్న ఆస్తుల వివరాలు మాత్రం ఇప్పటికీ బహిర్గతం కాలేదు.

representation image

మీనాక్షి అమ్మన్ టెంపుల్

తమిళనాడులోని మదురైలో ఉన్న మీనాక్షి అమ్మవారి గురించి తెలియని వారుండరు. రోజూ 15వేల మంది వరకు ఈ ఆలయాన్ని సందర్శిస్తుంటారు. నెలనెలా హుండీ ద్వారా రూ.1.5 కోట్ల రూపాయల కానుకలు వస్తున్నాయి.

జగన్నాథస్వామి ఆలయం

ఒడిశాలోని పూరి పట్టణంలో ఉందీ ఆలయం. భక్తులు జగన్నాథుడికి భక్తి పూర్వకంగా సమర్పించిన భూములు 60వేల ఎకరాలకు పైనే. స్వామికి 210 కిలోల కంటే ఎక్కువే బంగారం నిల్వలు ఉన్నాయి. 2011లో జగన్నాథుడి ఆలయానికి ఎదురుగా ఉన్న ఓ మఠంలో రూ.90 కోట్ల విలువైన 522 వెండి దిమ్మెలు బయటపడ్డాయి. వీటి బరువు 40కిలోల వరకు ఉంటుందని, వందేళ్ల క్రితం నాటివని గుర్తించారు. 

సోమనాథ్ టెంపుల్

ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన సోమనాథేశ్వరుడు గుజరాత్ లో కొలువై ఉన్నాడు. ఆ ఆలయానికి 35 కిలోల బంగారం నిల్వలు ఉన్నాయి. ఆలయ నిర్వహణను చూసే సోమనాథ్ ట్రస్ట్ పేరిట రూ.1639 కోట్ల రూపాయల మేర ఆస్తులున్నట్టు అంచనా.  

కాశీ విశ్వేశ్వరుడు

భక్తుల నుంచి కాశీ విశ్వేశ్వరుడికి ఏటా రూ.5 కోట్ల వరకు ఆదాయం వస్తోంది. 99 కిలోల వరకు బంగారు ఆభరణాలు ఉంటాయని అంచనా. 

శ్రీకృష్ణుడి ఆలయం

గురువాయూరులోని శ్రీకృష్ణుడి ఆలయానికి కూడా ఎంతో విశిష్టత ఉంది. ఈ ఆలయం వార్షిక ఆదాయం రూ.50 కోట్లు పైమాటే. ఇందులో కొంత బంగారం రూపంలో వస్తుంటుంది. సుమారు ఏటా 15 కిలోల మేర బంగారం వస్తుందని అంచనా. ఈ ఆలయానికి 600 కిలోలకు పైనే బంగారం నిల్వలు ఉన్నాయి. 

representation image

శబరిమల అయ్యప్పస్వామికి సైతం...

శబరిమల అయ్యప్ప దేవాలయానికి ఏటా 110 కోట్ల రూపాయలకు పైన ఆదాయం, 20 కిలోల బంగారం వరకు సమకూరుతోంది. ఆలయాలకు భక్తుల నుంచి బంగారం విరాళాలు వివిధ వస్తువుల రూపంలో వస్తుంటాయి. వీటిని బంగారు దిమ్మెల రూపంలోకి మార్చి బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తారు. దానిపై వడ్డీ రూపంలో ఆదాయం వస్తుంది. 

వైష్ణోదేవి ఆలయం

జమ్ములోని వైష్ణోదేవి ఆలయానికి 1.2 టన్నుల బంగారం నిల్వలున్నాయి. ఏటా కోటి మంది భక్తులు సందర్శిస్తుంటారు. సుమారు 500 కోట్ల మేర ఆదాయం వస్తుందని అంచనా.


More Articles