వాడడం తెలియాలేగానీ క్రెడిట్ కార్డును మించింది లేదు!

నిమిషంలో అప్పు పుట్టించడం సాధ్యమా...? ఎక్కడైనా ఎప్పుడైనా అప్పు కావాలంటే ఇచ్చే వారున్నారా...? ఎవరినీ దేహీ అనకుండా రాయల్ గా అప్పు తీసుకునేది ఎలా...? వీటికి సమాధానం క్రెడిట్ కార్డు. క్రెడిట్ అంటే రుణం అని అర్థం. నాణేనికి రెండు వైపులా అన్నట్టు ప్రతి అంశానికీ మంచి, చెడు రెండూ ఉంటాయి. అలానే క్రెడిట్ కార్డులకు కూడా. క్రమ శిక్షణతో అత్యవసరాలకు, షాపింగ్ వంటి వాటికి క్రెడిట్ కార్డులను ఉపయోగించుకోవడం మంచిదే. వడ్డీ లేకుండా అప్పు ఇచ్చేది క్రెడెట్ కార్డు. తేడా వస్తే అధిక వడ్డీ రాబట్టేది కూడా అదే. అందుకే కార్డు గురించి పూర్తిగా తెలుసుకునే తీసుకోండి.    

వడ్డీ లేని అప్పు

క్రెడిట్ కార్డుకు లిమిట్ ఉంటుంది. ఆ లిమిట్ మేరకు వాడేస్తే డ్యూ డేట్ లోపు తిరిగి చెల్లించాలి. ఇలా రుణ సదుపాయాన్ని వాడుకున్న ప్రతిసారీ నిర్ణీత తేదీలోపు (గ్రేస్ పిరియడ్) చెల్లిస్తే వడ్డీ పడదు. ఈ గ్రేస్ పిరియడ్ గరిష్ఠంగా 50 రోజులు. దీన్ని ఎలా లెక్కిస్తారంటే... ప్రతి నెలా బిల్ సైకిల్ ఉంటుంది. ఉదాహరణకు జూన్ 20 నుంచి జూలై 19 వరకు బిల్ సైకిల్ అనుకుంటే... డ్యూ డేట్ ఆగస్ట్ 10వ తేదీ ఉంటుంది. అంటే ఈ బిల్ కాల వ్యవధిలో ఎప్పుడు రుణ సౌకర్యాన్ని వాడుకున్నా తిరిగి ఆగస్ట్ 10లోపు వడ్డీ లేకుండా కట్టేస్తే సరిపోతుంది. ఉదాహరణకు జూన్ 20న కార్డుపై లిమిట్ వాడేస్తే... చెల్లించేందుకు ఆగస్ట్ 10వ తేదీ వరకు గడువు ఉంటుంది. అంటే 50 రోజులు. అదే జూలై 19న కొనుగోలు చేస్తే వడ్డీ లేకుండా తిరిగి చెల్లించేందుకు 20 రోజులు మాత్రమే ఉంటుంది.    

గడువు దాటితే గూబ గుయ్!

ఎక్కువ లిమిట్ తో వస్తుంటే చాలు మిగతా ఏ విషయాలను పట్టించుకోకుండా చాలా మంది క్రెడిట్ కార్డు తీసేసుకుంటారు. సాధారణంగా ఈ వడ్డీ రేటు 1.99 శాతం నుంచి 3.5 శాతం (నెలవారీ వడ్డీ) వరకు ఉంటుంది. డ్యు డేట్ లోపు చెల్లించేస్తే వడ్డీ గురించి పట్టించుకోవక్కర్లేదు. కానీ, గడువు దాటిన తర్వాత ఎంత త్వరగా చెల్లించగలిగితే అంత క్షేమం. ఎందుకంటే వడ్డీపై వడ్డీలు పెరిగిపోతుంటాయి. దీంతో క్రెడిట్ కార్డు రుణ ఊబిలో చిక్కుకునే ప్రమాదం ఏర్పడుతుంది. నెలకు 1.99 శాతం అంటే 12 నెలలకు లెక్కిస్తే వార్షిక వడ్డీ 24 శాతం పైనే ఉంటుంది. ఇక వడ్డీపై వడ్డీ పడితే ఇది 30 శాతం దాటిపోతుంది. ఎలా అంటే ఉదాహరణకు లక్ష రూపాయల క్రెడిట్ లిమిట్ వాడుకుని సకాలంలో చెల్లించకుండా కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నారనుకుందాం... కాంపొండెడ్ యాన్యువల్ గ్రోత్ రేటు ప్రకారం ఆ రుణ బకాయి కాస్తా ఐదేళ్లలో 7.9 లక్షల రూపాయలకు చేరుతుంది. అది క్రెడిట్ దెబ్బ అంటే.!

representation image

కార్డు ద్వారా ఖర్చు చేస్తే కొంత వెనక్కి...

క్రెడిట్ కార్డు ద్వారా చేసే ప్రతి రూపాయి ఖర్చుపై కొంత మొత్తాన్ని క్యాష్ బ్యాక్ రూపంలో చాలా బ్యాంకులు అందిస్తున్నాయి. అయితే, ముందే ఆఫర్ల సమాచారాన్ని తెలుసుకోవాలి. రెస్టారెంట్లలో, కడుపు నిండా లాగించేసి బిల్లుపై 20 శాతం వరకు ఆదా చేసుకునే అవకాశం ఉంది. అలాగే, మాల్స్ లో సైతం క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లిస్తే క్రెడిట్ రివార్డుల పాయింట్ల రూపంలో ప్రతి 100 రూపాయల వినియోగంపై కొన్ని పాయింట్లు వస్తాయి. 

ఉదాహరణకు హెచ్ డీఎఫ్ సీ ప్రతి 150రూపాయల వినియోగంపై 5 రివార్డు పాయింట్లను అందిస్తోంది. క్రెడిట్ కార్డు సంస్థల సైట్లను చూస్తే నెట్ వర్క్ లోని రెస్టారెంట్లు, మాల్స్ వివరాలు తెలుస్తాయి. అలాగే, ఆన్ లైన్ షాపింగ్ లో సైతం క్రెడిట్ కార్డుల ద్వారా తగ్గింపు ఆఫర్లు కనిపిస్తుంటాయి. పైగా క్రెడిట్ కార్డు ఉంటే ఆన్ లైన్ లో ఎలాంటి వస్తువునయినా చక్కగా ఈఎంఐ స్కీములో క్షణాల్లో కొనుక్కోవచ్చు. ఆఫ్ లైన్ స్టోర్లలోనూ ఈఎంఐ విధానంలో వస్తువులను కొనుగోలు చేసుకునే సౌలభ్యం ఉంది. అయితే, ఈఎంఐ చెల్లింపులపై వడ్డీ చార్జీలు ఉంటాయి. విమాన ప్రయాణ టికెట్ల కొనుగోలు, ట్రావెల్ ప్యాకేజీల్లోనూ రాయితీ లభిస్తుంది. 

అత్యవసర నిధి

రమేష్ వాళ్ల నాన్నగారికి ఓ రోజు ఉన్నట్టుండి హార్ట్ ఎటాక్ రావడంతో వెంటనే ఆస్పత్రికి తరలించారు. రూ.5 లక్షలు ఖర్చవుతుందన్న డాక్టర్లు వెంటనే రూ.2 లక్షలు డిపాజిట్ చేయాలని సూచించారు. దురదృష్టవశాత్తూ రమేష్ వాళ్ల నాన్నగారి పేరుతో ఆరోగ్య బీమా లేదు. రమేష్ దగ్గర కేవలం 50వేల రూపాయలు మాత్రమే ఉన్నాయి. లక్కీగా రూ.1లక్ష లిమిట్ తో ఓ క్రెడిట్ కార్డు ఉండడంతో ఊపిరి పీల్చుకున్నాడు. ఓ స్నేహితుడు తన దగ్గరున్న క్రెడిట్ కార్డు ద్వారా రూ.50వేల సాయం చేశాడు. గండం గట్టెక్కారు. ఇలా అత్యవసరంలో అందరి ముందు ప్రాధేయపడే బదులు వడ్డీ భారమైనా ఓ క్రెడిట్ కార్డు ఉంచుకోవడం వల్ల నష్టమేమీ లేదన్నది కొందరి అభిప్రాయం. అత్యవసర నిధి అవసరాలను క్రెడిట్ కార్డు తీరుస్తుంది. 

క్రెడిట్ కార్డుతో క్యాష్ తీసుకోవచ్చు...

క్రెడిట్ కార్డుల ద్వారా అవసరానికి ఏటీఎంల నుంచి నగదు డ్రా చేసుకోవచ్చు. అదే సమయంలో రుణం కూడా తీసుకోవచ్చు. నగదు ఉపసంహరణ క్రెడిట్ లిమిట్ లో కొద్ది మేరే ఉంటుంది. అదే రుణం రూపంలో తీసుకుంటే ఎక్కువ వస్తుంది. పర్సనల్ లోన్ కంటే వడ్డీ ఎక్కువగా ఉంటుంది.  

విదేశాల్లో వాడకం సులభం

క్రెడిట్ కార్డును విదేశాల్లో సైతం సులభంగా వినియోగించుకోవచ్చు. కరెన్సీ మార్పిడి చేసుకోవాల్సిన ఇబ్బంది ఉండదు. విదేశాల్లో చెల్లింపులతోపాటు ఏటీఎంల నుంచి అక్కడి కరెన్సీని పొందవచ్చు. కానీ డెబిట్ కార్డులకు ఇంత సౌలభ్యం లేదు.

ఎక్కువ మంది ఏ కార్డు వాతుతున్నారు...?

ఓ సర్వే ప్రకారం దేశంలో అత్యధికంగా 28 శాతం మంది హెచ్ డీఎఫ్ సీ క్రెడిట్ కార్డు వాడుతున్నారు. తర్వాత 23 శాతం మంది వద్ద ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు ఉన్నాయి. సిటీ బ్యాంకు క్రెడిట్ కార్డులు 19 శాతం, ఎస్ బీఐ క్రెడిట్ కార్డులు 11 శాతం, స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంకు క్రెడిట్ కార్డులు 7 శాతం, హెచ్ ఎస్ బీసీ బ్యాంకు కార్డులు 4 శాతం మంది వద్ద ఉండగా... ఇతర కంపెనీల క్రెడిట్ కార్డులను 7 శాతం మేర వినియోగిస్తున్నారు.

క్రెడిట్ కార్డును వాడే ముందు...

గరిష్టంగా ఎంత చెల్లించగలమో అంత మేరే క్రెడిట్ కార్డుపై ఖర్చు చెయ్యాలి. లేకుంటే అప్పు సమస్యగా మారుతుంది. ప్రతి నెలా క్రెడిట్ కార్డు స్టేట్ మెంట్ ను పరిశీలిస్తూ ఉండాలి. అదనపు ఖర్చుల భారం ఏమైనా పడుతుందా అన్నది తెలుస్తుంది. క్రెడిట్ కార్డు ఉచితంగా వస్తోంది కదా అని తీసుకోవద్దు. దాని గురించి మంచి చెడులు తెలుసుకున్న తర్వాత తగిన స్పష్టతతోనే తీసుకోవాలి. ఏడాదికోసారి సిబిల్ సంస్థ ద్వారా క్రెడిట్ రిపోర్ట్ ను చెక్ చేసుకోవాలి. ఏదైనా తప్పులుంటే సరి చేయించుకోవాలి. క్రెడిట్ కార్డు నంబర్ వంటి సున్నిత, రహస్య సమాచారాన్ని ఎవరితోనూ, ఏ వేదికల దగ్గరా పంచుకోరాదు. ఎక్కడా రాసి పెట్టుకోవద్దు.  

వార్షిక రుసుములు, ఇతర బాదుడు

క్రెడిట్ కార్డులపై సాధారణంగా ఎన్నో రకాల చార్జీలు ఉంటాయి. ఆలస్యంగా చెల్లిస్తే జరిమానా, పన్ను, నగదు ఉపసంహరణ చార్జీలు, వార్షిక నిర్వహణ చార్జీలు ఇలా అనమాట. వార్షిక రుసుములు ఫ్రీ అని ఊదరగొట్టినా కార్డు తీసుకున్న రెండో ఏడాది లేదా రెండు మూడేళ్ల తర్వాత నుంచి బాదుడు మొదలు కావచ్చు. అందుకే ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలి.  వార్షిక రుసుములు కనీసం 200 రూపాయల నుంచి ప్రారంభం అవుతాయి. క్రెడిట్ కార్డు రుసుములపై ఉన్న మరో పెద్ద ఇబ్బంది సర్వీసు ట్యాక్స్. వార్షిక రుసుములు, ఇతరత్రా ఫీజులు, వడ్డీపై 15 శాతం సేవా పన్ను చెల్లించుకోవాలి. డూప్లికేట్ స్టేట్ మెంట్ కు చార్జీ ఉంటుంది. అలాగే ఆన్ లైన్ షాపింగ్ లో విదేశీ కరెన్సీలో నగదు చెల్లించాల్సి వచ్చినప్పుడు కూడా చార్జీలు పడతాయి. వార్షిక రుసుములు లేకుండా కార్డులను జారీ చేసినా... కార్డుపై పేర్కొన్న గడువు తర్వాత దాన్ని తప్పనిసరిగా పునరుద్ధరించుకోవాలి. ఆ తర్వాత నుంచి వారు సైతం వార్షిక చార్జీ చెల్లించక తప్పదు. ఇక క్రెడిట్ కార్డు రుణంతో డీడీ తీసుకున్నా చార్జీ తప్పదు.  

బిల్లుల చెల్లింపుల్లో సౌకర్యం

దాదాపుగా అన్ని బ్యాంకులు నెట్ బ్యాంకింగ్ ద్వారా క్రెడిట్ కార్డుల రుణ చెల్లింపులను అనుమతిస్తున్నాయి. అలాగే, చెక్, నగదుగా రూపంలోనూ చెల్లించవచ్చు. అయితే, చెక్ ముందుగానే ఇచ్చినా... దాన్ని డ్యు డేట్ లోపు ప్రాసెస్ చేయకుంటే వడ్డీ పడుతుంది. పెనాల్టీ, కూడా తప్పదు.  

సేవలు, పారదర్శకత

కార్డు విషయమై ఎన్నో సందేహాలు ఉన్నాయి. వివరాలు తెలుసుకుందామనుకుని కస్టమర్ కేర్ కు కాల్ చేస్తే అరటిపండు ఒలిచి చేతిలో పెట్టిన విధంగా పూర్తి సమాచారం అందిస్తే ఎంత హాయిగా ఉంటుందో ఆలోచించండి. అదే అసంపూర్ణంగా, మొక్కుబడిగా సమాచారం ఇస్తే ఎలా ఉంటుంది..? అందుకే సేవలు చాలా కీలకం.

representation image

కార్డు ఒకటా... లేక రెండా...?

ప్రస్తుతం ఉన్న క్రెడిట్ కార్డుపై లిమిట్ సరిపోవడం లేదా..? అయితే మరో కార్డు తీసుకోవచ్చు. చెల్లింపుల చరిత్ర చక్కగా ఉంటే సంస్థలు వాటంతట అవే క్రెడిట్ లిమిట్ ను పెంచుతుంటాయి. మీకున్న క్రెడిట్ కార్డుపై లిమిట్ పెంచకుంటే మరొకటి తీసుకోవచ్చు. అలాగే, మీ దగ్గర ప్రస్తుతం ఉన్నది వీసా కార్డు. కానీ, మీరు వెళ్లిన చోట మాస్టర్ కార్డు మాత్రమే అనుమతిస్తామని చెబితే..? ఒక్కోసారి ప్రత్యేకంగా ఒక కార్డుపైనే ఆఫర్లు ఉండవచ్చు. లేదా ఒక్కో కార్డు ఒక్కో చోట లాభసాటిగా అనిపించవచ్చు. అలాంటప్పుడు రెండు వేర్వేరు కార్డులతో ఉపయోగం ఉంటుంది. అయితే, కార్డులు పెరుగుతున్న కొద్దీ బాధ్యత, భారం కూడా పెరగవచ్చు. వాటిని జాగ్రత్తగా చూసుకోవడం, సకాలంలో చెల్లింపులు చేయడం, ఖర్చును నియంత్రణలో ఉంచుకోవడం అవసరం. పది శాతం మందికి నాలుగు కార్డుల చొప్పున ఉన్నాయి. సగటున చూస్తే ఒక్కొక్కరికి రెండు చొప్పున ఉన్నట్టు సమాచారం.

క్రెడిట్ కార్డుల్లో ఎన్నో రకాలు

బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలు రకరకాల కార్డులను అందిస్తున్నాయి. స్టాండర్డ్ క్రెడిట్ కార్డులనేవి సాధారణంగా జారీ చేసేవి. వీటికి డిపాజిట్లు అవసరం ఉండదు. సెక్యూర్డ్ క్రెడిట్ కార్డులనేవి... హామీగా ఫిక్స్ డ్ డిపాజిట్ పై ఇచ్చేవి. క్రెడిట్ లిమిట్ అన్నది ఎంత మొత్తం డిపాజిట్ చేశారన్నదాన్ని బట్టి ఉంటుంది. అలాగే, డెబిట్ కార్డులను పోలిన  ప్రీపెయిడ్ క్రెడిట్ కార్డులు కూడా ఉన్నాయి. ఈ కార్డుల్లో ముందుగా నగదు జమ చేసుకోవాలి. స్పెషాలిటీ క్రెడిట్ కార్డులనేవి భాగస్వామ్య విధానంలో సంస్థలు జారీ చేసేవి. ఉదాహరణకు ఐసీఐసీఐ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ తో టైఅప్ అయి జారీ చేసే కార్డులను పెట్రోల్ పంపుల్లో వినియోగిస్తే రాయితీలు పొందవచ్చు. కోటక్, పీవీఆర్ సంస్థల భాగస్వామ్య కార్డుపై నెలకు వినియోగం రూ.7500 ఉంటే ప్రతి నెలా రెండు మూవీ టికెట్లు ఉచితం. అలాగే, ఎస్ బీఐ భాగస్వామ్యంతో ఐఆర్ సీటీసీ కూడా క్రెడిట్ కార్డును ఆఫర్ చేస్తోంది. ఆన్ లైన్లో ఈ కార్డుతో టికెట్లు కొనుగోలు చేస్తే రివార్డు పాయింట్లు వస్తాయి.  

క్రెడిట్ కార్డా... చార్జ్ కార్డా...?

ఈ రెండింటి మధ్య తేడా ఏంటీ అని అనుకుంటున్నారా... ఒకే రకంగా పని చేసే వేర్వేరు కార్డులు. క్రెడిట్ కార్డులో ఎంత అప్పు ఇచ్చేది ముందుగానే నిర్ణయిస్తారు. ఈ మొత్తాన్ని పూర్తిగా ఒక నెలలో వాడేస్తే అదే నెలలో తిరిగి చెల్లించాలన్న షరతులు ఏమీ ఉండవు. వీలునుబట్టి చెల్లించుకోవచ్చు. అదే చార్జ్ కార్డులో అప్పు తీసుకుంటే అదే నెల ముగిసే లోపు పూర్తిగా తిరిగి చెల్లించాలి. మరుసటి నెలకు క్యారీ ఫార్వార్డ్ చేసుకోవడానికి కుదరదు. అదే నెలలో తిరిగి చెల్లిస్తారు కనుక వడ్డీ ఉండదు. విఫలమైతే 5 శాతం పెనాల్టీ చెల్లించుకోవాలి. చార్జ్ కార్డులో అప్పు ఎంతన్నది వాడే సమయంలో నిర్ణయిస్తారు. కస్టమర్ రుణ చరిత్ర, ఆర్థిక సామర్థ్యాన్ని బట్టి ఇది ఎంతైనా ఉండవచ్చు. చార్జ్ కార్డుతో క్రెడిట్ స్కోరు చక్కగా పెంచుకోవచ్చు. అదే సమయంలో క్రెడిట్ కార్డు మాదిరిగా రివార్డులు, ఆఫర్లు పొందవచ్చు. అయితే, వార్షిక రుసుములు ఎక్కువగా ఉంటాయి. రుణాన్ని అదే నెలలో తిరిగి చెల్లించాలన్న నిబంధన వల్ల అప్పుల్లో చిక్కుకునే అవకాశాలు తక్కువ. 

రుణాన్ని బదిలీ చేసుకోవచ్చు

ఓ కంపెనీ క్రెడిట్ కార్డు వాడుతున్నారు. దానిపై 50వేలు రుణం తీసుకున్నారు. వడ్డీ 3 శాతం పడుతోంది. అదే సమయంలో మరో కంపెనీ మీకు 2 శాతం వడ్డీకే క్రెడిట్ కార్డు ఆఫర్ చేసింది. అప్పుడు మరో ఆలోచన లేకుండా రెండో కార్డు తీసుకుని దానిపై వచ్చిన రుణంతో మొదటి కార్డు రుణాన్ని తీర్చివేయడం బెటర్. పైగా కొత్తగా కార్డు ఇచ్చే సంస్థలు మీ గత వాడకం బాగుండి ఉంటే కొంత కాలం పాటు వడ్డీ రహిత రుణాలను సైతం ఆఫర్ చేస్తున్నాయి. బకాయి బదిలీలకు కూడా కంపెనీలు అవకాశం కల్పిస్తున్నాయి. కాకపోతే మరో కార్డుకు బకాయి బదిలీ చేయాలంటే వాటిపై 2 శాతం వరకు వడ్డీ చెల్లించుకోవాలి. పైగా ఈ బదిలీ చేసే రుణం కొత్త కార్డు రుణ పరిమితిలో 80 శాతాన్ని మించకూడదు.

తక్కువ ఆదాయ వర్గాల వారి కోసం క్రెడిట్ కార్డులు

చేస్తున్న ఉద్యోగం, ఆర్జిస్తున్న వేతనం ఇవే క్రెడిట్ కార్డు కంపెనీలు ప్రాథమికంగా చూసేది. అందుకే అధిక వేతనం గల వారిని కార్డు తీసుకునే వరకు కంపెనీలు వెంటబడుతుంటాయి. మరి తక్కువ ఆర్జన ఉన్నవారి పరిస్థితి ఏంటి..? వారికోసం ప్రత్యేకంగా కొన్ని కార్డులు ఉన్నాయి. హెచ్ఎస్ బీసీ క్లాసిక్ క్రెడిట్ కార్డు రూ.1.44 లక్షల వార్షిక వేతనం పొందుతున్న వారు తీసుకోవచ్చు. హెచ్ ఎస్ బీసీ గోల్డ్ కార్డు స్వయం ఉపాధుల్లో ఉన్నవారు, వేతన జీవులు నెలకు రూ.20వేలు ఆర్జిస్తున్న వారు ఎవరైనా సరే తీసుకోవడానికి అవకాశం ఉంది. యాక్సిక్ బ్యాంకు రూ.20వేల పిక్స్ డ్ డిపాజిట్ పై ఇన్ స్టా క్యాష్ క్రెడిట్ కార్డును ఇస్తోంది. నెలకు రూ.15వేలు ఆర్జిస్తున్న వారి కోసం ఉద్దేశించినదే యాక్సిక్ గోల్డ్ కార్డు. వార్షిక వేతనం 75వేల లోపు ఉన్న వారికి బ్యాంకు ఆఫ్ ఇండియా కార్డును ఆఫర్ చేస్తోంది. కెనరా బ్యాంకు వీసా క్లాసిక్, మాస్టర్ స్టాండర్డ్ కార్డులను వార్షికంగా రూ.లక్ష వేతనం కలిగిన వారికి అందిస్తోంది. వార్షికంగా రూ.2 లక్షల ఆర్జన ఉన్నవారికి కెనరా బ్యాంకు గ్లోబల్ గోల్డ్ కార్డు ఆఫర్ చేస్తోంది.   

నెలకు రూ.12వేల వేతనం ఉన్న వారు ఐసీఐసీఐ బ్యాంకు హెచ్ పీసీఎల్ క్రెడిట్ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు. హెచ్ డీఎఫ్ సీ గోల్డ్ అండ్ సిల్వర్ పేరుతో ఇచ్చే కార్డులకు రూ.2లక్షల వార్షిక వేతనం, స్వయం ఉపాధిలో ఉంటే రూ.1.5 లక్షల ఆదాయం కలిగి ఉండాలి. వేతన జీవులు, స్వయం ఉపాధిలో ఉండి రూ.3 లక్షల వార్షిక వేతనం అందుకుంటున్న వారికి కోటక్ బ్యాంకు ట్రంప్ అండ్ ఫార్చ్యూన్ గోల్డ్ కార్డును ఆఫర్ చేస్తోంది. ఇక నెలకు 20వేల వేతనం ఉన్నవారు ఆంధ్రా బ్యాంకు వీసా గోల్డ్ కార్డును తీసుకోవచ్చు. రూ.1.50 లక్షల వేతనం ఉన్నవారు బ్యాంకు ఆఫ్ బరోడా వీసా గోల్డ్ కార్డుకు అర్హులు. కార్పొరేషన్ బ్యాంకు క్లాసిక్ కార్డుకు నెలకు 10వేల వేతనం ఉంటే సరిపోతుంది. గోల్డ్ కార్డుకు వార్షికంగా రూ.2 లక్షల వేతనం పొందుతూ ఉండాలి. ఇక అత్యంత తక్కవ వేతనం అంటే నెలకు రూ.5వేల ఆదాయం ఉన్న వారు  విజయా బ్యాంకు వీసా క్లాసిక్ కార్డును తీసుకునేందుకు అర్హులు. విజయా బ్యాంకు మాస్టర్ కార్డు కోసం అయితే ఏడాదికి రూ.1.2 లక్షల వేతనం ఉండాలి. 

representation image

విద్యార్థులు, గృహిణులకు

ఉద్యోగం లేని వారు కావచ్చు... గృహిణులు కావచ్చు. అంటే ఎటువంటి ఆదాయ వనరులు లేని వారు సైతం క్రెడిట్ కార్డును కోరుకుంటే ఇచ్చేందుకు బ్యాంకులు సిద్ధంగానే ఉన్నాయి.  అయితే, ఇందు కోసం కనీసం ఇంత మొత్తం అని బ్యాంకులో ఫిక్సెడ్ డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. అది రూ.20వేల నుంచి రూ.50వేల వరకు ఉండవచ్చు. చెల్లింపుల్లో విఫలమైతే ఎఫ్ డీ నుంచి కోసేసుకుంటాయి. ఈ డిపాజిట్ మూడు నెలల నుంచి ఏడాది కాలానికి వేయాల్సి ఉంటుంది. 

అలాగే, యాడాన్ కార్డును కూడా ఇటువంటి వారికి బ్యాంకులు ఇస్తుంటాయి. అంటే అప్పటికే కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా కార్డు ఉంటే దానికి అనుబంధంగా యాడాన్ కార్డును జారీ చేస్తారు. అసలు కార్డుకు ఏవైతే నిబంధనలు వర్తిస్తాయో యాడాన్ కార్డు కు కూడా అవే వర్తిస్తాయి. విద్యార్థులకు ఇవి ఎంతో ఉపయోగంగా ఉంటాయి. ఇంట్లో వేరెవరికీ క్రెడిట్ కార్డు లేకుండా ఉంటే అప్పుడు విద్యార్థులు ఫిక్స్ డ్ డిపాజిట్ చేయడం ద్వారా కార్డు పొందడం ఓ మార్గం. సేవింగ్స్ ఖాతాలపై కూడా కొన్ని బ్యాంకులు కార్డులను జారీ చేస్తున్నాయి. విద్యార్థుల కోసమే జారీ చేసే కార్డులపై రుణ సుదుపాయం (లిమిట్) తక్కువగా ఉంటుంది. వడ్డీలు కూడా తక్కువే. వడ్డీ రహిత తిరిగి చెల్లింపు గడువు కూడా తక్కువగా ఉంటుంది. ఇంకా ఇంధన సర్ చార్జీ మినహాయంపు వంటి పలు సౌలభ్యాలు ఉన్నాయి.

రుణ చరిత్రను గొప్పగా మార్చుకోవచ్చు. 

క్రెడిట్ హిస్టరీ చెత్తగా ఉన్న వారు నగదు డిపాజిట్ చేసి దానిపై క్రెడిట్ కార్డు తీసుకుని... రుణాన్ని వాడుకుంటూ సకాలంలో చెల్లింపులు చేసుకుంటూ వెళ్లడం ద్వారా ఏడాది నుంచి రెండేళ్లలో క్రెడిట్ స్కోర్ ను పరుగెత్తించుకోవచ్చు. తద్వారా గృహరుణం, పర్సనల్ లోన్, ఇతర రుణాలకు అర్హతను మెరుగుపరచుకోవచ్చు.

ఏమి కావాలి

శాలరీ స్లిప్, ఆదాయపన్ను రిటర్నుల దాఖలు పత్రం, వేతనం జమ అయిన బ్యాంకు ఖాతాకు సంబంధించి గత మూడు నెలల కాలపు స్టేట్ మెంట్ సమర్పించాల్సి ఉంటుంది. వేతన జీవులు కాని వారు గత మూడేళ్ల కాలంలో ఆదాయపన్ను రిటర్నుల దాఖలు పత్రాలను, ఫొటో గుర్తింపు, పాన్ కార్డు కాపీ, చిరునామా ధ్రువీకరణ పత్రాలను ఇవ్వాలి. వ్యాపార వివరాలను సైతం అడగవచ్చు. క్రెడిట్ స్కోరు బాగుండాలి. నగదు డిపాజిట్ చేస్తే వీటిలో చాలా వరకు లేకపోయినా ఫర్వాలేదు. 

కార్డు ఇచ్చే ముందు ఏమి చూస్తారు...?

  • క్రెడిట్ హిస్టరీ బాగుండాలి. సిబిల్ (క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఆఫ్ ఇండియా లిమిటెడ్) రిపోర్టు చూస్తారు. స్కోరు 600కు పైన ఉంటే కార్డు జారీకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. స్కోరు తక్కువ ఉంటే రుణ చరిత్ర బాలేదన్నట్టు. అలాంటి వారికి ఇచ్చేందుకు చాలా కంపెనీలు వెనకాడతాయి. 

  • అసలు క్రెడిట్ హిస్టరీ లేకపోయినా ఇబ్బందే. అంటే అప్పటి వరకు ఎలాంటి రుణం తీసుకోకపోయి ఉన్నా క్రెడిట్ హిస్టరీ ఉండదు. రుణం తీసుకోకపోతే క్రెడిట్ హిస్టరీ ఉండదు కదా. 

  • అప్పటికే గురుడికి చాలా కార్డులు ఉండి, ఫుల్ గా వాడేసి చెల్లించకుండా... దొరవారు మరో కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారనుకోండి. వద్దు నాయనా అంటూ కార్డు సంస్థలు నమస్కారం పెడతాయి. బ్యాలన్స్ బదిలీ చేసుకుంటానన్నా ఒప్పుకోవు.

  • స్టాక్ మార్కెట్లో లిస్టయిన కంపెనీల్లో ఎంత తక్కువ వేతనంతో చేస్తున్న ఉద్యోగమైనా మరో సందేహం లేకుండా కార్డు ఇచ్చేస్తాయి. అన్ లిస్టెడ్ కంపెనీల వారికి ఇచ్చేందుకు తటపటాయిస్తాయి. 

  • అలాగే చేస్తున్న ఉద్యోగం, నివాసిత ప్రాంతాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటాయని తెలిస్తే నవ్వొస్తుంది. అలాగే, ఆదాయ స్థాయి, వయసు వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకుంటాయి. 

  • ముఖ్యంగా క్రెడిట్ లిమిట్ అన్నది దరఖాస్తుదారుడి ఆదాయ స్థాయిని బట్టి నిర్ణయిస్తారు. వేతనంలో ఇది 30 శాతం వరకు ఉండవచ్చు. 


More Articles