కంపెనీ మారుతున్నారా...?

కంపెనీని మార్చేయ్...! నేటి యువత ఆలోచనా ధోరణి ఇది. ఒకే కంపెనీలో సుదీర్ఘకాలం పని చేసేందుకు ఎక్కువ మంది పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఇందుకు ఎన్నో కారణాలు ఉండవచ్చు. కానీ ఉద్యోగరీత్యా ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి వెళ్లాలని డిసైడ్ అయితే అందుకు కొన్ని జాగ్రత్తలు అవసరం.

ఆఫర్ లెటర్ అందుకోవాలి

కొత్తగా జాబ్ ఆఫర్ వస్తే తొందరపడి పాత కంపెనీలో ఉద్యోగానికి రాజీనామా ఇచ్చేయకండి. నూతన ఉద్యోగ అవకాశం లభించడం కాదు, సదరు కంపెనీ నుంచి ఆఫర్ లెటర్ చేతికందిన తర్వాత మాత్రమే పాత ఉద్యోగానికి రాజీనామా చేయబోతున్నట్టు నోటీసు ఇవ్వండి. ఎందుకంటే ఆఫర్ లెటర్ అందుకోనంత వరకు ఏదైనా జరగవచ్చు. అది ఒకసారి చేతికి అందితే దాదాపుగా ఉద్యోగం ఖాయం.

సత్సంబంధాలు

మరో కంపెనీలో మంచి ప్యాకేజీతో ఉద్యోగం వచ్చిందన్న గర్వంతో పాత కంపెనీ యాజమాన్యం దగ్గర విధేయతకు భంగం రాకుండా చూసుకోవాలి. గర్వంతో విర్రవీగిపోరాదు. ప్రవర్తనలో మార్పు రాకుండా నియంత్రించుకోవాలి. సత్సంబంధాలే కెరీర్లో రాణించడానికి మూల సూత్రమని మరవద్దు. ఇవి దెబ్బతింటే కెరీర్ కు విఘాతం కలుగుతుంది. అందుకని ఉద్యోగాన్ని వీడి వెళ్లే వరకూ మంచిగానే వ్యవహరించాలి. నిబంధనల మేరకు ముందుగానే నోటీసు ఇవ్వాలి. మీ స్థానంలో మరో ఉద్యోగిని భర్తీ చేసుకునేందుకు వీలుగా నిబంధనల మేరకు నిర్ణీత కాలం ఆ కంపెనీలో సేవలు అందించాలి. అవసరమైతే నోటీసు కాలాన్ని వారం రెండు వారాలు పొడిగించుకున్నా ఫర్వాలేదు. అదే సమయంలో నోటీసు కాల వ్యవధి గురించి కొత్తగా ఆఫర్ ఇచ్చిన కంపెనీకి ముందుగానే స్పష్టం చేయాలి. ఉద్యోగంలో చేరేందుకు ఎన్ని రోజులు కావాలో కూడా స్పష్టం చేయాలి.

కొత్త ప్యాకేజీ గురించి సరిగ్గా తెలుసుకోండి

జాబ్ ఆఫర్ ఇచ్చే సమయంలో సీటీసీ (కాస్ట్ టు కంపెనీ) గురించి చెబుతారు. సీటీసీ అంటే ఉద్యోగిపై కంపెనీ వెచ్చించే మొత్తం. ప్రస్తుత కంపెనీలో అందుకుంటున్న వేతనం కంటే నూతన కంపెనీ ఆఫర్ చేస్తున్న సీటీసీ ఎక్కువగా ఉందనుకుంటే పొరబడినట్టే. వాస్తవంగా చేతికి అందే మొత్తాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. నూతన కంపెనీలో సీటీసీ ఎక్కువగా ఉన్నా... చేతికి అందే సరికి తక్కువగా ఉన్నా ఆశ్చర్యపోనక్కర్లేదు. కంపెనీలు ప్రయోజనాల విషయంలో భిన్నంగా లెక్కలు వేస్తుంటాయి. కొన్ని ఆరోగ్య బీమా, ఈపీఎఫ్ కూడా సీటీసీలో భాగంగా చూపిస్తాయి. కొన్ని చూపించవు. అందుకే కొత్త ఆఫర్ కు ఓకే చెప్పే ముందు స్పష్టంగా ఈ విషయాలు అడిగి అప్పుడు నిర్ణయాన్ని చెప్పండి.

బ్యాంకు వేతన ఖాతా సంగతి

కంపెనీ మారేందుకు నిర్ణయించుకున్నారు. పాత కంపెనీలో వేతన ఖాతా హెచ్ డీఎఫ్ సీ బ్యాంకులో ఉంది. కొత్తగా మారుతున్న కంపెనీ వేతన ఖాతాలు కూడా ఇదే బ్యాంకు పరిధిలో ఉంటే అప్పుడు పాత కంపెనీ ఖాతాను నూతన కంపెనీ పేరిట మార్చాలని బ్యాంకును కోరవచ్చు.

ఈపీఎఫ్ ఖాతాను కొనసాగించుకోవచ్చు

కొత్త కంపెనీకి మారితే పాత కంపెనీలో ఉన్న ఈపీఎఫ్ ఖాతా నంబర్ ను ఇస్తే సరిపోతుంది. నూతన కంపెనీలో ఈపీఎఫ్ చందాలను అప్పటికే ఉన్న ఖాతాకు మళ్లిస్తారు. నిబంధనల మేరకు ఒక కంపెనీలో ఉద్యోగం మానేసి రెండు నెలల పాటు మరే కంపెనీలోనూ ఉద్యోగంలో చేరకపోయి ఉంటే ఈపీఎఫ్ ఖాతాలో ఉన్నదంతా వెనక్కి తీసుకోవచ్చు. కానీ కొనసాగించుకోవడమే ప్రయోజనమన్నది నిపుణుల సలహా.

representation image

అవసరమైన పత్రాలు తీసుకోవాలి

రిలీవింగ్ లెటర్ (అంటే మిమ్మల్ని ఉద్యోగం నుంచి రీలీవ్ చేస్తున్నట్టు ఇచ్చే ధ్రువీకరణ), ఎక్స్ పీరియన్స్ సర్టిఫికెట్ (కంపెనీలో అందించిన సేవలను ధ్రువీకరిస్తూ ఇచ్చే పత్రం), పే స్లిప్ లు, ఫామ్ 16 మొదలైనవి తీసుకోవాలి. చాలా కంపెనీలు ఆదాయపన్నుకు సంబంధించిన ఫామ్ 16ని మే లేదా జూన్ లోనే ఇస్తున్నాయి. ఒకవేళ దీనిని కొత్త కంపెనీలో జాయిన్ అయ్యే సమయంలో ఇవ్వకపోతే పే స్లిప్ లో టీడీఎస్ తగ్గింపులను చూపించినా సరిపోతుంది.

అధిక వేతనం ఉంటే ఇవి అవసరం

నూతన కంపెనీలో చేరగానే గతంలో కంటే అధిక వేతనం అందుకుంటున్నారా..? అయితే, ఆదాయపన్ను కట్టాల్సి వస్తుంది. అందుకే వెంటనే పన్ను మినహాయింపు ఉన్న పథకాల్లో పెట్టుబడులు ప్రారంభించండి.

బ్రాండ్ వేల్యూ

కంపెనీ మారే ముందు ఇవే కాదు ఇంకా ఉన్నాయి. వేతనం ఒక్కటే కంపెనీ మారడానికి ప్రమాణంగా తీసుకోరాదు. కంపెనీ బ్రాండ్ వేల్యూ కూడా చాలా ముఖ్యం. ఉదాహరణకు నవీన్ టీసీఎస్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. ఇది వరల్డ్ క్లాస్ కంపెనీ. నవీన్ టాలంట్ ను చూసి చిన్న స్థాయి కంపెనీ అయిన సోనాటా సాఫ్ట్ వేర్ కంపెనీ... ఎక్కువ వేతనంతో ఆఫర్ ఇచ్చిందనుకోండి. బ్రాండ్ వేల్యూ పరంగా చూస్తే టీసీఎస్ కు దరిదాపుల్లో సొనాటా ఉండదు.

అదే చిన్న, మధ్య స్థాయి కంపెనీ నుంచి బ్రాండు వేల్యూ, ఆ రంగంలో అగ్రగామిగా ఉన్న కంపెనీలో మంచి అవకాశం వస్తే సొంతం చేసుకోవడం తెలివైన ఆలోచనే. ఇంటర్వ్యూలో కంపెనీ ఎందుకు మారాలనుకుంటున్నారు? అంటే వేతనం అని చెప్పకండి. లాభ, నష్టాలతోపాటు కొత్త కంపెనీలో పని పరంగా ఉన్న అవకాశాల గురించి ప్రస్తావించండి.

representation image

నేర్చుకునే అవకాశం.. పని వాతావరణం

పాత కంపెనీలో మూడేళ్లుగా ఒకే రకమైన పని బాధ్యతలో ఉన్నారనుకోండి. ఈ పనిపై బోర్ కొట్టేసి వేరే బాధ్యతలు ఇవ్వండని మొత్తుకున్నా కంపెనీ పట్టించుకోకపోతే... కొత్త కంపెనీలో నేర్చుకునేందుకు అవకాశాలు, పనిపరంగా చక్కని వాతావరణం ఉంటే మారిపోవచ్చు. అలాగే టాలెంట్ ను ఎంకరేజ్ చేసే వాతావరణం కూడా ఉండాలి. పని చేసే చోట తగినన్ని సౌకర్యాలు కూడా ఉండాలి. కొత్త ఉద్యోగం వేరే నగరంలో చేయాల్సి వస్తే అక్కడి వాతావరణం, సంస్కృతి మీకు సరిపోతుందా? అన్నది పరిశీలించుకోవాలి. ఇలా తరచి చూసుకోవాల్సిన అంశాలు ఎన్నో ఉంటాయి. వీటి గురించి అసలు పట్టించుకోకుండా వెంటనే కంపెనీ మారిపోతే, ప్రతికూలతలు ఎదురైతే అక్కడ ఎక్కువ కాలం కొనసాగలేక ఉద్యోగం నుంచి తప్పుకునే పరిస్థితి ఎదురవుతుంది. కానీ, కంపెనీలు మీద కంపెనీలు మారడం కాకుండా నిలకడగా చేయడం కెరీర్ గ్రాఫ్ ను మెరుగుపరుస్తుంది.


More Articles