దిలాఫ్రోజ్ ఖాజీ...కాశ్మీరీ మహిళల విద్యా ప్రదాత!

జమ్మూ, కాశ్మీర్... నిత్యం తుపాకీ పేలుళ్లతో కల్లోల పరిస్థితులకు నిలయం. ఆ తుపాకులు మిలిటెంట్లవి కావచ్చు.., లేకపోతే భారత సైనికులవీ కావచ్చు. కేవలం తుపాకులు అంతే! ఇక పాక్ తీవ్రవాదుల ప్రాబల్యం మెండుగా ఉన్న ఆ రాష్ట్రంలో బాలికల విద్యపై ఆంక్షలెన్నో. బాలికలు విద్యనభ్యసించరాదని భావించే ఇస్లామిక్ ఉగ్రవాదులు ఏకంగా పాఠశాలలనే కూలగొట్టే సంప్రదాయమున్న ప్రాంతమది.

 అలాంటి ప్రాంతంలో బాలికలకు, యువతులకు విద్యనందించేందుకు ఓ విద్యా సంస్థ వెలసింది. దానిని ప్రారంభించింది ఏ పేరుమోసిన విద్యావేత్తో, అత్యంత ధైర్యసాహసాలు చూపిన మాజీ సైనికుడో కాదు. కడు పేదరికం అనుభవించి, విద్య ప్రాముఖ్యతను గుర్తించిన సామాన్య మహిళ, దిలాఫ్రోజ్ ఖాజీ! విద్య ప్రాముఖ్యతను, అందులోనూ బాలికల విద్య గురించి ఎలుగెత్తి చాటారామె. ధీర వనితగా, శాంతి కపోతంగా ఎదిగారు.  

నోబెల్ బహుమతి రేసులో ఖాజీ

2005లో భారత్ నుంచి 90 మంది పేర్లను నోబెల్ బహుమతి ఎంపిక కోసం అప్పటి ప్రభుత్వం నార్వేకు పంపింది. ఆ జాబితాలో కాశ్మీర్ నుంచి ఖాజీ పేరు కూడా చోటుచేసుకుంది. అసలు అప్పటిదాకా ఆమె జమ్మూ, కాశ్మీర్ లోని కాశ్మీర్ లోయ ప్రాంత వాసులకు మాత్రమే తెలుసు. అది కూడా అంతో, ఇంతో చదువుకున్న వారికి మాత్రమే సుమా. అలాంటి ఖాజీ, నోబెల్ బహుమతికి ప్రతిపాదిత పేర్లలో స్థానం దక్కించుకున్నారంటే, మామూలు విషయం కాదు కదా. ఎంత ధైర్య సాహసాలు చూపి ఉంటేనో కదా ఆ స్థాయిలో, ఆ గౌరవం దక్కింది.

అసలు ఖాజీ చూపిన తెగువకు ఆ గౌరవం తక్కువేననిపిస్తుంది. ఎందుకంటే, కాశ్మీరీ లోయ బాలికల కోసం ఏర్పాటు చేసిన విద్యా సంస్థను కాపాడుకునే క్రమంలో మృత్యువుకు అతి సమీపానికి వెళ్లి, తిరిగి ప్రాణాలతో బయటపడ్డారు. అయినా వెన్ను చూపలేదు కదా, తిరిగి విద్యా సంస్థ కార్యకలాపాలను మరింత విస్తృతం చేశారు. ఆమె తెగువ చూసి ఉగ్రవాదులే పక్కకు తప్పుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయట.

ఎస్ఎస్ఎం కాలేజ్ ఆఫ్ మేనేజ్ మెంట్ అండ్ టెక్నాలజీ స్థాపన

1988లో శ్రీనగర్ పరిధిలోని బారాముల్లాలో ‘‘శ్రీనగర్ స్కూల్ ఆఫ్ మేనేజ్ మెంట్’’ పేరిట యువతులకు ఉపాధి కోర్సులను అందించేందుకు... ఖాజీ ఓ విద్యా సంస్థను ప్రారంభించారు. మిలిటెంట్ల నుంచి పలుమార్లు ప్రతిఘటనలు ఎదురైనా, మొక్కవోని ధైర్యంతో ఆ విద్యా సంస్థను దినదిన ప్రవర్ధమానం చేశారు. క్రమంగా మూడేళ్ల పాలిటెక్నిక్ కోర్సును అందించే స్థాయికి ఎదిగిన ఎస్ఎస్ఎం కాలేజ్... ప్రస్తుతం ఇంజినీరింగ్, మేనేజ్ మెంట్ కోర్సులనూ ఆఫర్ చేసే స్థాయికి ఎదిగింది.

అంతేకాదు, జమ్మూ, కాశ్మీర్ లో తొలి ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలగా ఇదిగుర్తింపు పొందింది. ఈ కళాశాలలో విద్యనభ్యసించిన విద్యార్థులు ఉన్నత ఉద్యోగులుగానూ ఎదుగుతున్నారు. 2013 సివిల్ సర్వీసు పరీక్షల్లో భాగంగా ఈ సంస్థలో చదివిన నవీద్ తంబూ ఐఏఎస్ కు ఎంపికయ్యారు. ఇలా ఈ విద్యా సంస్థలో విద్యనభ్యసించిన పలువురు విద్యార్థులు రాష్ట్ర స్థాయిలోనూ పలు ప్రభుత్వ ఉద్యోగాలను సాధించారని ఖాజీ చెప్పారు. ప్రస్తుతం ఎస్ఎస్ఎం కళాశాల తన కార్యకలాపాలను రాష్ట్రం దాటించి హర్యానాలోనూ విద్యా కుసుమాలను విరబూయిస్తోంది.

కడు పేదరికమే ఖాజీ నేపథ్యం

ఉగ్రవాదుల తుపాకీ మోతలు, మిలిటరీ జవాన్ల పదఘట్టనలతో నిత్యం ఘర్షణపూరిత వాతావరణం చోటుచేసుకునే కాశ్మీర్ లో 1962లో ఓ నిరుపేద కుటుంబంలో దిలాఫ్రోజ్ ఖాజీ జన్మించారు. తీవ్ర భయానక పరిస్థితుల్లోనే ప్రాథమిక విద్య పూర్తి చేసిన ఖాజీ, కాశ్మీర్ వర్సిటీ నుంచి బోధన, ఆర్థిక శాస్త్రాల్లో మాస్టర్స్ డిగ్రీలను సంపాదించారు. అంతటితో సరిపెట్టని ఖాజీ ఎల్ఎల్ బీ కోర్సునూ అదే వర్సిటీలో పూర్తి చేశారు. పేదరికంలో నుంచి వచ్చిన ఖాజీ, విద్యకున్న విలువను ఇట్టే గుర్తించారు. అందుకే, అవకాశమున్నంత మేరకు విద్యనందించేందుకే మొగ్గు చూపేందుకు ఆమె ఇష్టపడతారు. విద్యాదానం కన్నా మించిన దానం ఏముందని కూడా ఆమెు తనను కలిసే వారితో చెబుతుంటారు.

నిత్యం బెదిరింపులే!

అప్పటిదాకా కాశ్మీర్ లోయలో బాలికల విద్య గురించి ఏ ఒక్కరూ మాట్లాడలేదు. ఖాజీ కూడా మాట్లాడలేదు. అయితే మాట్లాడకుండానే చేతులు ముడుచుకుని కూర్చున్న వారిలా, ఖాజీ మాత్రం చేతులు ముడుచుకుని కూర్చోలేదు. మాటలతో పనేముందన్న భావనతో నేరుగా కార్యరంగంలోకి దిగిపోయారు. బాలికల కోసం విద్యా సంస్థను నెలకొల్పారు. ఇది ఇస్లామిక్ ఉగ్రవాదులకు ఆగ్రహం తెప్పించింది. మాటలతో చెప్పి చూశారు. ఖాజీ వినలేదు. బెదిరించారు. ఖాజీ బెదరలేదు. దాడులకు దిగారు. అయినా ఆమె వెనుకాడలేదు.

 1994లో తండ్రి , సోదరులతో పాటు భర్తనూ తీవ్రవాదులు అపహరించారు. కళాశాల తలుపు తెరిచిన వారికి మరణం ఖాయమని హూంకరించారు. దీంతో కళాశాలను కాస్త సురక్షిత ప్రాంతానికి తరలించి, అసలేం జరగనట్లే మళ్లీ తన కార్యకలాపాల్లో మునిగిపోయారు ఖాజీ. ఆ తర్వాత ఒకానొక సందర్భంలో దాదాపు మృత్యువుకు అతి సమీపానికి వెళ్లారు. అయితే ఆమె చేయాల్సిన పనులు చాలానే మిగిలి ఉన్నాయని మృత్యువు కూడా ఆమెను తిప్పి పంపింది.

సామాజిక ఉద్యమ కార్యక్రమాల్లోనే కాలుమోపారు

విద్యా సంస్థ నిర్వహణలో నిత్యం బెదిరింపులు ఎదురవుతున్నప్పటికీ, మొక్కవోని ధైర్యంతో ముందుకెళ్లిన ఖాజీ, సామాజిక ఉద్యమాల్లోనూ కాలుమోపారు. 1991లో కునాన్ పోష్పురాలో ఒకేసారి 36 మంది మహిళలపై సామూహిక అత్యాచారం జరిగింది. అత్యంత దారుణంగా చోటుచేసుకున్న ఈ ఘటన తర్వాత బాధితులను ఓదార్చాల్సిన వారి కుటుంబ సభ్యులు, అత్యాచారం చేసిన మృగాళ్లకు మాదిరే చిత్రహింసలకు గురి చేస్తున్నారు.

 అదే సమయంలో ఖాజీ అక్కడికి వెళ్లారు. బాధితుల దయనీయ స్థితి చూసి కంటతడిపెట్టారు. అంతటితో ఊరుకోని ఖాజీ, వారికి ఆశ్రయం కల్పించడంతో పాటు స్వయం ఉపాధి కింద 15 ఆవులను అందించి, డైరీ ఫారాన్ని ఏర్పాటు చేయించారు. 2005 నాటికి ఆ డెయిరీ ఫారం, రెట్టింపు ఆవులతో బాధిత మహిళలకు జీవితంపై పూర్తి భరోసా అందించింది. ఇలాంటి కార్యక్రమాలెన్నింటినో ఖాజీ అవలీలగా చేపట్టారు.

కాశ్మీరీ సమస్యలన్నీ తన సమస్యలే!

కాశ్మీరీ ప్రజలు ఎదుర్కొనే ప్రతి సమస్యనూ ఖాజీ తన సమస్యగానే భావించారు. ఓ సందర్భంలో కాశ్మీరీ పండిట్లు దాడులకు గురై ప్రాణాలను దక్కించుకునే క్రమంలో స్వస్థలాలను వదిలి చెల్లాచెదురయ్యారు. అనంతరం పలు సంస్థల సహకారంతో వారంతా తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరాలకు చేరారు. వారిని పరామర్శించేందుకు వెళ్లిన ఖాజీ, పండిట్ల అనారోగ్య సమస్యలపై తీవ్రంగా స్పందించారు.

బుల్లెట్లు పండిట్లను గాయపరచకున్నా, బుల్లెట్ శబ్దాలు వారి గుండెలను దుర్బలం చేశాయని చెప్పారు. నిత్యం భయాందోళనల్లో మునిగిపోయే కాశ్మీరీ పండిట్లు గుండె జబ్బుల బారిన పడ్డారని ఆమె అర్థం చేసుకున్నారు. కాశ్మీరీ పండిట్ల గుండె జబ్బులు నయమవ్వాలంటే ముందుగా తుపాకీ గుళ్ల చప్పుళ్లు నిలిచిపోవాలని అభిప్రాయపడ్డారు. అదొక్కటే కాశ్మీర్ లో శాంతి కపోతాన్ని ఎగురవేస్తుందని తేల్చారు. మరి ఆమె ఆశయం సిద్ధించాలని మనస్ఫూర్తిగా మనమూ కోరుకుందాం.


More Articles