మీ మెమరీ కార్డు ఏ క్లాస్.. దాని స్పీడెంత.. కొనేముందు ఇవి చూడండి!

మన నిత్య జీవితంలోకి స్మార్ట్ ఫోన్లు ఎంతగా దూసుకుపోయాయో.. వాటితో అవసరాలు అంతకన్నా పెరిగిపోతున్నాయి. మనం తీసుకునే ఫొటోలు, వీడియోల దగ్గరి నుంచి మనకు అవసరమైన సమాచారం, ఈ-పుస్తకాల దాకా మన జేబులోనే ఉంటున్నాయి. ఇవే కాదు డిజిటల్ కెమెరాలు, ఎంపీ3 ప్లేయర్లు, నోట్ బుక్ లు వంటివాటన్నింటికీ మెమరీకార్డులు అవసరమే. ఇక పెన్ డ్రైవ్ లు సరేసరి. మరి ఈ మెమరీ కార్డులు, పెన్ డ్రైవ్ లు ఏ రకానికి చెందినవి, వాటి వేగం ఎంత, నాణ్యమైన మెమరీకార్డును ఎలా గుర్తించాలనేది చాలా మందికి తెలియదు. ఆ వివరాలు తెలుసుకుందాం...

మెమరీ కార్డుల్లో ఎన్నో రకాలు

memory cardsమెమరీ కార్డులను సెక్యూర్ డిజిటల్ కార్డులు లేదా ఎస్ డీ (SD) కార్డులుగా పిలుస్తాం. వీటిలో వినియోగాన్ని బట్టి పలు రకాలు, పరిమాణాల్లో మెమరీ కార్డులు అందుబాటులో ఉన్నాయి. తొలి తరంలో తయారైన మెమరీ కార్డుల పరిమాణం ఎక్కువగా ఉన్నా.. ఇప్పటికీ ఆ పరిమాణాల్లోనే వినియోగిస్తున్నారు కూడా. అయితే వాటి స్టోరేజ్ సామర్థ్యం మాత్రం బాగా పెరిగింది. మొత్తంగా పరిమాణాన్ని బట్టి ప్రస్తుతం నాలుగైదు రకాల మెమరీ కార్డులు అందుబాటులో ఉన్నాయి. అవి ఎస్ డీహెచ్ సీ (SDHC) కార్డులు, ఎస్ డీఎక్స్ సీ (SDXC) కార్డులు, ఎంఎంసీ (MMC) కార్డులు, మినీ ఎస్ డీ (Mini SD) కార్డులు, మైక్రో ఎస్ డీ (Micro SD) కార్డులు. 

వీటిల్లో ఎస్ డీహెచ్ సీ, ఎస్ డీఎక్స్ సీ, మైక్రో ఎస్ డీ కార్డుల వినియోగం ఎక్కువ. ఎస్ డీహెచ్ సీ, ఎస్ డీఎక్స్ సీ కార్డులను డిజిటల్ కెమెరాలు, కామ్ కార్డర్లు, ఇతర స్టోరేజ్ అవసరమైన పరికరాల్లో వినియోగిస్తుండగా.... మైక్రో ఎస్ డీ కార్డులను ప్రధానంగా మొబైల్ ఫోన్లు, ట్యాబ్లెట్లు, ఎంపీత్రీ ప్లేయర్లు, డిజిటల్ వీడియో ప్లేయర్లు, ఈబుక్ లు వంటి వాటిల్లో వినియోగిస్తున్నారు. ఇక వేగాన్ని బట్టి కూడా స్పీడ్ క్లాస్, అల్ట్రా హైస్పీడ్ క్లాస్-1 (యూహెచ్ఎస్-1), అల్ట్రా హైస్పీడ్ క్లాస్-2 (యూహెచ్ఎస్-2) అనే రకాలుగా మెమరీ కార్డులు లభిస్తుంటాయి.

ఏ కార్డులు ఎలా ఉంటాయి..card size

  • ఎస్ డీహెచ్ సీ (SDHC), ఎస్ డీఎక్స్ సీ (SDXC) మెమరీ కార్డులు 32 మిల్లీమీటర్ల పొడవు, 24 మిల్లీ మీటర్ల వెడల్పుతో, 2.1 మిల్లీమీటర్ల మందంతో ఉంటాయి. ఇందులో ఎస్ డీహెచ్ సీ కార్డులు 512 ఎంబీ నుంచి 32 జీబీ వరకు ఉంటుండగా.. ఎస్ డీఎక్స్ సీ కార్డులు 32 జీబీ నుంచి 2 టీబీ (టెరాబైట్) వరకు ఉంటాయి. వీటిని ఎక్కువగా డిజిటల్ కెమెరాలు, కామ్ కార్డర్లు, అత్యధిక స్టోరేజ్ సామర్థ్యం అవసరమైన పరికరాల్లో వినియోగిస్తారు. ఎస్ డీహెచ్ సీ, ఎస్ డీఎక్స్ సీ కార్డులను వినియోగించుకునే కెమెరాలు వంటి పరికరాల్లో మినీ, మైక్రో ఎస్ డీ కార్డులను కూడా వినియోగించుకోవచ్చు. ఇందుకోసం ప్రత్యేకమైన స్లాట్ లు లభిస్తాయి. ఎస్ డీహెచ్ సీ కార్డు పరిమాణంలో ఉండే ఆ స్లాట్ లలో మినీ/మైక్రో ఎస్ డీ కార్డును అమర్చి వినియోగించుకోవచ్చు.
  • ఎంఎంసీ కార్డుల పొడవు 32 ఎంఎం, వెడల్పు 24 ఎంఎం ఉంటాయి. ఎస్ డీ కార్డులు వచ్చాక వీటి వినియోగం పూర్తిగా ఆగిపోయింది. వీటిలో తర్వాత వచ్చిన ఆర్ఎస్-ఎంఎంసీ కార్డుల (పొడవు 18 ఎంఎం, వెడల్పు 24 ఎంఎం)ను మాత్రం తొలి తరం స్మార్ట్ ఫోన్లలో విస్తారంగా వినియోగించారు. ఇప్పుడివి వాడుకలో లేవు.
  • మినీ ఎస్ డీ కార్డుల పరిమాణం 21.5 మిల్లీమీటర్ల పొడవు, 20 మిల్లీమీటర్ల వెడల్పు, 1.4 మిల్లీమీటర్ల మందం ఉంటాయి. తొలితరం స్మార్ట్ ఫోన్లలో వీటిని ఎక్కువగా వినియోగించారు. ప్రస్తుతం ఇవి దాదాపుగా వినియోగంలో లేవు. 
  • ప్రస్తుతం విస్తారంగా వినియోగిస్తున్నవి మైక్రో ఎస్ డీ కార్డులు. ఇవి 15 మిల్లీమీటర్ల పొడవు, 11 మిల్లీమీటర్ల వెడల్పు, ఒక మిల్లీమీటర్ మందంతో ఉంటాయి. 

ఏ కార్డు స్పీడ్ ఎంత?

మీ మెమరీ కార్డులోకి ఓ సినిమాను కాపీ చేస్తే ఎంత సేపట్లో పూర్తవుతుంది? కొన్ని కార్డుల్లో రెండు మూడు నిమిషాల్లోనే కాపీయింగ్ పూర్తయితే... మరికొన్నింటిలో దాదాపు పది పన్నెండు నిమిషాలు తీసుకుంటుంది. దీనికి కారణం వాటి స్పీడ్ క్లాస్ లో తేడాయే. పైన చెప్పుకొన్నట్లుగా స్పీడ్ క్లాస్ మూడు రకాలు. అయితే కొన్ని మెమరీ కార్డుల తయారీ కంపెనీలు తమ మెమరీ కార్డు సపోర్ట్ చేసే అన్ని రకాల స్పీడ్ క్లాస్ లనూ వాటిపై ముద్రిస్తుంటాయి.

సాధారణ స్పీడ్ క్లాస్

speed classఇందులో మెమరీకార్డుల రీడ్/రైట్ సామర్థ్యాన్ని 2, 4, 6, 10 గా సూచిస్తుంటారు. కార్డుపై పెద్ద సీ (C)కి మధ్యలో ఈ నంబర్ ను చూపుతారు. క్లాస్-2 అంటే కనీసం 2 ఎంబీపీఎస్ (మెగాబైట్స్ పర్ సెకన్-MBps) వేగంతో డాటాను రైట్ చేసుకోగలుగుతుంది. ఇలాగే క్లాస్-4 కార్డు 4 ఎంబీపీఎస్ కన్నా వేగంతో, క్లాస్-6 కార్డు 6 ఎంబీపీఎస్ కన్నా వేగంతో, క్లాస్-10 కార్డు 10 ఎంబీపీఎస్ కన్నా ఎక్కువ వేగంగా పనిచేస్తుంది. అయితే ఇది ఈ మెమరీ కార్డుల కనీస వేగం మాత్రమే. అంటే కార్డుపై పేర్కొన్నదానికన్నా వేగంగా పనిచేస్తాయన్న మాట. ఈ వేగం మంచి కంపెనీల మెమరీ కార్డుల్లో చాలా ఎక్కువగా కూడా ఉండవచ్చు. క్లాస్-10గా పేర్కొనే బ్రాండెడ్ మెమరీ కార్డు 25 - 30 ఎంబీపీఎస్ వేగంతో కూడా డాటా రీడ్/రైట్ చేయగలుగుతుంది. అటువంటి మెమరీ కార్డులపై ఆయా కంపెనీలు వాటి హైస్పీడ్ లను కూడా 25 ఎంబీపీఎస్, 30ఎంబీపీఎస్ గా ముద్రిస్తుంటాయి.

యూహెచ్ఎస్-1, యూహెచ్ఎస్-2 కార్డులు

high speed cardఅత్యంత వేగవంతమైన మెమరీ కార్డుల అవసరం పెరగడంతో అందుబాటులోకి వచ్చిన సరికొత్త టెక్నాలజీ ‘అల్ట్రా హైస్పీడ్’ కార్డులు. వీటిలో డాటాను నిక్షిప్తం చేసుకునే మెమరీ, ఇతర విభాగాలు మిగతా వాటిలాగానే ఉంటాయి. కానీ కార్డుకు, పరికరాలకు మధ్య డాటాను అత్యంత వేగంగా బదిలీ చేసే ‘బస్ (కార్డులో ఉండే మెమరీని పరికరానికి, పరికరం అందించే సమాచారాన్ని మెమరీకి పంపే కార్డులోని భాగం)’ను వినియోగిస్తారు. యూహెచ్ఎస్-2లో అదనంగా మరో ‘బస్’ను వినియోగిస్తారు. అందువల్ల డాటా మరింత వేగంగా బదిలీ అవుతుంది. ఈ మెమరీ కార్డులు కనీసం 10-30 MBps వేగంతో డాటాను రీడ్/రైట్ చేయగలవు. గరిష్టంగా యూహెచ్ఎస్-1 కార్డులు 104 ఎంబీపీఎస్ వరకు, యూహెచ్ఎస్-2 కార్డులు 312 ఎంబీపీఎస్ వరకు వేగంతో పనిచేయగలవు. ఆంగ్ల అక్షరం యూ (U) మధ్యలో 1 లేదా 3 అంకెతో వీటి సామర్థ్యాన్ని సూచిస్తారు. యూహెచ్ఎస్ తరహాను రోమన్ అంకెలు I, II లతో చూపుతారు.  

'X' రేటింగ్ ఏమిటి?

కొన్ని మెమరీ కార్డులపై 16x, 32x, 48x, 100x.. ఇలా X  రేటింగ్ ను కూడా చూపుతుంటారు. ఇది కూడా ఆయా మెమరీ కార్డులు పనిచేసే వేగాన్ని చూపుతుంది. అసలు మనం ఈ X రేటింగ్ ను సీడీలు, డీవీడీలపై చూస్తుంటాం. ఇది కూడా దాని ఆధారంగా పేర్కొనేదే. 1x వేగం అంటే 150 కేబీపీఎస్ (కిలోబైట్స్ పర్ సెకండ్). ఈ లెక్కన చూస్తే సుమారుగా 16x అంటే 2.34 MBps, 32x అంటే 4.69 MBps, 48x అంటే 7.03 MBps, 100x అంటే 14.6 MBps వేగం అన్నమాట. సాధారణంగా స్పీడ్ క్లాస్ రేటింగ్ లలో మెమరీ కార్డులు రీడ్/రైట్ చేసే కనీస వేగాన్ని చూపితే... X రేటింగ్ ప్రకారం మాత్రం అది ఆ కార్డు సపోర్ట్ చేసే గరిష్ట డేటా ట్రాన్స్ ఫర్ వేగమని గుర్తుంచుకోవాలి. 

MBps వేరు.. Mbps వేరు..

మెమరీ కార్డుగానీ, పెన్ డ్రైవ్ గానీ ఇతర మెమరీ డివైజ్ లుగానీ తీసుకునేటప్పుడు దానిపై ఉన్న రీడ్/రైట్ వేగం వివరాలను జాగ్రత్తగా పరిశీలించండి. ఎందుకంటే వేగాన్ని సూచించే మెగాబైట్స్ పర్ సెకండ్ (MBps), మెగాబిట్స్ పర్ సెకండ్ (Mbps)కు చాలా తేడా ఉంటుంది. ఒక మెగాబైట్ అంటే ఎనిమిది మెగాబిట్లతో సమానం. అంటే ఈ అక్షరాల్లో ఉండే చిన్న మార్పుతో వేగంలో ఏకంగా ఎనిమిది రెట్లు తేడా ఉంటుంది. ఉదాహరణకు 2 MBps మెమరీ కార్డును మెగాబిట్లలో లెక్కిస్తే 16 Mbps కార్డు అవుతుంది. మెమరీ కార్డును కొనుగోలు చేసే ముందు ఈ అంశాన్ని తప్పనిసరిగా గమనించండి MBpsలలో ఉన్న కార్డునే ఎంచుకోండి.

నకిలీలతో జాగ్రత్తcard types

  • మంచి కంపెనీలకు చెందిన బ్రాండెడ్ మెమరీ కార్డులు, పెన్ డ్రైవ్ లు మాత్రమే మంచి నాణ్యతతో ఉంటాయి. వాటిపై నమోదు చేసి ఉన్న మేరకు రీడ్/రైట్ వేగాన్ని అందిస్తాయి. వాటిపై పేర్కొన్న మేరకు మెమరీని కూడా కలిగి ఉంటాయి.
  • ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న చాలా మెమరీ కార్డులు ప్రముఖ కంపెనీల లేబుల్ తో వస్తున్న నకిలీ ఉత్పత్తులే. అచ్చు ఒరిజినల్ ఉత్పత్తుల తరహాలనే ప్యాకింగ్ కూడా చేసి వస్తున్నాయి. అందువల్ల కొనేటప్పుడు జాగ్రత్త.
  • పెద్ద, నమ్మకమైన షోరూంలు లేదా కంపెనీల షోరూంలు, డీలర్ల వద్ద కొనుగోలు చేయడం మేలు. ఇలా చేస్తే మెమరీ కార్డులకు ఉండే వారెంటీ కూడా వర్తిస్తుంది.

ధరల్లో తేడా కొంచమే

మెమరీ కార్డుల సామర్థ్యంలో తేడా భారీగా ఉన్నా... వాటి ధరల్లో తేడా చాలా తక్కువగా ఉంటుందని గుర్తుంచుకోండి. ఉదాహరణకు 2 జీబీ మైక్రో ఎస్ డీ కార్డు ధర సుమారు రూ.180 నుంచి రూ.220 వరకు ఉంటుండగా.. 4 జీబీ కార్డు రూ.260 వరకు, 8 జీబీ కార్డు రూ.320 వరకు, 16 జీబీ మెమరీ కార్డు రూ.380 వరకు, 32 జీబీ మెమరీ కార్డు రూ.500 వరకు లభిస్తాయి. అంటే 2 జీబీ కార్డుకు పెట్టే ధరకు రెండు మూడింతలు ఖర్చుపెడితే.. ఏకంగా 16 జీబీ లేదా 32 జీబీ మెమరీ కార్డు వస్తుంది. అందువల్ల కొంచెం ఎక్కువ ఖర్చు పెడితే... అత్యధిక కెపాసిటీ ఉన్న మెమరీ కార్డు కొనుగోలు చేయవచ్చు. కానీ అంత కెపాసిటీని మీ ఫోన్ లేదా ఇతర పరికరం సపోర్ట్ చేస్తుందో లేదో చెక్ చేశాకే కొనుగోలు చేయండి.

మెమరీ కార్డు మొత్తం సామర్థ్యం చూపించడం లేదా?sd card reader

సాధారణంగా మెమరీ కార్డులు 2 జీబీ, 4 జీబీ, 8 జీబీ, 16 జీబీ.. ఇలాంటి స్పెసిఫికేషన్లతో ఉంటాయి. కానీ ఆ మెమరీ కార్డులను కార్డ్ రీడర్ ద్వారా కంప్యూటర్ కు అనుసంధానించినప్పుడుగానీ, సెల్ ఫోన్ లో వేసినప్పుడుగానీ పూర్తి సామర్థ్యాన్ని చూపించవు. ఉదాహరణకు 8 జీబీ మెమరీ కార్డు 7.81 జీబీ ఖాళీగా ఉన్నట్లు చూపిస్తుంది. కొన్ని నాసిరకం మెమరీ కార్డులు కొనుగోలు చేసిన కొద్ది కాలానికే దాని కెపాసిటీలో చాలా వరకు తక్కువగా చూపుతుంటాయి. దీనికి రెండు కారణాలున్నాయి. ఒకటి మెమరీ కార్డును నాసిరకంగా తయారు చేయడం, కార్డులోని అంతర్గత భాగాలు దెబ్బతినడంకాగా.. మెమరీ కార్డులో కొంత భాగం బఫర్ జోన్ గా రిజర్వు అయి ఉండడం మరో కారణం. ఇలా రిజర్వు చేసిన ప్రాంతాన్ని మెమరీ కార్డులోని ప్రాసెసర్ డాటాను ప్రాసెస్ చేయడానికి, రీడ్/రైట్ కమాండ్లను అమలు చేయడానికి వినియోగించుకుంటుంది. ఆయా మెమరీ కార్డులను మంచి ఫార్మాటింగ్ సాఫ్ట్ వేర్లతో ఫార్మాట్ చేయడం ద్వారా, రికవరీ సాఫ్ట్ వేర్ల ద్వారా వాటిలో కోల్పోయిన సామర్థ్యాన్ని తిరిగి పొందవచ్చు.

కొత్త కొత్త టెక్నాలజీలో అద్భుతమైన మెమరీ కార్డులు..new technology card

  • పలు మెమరీ కార్డుల తయారీ సంస్థలు అత్యంత అధునాతన టెక్నాలజీని మెమరీ కార్డుల్లో చొప్పిస్తూ వాటిని మరింత బహుళ ప్రయోజనకరంగా మార్చుతున్నాయి.
  • ఎస్ డీ కార్డుల్లోనే ‘వైఫై ట్రాన్సీవర్స్’ను కొన్ని కంపెనీలు ఏర్పాటు చేస్తున్నాయి. వాటిని వినియోగించుకునే పరికరాల్లో ‘వైఫై’ సౌలభ్యం లేకున్నా.. ఈ కార్డులే వాటిల్లోని వైఫై ద్వారా డాటాను ఇతర వైఫై ఆధారిత పరికరాలకు పంపించేస్తాయి. ఉదాహరణకు ఒక డిజిటల్ కెమెరాలో ఈ కార్డును వినియోగిస్తే.. ఆ కెమెరాతో తీసిన ఫొటోలు ఎప్పటికప్పుడు వైఫై ద్వారా ఎంపిక చేసిన పరికరాలకు చేరిపోతాయి. వైఫై పరికరాలు లేకపోతే కార్డులోనే ఫొటోలు నిక్షిప్తమై.. వైఫై అందుబాటులోకి వచ్చాక పంపుతాయి. సాన్ డిస్క్ సంస్థకు చెందిన ‘ఐ-ఫై’, ట్రాన్సెండ్ వైఫై, తొషిబా ఫ్లాష్ ఎయిర్ వంటివి ఈ మెమరీ కార్డులే.
  • కొన్ని కంపెనీలు మెమరీ కార్డులకే నేరుగా యూఎస్ బీ కనెక్టర్ లను అమర్చుతున్నాయి. ఈ మెమరీ కార్డులను అటు డిజిటల్ కెమెరాల వంటి పరికరాల్లో ఉపయోగించుకోవడంతోపాటు ఎలాంటి కార్డ్ రీడర్ అవసరం లేకుండా నేరుగా కంప్యూటర్ లేదా ఇతర పరికరాల యూఎస్ బీ పోర్టులకు అనుసంధానం చేసుకోవచ్చు. సాన్ డిస్క్ సంస్థ ప్రవేశపెట్టిన ఎస్ డీ ప్లస్ కార్డు దీనికి ఉదాహరణ
  • ఇక మెమరీ కార్డులో ఎంత ఖాళీగా ఉన్నదనే విషయాన్ని చూపేలా డిజిటల్ డిస్ప్లేతో కూడిన కార్డులనూ కొన్ని కంపెనీలు మార్కెట్లోకి తెచ్చాయి. అడాటా సంస్థకు చెందిన ‘సూపర్ ఇన్ఫో ఎస్ డీ’ అలాంటిదే.

కొనే ముందు ఇవి గుర్తుంచుకోండిmemory devices

  • మెమరీ కార్డు కొనేటప్పుడు మీ ఫోన్ లేదా ఇతర పరికరం సామర్థ్యానికి అనుగుణంగా ఉండేలా చూసుకోవాలి. 16 జీబీని సపోర్ట్ చేసే ఫోన్ కోసం 32 జీబీ మెమరీ కార్డును కొనుగోలు చేస్తే నష్టమే.
  • అత్యంత వేగవంతంగా డాటా ట్రాన్స్ ఫర్ చేయగలిగే ఫోన్లు, అల్ట్రా హైస్పీడ్ (యూహెచ్ఎస్)ను సపోర్ట్ చేసే ఫోన్లు అయితేనే ఎక్కువ క్లాస్ ఉన్న మెమరీకార్డులు కొనుగోలు చేయాలి. లేకుంటే అనవసరపు ఖర్చుతోపాటు ఒక్కోసారి ఆ మెమరీ కార్డులు పనిచేయకపోవచ్చు.
  • ఎక్కువ మెమరీ ఉన్న మెమరీ కార్డును వినియోగించడం, దాని నిండా డాటాను కుక్కేయడం మంచిదికాదు. దానివల్ల ఫోన్ పనిచేసే వేగం తగ్గిపోతుంది.
  • మీ అవసరానికి తగిన క్లాస్ మెమరీకార్డునే కొనుగోలు చేయడం ఉత్తమం. సాధారణ స్మార్ట్ ఫోన్లకు క్లాస్ 4 లేదా క్లాస్ 6 మెమరీ కార్డు సరిపోతుంది. హైఎండ్ స్మార్ట్ ఫోన్లు, ఎక్కువ కెమెరా సామర్థ్యమున్న ఫోన్లు, హైక్వాలిటీతో వీడియో చిత్రీకరించాలనుకుంటే క్లాస్ 10, అల్ట్రా హైస్పీడ్ (యూహెచ్ఎస్) మెమరీ కార్డులు కొనుగోలు చేయాలి.
  • సాధారణ డిజిటల్ కెమెరాలు, కామ్ కార్డర్ల వంటి వాటికి క్లాస్ 4, క్లాస్ 6 మెమరీ కార్డులు సరిపోతాయి. ఫుల్ హెచ్ డీ వీడియో రికార్డు చేసే కెమెరాలు, కామ్ కార్డర్లకు యూహెచ్ఎస్ మెమరీ కార్డులు తప్పనిసరి.
  • కంప్యూటర్లకు డాటా బదిలీ చేయడం, కంప్యూటర్ నుంచి మెమరీ కార్డులోకి డాటాను నింపడం కోసం వాడినప్పుడు కేవలం మెమరీ కార్డు హైస్పీడ్ అయినంత మాత్రాన డాటా వేగంగా ట్రాన్స్ ఫర్ కాదు. కంప్యూటర్ లో యూఎస్ బీ పోర్టు వేగవంతమైన 2.0 లేదా 3.0 టెక్నాలజీకి చెందినదై ఉండాలి. అదే సమయంలో కార్డును కంప్యూటర్ కు అనుసంధానించే కార్డ్ రీడర్ కూడా ఆ టెక్నాలజీని సపోర్ట్ చేసేదై ఉండాలి.
  • ఎస్ డీ కార్డులు రైట్ ప్రొటెక్టెడ్ (అందులోని డాటాను కేవలం చూడగలడమే తప్ప ఎలాంటి మార్పులు చేయలేకుండా, డిలీట్ చేయలేకుండా) లాక్ తో లభిస్తుంటాయి. మీ అవసరాన్ని బట్టి అలాంటివి ఎంచుకోవచ్చు.


More Articles