'బాయ్స్ హాస్టల్' (ఆహా) మూవీ రివ్యూ

  • కన్నడలో సక్సెస్ ను సాధించిన సినిమా ఇది 
  • తెలుగులో 'బాయ్స్ హాస్టల్' గా అనువాదం 
  • ఈ నెల 5వ తేదీ నుంచి మొదలైన స్ట్రీమింగ్
  • సహజత్వానికి దగ్గరగా అనిపించే చిత్రీకరణ

కన్నడలో 'హాస్టల్ హుడుగారు బేకగిద్దరే' అనే సినిమా రూపొందింది. 2023 జులై 21వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, అక్కడి యూత్ కి బాగా కనెక్ట్ అయింది. రచయితగా - దర్శకుడిగా నితిన్ కృష్ణమూర్తి వ్యవహరించిన ఈ సినిమా, తెలుగులో ఆగస్టు 26వ తేదీన విడుదలైంది. పెద్దగా పబ్లిసిటీ లేకపోవడం వలన, ఈ సినిమా ఎప్పుడు థియేటర్స్ కి వచ్చి వెళ్లిందనేది చాలామందికి తెలియదు. ఈ నెల 5వ తేదీ నుంచి ఈ సినిమా  'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతోంది.

అది ఓ యూనివర్సిటీ క్యాంపస్ కి ఆనుకుని ఉన్న బాయ్స్ హాస్టల్. వందలమంది స్టూడెంట్స్ అందులో ఉండి చదువుకుంటూ ఉంటారు. ఆ హాస్టల్ కి వార్డెన్ గా రమేశ్ కుమార్ వ్యవహరిస్తూ ఉంటాడు. అతను చాలా స్ట్రిక్ట్ .. అతనంటే స్టూడెంట్స్ అందరికీ భయమే. అందువలన అందరూ కూడా మనసులో అతణ్ణి తిట్టుకుంటూ ఉంటారు. అయినా అతను తన పని తాను చేసుకుంటూ వెళుతుంటాడు. ఆ హాస్టల్లో అజిత్ ... అభి .. రాజా .. మచ్చా .. కాశీ .. రాణా ఫ్రెండ్స్ బ్యాచ్ గా ఉంటారు. 

అజిత్ కి ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలనే కోరిక ఉంటుంది. అందుకు అవసరమైన కథను అతనే తయారు చేసుకుంటూ ఉంటాడు. తాను షార్ట్ ఫిల్మ్ చేయడానికి సహకరించమని అతను మిగతా ఫ్రెండ్స్ ను కోరతాడు. ఆ కథలో ..  కొంతమంది స్టూడెంట్స్ సరదాగా చేసిన పనికి హాస్టల్ వార్డెన్ చనిపోతాడు. స్టూడెంట్స్ అంతా కూడా అతని డెడ్ బాడీని ఏం చేయాలా అనే ఆలోచనలో పడతారు. వార్డెన్ ను అతని కారులోనే డ్రైవింగ్ సీట్లో కూర్చోబెట్టి, యాక్సిడెంట్ సీన్ ను క్రియేట్ చేసి, ఆ కేసు నుంచి బయటపడాలని ప్లాన్ చేస్తారు.  

ఈ కథ విన్న మిగతా స్టూడెంట్స్ అజిత్ ను ఆటపట్టిస్తారు. ఎగ్జామ్స్ తరువాత ఇలాంటి కథలను గురించి ఆలోచిద్దామని అంటారు. అంతలో ఓ స్టూడెంట్ పరిగెత్తుకు వచ్చి, వార్డెన్ తన రూమ్ లో సూసైడ్ చేసుకున్నాడని చెబుతాడు. దాంతో అజిత్ మిత్ర బృందం అంతా షాక్ అవుతారు. వార్డెన్ రూమ్ కి వెళ్లి చూస్తే .. నిజంగానే అతను చనిపోయి ఉంటాడు. అజిత్ తన కథలో చెప్పినట్టుగానే వార్డెన్ చనిపోవడం అతని స్నేహితులకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.

వార్డెన్ ఒక సూసైడ్ నోట్ రాసిపెడతాడు. అందులో తన మరణానికి కారణమంటూ అజిత్ మిత్రబృందంలోని వాళ్లందరి పేర్లు రాసిపెడతాడు. దాంతో అందరూ కూడా భయపడిపోతారు. తాము జైలుపాలు కావడం ఖాయమని అనుకుంటారు. వాచ్ మెన్ కి తెలియకుండా వార్డెన్ డెడ్ బాడీని బయటికి తీసుకుని వెళ్లడం అసాధ్యం. అందువలన సీనియర్స్ సహాయం తీసుకోవడం మంచిదని రాజా సలహా ఇస్తాడు. పై ఫ్లోర్ లో ఉన్న సీనియర్ స్టూడెంట్స్  గురూజీ .. ఎకో .. నాగ దగ్గరికి వెళ్లి విషయం చెబుతారు.

సీనియర్ స్టూడెంట్స్ ముగ్గురు వార్డెన్ రూమ్ కి వెళ్లి చూస్తారు. అతను రాసిన సూసైడ్ లెటర్ లో తమ పేర్లు కూడా ఉండటం చూసి షాక్ అవుతారు. వాళ్లంతా కలిసి ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా, వార్డెన్ శవాన్ని బయటకి తీసుకుని వెళ్లడానికి ఒక ప్లాన్ చేస్తారు. ఆ ప్రయత్నంలో వాళ్లకి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? అప్పుడు వాళ్లు ఏం చేస్తారు? అనేవి ఆసక్తిని రేకెత్తించే అంశాలు.

ఈ సినిమాకి కథ .. స్క్రీన్ ప్లే .. సంభాషణలను నితిన్ కృష్ణమూర్తి అందించాడు. ఆయనే ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించాడు. ఈ కథ అంతా కూడా బాయ్స్ హాస్టల్ పరిధిలోనే జరుగుతుంది. తెలుగువారి వైపు నుంచి చూసుకుంటే, దాదాపుగా కొత్త ముఖాలే కనిపిస్తాయి. స్టూడెంట్స్ అంతా కూడా చాలా సహజంగా చేశారు. వాళ్లను కెమెరా ఫాలో అవుతూ ఉంటుంది అంతే .. వాళ్లు మాత్రం కెమెరాను పట్టించుకోకుండా చేశారు. 

సాధారణంగా యూనివర్సిటీకి సంబంధించిన హాస్టల్ లో ఉండే స్టూడెంట్స్ లో ఒక్కొక్కరికీ ఒక్కో బలహీనత ఉంటుంది. మందు .. సిగరెట్టు .. డ్రగ్స్ .. ఇలా. ఏ ఎగ్జామ్ ఏరోజో తెలియని వాళ్లు కొంతమంది అయితే .. అసలు పుస్తకమే వదిలిపెట్టని వాళ్లు మరికొంతమంది. ప్రతి విషయాన్ని పెద్దది చేస్తూ గొడవపడేవారు .. లవ్ లోపడి నానా ఇబ్బందులను ఫేస్ చేసేవారు మరికొంతమంది.  ఇలా రకరకాల స్వభావాలు కలిగిన వాళ్లందరి దగ్గరి నుంచి, సహజంగా అనిపించే అవుట్ పుట్ ను రాబట్టడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. 

సాధారణంగా బాయ్స్ హాస్టల్స్ ఎలా ఉంటాయో .. బాయ్స్ రూమ్స్ ఎలా ఉంటాయో .. వాళ్ల పద్ధతి ఎలా ఉంటుందో  .. దర్శకుడు అలాగే చూపించాడు. ఎవరి ముఖానికి మేకప్ కనిపించదు .. ఎవరికీ కూడా కావాలని చెప్పేసి జోడీని సెట్ చేయడం జరగలేదు. కామెడీ .. సస్పెన్స్ కలిసి నడిచే తీరు, ఈ జనరేషన్ కి నచ్చుతుంది. డెడ్ బాడీని తీసుకెళ్లడాన్ని ఎవరైతే చూస్తారో .. వాళ్ల పేర్లను సూసైడ్ లెటర్ లో చేర్చడం ఫన్నీగా అనిపిస్తుంది. 'ఫోన్ పోయింది కాబట్టి EMI కట్టవలసిన పనిలేదు' ... 'పోలీసులు ఆడిటింగ్ చేస్తే మనం దొరికిపోవడం ఖాయం' వంటి డైలాగ్స్ సింపుల్ గా అనిపిస్తూనే .. హాయిగా నవ్విస్తాయి.

 రిషబ్ శెట్టి .. తరుణ్ భాస్కర్ .. ప్రత్యేకమైన పాత్రలలో కనిపిస్తారు. మరీ రష్మీ అయితే పోస్టర్స్ వైపు నుంచి ఉపయోగించుకోవడానికి మాత్రమే ఆమెను చూపించారనిపిస్తుంది. ఈ సినిమాలో బలమైన సన్నివేశాలు .. బరువైన సన్నివేశాలేం కనిపించవు. అలాగే అనూహ్యమైన మలుపులు కూడా ఏమీ ఉండవు. ఈ జనరేషన్ కుర్రాళ్లు .. వాళ్ల హాస్టల్ డేస్ కి సంబంధించిన లైఫ్ స్టైల్ ఎలా ఉందనేది చూపించడం పైనే దర్శకుడు దృష్టి పెట్టాడు. అజనీశ్ లోక్ నాథ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. అరవింద్ కశ్యప్ ఫొటోగ్రఫీ .. సురేశ్ ఎడిటింగ్ ఫరవాలేదు.

సాధారణంగా ఎక్కడైనా హాస్టల్లో ఉండే కుర్రాళ్లకు .. వార్డెన్ కి మధ్య, అక్కడి సమస్యలను బట్టి వార్ నడుస్తూనే ఉంటుంది. వార్డెన్ పై తమ కోపం తీర్చుకోవడానికి స్టూడెంట్స్ ఆకతాయి పనులు చేస్తూనే ఉంటారు. అలాంటి వాళ్లను వార్డెన్స్ మరింత టార్గెట్ చేస్తుంటారు. అలాంటి నేపథ్యంలో అల్లుకున్న ఈ కథ సహజత్వానికి చాలా దగ్గరగా అనిపిస్తుంది. యూత్ కి ఇలాంటివి అనుభవంలోకి వచ్చే విషయాలే గనుక, వాళ్లకు కనెక్ట్ అవుతుంది.

Movie Details

Movie Name: Boys Hostel

Release Date:

Cast: Prajwal, Manjunath, Rakesh Rajkumar,Srivatsa Shyam, Tejas Jayanna,

Director: Nithin Krishnamurthy

Producer: Varun Gowda

Music: Ajaneesh Loknath

Banner: Paramvah Studios

Boys Hostel Rating: 2.75 out of 5

Trailer

More Movie Reviews