మలయాళం మేకర్స్ థ్రిల్లర్ జోనర్ కి సంబంధించిన కథలను గొప్పగా తెరకెక్కించడంలో సిద్ధహస్తులు. ఇక అడవి నేపథ్యంలో కథలను ఆసక్తికరంగా ఆవిష్కరించడంలో వాళ్లు మరింత ముందుంటారు. ఇదే విషయాన్ని మరోసారి నిరూపించిన సినిమానే 'ఎకో'. జయరామ్ - విపిన్ అగ్నిహోత్రి నిర్మించిన ఈ సినిమాకి, దింజిత్ అయ్యతన్ దర్శకత్వం వహించాడు. మిస్టరీ థ్రిల్లర్ జోనర్లో రూపొందిన ఈ సినిమా కథేమిటనేది ఇప్పుడు చూద్దాం.
కథ: అది దట్టమైన అడవీ ప్రాంతం. కేరళ .. తమిళనాడు .. కర్ణాటక ప్రాంతాలను కలిపే ఆ ఫారెస్టు ఏరియాను తాకుతూ, కురియాచన్ (సౌరభ్ సచ్ దేవ్)కి 150 ఎకరాల ఎస్టేట్ ఉంటుంది. కురియాచన్ ప్రకృతి ప్రేమికుడు. అందువలన అతను ఆ ఎస్టేట్ ను ప్రాణంగా చూసుకుంటూ ఉంటాడు. మలేసియాలో కొంతకాలం పాటు పనిచేసిన ఆయనకి, అక్కడ ఒక బ్రీడ్ కి చెందిన కుక్కల పనితీరును గమనిస్తాడు. అక్కడి కుక్కలను తన ఎస్టేట్ లో పెంచుతూ ఉంటాడు.
కురియాచన్ ఇచ్చిన శిక్షణ కారణంగా, అతను వెంట లేకుండా ఆ ఎస్టేట్ లోకి ఎవరూ అడుగుపెట్టలేరు. అలాంటి కురియాచన్ కనిపించకుండా పోయి కొన్నేళ్లు అవుతుంది. అందుకు కారణం ఒక క్రిమినల్ కేసు అని చెప్పుకుంటూ ఉంటారు. తన భర్త కోసం ఎదురుచూస్తూ కురియాచన్ భార్య 'మిలాతియా' (బియానా మోమిన్) ఎస్టేట్ లోని ఒక కొండపై నివసిస్తూ ఉంటుంది. మిలాతియా బాగోగులు చూసుకోవడానికి ఆమె పిల్లలు 'పీయూస్'( సందీప్ ప్రదీప్) ను నియమిస్తారు.
కురియాచన్ గురించి తెలుసుకోవడం కోసం అతని స్నేహితుడైన 'మోహన్ పోతన్' (వినీత్) ఆ ఫారెస్ట్ కి వస్తాడు. అయితే ఊహించని విధంగా అతను హత్యకి గురవుతాడు. ఆ తరువాత 'నేవీ'కి చెందిన ఒక ఆఫీసర్ (నరేన్) కూడా కురియాచన్ గురించి ఆరా తీయడానికి వస్తాడు. అతనికి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి? కురియాచన్ ఏమయ్యాడు? అతని కోసం ఎవరెవరు ఎందుకు గాలిస్తున్నారు? పీయూస్ నేపథ్యం ఏమిటి? అనేది మిగతా కథ.
విశ్లేషణ: అడవి అనేది చూడటానికి అందంగానే కనిపిస్తుంది. అక్కడ చిక్కుబడినప్పుడే అసలు స్వరూపం అర్థమవుతుంది. అలాంటి దట్టమైన అడవి నేపథ్యంలో తయారు చేసుకున్న కథ ఇది. కురియాచన్ పాత్ర చాలా సేపటి వరకూ తెరపైకి రాదు. ఆయన కోసం గాలించేవారి చుట్టూ ఈ కథ తిరుగుతూ ఉంటుంది. ఆయన ఎవరు? ఏమయ్యాడు? అనే కుతూహలం ఆడియన్స్ ను కూర్చోబెట్టేస్తుంది.
సాధారణంగా అడవి అనగానే పులులు .. సింహాలు గట్రా మృగాలను చూపిస్తూ ఉంటారు. కానీ ఈ కథలో మలేసియా కుక్కలు గుంపులుగా వస్తాయి. మలేసియా కుక్కలకు సంబంధించిన నేపథ్యం చుట్టూ రాసుకున్న కథ కూడా కనెక్ట్ అవుతుంది. కురియాచన్ .. కుక్కలపెంపకం పట్ల అతనికి గల ఆసక్తిని లైట్ గా దర్శకుడు పరిచయం చేసినప్పుడు, ప్రేక్షకుడు కూడా ఆ విషయాన్ని లైట్ తీసుకుంటాడు. ఆ తరువాత కథలో కుక్కల వైపు నుంచి పెరుగుతున్న ప్రాధాన్యత ప్రేక్షకులను టెన్షన్ పెడుతుంది కూడా.
అసలు కురియాచన్ ఎవరు? అతనికి మిలాతియాతో ఎలా పరిచయం ఏర్పడింది? మలేసియా కుక్కలకు ఈ ఎస్టేట్ కి ఉన్న సంబంధం ఏమిటి? కురియాచన్ భార్య బాగోగులు చూసుకోవడానికి చేరిన పీయూస్ ఉద్దేశం ఏమిటి? అసలు ఆ అడవిలో ఏం జరుగుతోంది? అనే కోణాలలో ఈ కథను నడిపించిన విధానం ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది.
పనితీరు: అడవి నేపథ్యంలో రూపొందిన సినిమాలు గతంలో చాలానే వచ్చాయి. అయితే ఆ సినిమాలకు మించిన కథాకథనాలు మనకి ఈ సినిమాలో ఏమీ కనిపించవు. కాకపోతే ట్రీట్మెంట్ కొత్తగా అనిపిస్తుంది. మలేసియా నేపథ్యం .. అక్కడికి చెందిన బ్రీడ్ కుక్కలు ఈ కథకు కాస్త విలక్షణాన్ని తీసుకొస్తాయి.
సాధారణంగా ఏ సినిమా విషయంలోనైనా కథాకథనాలకు సంగీతం .. ఫొటోగ్రఫీ మరింత బలాన్ని చేకూర్చుతూ ఉంటాయి. అయితే ఈ సినిమాలో మిగతా అంశాలను లొకేషన్స్ డామినేట్ చేస్తాయి. కథాకథనాలు కాస్త నిదానంగా నడుస్తున్నప్పటికీ, లోకేషన్స్ చూస్తూ ప్రేక్షకులు మిగతా విషయాలను మరిచిపోతారు. అయితే ఫారెస్టు నేపథ్యంలోని కుక్కల సన్నివేశాల సమయంలో మాత్రం, గతంలో టీవీలో ధారావాహికగా వచ్చిన 'రహస్యం' గుర్తుకు వస్తుంది.
నటీనటులంతా చాలా బాగా చేశారు. బాహుల్ రమేశ్ కెమెరా పనితనం బాగుంది. అందమైన లొకేషన్స్ ను ఆవిష్కరించిన తీరు గొప్పగా అనిపిస్తుంది. ఆ లొకేషన్ కి ఒకసారి వెళ్లి రావాలని ప్రేక్షకులు అనుకునేలా ఆవిష్కరించారు. ముజీబ్ మజీద్ నేపథ్య సంగీతం కూడా కథకి అవసరమైన బలాన్ని అందించింది. సూరజ్ ఎడిటింగ్ కూడా బాగుంది.
ముగింపు: కథగా చూసుకుంటే సాధారణమైనదే. అక్కడక్కడా మరింత నిదానంగా నడిచినదే. అయితే అడవి .. కొండ .. ఆ కొండను అనుకుని ఉన్న విలేజ్ .. అక్కడి జీవన విధానం .. రహస్యాలను ఛేదించడానికి కొంతమంది చేసే ప్రయత్నం ఈ కథకు మరింత ఉత్కంఠను జోడించాయని చెప్పచ్చు. ఒక్క మాటలో చెప్పాలంటే తక్కువ బడ్జెట్ లో .. తక్కువ పాత్రలతో చేసిన ప్రయోగం ఇది. అందమైన చిత్రాలతో కూడిన కథల పుస్తకాన్ని చదువుతూ ఉంటే ఎలా ఉంటుందో, ఈ సినిమా చూస్తుంటే అలా ఉంటుంది.
'ఎకో' ( నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!
Eko Review
- మలయాళంలో రూపొందిన 'ఎకో'
- అడవి నేపథ్యంలో సాగే కథ
- తక్కువ బడ్జెట్ లో చేసిన ప్రయోగం
- హైలైట్ గా నిలిచే లొకేషన్స్
- ఆకట్టుకునే క్లైమాక్స్
Movie Details
Movie Name: Eko
Release Date: 2025-12-31
Cast: Sandeep Pradeep,Biana Momin,Narain ,Saurabh Sachdeva,Vineeth,Ashokan
Director: Dinjith Ayyathan
Music: Mujeeb Majeed
Banner: Aaradyaa Studio
Review By: Peddinti
Trailer