శివకార్తికేయన్ కథానాయకుడిగా రూపొందిన తమిళ సినిమానే 'అయలాన్'. రవికుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కథానాయికగా రకుల్ ప్రీత్ అలరించింది. ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా 2024లో జనవరి 12వ తేదీన థియేటర్లకు వచ్చింది. తెలుగు వెర్షన్ మాత్రం, కొన్ని కారణాల వలన రిలీజ్ కాలేదు. అలాంటి ఈ సినిమా ఈ నెల 7వ తేదీ నుంచి 'ఆహా'లో అందుబాటులోకి వచ్చింది. 

కథ: హీరో (శివ కార్తికేయన్) 'అరకు'లో రైతు. తల్లితో కలిసి అతను తన జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. ఈ నేల .. ఈ ప్రకృతి అంటే అంతానికి ఎంతో ఇష్టం. అలాగే జీవరాశిని కాపాడుకోవలసిన బాధ్యత కూడా తమపై ఉందని అతను భావిస్తూ ఉంటాడు. పంట నష్టం రావడంతో, పని వెతుక్కుంటూ హైదరాబాద్ వచ్చేస్తాడు. అక్కడే అతనికి టైసన్ (యోగిబాబు) బ్యాచ్ తారసపడుతుంది. వాళ్ల షెల్టర్ తీసుకున్న హీరో, వాళ్లకి సాయంగా ఉండిపోతాడు. ఆ సమయంలోనే అతనికి తార (రకుల్) పరిచయమవుతుంది.

గతంలో ఒక గ్రహశకలం 'సైబీరియా' ప్రాంతంలో పడుతుంది. ఆ శకాలానికి 'స్పార్క్' అని ఆర్యన్ (శరద్ కేల్కర్) నామకరణం చేస్తాడు. నేలలో చాలా లోతున ఉండే 'నోవా' గ్యాస్ ను వెలికి తీయడానికి ' స్పార్క్'ను ఉపయోగించాలని నిర్ణయించుకుంటాడు. అందుకోసం దక్షిణాఫ్రికాలో అతను చేసిన ప్రయోగం ఫలితంగా చాలామంది చనిపోతారు. దాంతో అతను ఈ సారి తన ప్రయోగాన్ని హైదరాబాద్ లో చేయడానికి సిద్ధమవుతూ ఉంటాడు. అతని ఆదేశాలను పాటిస్తూ టీమ్ ముందుకు వెళుతూ ఉంటుంది. 

ఈ నేపథ్యంలోనే అంకితరిక్షం నుంచి గ్రహాంతరవాసి ఈ భూమిపైకి వస్తాడు. ఆర్యన్ స్థావరంలోకి ప్రవేశించి అక్కడ గందరగోళం సృష్టిస్తాడు. ఆర్యన్ ల్యాబ్ లో ఉన్న 'స్పార్క్'ను చేజిక్కుంచుకుని అక్కడి నుంచి బయటపడతాడు. ఆ తరువాత అనుకోకుండా అతను హీరోకి తారసపడతాడు. ఏలియన్ వచ్చాడనీ .. స్పార్క్ కాజేశాడని ఆర్యన్ కి తెలుస్తుంది. అప్పుడు అతను ఏం చేస్తాడు? ఎవరి కారణంగా ఎవరు ప్రమాదంలో పడతారు? అనేది కథ. 

విశ్లేషణ: భూగర్భంలో ఉన్న 'నోవా' గ్యాస్ ను పైకి తీసుకురావాలనే ఆలోచన .. అందుకోసం గ్రహశకలాన్ని ఉపయోగించాలానే ప్రయత్నం .. అదే జరిగితే భూమికి నష్టం జరుగుతుందని భావించిన ఏలియన్, కాపాడటం కోసం తన లోకం నుంచి రావడం .. ఇక్కడ ఏలియన్ కి ఎదురయ్యే పరిణామాల చుట్టూ దర్శకుడు ఈ కథను అల్లుకున్నాడు. హీరోకి .. విలన్ కి మధ్యలో ఉండే ఏలియన్ చుట్టూనే ఈ కథ నడుస్తుంది.

ఒక వైపున హీరో మంచితనం వైపు నుంచి .. ఒక వైపున విలన్ స్వార్థం వైపు నుంచి .. మరొక వైపు నుంచి మంచి మనుషులకు సాయం చేయాలనే ఏలియన్ వైపు నుంచి ఈ కథ నడుస్తుంది. అయితే విలన్ ట్రాక్ మాత్రమే కాస్త కరెక్టుగా కుదిరిందేమో అనిపిస్తుంది. హీరో - హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్, హీరో - అతని ఫెండ్స్ మధ్య కామెడీ ట్రాక్ .. హీరోకి, ఏలియన్ కి సంబంధించిన కాంబినేషన్ సీన్స్ అంత ఎఫెక్టివ్ గా అనిపించవు. 

హీరో .. విలన్ .. ఏలియన్ .. ఈ ముగ్గురి మధ్యనే దాగుడుమూతలు నడుస్తూ ఉంటాయి. అయితే ఏ క్షణంలో ఏం జరుగుతుందో .. ఎవరు ఎలాంటి ఆపదలో పడతారో అనే ఒక కుతూహలం ప్రేక్షకులకు ఉండదు. తెరపై ఏదో హడావిడి నడుస్తుందిగా .. నడవనీ అన్నట్టుగా ఉంటుంది. ఆ వైపు నుంచి కూడా లోపాలను భర్తీ చేసుకుంటూ వచ్చి ఉంటే ఈ కథ మరింతగా అలరించేదేమో అనిపిస్తుంది.              
      
పనితీరు: ఈ సినిమా కోసం అనుకున్న లైన్ బాగుంది. ప్రధానమైన పాత్రలను డిజైన్ చేసుకున్న తీరు కూడా బాగుంది. అయితే సరైన సన్నివేశాలను డిజైన్ చేసుకోవడమే ఆశించిన స్థాయిలో జరగలేదనిపిస్తుంది. ఈ కారణంగానే యాక్షన్ .. ఎమోషన్ .. కామెడీ కనెక్ట్ కాలేదని చెప్పచ్చు. నీరవ్ షా ఫొటోగ్రఫీ .. ఏఆర్ రెహ్మాన్ సంగీతం .. రూబెన్ ఎడిటింగ్ ఫరవాలేదనిపిస్తాయి. 
ప్రధానమైన పాత్రలను పోషించిన ఆర్టిస్టులంతా తమ పాత్రలకు న్యాయం చేశారు. 

ముగింపు: ఏలియన్ తో కలిసి హీరో చేసే హంగామాగా మాత్రమే ఈ సినిమా కనిపిస్తుంది. ఆ దారిలో వెళ్లాలనుకున్నప్పుడు కామెడీ సీన్స్ కాస్త బలంగా రాసుకోవలసింది. కామెడీ వర్కౌట్ కాకపోగా లవ్ .. యాక్షన్ .. ఎమోషన్స్ కూడా కనెక్ట్ కాలేదు. వినోదం పరంగా పిల్లలను అలరిస్తుందని మాత్రం చెప్పచ్చు.