ఈటీవీ విన్ లో కొంతకాలం క్రితం 'కానిస్టేబుల్ కనకం' సిరీస్ స్ట్రీమింగ్ అయింది. వర్ష బొల్లమ్మ ప్రధానమైన పాత్రను పోషించిన ఈ సిరీస్, 6 ఎపిసోడ్స్ గా ప్రేక్షకులను పలకరించింది. ప్రశాంత్ కుమార్ దిమ్మల దర్శకత్వం వహించిన ఈ సిరీస్, కథాకథనాల వైపు నుంచి మంచి మార్కులు కొట్టేసింది. అలాంటి ఈ సిరీస్ నుంచి సీజన్ 2 వచ్చేసింది. నాలుగు ఎపిసోడ్స్ గా పలకరించిన సీజన్ 2 ఎలా ఉందనేది ఇప్పుడు చూద్దాం. 

కథ: శ్రీకాకుళం జిల్లా .. 'రేపల్లె' గ్రామంలో వరుసగా అమ్మాయిలు కనిపించకుండా పోవడం మిస్టరీగా మారుతుంది. ఆ ఊరు పోలీస్ స్టేషన్ కి కానిస్టేబుల్ గా వచ్చిన కనకం (వర్ష బొల్లమ్మ)కి అక్కడి పరిస్థితులు అనేక అనుమానాలను కలిగిస్తాయి. దాంతో ఆమె ఆ మిస్టరీకి సంబంధించిన ముడులు విప్పుకుంటూ వెళుతుంది. కనిపించకుండా పోయినవారి ఆచూకీ తెలుసుకుంటుంది. అయితే వాళ్లలో 'చంద్రిక' జాడ తెలియకపోవడంతో ఆలోచనలో పడుతుంది. అక్కడి నుంచి సీజన్ 2 మొదలవుతుంది. 

చంద్రిక ఏమైపోయిందనేది తెలుసుకుని తీరాలని కనకం నిర్ణయించుకుంటుంది. చంద్రికకి సంబంధించిన వివరాల కోసం వైజాగ్ లోని ఆమె తల్లిదండ్రుల దగ్గరికి వెళుతుంది. సత్యనారాయణ రాజు - విజయ దంపతులను చంద్రిక గురించి అడుగుతుంది. చంద్రిక తమ సొంత కూతురు కాదనీ, దత్తత చేసుకున్నామని వాళ్లు చెబుతారు. ఆ మాట వినగానే  కనకం నివ్వెరపోతుంది. 

చంద్రిక సొంత తల్లిదండ్రులు ఎవరు? వాళ్లు ఎక్కడ ఉంటున్నారు? అనేది తెలుసుకోవడం వలన చిక్కుముడులు వీడిపోతాయని కనకం భావిస్తుంది. అతి కష్టం మీద ఆ వివరాలను తెలుసుకుని చంద్రిక సొంత ఊరుకు వెళుతుంది. అక్కడ ఆమెకి తెలిసే నిజాలు ఏమిటి? చంద్రిక కనిపించకుండా పోవడానికి కారకులు ఎవరు? అసలు చంద్రిక ఏమైపోయింది? అనేది మిగతా కథ. 

విశ్లేషణ: అడవిని ఆనుకుని ఉన్న విలేజ్ .. కనిపించకుండా పోతున్న అక్కడి అమ్మాయిలు .. మూఢాచారాలు .. క్షుద్రశక్తులకి సంబంధించిన టచ్ ఇస్తూ మొదటి సీజన్ కొనసాగింది. ఇక రెండో సీజన్ అంతా కూడా, చంద్రిక అనే యువతి అదృశ్యం చుట్టూనే కథను అల్లుకున్నారు. ఆమె పాత్రను కేంద్రంగా చేసుకునే ఈ కథ అంతా కూడా నడుస్తూ ఉంటుంది. ఈ కేసు విషయంలోని మలుపులు ఆసక్తికరంగా అనిపిస్తాయి.

చంద్రిక ఫ్లాష్ బ్యాక్ గురించిన ఎపిసోడ్ .. చంద్రిక పెంపుడు తల్లిదండ్రుల ఇంటికి సంబంధించిన ఎపిసోడ్ ఈ సీజన్ కి కొత్తదనాన్ని తీసుకొచ్చాయి. మొదటి సీజన్ కి భిన్నంగా ఈ కథను నడిపించాయి. 'మేరీ' అనే ఒక కొత్త పాత్ర ఎంట్రీ ఇవ్వడంతో కథా స్వరూపం మరింత ఇంట్రెస్టింగ్ గా మారిపోతుంది. ఈ సీజన్ ముగింపు దిశగా వెళుతున్నా కొద్దీ చకచకా కథలో వచ్చే మార్పులు .. మలుపులు కుతూహలాన్ని పెంచుతాయి. కథని మరింత బలంగా మార్చేస్తూ ఉంటాయి.

సాధారణంగా మరో సీజన్ ఉన్నప్పుడు, ప్రస్తుత సీజన్ కి సంబంధించిన కథను అసంపూర్తిగా ఆపేస్తూ ఉంటారు. కానీ ఈ సిరీస్ విషయంలో అలా జరగలేదు. మరో సీజన్ ఉన్నప్పటికీ, ఈ సీజన్ లో మంచి ముగింపు పడుతుంది. ఫైనల్ ట్విస్ట్ చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. మొత్తానికి 'కానిస్టేబుల్ కనకం 2' కూడా ప్రేక్షకులను అలరించిందనే చెప్పాలి.

పనితీరు
: విలేజ్ నేపథ్యం, కథ .. స్క్రీన్ ప్లే ఈ సిరీస్ కి ప్రధానమైన బలం అని చెప్పాలి. ప్రధానమైన పాత్రలను డిజైన్ చేసిన విధానం .. వాటిని చివరివరకూ నడిపించిన తీరు ఆకట్టుకుంటుంది. ప్రీ క్లైమాక్స్ .. క్లైమాక్స్ రెండూ కూడా కథను మరింత ఉత్కంఠగా మారుస్తాయి. 

వర్ష బొల్లమ్మతో పాటు ఆర్టిస్టులంతా కూడా తమ పాత్రలకు సహజత్వాన్ని తీసుకొచ్చారు. శివరామ్ ముక్కపాటి ఫొటోగ్రఫీ .. సురేశ్ బొబ్బిలి నేపథ్య సంగీతం  .. మాధవ్ కుమార్ ఎడిటింగ్ కథను మరింత ఆసక్తికరంగా ఆవిష్కరించడంలో తమవంతు పాత్రను పోషించాయి.

ముగింపు: సీజన్ 2కి సంబంధించిన కథాకథనాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. కథలో భాగంగా వచ్చే ఫ్లాష్ బ్యాకులు కూడా నిరాశ పరచవు. ఫ్యామిలీ ఎమోషన్స్ ను టచ్ చేస్తూ ఇన్వెస్టిగేషన్ ను నడిపించడమనే కొత్తదనం ఆడియన్స్ ను ఆకట్టుకుంటుంది. ఫ్యామిలీతో కలిసి ఈ సీజన్ ను కూడా చూసేయవచ్చు.