మలయాళంలో రూపొందిన ఓ రివేంజ్ థ్రిల్లర్ ఇప్పుడు ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. ఆ సినిమా పేరే 'ఆజాది'. క్రితం ఏడాది మే 23వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, ఆ తరువాత మలయాళంలో ఒకటి రెండు ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ పైకి వచ్చింది. ఈ నెల 1వ తేదీ నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతోంది. 'మంజుమ్మెల్ బాయ్స్' ఫేమ్ శ్రీనాథ్ భాసి ప్రధానమైన పాత్రను పోషించిన సినిమా ఇది. జో జార్జ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కథేమిటనేది ఇప్పుడు చూద్దాం. 

కథ: ఒక రాజకీయనాయకుడి ఇంటికి వెళ్లి అతని కొడుకుని హత్య చేసిన నేరంపై గంగ (రవీనా రవి) జైల్లో శిక్షను అనుభవిస్తూ ఉంటుంది. తన చెల్లెలి ఆత్మహత్యకి కారకుడైనందు వల్లనే ఆమె అతనిని హత్య చేస్తుంది. అప్పటికే గర్భవతిగా ఉన్న ఆమెకి డెలివరీ డేట్ వచ్చేస్తుంది. దాంతో ఆమెను ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో చేరుస్తారు. గంగ తండ్రి శివ ( లాల్) ఆమె భర్త రఘు ( శ్రీనాథ్ భాసి) హాస్పిటల్ కి చేరుకుంటారు. ఈ ముగ్గురిపై ప్రతీకారం తీర్చుకునే అవకాశం కోసం ఆ రాజకీయనాయకుడు వెయిట్ చేస్తూ ఉంటాడు. 

గంగ డెలివరీ అయిన తరువాత బేబీతో పాటు ఆమెను హాస్పిటల్ నుంచి తప్పించాలని శివ - రఘు నిర్ణయించుకుంటారు. హాస్పిటల్లో నర్స్ గా పనిచేసే 'మినీ' .. అంబులెన్స్ డ్రైవర్ గా పనిచేసే బాబుతో పాటు, సత్య .. జినూ సాయం తీసుకుంటారు. అయితే హాస్పిటల్ లో గంగకి కాపలాగా పోలీస్ టీమ్ ఉంటుంది. అలాగే గంగ ఫ్యామిలీపై ప్రతీకారం తీసుకోవడం కోసం రాజకీయనాయకుడు పంపించిన బ్యాచ్ అక్కడే ఉంటుంది. 

దాంతో రఘు తన భార్య బిడ్డలతో హాస్పిటల్ నుంచి ఎలా బయటపడాలనే విషయంపై గట్టిగానే కసరత్తు చేసి ఒక ప్లాన్ గీస్తాడు. ఆ ప్లాన్ ను అందరికి అర్థమయ్యేలా చెబుతాడు. అయితే ఊహించని విధంగా గంగ రక్షణ కోసం పోలీస్ ఆఫీసర్ రాణి (వాణీ విశ్వనాథ్) రంగంలోకి దిగుతుంది. అప్పుడు రఘు బ్యాచ్ ఏం చేస్తుంది? గంగను హాస్పిటల్ నుంచి తప్పించగలుగుతారా? అనేదే కథ. 

విశ్లేషణ: ఈ మధ్య కాలంలో తక్కువ బడ్జెట్ లో .. తక్కువ పాత్రలతో .. ఒకే ఒక లొకేషన్ లో కథను అల్లుకుని ఆవిష్కరించడం ఎక్కువగా జరుగుతోంది. కోర్టు రూమ్ ప్రధానమైన కథలు .. తోట బంగళాకు సంబంధించిన దెయ్యం కథలు .. ఆఫీస్ చుట్టూ తిరిగే కథలు .. అలాగే హాస్పిటల్ నేపథ్యంలో నడిచే కథలు కనిపిస్తాయి. ఈ కథ కూడా దాదాపు ఒక హాస్పిటల్ నేపథ్యంలోనే కొనసాగేలా దర్శకుడు ఈ కథను తయారు చేసుకున్నాడు. 
      
పోలీసులు .. హంతకులు .. హత్య చేయబడినవారి తాలూకు మనుషులు .. హంతకుల కుటుంబ సభ్యులు .. ఇలా అన్ని వైపుల నుంచి కీలకమైన పాత్రలన్నీ హాస్పిటల్ కి చేరుకోవడం .. అక్కడ చోటుచేసుకునే యాక్షన్ .. ఎమోషనల్ సీన్స్ ను దర్శకుడు ఆవిష్కరించిన తీరు ఆసక్తికరంగా అనిపిస్తుంది. కథలో దారిపొడవునా ఎక్కడా ఎలాంటి ట్విస్టులు లేకపోయినా, ఏం జరగనుందా?అనే ఒక కుతూహలం మాత్రం ప్రేక్షకులను అలా కూర్చో బెడుతుంది.

చివర్లో ఒక ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ కారణంగా ఈ కథకి మరింత బలం పెరిగినట్టుగా అనిపిస్తుంది. అప్పటి వరకూ నడుస్తూ వచ్చిన కథమొత్తాన్ని మలుపు తిప్పేదిగా ఈ ట్విస్ట్ ఉంటుంది. ట్విస్ట్ ను ఆడియన్స్ గెస్ చేయలేరుగానీ, ఆ ట్విస్ట్ ఏ వైపు నుంచి ఉండొచ్చనే విషయంలో ఆడియన్స్ కి కాస్త అనుమానమైతే వస్తుంది. ఆ సందేహం కూడా రాకుండా చూసుకుంటే మరింత ఇంట్రెస్టింగ్ గా ఉండేదేమో అనిపిస్తుంది.

పనితీరు: సాధారణంగా హాస్పిటల్ నేపథ్యంలో కథలను చూడటానికి ఆడియన్స్ అంతగా ఇంట్రెస్ట్ చూపించరు. కానీ దర్శకుడు ఈ కథను నడిపించిన విధానం మిగతా విషయాలపైకి దృష్టి వెళ్లనీయదు. గవర్నమెంట్ హాస్పిటల్ లోని వాతావరణం ఎలా ఉంటుందనేది చూపించిన విధానం సహజత్వానికి చాలా దగ్గరగా అనిపిస్తుంది.

 దర్శకుడి టేకింగ్ తో పాటు సాగర్ స్క్రీన్ ప్లే మంచి మార్కులు కొట్టేస్తుంది. చివర్లో వచ్చే ట్విస్ట్ ఆడియన్స్ కి ఎమోషనల్ పరంగా కూడా కనెక్ట్ అవుతుంది. లాల్ .. వాణీ విశ్వనాథ్ .. శ్రీనాథ్ భాసి నటన ఆకట్టుకుంటుంది. సనీష్ స్టాన్లీ ఫొటోగ్రఫీ .. వరుణ్ నేపథ్య సంగీతం .. నౌఫల్ ఎడిటింగ్ ఫరవాలేదు.

ముగింపు: ఈ కథను చూస్తున్నంత సేపు ఒక కోణంలో కనిపిస్తూ ఉంటుంది. కానీ ఒకే ఒక్క ట్విస్ట్ తో అప్పటివరకూ మనం ఆ కథను చూసిన కోణమే మారిపోతుంది. ఆ ట్విస్ట్ ఏమిటి? ఆ కథేమిటి? అనేది ఆసక్తికరంగా అనిపిస్తుంది. అభ్యంతరకరమైన సన్నివేశాలు .. రక్తపాతాలు లేకుండా సాగే ఏ సినిమాను, ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు.