మొదటి నుంచి కూడా ఆది పినిశెట్టి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ తన ప్రత్యేకతను చాటుతున్నాడు. ఒక వైపున కీలకమైన పాత్రలను చేస్తూనే, మరో వైపున ప్రధానమైన పాత్రలను చేస్తూ వెళుతున్నాడు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన మరో సినిమానే 'డ్రైవ్'. డిసెంబర్ 12వ తేదీన థియేటర్లకు వచ్చిన ఈ సినిమా, ఈ నెల 2వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా కథేమిటనేది ఇప్పుడు చూద్దాం. 

కథ: ప్రజా మీడియా కార్పొరేషన్ ద్వారా సంజీవ రెడ్డి కోట్ల కొద్దీ ఆస్తులను సంపాదిస్తాడు. ఆయన తరువాత వారసుడిగా వ్యాపార వ్యవహారాలను చూసుకోవలసిన బాధ్యత జయదేవ్ రెడ్డి (ఆది పినిశెట్టి)పై పడుతుంది. అయితే తండ్రి ఏర్పాటు చేసిన సంస్థలను అమ్మేసి, భార్య బిడ్డలతో 'లండన్' వెళ్లిపోయి అక్కడ విలాసవంతమైన జీవితాన్ని గడపాలని జయ్ నిర్ణయించుకుంటాడు. అందుకు సంబంధించిన సన్నాహాలను చకచకా మొదలుపెడతాడు.

అయితే తాను ఈ సంస్థలను ఎవరికి అమ్ముతున్నదీ .. ఎక్కడికి వెళుతున్నది ఎవరికీ తెలియకూడదని జయ్ భావిస్తాడు. అలా జరిగితే ఆర్ధికంగా తాను పెద్ద మొత్తంలో నష్టపోవడమే కాకుండా, పరువు ప్రతిష్ఠలు దెబ్బతింటాయని ఆందోళన చెందుతాడు. ఆర్ధిక నేరాల కారణంగా తాను దొరికిపోయే ఛాన్స్ కూడా ఉందని భయపడతాడు. అందువలన సాధ్యమైనంత త్వరగా 'లండన్' కి మకాం మార్చాలని అనుకుంటాడు. 

అయితే ఊహించని విధంగా ఈ వార్త మీడియాలో హల్ చల్ చేయడం మొదలవుతుంది. తనకి సంబంధించిన వివరాలను మీడియాకి ఎవరు లీక్ చేసి ఉంటారనే ఆలోచన చేసిన ఆయనకి, తన సిస్టమ్ ను ఎవరో హ్యాక్ చేశారనే విషయం అర్థమవుతుంది. అలాగే తన ప్రతి కదలికను ఎవరో పసిగడుతున్నట్టు అర్థమవుతుంది. అది ఎవరు? ఆ విషయం తెలుసుకున్న జయ్ ఏం చేస్తాడు? అనేది కథ. 

విశ్లేషణ: కథ ఏదైనా ఆడియన్స్ ఎప్పుడూ హీరో పక్షమే. సినిమా మొదలు కాగానే ప్రేక్షకులు హీరో వెనుక చేరిపోతారు. అతను హ్యాపీగా ఉంటే వాళ్లు చప్పట్లు కొడతారు. అతను బాధలో ఉంటే వీళ్లు డీలాపడిపోతారు. అయితే హీరోకి వచ్చిన కష్టమేంటి? జరగబోతున్న నష్టమేంటి? అనేది తెలిసినపుడే, అతను వాటిని ఎలా అధిగమిస్తాడు? అనే టెన్షన్ వాళ్లలో పెరుగుతూ పోతుంది. అదృష్టం కొద్దీ ఈ సినిమాలో హీరో ఎందుకు టెన్షన్ పడుతున్నాడనేది చాలామందికి అర్థం కాదు. 

ఇక ఈ సినిమాలో విలన్ ఎవరయ్యా అంటే హ్యాకర్. మాట్లాడితే హీరోకి కాల్ చేసి అతణ్ణి భయపెట్టేస్తూ ఉంటాడు. ఈ హ్యాకర్ ఎవరు? అతగాడికి .. హీరోకి ఉన్న శత్రుత్వం ఏమిటి? అనేది తెలుసుకోవాలనే ఆరాటం కలగడం సహజం. ఊరించి ఊరించి ఆ సీక్రెట్ ను కూడా రివీల్ చేస్తారు. అదేమైనా మనం ఆశ్చర్యపోయి నోరెళ్లబెట్టేలా ఉందా అంటే అదీ లేదు. పేలవమైన .. బలహీనమైన ఆ కారణం, అప్పటివరకూ జరిగిన కథను కూడా నీరుగారుస్తుంది.
 
ఏ సినిమాలోనైనా కథ పరిగెత్తాలి .. కథనం మలుపులు తీసుకోవాలి. కానీ ఈ సినిమాలో కథ కాకుండా కారు పరిగెడుతూ ఉంటుంది. ఫారిన్ వీధుల్లో మలుపులు తీసుకుంటూ ఉంటుంది. ఏయే ట్విస్టుల కోసం ప్రేక్షకులు వెయిట్ చేస్తూ ఈ హడావుడిని భరిస్తారో, ఆ ట్విస్టులు ఉస్సూరు మనిపిస్తాయి. ఏదో ఉందనిపించి .. ఆ తరువాత కొత్తగా ఏమీ లేదనిపించే సినిమాలలో ఇది ఒకటిగా చెప్పుకోవచ్చు.  
  
పనితీరు: ఈ కథ మొదలైన తీరును బట్టి, ప్రేక్షకులకు కూడా పెద్దపెద్ద బిజినెస్ లపై ఎంతో కొంత అవగాహన ఉండాలేమో అనిపిస్తుంది. ఆ తరువాత కథ రివేంజ్ డ్రామాగా మారుతుంది. ఈ రివేంజ్ పుట్టడానికీ .. పెరగడానికి గల కారణం గట్టిగా లేకపోవడంతో అది ఆడియన్స్ కి అంతగా పట్టుకోదు. 

నటీనటుల నటన గురించి మాట్లాడుకునేంత బలమైన పాత్రలేవీ ఈ కథలో కనిపించవు. అభినందన్ రామానుజం ఫొటోగ్రఫీ బాగుంది. ఓషో వెంకట్ నేపథ్య సంగీతం ..ప్రవీణ్ ఎడిటింగ్ ఓ మాదిరిగా అనిపిస్తాయి.   

ముగింపు: 'డ్రైవ్' .. టైటిల్ కి తగినట్టుగానే హీరో ఈ కథ మొదలైన దగ్గర నుంచి కారు డ్రైవ్ చేస్తూనే ఉంటాడు. హ్యాకర్ కాల్ చేస్తే తాను కంగారు పడుతుంటాడు. ఆ తరువాత తాను కాల్ చేసి తనవాళ్లని కంగారు పెడుతూ ఉంటాడు. ప్రేక్షకుడు మాత్రం కూల్ గా కూర్చుని ఈ తతంగాన్నంతా చూస్తుంటాడు. దానిని బట్టి కథలో పసలేదనీ, ఉందనుకున్న కథకు అతను కనెక్ట్ కాలేదని చెప్పచ్చు.