'కొల్లా' (ఈటీవీ విన్) మూవీ రివ్యూ!

  • మలయాళంలో రూపొందిన 'కొల్లా'
  • ఆసక్తికరమైన కథాకథనాలు 
  • ఆకట్టుకునే సన్నివేశాలు 
  • సహజత్వమే ప్రధానమైన బలం 

మలయాళంలో రూపొందిన సినిమానే 'కొల్లా'. సూరజ్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా, జూన్ 9వ తేదీన 2023లో థియేటర్లకు వచ్చింది. రజీషా విజయన్ - ప్రియా ప్రకాశ్ వారియర్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, ఈ రోజు నుంచి 'ఈటీవీ విన్'లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా కథేమిటనేది చూద్దాం. 

కథ: అనీ (రజీషా విజయన్)  శిల్ప ( ప్రియాప్రకాశ్ వారియర్) లైఫ్ లో సెటైలై పోవాలని అనుకుంటారు. అందుకోసం బ్యాంకు లాకర్లలో ఉండే బంగారాన్ని కాజేయాలని నిర్ణయించుకుంటారు. పథకం ప్రకారం ఒక ఊళ్లో బ్యాంకు పక్కనే ఉన్న ఒక షెట్టర్ ను రెంట్ కి తీసుకుంటారు. అందులో బ్యూటీ పార్లర్ ను పెడుతున్నట్టుగా చుట్టుపక్కలవారిని నమ్మిస్తారు. ఆ షెట్టర్ లో నుంచి బ్యాంకుకి కన్నం వేసి 26 కేజీల బంగారం దోచేస్తారు.

బ్యాంకు నుంచి బంగారం కాజేసే విషయంలో తమకి బాగా పరిచయమున్న 'స్టీఫెన్' సహాయం తీసుకుంటారు. ఏమీ ఎరుగట్టుగా అనీ - శిల్ప అదే ఊళ్లో ఉంటారు. స్టీఫెన్ ఎవరికీ అనుమానం రాకుండా ఉండటం కోసం, ఆ బంగారాన్ని తన విలేజ్ కి తీసుకుని వెళ్లి, ఒక పాడుబడిన ఇంట్లో దాచిపెడతాడు. ఈ కేసును పరిష్కరించడం కోసం పోలీస్ ఆఫీసర్ 'ఫరూక్' రంగంలోకి దిగుతాడు. అన్ని వైపుల నుంచి ఆధారాలను రాబట్టే పనిలో ఉంటాడు.  

ఈ నేపథ్యలోనే ఆల్రెడీ నేరచరిత్ర కలిగిన స్టీఫెన్ ను ఫరూక్ పట్టుకుంటాడు. అయితే ఊహించని విధంగా ఫరూక్ గుండెపోటుతో చనిపోతాడు. అతను ఆ బంగారం ఎక్కడ పెట్టాడనేది తెలియని అనీ - శిల్పా ఇద్దరూ అయోమయంలో పడతారు. ఆ బంగారం జాడ తెలుసుకోవడం కోసం .. తమ బండారం బయటపడకుండా ఉండటం కోసం వాళ్లు ఏం చేస్తారు? ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటారు? అనేది కథ. 

విశ్లేషణ:బ్యాంకు దోపిడీకి పాల్పడిన ఇద్దరు యువతులు తాము పట్టబడకుండా ఉండటం కోసం .. తమ చేతిలో నుంచి ఆ బంగారం జారిపోకుండా ఉండటం కోసం ఏం చేస్తారు? అనే ఒక ప్రధానమైన కథాంశంతో ఈ సినిమా నడుస్తుంది. చాలా తక్కువ బడ్జెట్ లో .. అరడజను ప్రధానమైన పాత్రలతో తెరకెక్కించిన సినిమా ఇది. సహజత్వానికి దగ్గరగా .. చాలా ఇంట్రెస్టింగ్ గా ఈ కథ పరిగెడుతూ ఉంటుంది. 

బ్యాంకు దోపిడీ నేపథ్యంలో గతంలో చాలానే సినిమాలు వచ్చాయి. అయితే ఆ కథల్లో, తాము పట్టుబడిపోయే పరిస్థితి వచ్చినప్పుడు దొంగిలించిన మొత్తాన్ని వదులుకోవడానికి ఆయా పాత్రలు సిద్ధపడుతూ ఉంటాయి. అయితే ఈ కథలో .. తాము పట్టుబడిన సరే, ఎంతో కష్టపడి దొంగిలించిన సొమ్ము ఎలాంటి పరిస్థితుల్లో పోలీసులకు దొరక్కూడదు అనే పట్టుదలతో దొంగలు ముందుకు వెళ్లడం కొత్తగా అనిపిస్తుంది. 
  
'కొల్లా' అంటే దోపిడీ అని అర్థం. బ్యాంకు దోపిడీ చుట్టూనే ఈ కథ తిరుగుతుంది. ఒక వైపున దొంగల ఎత్తులు .. మరో వైపున పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఆసక్తికరంగా అనిపిస్తాయి. తక్కువ బడ్జెట్ లో .. తక్కువ పాత్రలతో .. రెండు మూడు లొకేషన్స్ లోనే ఈ  కథను నడిపించిన తీరు ఆకట్టుకుంటుంది. లవ్ .. రొమాన్స్ .. డ్యూయెట్లు వంటివి లేకపోయినా, ఎక్కడా ఈ సినిమా బోర్ అనిపించదు. ఫ్యామిలీతో కలిసి చూడదగిన సినిమానే ఇది. 

పనితీరు
: దర్శకుడిగా సూరజ్ వర్మ పనితీరుకు మంచి మార్కులు పడతాయి. బాబీ - సంజయ్ అందించిన కథ కూడా సహజత్వానికి చాలా దగ్గరగా వెళుతూనే ఆకట్టుకుంటుంది. సందర్భానికి తగిన నేపథ్య సంగీతాన్ని అందించడంలో షాన్ రెహ్మాన్ సక్సెస్ అయ్యాడని చెప్పాలి. రాజవేల్ మోహన్ ఫొటోగ్రఫీ - అర్జు బెన్ ఎడిటింగ్ మెప్పిస్తాయి. ఆర్టిస్టులందరి నటన  ఆకట్టుకుంటుంది

ముగింపు: కొన్ని సినిమాలు స్టార్ హీరోలు లేకపోయినా, లవ్ .. రొమాన్స్ .. యాక్షన్ సీన్స్ .. డ్యూయెట్లు లేకపోయినా ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. కథనే హీరోగా నిలబడటం .. కంటెంట్ లోని బలం అందుకు కారణం అని చెప్పాలి. అలాంటి కోవకి చెందిన సినిమాల జాబితాలో ఈ సినిమా కూడా కనిపిస్తుంది.

Movie Details

Movie Name: Kolla

Release Date: 2025-06-19

Cast: Rajisha Vijayan, Priya Prakash Varrier, Vinay Forrt, Kollam Sudhi

Director: Suraj Varma

Producer: Rajeesh

Music: Shaan Rahman

Banner: Rajeesh Productions

Review By: Peddinti

Kolla Rating: 2.50 out of 5

Trailer

More Movie Reviews