అనుదీప్ అనగానే కామెడీ కంటెంట్ పుష్కలంగా ఉంటుందని ఆడియన్స్ అనుకుంటూ ఉంటారు. కామెడీ కోసమే ఆయన సినిమాలకి వెళుతుంటారు. అలా మరోసారి పూర్తిగా కామెడీని నమ్ముకుని అనుదీప్ చేసిన సినిమానే 'ఫంకీ'. సితార బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమా, ఈ రోజునే థియేటర్లకు వచ్చింది. విష్వక్సేన్ - కయాదు లోహర్ జంటగా నటించిన ఈ సినిమా, ఆడియన్స్ ను ఎంత వరకూ నవ్వించిందనేది ఇప్పుడు చూద్దాం.
కోమల్ (విష్వక్సేన్) ఓ నిలకడ లేని మనిషి. మాట మీద నిలబడలేడు . కాకపోతే మాటలు చెప్పే బ్రతికేస్తూ ఉంటాడు. ఎప్పటికప్పుడు అప్పటికప్పుడు తన పని పూర్తి కావాలనే ఆలోచనలో ఉంటాడు. అందుకోసం ఇతరులను ఇబ్బందులలో పెట్టడానికి అతను ఎంతమాత్రం వెనుకాడడు. ఇలా నమ్మించే అతను జీకే (సంపత్ రాజ్)ను శత్రువుగా చేసుకుంటాడు. సినిమా డైరెక్టర్ గా నిలదొక్కుకోవడం కోసం హైదరాబాద్ లోని అద్దె రూమ్ లో నానా తంటాలు పడుతుంటాడు.
సుదర్శన్ (నరేశ్) నిర్మాతగా కోమల్ ఒక సినిమాను మొదలుపెడతాడు. 4 కోట్లతో సినిమాను పూర్తి చేస్తానని చెప్పి, బడ్జెట్ పెంచేస్తూ వెళతాడు. దాంతో సుదర్శన్ కి గుండెపోటు వస్తుంది. తండ్రి హాస్పిటల్ పాలు కావడానికి కారణమైన కోమల్ పట్ల, సుదర్శన్ కూతురు చిత్ర (కయాదు లోహర్) మండిపడుతుంది. ఆ ప్రాజెక్టును ఆపేసి కోమల్ ను బయటికి పంపిస్తుంది. సినిమా తప్ప మరేమీ తెలియని కోమల్, అదేపనిగా చిత్ర చుట్టూ తిరుగుతూ ఆమెను కూల్ చేస్తాడు. ఆమె అభిమానంతో పాటు ప్రేమను కూడా సంపాదిస్తాడు.
కోటి రూపాయలలో మిగతా సినిమాను పూర్తి చేసే షరతు మీద, కోమల్ కి చిత్ర మళ్లీ అవకాశం ఇస్తుంది. ఆ మాటకి కట్టుబడి మళ్లీ అతను రంగంలోకి దిగుతాడు. అయితే కోమల్ కి ఎమోషన్స్ లేవనీ, అతనికి తల్లీ .. చెల్లి పట్లనే పెద్దగా ప్రేమను రాగాలు లేవనే విషయం చిత్రకి అర్థమవుతుంది. అప్పుడు ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? ఫలితంగా కోమల్ కి ఎలాంటి పరిస్థితి ఎదురవుతుంది? అనే మలుపులు ఈ కథలో కనిపిస్తాయి.
సినిమా నేపథ్యం కలిగిన కథ ఇది. నిర్మాత కూతురుకి .. దర్శకుడికి మధ్య లవ్ .. ఇందులో ఒక భాగం. కథలో భాగంగా హీరో - హీరోయిన్ 'మన' అనేసుకున్న తరువాత, ఇక బడ్జెట్ అనేది పెద్ద విషయమే కాదు గాబట్టి, ఇక ఆ వైపు నుంచి ఆడియన్స్ కి ఎలాంటి టెన్షన్ ఉండదు. ఈ కథలో చాలా సేపటి వరకూ కనిపించకుండా ఉన్న మరో అంశం .. హీరోకి ఎమోషన్స్ లేకపోవడం. అలాంటి ఒక మనసులోని ఎమోషన్స్ ను హీరోయిన్ తట్టి లేపగలిగిందా .. లేదా? అనేది ఈ ట్రాక్ ప్రధానమైన ఉద్దేశం.
నిజానికి హీరోలో ఈ లోపం .. ఈ లక్షణం కథలో ప్రధానమైన అంశంగా హైలైట్ చేస్తూ వెళితే బాగుండేది. కానీ సినిమా .. బడ్జెట్ అంటూ కామెడీ డైలాగులతో కాలక్షేపం చేశారు. ఈ సినిమాలో కథ ఉండదు .. కామెడీ మాత్రమే ఉంటుందనే విషయాన్ని ఈవెంట్స్ లో చెప్పారు కాబట్టి, ఆ విషయాన్ని గురించి మాట్లాడుకోవలసిన పనిలేదు. కాకపోతే కథ మాత్రమే కాదు .. కామెడీ కూడా అనుకున్నంత .. ఆశించినంత లేదు. తిప్పి తిప్పి చెబుతూ గమ్మత్తుగా అనిపించే మాటల గారడీ మాత్రం ఉందని చెప్పచ్చు.
ఫస్టాఫ్ తరువాత కామెడీ మరింత బలపడుతుందని అనుకుంటే, మరింత పలచబడింది. జీకే పాత్ర ద్వారా సంపత్ రాజ్ తో మరికాస్త నవ్వుల సందడి చేయించడానికి ట్రై చేశారు గానీ వర్కౌట్ కాలేదని అనిపిస్తుంది. నరేశ్ పాత్రను పూర్తి స్థాయిలో ఉపయోగించుకోలేకపోవడం, సంపత్ రాజ్ పాత్రపై పెద్దగా దృష్టి పెట్టకపోవడం వలన, పైపైన అల్లేసుకున్న సన్నివేశాలతో కంటెంట్ బలహీనపడిందనే అనిపిస్తుంది.
స్కూల్ లో విష్వక్ ఎంట్రీ సీనే డైలాగ్స్ పరంగా తేలిపోయింది. ఎన్టీఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ సీన్ .. పోలీస్ ఆఫీసర్ కృష్ణమూర్తి సీన్ .. పెళ్లి చూపులు .. అప్పగింతలు సీన్ ఆడియన్స్ ఆశించిన స్థాయి కామెడీని అందించలేక చతికిల పడతాయి. 'నేను కేరవాన్లో కంటే కేరక్టర్లోనే ఎక్కువ ఉంటాను, 'ఫ్రెండ్స్ పిలిస్తే బయటికి వెళతాను గానీ లేదంటే కేరక్టర్లోనే ఉండిపోతాను' .. 'నాకు చిన్నప్పట్టి నుంచి తాంబూలాలు తీసుకోవడమంటే చాలా ఇష్టం' వంటి కొన్ని డైలాగ్స్ ఆకట్టుకుంటాయి.
విష్వక్సేన్ కి మాస్ ఇమేజ్ ఎక్కువ. కాకపోతే ఈ సినిమాలో కామెడీ .. ఎమోషన్స్ వైపు నుంచి ఎక్కువగా కనెక్ట్ కావడానికి ట్రై చేశాడు. కయాదు లోహర్ ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఇక నరేశ్ తన మార్క్ చూపించాడు. కాకపోతే ఆ పాత్రపై మరికాస్త కసరత్తు చేయవలసింది. సంపత్ రాజ్ ఆ పాత్రకి సెట్ కాలేదని అనిపిస్తుంది. ఈ పాత్ర 'అయ్యో' అనుకునే స్థాయిలో తేలిపోయింది.
అనుదీప్ గ్యాంగ్ చేసిన అల్లరి కూడా అంతగా పేలలేదు. దిల్ రాజు .. నాగవంశీ .. హరీశ్ శంకర్ సందర్భానికి తగినట్టుగా మెరిశారు. సురేశ్ సారంగం కెమెరా పనితనం .. నవీన్ నూలి ఎడిటింగ్ .. భీమ్స్ నేపథ్య సంగీతం ఫరవాలేదు. బాణీల వరకూ చూసుకుంటే, అంతగా గుర్తుపెట్టుకునేవేమీ లేవు.
ఈ కథలో కామెడీ ఉంది .. ఎమోషన్స్ ఉన్నాయి. కాకపోతే ఈ రెండూ కూడా ఆడియన్స్ కి ఆశించిన స్థాయిలో కనెక్ట్ కాలేదు. సంభాషణల పరంగా జరిగిన గారడీ, అక్కడక్కడా కాస్త నవ్విస్తుంది అంతే.
'ఫంకీ' (మూవీ రివ్యూ)
Funky Review
Movie Details
Movie Name: Funky
Release Date: 2026-02-13
Cast: Vishwak Sen,Kayadu Lohar,Naresh, Sampath Raj
Director: K V Anudeep
Music: Bheems Ceciroleo
Banner: Sithara Entertainments - Fortune Four Cinemas
Review By: Peddinti
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer