తమిళం నుంచి వచ్చిన మరో హారర్ కామెడీ సినిమానే 'రజినీ గ్యాంగ్'. రమేశ్ భారతి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, రజినీ కిషన్ - ద్వివిక ప్రధానమైన పాత్రలను పోషించారు. క్రితం ఏడాది నవంబర్ 27వ తేదీన ఈ సినిమాను విడుదల చేశారు. అలాంటి ఈ సినిమా డిసెంబర్ 24వ తేదీ నుంచి 'అమెజాన్ ప్రైమ్' లో స్ట్రీమింగ్ కి వచ్చింది. తమిళంతో పాటు తెలుగులోను అందుబాటులోకి వచ్చింది.
రజినీ (రజినీ కిషన్)ఓ సాధారణ యువకుడు. అదే గ్రామానికి చెందిన మైనా (ద్వివిక)తో ప్రేమలో పడతాడు. ఆమె ఆ గ్రామ సర్పంచ్ కూతురు. అందువలన తమ ప్రేమ .. పెళ్లి వరకూ వెళ్లదని భావిస్తారు. ఆ ఊరు నుంచి వెళ్లిపోవడానికి ప్లాన్ చేసుకుంటారు. అదే సమయంలో యోగి (మునీశ్ కాంత్) ఒక మంత్రిగారికి సంబంధించిన కారు కొట్టేస్తాడు. రజినీ - ద్వివిక ఆ కారు లిఫ్ట్ అడిగి అందులో ఎక్కేస్తారు. అక్కడి నుంచి కాస్త ముందుకు వెళ్లిన తరువాత ఒక దొంగ కూడా వాళ్లను లిఫ్ట్ అడిగి ఆ కారు ఎక్కుతాడు.
ఆ కారుతో ఆ మంత్రికి ఎంతో సెంటిమెంట్ ఉంటుంది. అందువలన దానిని వెతికించే పనిలో అతను తీరిక లేకుండా ఉంటాడు. యోగి చనిపోయి .. అంత్య క్రియలకు ముందు బ్రతికాడనీ, అయితే అప్పటి నుంచి అతని ప్రవర్తన చిత్రంగా మారిపోయిందనే విషయం రజినీ - ద్వివికలతో పాటు ఆ దొంగకు తెలుస్తుంది. ఇక ఎవరితోనైతే ద్వివికకి పెళ్లి చేయాలనీ పేరెంట్స్ అనుకున్నారో, అతను కూడా ఈ జంటను పట్టుకోవడానికి రంగంలోకి దిగుతాడు.
ఇక ఈ దొంగ దగ్గర అతను కాజేసిన ఒక మంగళ సూత్రం ఉంటుంది. అల్పాయుష్షుతో చనిపోయిన ఒక యువతి మంగళ సూత్రం అది. ఆ తాళి ఎవరికి కట్టినా అనేక విపరీతాలు చోటుచేసుకుంటాయి. కారులో పారిపోతున్న రజినీ - ద్వివిక ఒక ఆలయం దగ్గర ఆగుతారు. అక్కడ పెళ్లి చేసుకుంటే బాగుంటుందని భావిస్తారు. అప్పుడు ఆ దొంగ తన దగ్గరున్న తాళిని వాళ్లకి ఇస్తాడు. రజినీ ఆ తాళిని ఆమె మెడలో కడతాడు. అప్పుడు ఏం జరుగుతుంది? ఆ తరువాత ఏమౌతుంది? అనేది కథ.
ఒక విలేజ్ కి చెందిన ప్రేమజంట, ఎవరో దొంగిలించబడిన మంత్రిగారి కారులో పారిపోవడం .. మార్గమధ్యంలో వాళ్లకి మరొక దొంగ తారసపడటం .. ప్రేతాత్మకి సంబంధించిన ఒక తాళి ఆ దొంగ దగ్గర ఉండటం .. తప్పనిసరి పరిస్థితులలో ఆ తాళిని హీరోయిన్ తన మెడలో వేసుకోవడం అనేవి ఈ కథలో మనకి ప్రధానంగా కనిపించే అంశాలు. ఈ మొత్తం కంటెంట్ అంతా కూడా కామెడీ టచ్ తోనే నడుస్తూ ఉంటుంది. ఎక్కడ కూడా కథ సీరియస్ గా కనిపించదు.
కూతురు కోసం సర్పంచ్ మనుషులు .. కారు కోసం మంత్రిగారి మనుషులు .. దొంగ కోసం పోలీసులు .. తన తాళి కోసం ప్రేతాత్మ రంగంలోకి దిగడంతో కథ అన్ని వైపుల నుంచి ఆసక్తికరంగా పరిగెడుతుందని సగటు ప్రేక్షకుడు భావిస్తాడు. కానీ అన్ని వైపుల నుంచి ఈ కథ నీరుకారుకుంటూ .. నిరాశపరుస్తూ వస్తుంది. కామెడీ పరంగాగానీ .. హారర్ పరంగా గాని వర్కౌట్ చేయలేకపోయారు.
మొదటి నుంచి నవ్వు రాకపోయినా .. మధ్యలో నుంచి భయపెట్టలేకపోయినా, ప్రీ క్లైమాక్స్ .. క్లైమాక్స్ ఈ రెండూ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయని అనుకోవడం సహజంగా జరుగుతూ ఉంటుంది. కానీ ప్రీ క్లైమాక్స్ - క్లైమాక్స్ దగ్గరికి వచ్చేసరికి ఈ కథ మరింత బలహీనపడుతుంది. భయపడాల్సిన దగ్గర కామెడీ .. నవ్వాల్సిన చోటున భయం వర్కౌట్ అయ్యాయేమో అనిపిస్తుంది.
నిజానికి ఈ కథలో ఇటు కామెడీ .. అటు హారర్ కి సంబంధించిన అంశాలు ఉన్నాయి. అన్ని వైపుల నుంచి ఆ ట్రాకులను పరిగెత్తిస్తూ ఫన్ జనరేట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. అయితే వాటిని కలుపుకుంటూ ఒక ఆసక్తికరమైన కథను తెరపై ఆవిష్కరించలేకపోయారు. దాంతో ఇంట్రెస్టింగ్ గా అనిపించే ట్రాకులన్నీ తేలిపోయాయి .. సిల్లీ కామెడీగా మిగిలిపోయాయి.
కనిపించడానికి తెరపై చాలానే పాత్రలు కనిపిస్తాయి. కానీ ఎవరి పాత్ర కూడా ఆడియన్స్ ను ప్రభావితం చేయలేకపోతుంది. కంటెంట్ బలహీనంగా ఉండటం వలన, సాంకేతిక పరిజ్ఞానం కూడా పూర్తిస్థాయి ప్రతిభను చూపలేకపోవడం కనిపిస్తుంది. సతీశ్ కుమార్గ్ కెమెరా పనితనం .. ఎడిటింగ్ ఫరావాలేదు. నేపథ్య సంగీతం ఓ మాదిరిగా అనిపిస్తుంది. ఈ సినిమాలో రజినీ గ్యాంగ్ ఏం చేసింది? అనే ప్రశ్న వేసుకుంటే, అనవసరమైన హడావిడి మాత్రమే మనకి కనిపిస్తుంది.
'రజినీ గ్యాంగ్'(అమెజాన్ ప్రైమ్) మూవీ రివ్యూ
Rajini Gaang Review
-
Movie Details
Movie Name: Rajini Gaang
Release Date: 2025-12-24
Cast: Rajini Kiishen, Dwivika, Motta Rajendran, Munishkanth, Cool Suresh, kalki Raja
Director: Ramesh Bharathi
Music: -
Banner: Mishri Enterprises
Review By: Peddinti
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer