హిందీలో రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ 'కొహ్రా'. 2023 - జులైలో ఈ సిరీస్ స్ట్రీమింగ్ కి వచ్చింది. 6 ఎపిసోడ్స్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సిరీస్ కి అనూహ్యమైన ఆదరణ లభించింది. అలాంటి ఈ సిరీస్ నుంచి సీజన్ 2 వచ్చింది. ఈ నెల 11వ తేదీ నుంచి 6 ఎపిసోడ్స్ గా స్ట్రీమింగ్ అవుతోంది. సుదీప్ శర్మ - ఫైజల్ రెహ్మాన్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ లో, మోనా సింగ్ - బరున్ సోబ్తి ప్రధానమైన పాత్రలను పోషించారు. తెలుగులోను అందుబాటులోకి వచ్చిన సిరీస్ ఇది.
ప్రీత్ బాజ్వా(పూజ) తన భర్త శ్యామ్ ( రణ్ విజయ్ సింఘా) తో కలిసి అమెరికాలో నివసిస్తూ ఉంటుంది. వారికి ఇద్దరు పిల్లలు. శ్యామ్ కి 'లవ్లీన్'తో అక్రమ్ సంబంధం ఉందనే విషయాన్ని గ్రహించిన ప్రీత్, భర్తతో పాటు పిల్లలను కూడా వదిలేసి, కోపంతో పంజాబ్ లోని తన పుట్టింటికి వచ్చేస్తుంది. ఆమె అన్నయ్య బల్జీత్ సింగ్ - వదిన ట్వింకిల్ ఈ విషయంలో అసంతృప్తిగా ఉంటారు. పుట్టింటి ఆస్తిలో తనకి రావాల్సిన వాటా కోసం ఆమె బల్జీత్ తో గొడవపడుతూ ఉంటుంది.
తనకి మెహర్ వర్మతో అక్రమ సంబంధం ఉందనే విషయాన్ని బయటపెట్టిన చెల్లెలు ప్రీత్ పై బల్జీత్ కోపంతో ఉంటాడు. ఆమెకి జాన్ తో ఉన్న సాన్నిహిత్యాన్ని హైలైట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ట్వింకిల్ కి చెందవలసిన ఆస్తి అటు ప్రీత్ కి .. ఇటు మెహర్ కి దక్కకుండా ట్వింకిల్ సోదరుడైన కరంజ్యోత్ ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇలాంటి పరిస్థితులలో ప్రీత్ దారుణంగా హత్య చేయబడుతుంది.
ఈ కేసును పరిష్కరించడానికి ధనవత్ కౌర్ (మోనా సింగ్) అమ్రపాల్ (బరున్ సోబ్తి) రంగంలోకి దిగుతారు. అయితే నిజానికీ ఈ ఇద్దరికీ వారి ఫ్యామిలీ వైపు నుంచి మనఃశాంతి ఉండదు. పెళ్లీడు కొచ్చిన కొడుకును పోగొట్టుకుని ధనవత్ దంపతులు నిర్జీవంగా బ్రతుకుతూ ఉంటారు. తన జీవితంలోకి అర్థాంగిగా అడుగుపెట్టిన సిల్కీ కి సంతోష పెట్టలేక అమ్రపాల్ బాధపడుతూ ఉంటాడు.
ఇలాంటి పరిస్థితులలో ప్రీత్ కేసు విషయాల్లో మిస్టరీని ఛేదించడానికి వారు సిద్ధమవుతారు. ప్రీత్ హత్యకి కారకుడు ఆమె భర్తనా? ఆమెతో సాన్నిహిత్యంగా ఉంటూ వచ్చిన జాన్ కారణమా? ఆస్తిలో వాటా అడుగుతుందని ఆగ్రహించిన సోదరుడు బల్జీత్ నా? తన అక్క ఫ్యామిలీని ఇబ్బంది పెడుతుందని భావించిన ట్వింకిల్ సోదరుడు కరణ్ జోత్ నా? లేదంటే వేరెవరైనానా? అనేది కథ.
సాధారణంగా క్రైమ్ థ్రిల్లర్ జోనర్ కి సంబంధించిన కథలు, మర్డర్ మిస్టరీ చుట్టూ తిరుగుతాయి. అలాగే ఈ కథ కూడా ఒక మర్డర్ తో మొదలవుతుంది. ఈ హత్య ఎవరు చేశారు? ఎందుకు చేశారు? అనే అంశాల చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ప్రీత్ అనే పాత్రను హత్య చేసింది భర్తనా? ప్రియుడా? సోదరుడా? బంధువా? ఇలా అనేక వైపులా నుంచి ఈ కథను అల్లుకొచ్చిన తీరు ఆసక్తికరంగా అనిపిస్తుంది.
ఒక వైపున ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తూనే, మరో వైపున ఫ్యామిలీపరమైన సమస్యలను పోలీస్ ఆఫీసర్స్ ఫేస్ చేసే విధానం కూడా బలంగానే చూపించారు. ఆ సమస్యలను దాటుకుంటూ వాళ్లు తమ ముందున్న సవాళ్లను స్వీకరించడం, ఎమోషన్స్ వైపు నుంచి మంచి మార్కులు కొట్టేస్తుంది. ఆయా పాత్రలు .. ఆ పాత్రల మధ్య డ్రామా నడిపించడానికి దర్శకుడు ఎక్కువ సమయాన్ని తీసుకున్నాడు. సహజత్వానికి దగ్గరగా సన్నివేశాలను తీసుకుని వెళ్లాడు.
డబ్బు .. వ్యసనం .. నిర్లక్ష్యం .. అబాధ్యత కారణంగా జీవితం ప్రమాదంలో పడుతుందనే సత్యాన్ని దర్శకుడు ఆవిష్కరించిన తీరు బాగుంది. బంధాలు దెబ్బతిన్నప్పుడు .. బంధాల నుంచి దూరం చేసినప్పుడు మనిషి మృగంగా మారతాడు అనే సందేశం కూడా మనకి ఈ కథలో కనిపిస్తుంది. అయితే ఈ కథలో అసహనాన్ని కలిగించే అంశం ఒకటి ఉంది. అదే అక్రమ సంబంధం. దర్శకుడు ఈ కథను మలుపులు తిప్పడానికి ఎక్కువగా అక్రమ సంబంధాలపైనే ఆధారపడటం ఇబ్బందిని కలిగిస్తుంది.
అభ్యంతరకరమైన సన్నివేశాలు ఏమీ ఉండవు. తెరపైకి అవి ఎప్పుడు వస్తాయోనని కాంగారు పడవలసిన పని లేదు. అయితే అక్రమ సంబంధాల సంఖ్య పెరుగుతూ పోతుంటుంది. అక్రమ సంబంధాలు ఆ పాత్రల ఔన్నత్యాన్ని దెబ్బతీస్తాయి. చనిపోయిన వ్యక్తిని అక్రమ సంబంధాలు ఉండేవి అనగానే ఆ పాత్రపై గల సానుభూతి తగ్గిపోతుంది. ఈ గొలుసుకట్టు అక్రమ సంబంధాలే కాస్త ఇబ్బంది పెడతాయి అంతే.
పాత్రల సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. అయితే ప్రతి పాత్ర రిజిస్టర్ అవుతుంది. ఆ పాత్రల ముగింపు కరెక్టుగా ఉంటుంది. ఎప్పటికప్పుడు అన్ని పాత్రలను కవర్ చేస్తూ .. కనెక్ట్ చేస్తూ సాగే స్క్రీన్ ప్లే మెప్పిస్తుంది. ప్రధానమైన పాత్రలను పోషించిన వాళ్లంతా చాలా సహజంగా నటించారు. అలాగే ఇతర నటీనటులు కూడా ఆ పాత్రలను కనెక్ట్ చేయగలిగారు. ఫొటోగ్రఫీ .. నేపథ్య సంగీతం .. ఎడిటింగ్ కథకి బలమైన సపొర్టుగా నిలిచాయి.
ఒక హత్య .. ఆ హత్యకి గల కారణాలు .. కారకులు చుట్టూ తిరిగే కథ ఇది. మిగతా పోలీస్ కథల మాదిరిగా హడావిడిగా .. ఉరుకుల పరుగుల మీద కొనసాగదు. ఫ్యామిలీ ఎమోషన్స్ ను టచ్ చేస్తూ, ఆసక్తికరమైన డ్రామాతో నిదానంగా నడుస్తుంది. అక్రమ సంబంధాల సంఖ్య కాస్త తగ్గిస్తే బాగుండేదని మాత్రం అనిపిస్తుంది.
'కొహ్రా - సీజన్ 2' (నెట్ ఫ్లిక్స్) సిరీస్ రివ్యూ!
Kohrra Season 2 Review
Movie Details
Movie Name: Kohrra Season 2
Release Date: 2026-02-11
Cast: Mona Singh, Barun Sobti, Rannavijay Singha, Pooja Bhamrrah, Anurag Arora
Director: Sudip Sharma- Faisal Rahman
Music: Naren Chaandavarkar
Banner: A Film Squad production
Review By: Peddinti
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer