శివకార్తికేయన్ కథానాయకుడిగా నటించిన సినిమానే 'పరాశక్తి'. సుధా కొంగర దర్శకత్వం వహించిన ఈ సినిమాలో, శ్రీలీల .. రవి మోహన్ కీలకమైన పాత్రలను పోషించారు. ఈ ఏడాది జనవరి 10వ తేదీన ఈ సినిమాను విడుదల చేశారు. అలాంటి ఈ సినిమాను ఈ రోజు ( ఫిబ్రవరి 7వ) తేదీ నుంచి స్ట్రీమింగ్ కి వచ్చింది. తమిళంతో పాటు ఇతర భాషల్లోను అందుబాటులోకి వచ్చింది.
ఈ కథ 1959లో 'తిరుచిరాపల్లి'లో మొదలవుతుంది. హిందీని అధికార భాషగా బలవంతంగా రుద్దాలనే ఒక నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం రావడంతో ఈ కథ మొదలవుతుంది. దాంతో మాతృ భాష పట్ల గల మమకారం వలన, తమిళ ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత పెరుగుతూ వస్తుంది. ముఖ్యంగా తమిళనాడులోని మదురై .. చిదంబరం ప్రాంతాల నుంచి అక్కడి కాలేజ్ స్టూడెంట్స్ నిరసనలు .. ర్యాలీలు నిర్వహిస్తుంటారు.
కాలేజ్ కుర్రాళ్ల వైపు నుంచి జరిగే ఈ ఉద్యమంలో 'చిన్న దురై' (అథర్వ) ప్రధానమైన పాత్రను పోషిస్తూ ఉంటాడు. ఈ విషయంలో అతని అన్నయ్య చెళియన్ ( శివకార్తికేయన్) అండగా నిలబడతాడు. గతంలో జరిగిన గొడవల కారణంగా తన స్నేహితుడు గోవింద్ ను కోల్పోయిన చెళియన్, ఆ తరువాత తన పని తాను చేసుకు వెళుతుంటాడు. అయితే తమ్ముడు ఈ కేసులో చిక్కుకోవడం వలన అతని భవిష్యత్తు దెబ్బతింటుందేమోనని మళ్లీ రంగంలోకి దిగుతాడు.
అదే ఊళ్లోని రేడియోస్టేషన్లో రత్నమాల పనిచేస్తూ ఉంటుంది. ఆమె భన్వర్ లాల్ అనే ఒక ఎంపీ కూతురు. చెళియన్ చేసేది రైల్లో బొగ్గువేసే పని అయినప్పటికీ, ఆయన వ్యక్తిత్వాన్ని చూసి ఆమె ఇష్టపడుతుంది. అతను కూడా ఆమెను ఆరాధిస్తూ ఉంటాడు. హిందీ భాష వ్యతిరేక ఉద్యమంలో పోరాడే అతనికి, రత్నమాల కూడా తనవంతు సాయాన్ని అందిస్తూ ఉంటుంది.
అయితే ఈ పోరాటం చేసే విద్యార్థి సంఘాలను అణగదొక్కడానికి ఓ పోలీస్ అధికారి ప్రయత్నిస్తూ ఉంటాడు .. అతని పేరే 'తిరునాథన్' ( రవి మోహన్). మదరాసి అయిన తండ్రి పట్ల అతనికి గల ద్వేషం, ఆ ప్రాంతంపైనే పగగా మారుతుంది. ఈ ఉద్యమానికి సంబంధించిన గొడవలలో తనని గాయపరిచిన చెళియన్ కోసం అతను గాలిస్తూ ఉంటాడు. హిందీ వ్యతిరేక ఉద్యమం ఎక్కడి వరకూ వెళుతుంది? అందుకోసం రంగంలోకి దిగిన చెళియన్ కి ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి? తిరునాథన్ కోరిక నెరవేరుతుందా? చెళియన్ ప్రేమ ఫలిస్తుందా? అనేది కథ.
1950 - 60 ప్రాంతంలో తమిళనాడుపై హిందీని బలవంతంగా రుద్దడానికి ప్రభుత్వం ప్రయత్నించడం .. అనూహ్యమైన స్థాయిలో అందుకు వ్యతిరేకత రావడానికి సంబంధించిన నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ఇది. కథ మొత్తం ఆ కాలంలోనే నడిచేది కావడం వలన, ఆనాటి సామాజిక వాతావరణాన్ని తెరపై చూపించడం నిజంగా చాలా కష్టమైన విషయం. కాస్ట్యూమ్స్ మొదలు అప్పటి వస్తువులు .. వాహనాల విషయంలో దృష్టి పెట్టే విషయంలో సుధా కొంగరకి మంచి మార్కులు పడతాయి.
ఇక ఈ సినిమాలో శివకార్తికేయన్ .. అతని తమ్ముడు పాత్రలో అథర్వ .. శివకార్తికేయన్ మనసు పడిన రత్నమాలగా శ్రీలీల.. ప్రతినాయకుడిగా రవి మోహన్ పాత్రలు ప్రధానంగా కనిపిస్తాయి. అయితే ఈ పాత్రలెవీ కూడా పూర్తి స్థాయిలో ఆకట్టుకునేలా డిజైన్ చేయబడలేదనే అనిపిస్తుంది.
పాత్రల మధ్య క్లారిటీ లోపించడం కూడా కనిపిస్తుంది. కథానాయకుడే ఒకానొక సందర్భంలో ఈ ఉద్యమంలో నుంచి బయటికిపోయి, తిరిగి వెనక్కి రావడం, ఆ పాత్ర ఔచిత్యాన్ని దెబ్బతీస్తుంది.
ఇక ప్రతినాయకుడి విషయానికి వస్తే, తన తండ్రి పట్ల గల అసహనం .. హీరో పట్ల గల కోపం కారణంగా తమిళ ప్రజలందరి పట్ల కఠిన వైఖరిని ప్రదర్శించడం చిత్రంగా అనిపిస్తుంది. ఆయన ఆ పాత్రలో ఆవేశపరుడైన ఒక అధికారిగా కాకుండా ఉన్మాదిలా కనిపిస్తాడు. హీరో - హీరోయిన్స్ వైపు నుంచి లవ్ కీ .. రొమాన్స్ కి అవకాశం ఉన్నప్పటికీ, పెద్దగా పట్టించుకోలేదు. ఇక అథర్వ పాత్రవైపు నుంచి ఎమోషన్స్ ను కూడా కనెక్ట్ చేయలేకపోయారు.
కథలో ప్రధానంగా కనిపించే సమస్య భాషకి సంబంధించినది మాత్రమే. ఆ అంశంపై మాత్రమే పూర్తిగా ఫోకస్ చేశారు. ఆ ప్రధానమైన అంశం చుట్టూ ఆడియన్స్ కోరుకునే ఇతర అంశాలేవీ కనిపించవు. వ్యూహాలు .. త్యాగాలు ఉన్నాయిగానీ, ఆ ఎమోషన్స్ ను మనసుకు దగ్గరగా తీసుకుని వెళ్లలేకపోయారు. అన్నదమ్ములకి సంబంధించిన సన్నివేశాలలో ఎమోషన్స్ ను రాబట్టడానికి ప్రయత్నం చేశారుగానీ ప్రయోజనం దక్కలేదు.
ఒక ప్రాంతానికి సంబంధించిన కథగా భారీతనాన్ని మాత్రమే తీసుకురాగలిగారని చెప్పాలి. రవి కె చంద్రన్ ఫొటోగ్రఫీ .. జీవీ ప్రకాశ్ కుమార్ నేపథ్య సంగీతం .. సతీశ్ సూర్య ఎడిటింగ్ ఫరవాలేదు.ఒక యథార్థ సంఘటనను తెరపైకి తీసుకుని రాగలిగారు. ఆ కాలానికి సంబంధించిన సామజిక వాతావరణాన్ని కళ్లముందుంచారు. అయితే కథలోని ఆత్మ, ఆడియన్స్ ను కదిలించలేకపోయింది. ఒళ్లు గగుర్పొడిచే సన్నివేశాలను .. సంభాషణలను ఆవిష్కరించలేకపోయింది. ఆ సంగతి అలా ఉంచితే, ఈ సినిమాకి 'పరాశక్తి' అనే టైటిల్ ను ఎందుకు సెట్ చేశారనేది మనకి అర్థంకాని ప్రశ్నలా అలా మిగిలిపోతుందంతే
'పరాశక్తి' (జీ 5) మూవీ రివ్యూ!
Parasakthi Review
Movie Details
Movie Name: Parasakthi
Release Date: 2026-02-07
Cast: Sivakarthikeyan,Ravi Mohan, Atharvaa, Sreeleela,Kulappulli
Director: Sudha Kongara
Music: G V Prakash Kumar
Banner: Dawn Pictures
Review By: Peddinti
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer