సీనియర్ స్టార్ హీరోలు కొంతమంది తమ కూతుళ్లను హీరోయిన్స్ గా పరిచయం చేశారు. అలా అర్జున్ కూడా తన కూతురు ఐశ్వర్యను ' సీతా పయనం' సినిమాతో టాలీవుడ్ కి పరిచయం చేశాడు. అయితే ఈ సినిమాకి అర్జున్ దర్శకత్వం వహించడం విశేషం. ఇది అర్జున్ తయారు చేసుకున్న కథ. స్క్రీన్ ప్లే కూడా ఆయనే వేసుకున్నాడంటే, కూతురు సినిమా విషయంలో అర్జున్ ఎంత కేర్ తీసుకున్నాడనేది అర్థం చేసుకోవచ్చు. ఈ రోజున విడుదలైన ఈ సినిమాతో ఐశ్వర్య అర్జున్ ఎన్ని మార్కులు కొట్టేసిందనేది చూద్దాం.

సీత (ఐశ్వర్య అర్జున్) శ్రీమంతుల కుటుంబానికి చెందిన బ్యూటీ. విశాఖ పట్నంలో తండ్రితో కలిసి నివసిస్తూ ఉంటుంది. చిన్నతనంలోనే తల్లిని కోల్పోయిన సీతను, తండ్రి (సత్యరాజ్) ఎంతో గారాబంగా పెంచుతాడు. లంకంత ఇంటికి ఆమెనే యువరాణి. ఒకసారి ఒక వర్క్ షాప్ లో పాల్గొనడం కోసం ఆమె విశాఖ నుంచి హైదరాబాద్ కి కారులో బయల్దేరుతుంది. మార్గమధ్యంలో ఆమెకి అభి (నిరంజన్) తారసపడతాడు. చూడటానికి అతను కాస్త డీసెంట్ గా కనిపించడంతో, ఆమె లిఫ్ట్ ఇస్తుంది. 

అభి ఆమెతో మాటలు కలపడానికి ప్రయత్నిస్తాడు. తన ఊరు 'సీతాపురం' అనీ .. తన తల్లిదండ్రులు .. తాతయ్య - నాయనమ్మ అక్కడే ఉంటూ ఉంటారని చెబుతాడు. ఆ పక్కనే ఉన్న 'రామాపురం' గ్రామానికీ .. తమ ఊరుకి ఎంత మాత్రం పడదని అంటాడు. దేవాలయం విషయంలో ఇప్పటికీ గొడవ నడుస్తుందని చెబుతాడు. ఆమె వస్తే తమ ఊరు చూపిస్తానని అంటాడు. సీత మాత్రం తన పేరు కూడా చెప్పకుండా అతను చెప్పేది వింటూ ఉంటుంది. 

అభికి ఫ్యామిలీ ఎమోషన్స్ అంటే ఇష్టమనీ .. అలాగే సంగీతం అంటే ప్రాణమనే విషయం ఆమెకి అర్థమవుతుంది. అలాగే ఆమెకి మానవత్వం ఎక్కువనీ, ప్రకృతిని .. పిల్లలను ఎక్కువగా ప్రేమిస్తుందనే విషయాన్ని అతను గ్రహిస్తాడు. ఆ తరువాత ఆమె అతణ్ణి 'సీతాపురం ' దగ్గర దింపేసి సీత వెళ్లిపోతుంది. వర్క్ షాపులోకి ఆమె అడుగుపెడుతూ ఉండగానే ఏం జరుగుతుంది?  ఆ సంఘటనతో ఆమె జీవితం ఎలాంటి మలుపు తిరుగుతుంది? అనేది మిగతా కథ. 

'సీతా పయనం' .. టైటిల్ కి తగినట్టుగా ఈ కథ అంతా కూడా సీత చేసే జర్నీగా సాగుతుంది. ఈ జర్నీలో ఏం జరుగుతుంది? అది ఆమె జీవితాన్ని ఎలా ప్రభావితం చేసింది? అనే అంశాల చుట్టూ అర్జున్ ఈ కథను అల్లుతూ వెళ్లాడు. కథలో 80 శాతం వరకూ హీరో - హీరోయిన్ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ప్రకాశ్ రాజ్ .. సత్యరాజ్ వంటి పెద్ద ఆర్టిస్టులు ఉన్నారుగానీ, వారి పాత్రల ప్రమేయం .. ప్రభావం చాలా తక్కువనే చెప్పాలి. 

లవ్ .. ఎమోషన్ .. యాక్షన్ అనే మూడు ప్రధానమైన అంశాలు ఈ కథలో ఉండేలా అర్జున్ చూసుకున్నాడు. ఈ మూడింటిలో కూడా ఎమోషన్స్ కి ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వడం మనకి కనిపిస్తుంది. అయితే ఎమోషన్స్ కి సంబంధించిన సన్నివేశాలు అంత బలమైనవిగా కనిపించవు. అందుకు సంబంధించిన సన్నివేశాలలో గాఢత లోపించింది. ఇక లవ్ విషయానికి వస్తే, అందుకు సంబంధించిన సన్నివేశాలు కూడా హృదయానికి పట్టుకోవు.

ఇక మిగిలిందల్లా యాక్షన్ సన్నివేశాలు. ఇటు హీరో వైపు నుంచి .. అటు అర్జున్ వైపు నుంచి .. ఇక కథతో సంబంధం లేకుండా హఠాత్తుగా పై నుంచి ఊడిపడినట్టుగా అనిపించే అర్జున్ మేనల్లుడు ధృవ్ వైపు నుంచి కూడా ఫైటింగులు పలకరిస్తాయి. అయితే అన్ని యాక్షన్ సీన్స్ ను పరిశీలన చేస్తే, అవి చాలా కృతకంగా అనిపిస్తాయి. అసలు అర్జున్ తన పాత్రను కూడా సరిగ్గా డిజైన్ చేసుకోకపోవడం ఆశ్చర్యంగా అనిపిస్తుంది.    

ప్రకాశ్ రాజ్ ఎపిసోడ్ బాగానే అనిపిస్తుంది.  కథ అక్కడ కాసేపు కుదురుకుంటే బాగుండేదే. కానీ అక్కడ నుంచి కూడా కథ షిఫ్ట్ కావడానికి పెద్దగా సమయం పట్టదు. ఇక పెళ్లైన కొత్త జంట మధ్య మనస్పర్థలు తొలగించడం .. గోవులను రక్షించడం .. ఇలాంటివన్నీ కూడా పెద్దగా ఎఫెక్ట్ చూపించవు. చివరిలోకి వచ్చిన తరువాత కూడా కథ ఎక్కడికక్కడ అయిపోతూ ఉందని అనిపిస్తూ ఉంటుంది. ఆ వెంటనే కొనసాగుతూ ఉంటుంది.
 
'సీతా పయనం' అనే ఈ కథలో ఐశ్వర్య అర్జున్ అందంగా .. ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఇక అభి పాత్రను పోషించిన నిరంజన్ విషయానికి వస్తే, ఒడ్డూ పొడుగూ  బాగానే ఉన్నప్పటికీ, తెలుగు ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యేలా మాత్రం అనిపించడు. నటన పరంగా కూడా ఆడియన్స్ దృష్టిని తనవైపుకు తిప్పుకోలేకపోయాడు. ప్రకాశ్ రాజ్ - సత్యరాజ్ సినిమాకి ఒక భారీతనాన్ని తీసుకొచ్చారు. అర్జున్ తన పాత్ర విషయంలో మరికాస్త కసరత్తు చేయవలసింది. 

బాలమురుగన్ ఫొటోగ్రఫీ బాగుంది. కథలో ఎక్కువ భాగం వర్షంలో నడుస్తున్నట్టుగా చూపించారు. ఆ వర్షం తాలూకు సన్నివేశాలను ఆవిష్కరించిన తీరు .. రోడ్డు జర్నీకి సంబంధించిన లొకేషన్స్ ను చూపించిన విధానం బాగుంది. అనూప్ రూబెన్స్ నేపథ్య సంగీతం బాగుంది .. బాణీల పరంగా మాత్రం అంతగా ఆకట్టుకోవు. ఆయూబ్ ఖాన్ ఎడిటింగ్ ఫరవాలేదు. సంభాషణల బలం కూడా ఎక్కడా కనిపించదు.

జీవితం చాలా చిన్నది .. అందువల్లనే ఎంతో విలువైనది. కలిసి బ్రతడంలోనే అసలైన ఆనందం ఉంది. ప్రకృతిలోని ప్రతి ప్రాణితో కలిసి బ్రతడంలోనే జీవితానికో అర్థం .. పరమార్థం ఉంటాయనే ఒక సందేశాన్ని ఇవ్వడానికి ప్రయత్నించారు. అయితే ఈ లైన్ క్రింద డిజైన్ చేసుకున్న సన్నివేశాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాయి. అనవసరమైన సన్నివేశాలకు ప్రాధాన్యతను ఇవ్వడం అసహనాన్ని పెంచుతూ వెళతాయి.