మూవీ రివ్యూ: 'భళా తందనాన'

  • కొత్తదనం లేని కథ 
  • బలహీనమైన కథనం 
  • టైటిల్ తో సంబంధం లేని సినిమా 
  • శ్రీవిష్ణు బాడీ లాంగ్వేజ్ కి భిన్నమైన పాత్ర 
  •  అనవసరమైన పాత్రలు .. ఫ్లాష్ బ్యాక్ లు
మొదటి నుంచి కూడా శ్రీవిష్ణు విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలను పోషిస్తూ వస్తున్నాడు. శ్రీ విష్ణు సినిమా అంటే ఎంతో కొంత కొత్తదనం ఉంటుంది .. ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏదో ఉంటుందని ప్రేక్షకులు భావిస్తారు. అలాంటి శ్రీవిష్ణు తాజా చిత్రంగా ఈ రోజున 'భళా తందనాన' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వారాహి బ్యానర్ పై రజనీ కొర్రపాటి నిర్మించిన ఈ సినిమాకి చైతన్య దంతులూరి దర్శకత్వం వహించాడు. శ్రీవిష్ణు సరసన నాయికగా కేథరిన్ అలరించిన ఈ సినిమాకి, మణిశర్మ సంగీతాన్ని సమకూర్చాడు. తన ఇమేజ్ కి భిన్నంగా శ్రీవిష్ణు చేసిన ఈ యాక్షన్ థ్రిల్లర్ ఆడియన్స్ ను ఏ స్థాయిలో ఆకట్టుకుందో చూద్దాం. 

డబ్బు చుట్టూ తిరిగే కథలతో గతంలో చాలానే సినిమాలు వచ్చాయి. డబ్బుకోసం ఎత్తుకు పై ఎత్తులు .. ఒకరిని మించిన పన్నాగాలు ఒకరు వేయడం వంటి నేపథ్యంలో ప్రేక్షకులను పలకరించిన సినిమాలు చాలానే ఉన్నాయి. సాధారణంగా కోట్ల రూపాయల డబ్బును విలన్ కాజేస్తుంటాడు. ఈ సినిమాలో విలన్ స్థావరం నుంచి రెండు వేల కోట్ల రూపాయలు మాయం కావడమే కొత్త పాయింట్. డబ్బు కంటే ఆశ చాలా పెద్ద ఎమోషన్ అని హీరో అన్నట్టుగా ఈ కథ అంతా కూడా 2 వేల కోట్ల రూపాయల చుట్టూనే పరిగెడుతూ ఉంటుంది.

ఆనంద్ బాలి (గరుడ  రామ్) వరదరాజులు అనే గ్యాంగ్ స్టర్ దగ్గర పనిచేస్తూనే, అడ్డొచ్చినవారిని చంపుకుంటూ తాను లీడర్ అవుతాడు. అతని హవాలా వ్యాపారంలో పెద్దతలకాయల ప్రమేయం ఎక్కువ. అలా అతను 2 వేల కోట్ల రూపాయలను సంపాదిస్తాడు. ఆ డబ్బు అతని ఖజానా నుంచి మాయమవుతుంది. అందుకు సంబంధించిన పథక రచనతోనే ఈ సినిమా మొదలవుతుంది. ఆనంద్ బాలి ఖజానా నుంచి డబ్బు మాయమైందనే విషయాన్ని ఇన్వెస్టి గేటివ్ జర్నలిస్ట్ శశిరేఖ (కేథరిన్) ఒక పత్రికలో రాస్తుంది.

అప్పటికే ఒక అనాథ శరణాలయంలో ఎకౌంటెంట్ గా పనిచేస్తున్న చందూ (శ్రీ విష్ణు)తో శశిరేఖకి పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం ప్రేమగా మారుతూ ఉంటుంది. ఆనంద్ బాలికి సంబంధించిన వ్యవహారంలో తల దూర్చడం ప్రమాదమని శశిరేఖకి చందూ చెబుతూ ఉండగానే, కొంతమంది రౌడీలు అక్కడికి చేరుకుంటారు. వాళ్ల బారి నుంచి ఇద్దరూ తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నిస్తారు. అయితే వచ్చిన రౌడీ గ్యాంగ్ శశిరేఖను వదిలేసి, తమ బాస్ తీసుకుని రమ్మన్నది చందూనే అని చెప్పేసి అతణ్ణి తీసుకుని వెళతారు.

దాంతో శశిరేఖ మాత్రమే కాదు .. థియేటర్స్ లో ఉన్న ప్రేక్షకులు కూడా షాక్ అవుతారు. అమాయకుడైన చందూను విలన్ గ్యాంగ్ ఎందుకు తీసుకుని వెళ్లింది? 2 వేల కోట్లతో చందూకి ఉన్న సంబంధం ఏమిటి? అనే ఆసక్తికరమైన అంశాలతో .. కథ చకచకా మలుపులు తీసుకుంటూ ఉంటుంది. 'బాణం' వంటి హిట్ ఇచ్చిన చైతన్య దంతులూరి ఈ సినిమాకి దర్శకత్వం వహించాడు. కోట్ల రూపాయల డబ్బును కాజేయడానికి వ్యూహ రచన చేసే ఎపిసోడ్ తో ఈ కథను ఆయన స్టార్ట్ చేశాడు. స్టార్టింగ్ ఎపిసోడ్ కీ .. లాస్ట్ ఎపిసోడ్ కి ముడిపెట్టి ఆయన నడిపించిన స్క్రీన్ ప్లే ఎంతమాత్రం ఆకట్టుకోదు. 

 క్లైమాక్స్ కి లింకై ఉన్న ఫస్టు ఎపిసోడ్ కథను మొదలుపెట్టిన దర్శకుడు, ఈ మధ్యలో నడిచే డ్రామాను ఇంట్రస్టింగ్ గా ప్రెజెంట్ చేయలేకపోయాడు. సహజత్వాన్ని తీసుకుని రాలేకపోయాడు. ఇంటర్వెల్ వరకూ కథ నత్తనడక నడుస్తుంది. ఆ తరువాత స్పీడ్ అందుకుంటుందా అంటే, అదీలేదు .. ఆ నత్త నడకకి ఆడియన్స్ అలవాటు పడిపోతారు. ఇంటర్వెల్ వరకూ ఇదే పరిస్థితి. ఒక ట్విస్టుతో ఇంటర్వెల్ కార్డు పడుతుంది. ఇక్కడి నుంచి కాస్త డ్రామా మొదలవుతుంది. కాకపోతే అది శ్రీవిష్ణు బాడీ లాంగ్వేజ్ కి భిన్నంగా నడవడంతో ఆడియన్స్ కనెక్ట్ కాలేరు.  

శ్రీవిష్ణు పాత్రనుగానీ .. కేథరిన్ పాత్రనుగాని సరిగ్గా డిజైన్ చేయలేదు. ఇద్దరి మధ్య రొమాన్స్ కరువు. ఇక ఒక చిన్న రౌడీ నుంచి గ్యాంగ్ స్టర్ వరకూ ఎదిగిన తరువాత 'గరుడ' రామ్ లుక్ విషయంలో శ్రద్ధ తీసుకోవలసింది .. ముఖ్యంగా హెయిర్ స్టైల్ విషయంలో. ఇక విలన్ కి వంత పడుతూ .. హీరో చేతిలో కంగుతినే దయామయం పాత్రలో పోసాని నటనలో కూడా కొత్తదనం కనిపించదు. గతంలో ఇలాంటి పాత్రలు ఆయన చాలానే చేశారు. ఇక హీరో ఫ్రెండ్ గా కమెడియన్ సత్య నవ్వించడానికి తనవంతు ప్రయత్నం చేశాడు. విలన్ తనని మోసం చేసిన అనుచరుడి కళ్లలో వ్రేళ్లతో పొడిచి చంపడం వంటి సీన్స్ చాలా ఇబ్బందిని కలిగిస్తాయి.  

ఫస్టాఫ్ లో గంటవరకూ ఎలాంటి ట్విస్టులు లేకుండా నడిచిన కథ, క్లైమాక్స్ కి దగ్గరవుతున్న కొద్దీ ట్విస్టులు ఎక్కువైపోయాయి. ఏది నిజం? ఏది అబద్దం? అనే సందేహం నుంచి అవి ప్రేక్షకులను తేరుకోనీయవు. మణిశర్మ స్వరపరిచిన పాటల్లో 'మీనాక్షి .. ' పాట బాగుంది. ఇక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ గొప్పగా లేదు. కెమెరా పనితనం .. ఎడిటింగ్  ఫరవాలేదు. అనవసరమైన పాత్రలు .. అవసరం లేని ఫ్లాష్ బ్యాక్ లు ..  గ్రిప్పింగ్ గా లేని  స్క్రీన్ ప్లే. చెప్పుకోదగినట్టుగా లేని సంభాషణలతో ఈ సినిమా సో సో గా నడుస్తుందంతే. టైటిల్ కి ఎంతమాత్రం సంబంధం లేని ఈ సినిమాకి సీక్వెల్ కూడా ఉంటుంది అనే హింట్ ఇవ్వడం కొసమెరుపు.

Movie Details

Movie Name: Bhala Thandanana

Release Date:

Cast: Sri Vishnu, Catherine, Ramachandra Raju

Director: Chaitanya Danthuluri

Producer: Rajani Korrapati

Music: Manisharma

Banner: Vaarahi Chalana Chitra

Bhala Thandanana Rating: 2.50 out of 5


More Movie Reviews