మలయాళం దర్శకులు థ్రిల్లర్ జోనర్ కి సంబంధించిన కథలను తెరకెక్కించడంలో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటారు. అందువలన థ్రిల్లర్ సినిమాలను చూడటానికి ఓటీటీ ప్రేక్షకులు ఎక్కువ ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు. అలా మలయాళంలో రూపొందిన సినిమానే 'ఆశ'. ఊర్వశి - జోజు జార్జ్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, సెప్టెంబర్ 11వ తేదీన థియేటర్లకు వచ్చింది. ఈ నెల 16వ తేదీ నుంచి ఈ సినిమా 'జీ 5'లో తెలుగులోనూ అందుబాటులోకి వచ్చింది. 

'ఆశ' (ఊర్వశి) నది వయసు దాటిన మహిళ. ఆమె సిటీకి దూరంగా నర్సరీ నడుపుతూ ఉంటుంది.. ఆమెకి ఇద్దరు కూతుళ్లు. పెద్ద కూతురు అనిత(లక్ష్మీమీనన్) ఆమె భర్త 'దుబాయ్'లో ఉంటూ ఉంటారు. చిన్న కూతురు 'అనఘ' ( ఐశ్వర్య లక్ష్మి)తో కలిసి ఆశ నివసిస్తూ ఉంటుంది. ఆశ భర్త చనిపోయి చాలాకాలమే అవుతూ ఉంటుంది. ఆమె సంతోష్ ( విజయ రాఘవన్) పట్ల అభిమానం చూపుతుండటం అనఘ గ్రహిస్తుంది. వాళ్లిద్దరికీ పెళ్లి చేస్తే బాగుంటుందని భావిస్తుంది. 

ఆశకి కోపం .. అసహనం .. తొందరపాటు ఎక్కువ. ఆమె ఎవరేం చెపుతున్నా వినిపించుకోదు. తనకి తోచిన పని చేయడమే ఆమెకి అలవాటు. ఈ విషయంలో తల్లిని నియంత్రించలేక అనఘ నానాపాట్లు పడుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఒక రాత్రివేళ 'ఆశ' డ్రైవింగ్ కారణంగా జీమోన్ (జోజు జార్జ్)జీప్ కి యాక్సిడెంట్ అవుతుంది. అతనితో పాటు అతని అసిస్టెంట్ 'ఆసిఫ్' గాయపడతారు. ఆశ వల్లనే తమ జీప్ డామేజ్ అయిందని వాళ్లు ఎంతగా చెబుతున్నా వినిపించుకోకుండా కేస్ ఫైల్ చేస్తారు.

ఆ తరువాత ఒక రోజున అనఘ ప్రమాదానికి లోనవుతుంది. స్పృహలో లేని ఆమెను జీమోన్ .. ఆసిఫ్ హాస్పిటల్లో చేరుస్తారు. అనఘ గాయపడటానికి ముందు ఆమెపై లైంగిక దాడి జరిగినట్టుగా ఆశ భావిస్తుంది. జీమోన్ .. ఆసిఫ్ ప్లంబర్ పని చేస్తారని తెలిసిన ఆమె, వాళ్లిద్దరినీ తన కొత్త ఇంటి నిర్మాణం కోసం పిలుస్తుంది. అది ఆశ ఇల్లు అని తెలియని ఇద్దరూ అక్కడికి వెళతారు. అక్కడ వాళ్లిద్దరిపై ఊహించని విధంగా ఆశ దాడి చేస్తుంది. అప్పుడు ఏం జరుగుతుంది? అది ఎలాంటి పర్యవసానాలకు దారితీస్తుంది? అనేది మిగతా కథ.

 కొంతమంది మనసత్త్వం చాలా విచిత్రంగా ఉంటుంది. చాలా చిన్న చిన్న విషయాలకు ఎక్కువగా రియాక్ట్ అవుతూ ఉంటారు. పంతాలకు పట్టింపులకు వెళుతూ, తమ మాటనే నెగ్గాలని భీష్మించుకుంటారు. ఎవరు ఎన్ని విధాలుగా నచ్చజెప్పడానికి ప్రయత్నించినా, రాజీకీ ససేమిరా అంటారు. తమ కారణంగా అవతలివారికి ఎంత ఇబ్బంది అవుతుందనేది ఎంతమాత్రం ఆలోచన చేయరు. అలాంటి ఒక చిత్రమైన స్వభావం కలిగిన 'ఆశ' అనే మహిళ చుట్టూ తిరిగే కథనే ఇది.

తాను చెప్పినట్టుగా వినాలి .. తాను అనుకున్నట్టుగా జరగాలి అనే ఒక మానసిక స్థితి కలిగిన ఆశ .. ఆమె ఫ్యామిలీ తెరపైకి వస్తుంది. ఆశ చిత్రమైన స్వభావానికి సంబంధించిన సన్నివేశాలు ఆమె స్వభావంలో తీవ్రతను ఆడియన్స్ ముందు ఆవిష్కరిస్తూ వెళుతుంది. అలా తన కూతురుకి జీమోన్ .. ఆసిఫ్ కారణంగా అన్యాయం జరిగిందని భావించిన ఆమె , ఆ ఇద్దరిపై దాడి చేయడం వరకూ గల సన్నివేశాలు ఫస్టాఫ్ గా ప్రేక్షకుల ముందుకు వస్తాయి. 

ఆ తరువాత ఆశ తన కూతురు ద్వారా జరిగినది తెలుసుకోవడం .. తనని తాను కాపాడుకోవడానికి ప్రయత్నించడం వంటి సన్నివేశాలతో సెకండాఫ్ నడుస్తుంది. జీమోన్ .. అతని అసిస్టెంట్ కనిపించకపోవడంతో పోలీస్ ల గాలింపు మొదలవడం .. ఆశ ప్రవర్తనలో వచ్చిన మార్పును ఇరుగుపొరుగువారు గమనించడం .. కూతుళ్లు అనుమానించడం వంటి సన్నివేశాల ద్వారా మరింత ఉత్కంఠను రేకెత్తించడానికి దర్శకుడు తనవంతు ప్రయత్నం చేశాడు.

ఒక వైపున పోలీస్ నిఘా ఆశ ఇంటివైపు తిరుగుతుంది. మరో వైపున ఆశపై ధోరణిపై ఆమె కుటుంబ సభ్యులకు సందేహాలు మొదలవుతాయి. ఇక శత్రువు వైపు నుంచి ఆశ ప్రమాదంన్లో పడుతుందేమో అనే ఒక కుతూహలం పెరుగుతూ వెళుతుంది. కానీ ఈ మూడు వైపుల నుంచి ఏమీ జరగదు. ఆడియన్స్ అదిరిపడేలా చేసే ట్విస్ట్ ఏదీ పలకరించదు. అదే ఈ సినిమాకి సంబంధించిన లోపంగా అనిపిస్తుంది. 

సాధారణంగా మలయాళ సినిమాలు చాలా సాదాసీదాగా సాగుతూ ఉంటే, చివర్లో ఒక రేంజ్ ట్విస్ట్ ఉంటుందని ఆడియన్స్ భావిస్తారు. చివర్లో వచ్చే ఆ మెరుపు కథాబలాన్ని ఒక్కసారిగా పెంచేయడం జరుగుతూ ఉంటుంది. కానీ అలాంటి మేజిక్ ఏదీ ఈ సినిమా విషయంలో జరగలేదు. చాలా సింపుల్ గా .. సాదాసీదాగానే ఈ సినిమా కథను నడిపిస్తూ వెళతారు .. అలాగే ముగించారు.

ఈ కథ చాలా నిదానంగా మొదలవుతుంది. సహజత్వానికి దగ్గరగా వెళుతుంది. అయితే ప్రీ క్లైమాక్స్ నుంచి కథ పుంజుకోవడం .. క్లైమాక్స్ కి నెక్స్ట్ లెవెల్ కి చేరుకోవడం అనేవి లేకపోవడం, ఆడియన్స్ ఎదురుచూసే ట్విస్టులు లెక్సపోవడం అసంతృప్తిని కలిగిస్తుంది. ఊర్వశి .. జోజు జార్జ్ .. ఐశ్వర్య లక్ష్మి నటన ఆకట్టుకుంటుంది. మధు నీలకందన్ ఫొటోగ్రఫీ .. మిథున్ ముకుందన్ నేపథ్య సంగీతం .. షాన్ మహ్మద్ ఎడిటింగ్ ఫరవాలేదు.

అనుమానాలు .. అపార్థాలు .. పంతాలు ... పట్టింపులు ..తొందరపాటు నిర్ణయాలు జీవితంలో ఎలా అల్లకల్లోలాన్ని సృష్టిస్తాయనేది చెప్పడానికి దర్శకుడు ప్రయత్నించాడు. అవతలివారి అభద్రతాభావం .. మానసికపరమైన బలహీనత ఒక్కోసారి ఇతరులకు ఎంతటి ప్రమాదాన్ని తెచ్చిపెడుతుందనేది ఈ సినిమా ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు. ఓ మాదిరి కేటగిరీలోనే ఈ సినిమా కనిపిస్తుంది.