తమిళంలో ఈ ఏడాది రూపొందిన విలక్షణమైన సినిమాలలో 'ఎన్నా విలై' ఒకటిగా కనిపిస్తుంది. కరుణాస్ కథానాయకుడిగా రూపొందిన ఈ సినిమాలో నిమిషా సజయన్ కీలకమైన పాత్రను పోషించింది. సజీవ్ పళూర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, సెప్టెంబర్ 17వ తేదీన థియేటర్లకు వచ్చింది. అలాంటి ఈ సినిమా, ఈ నెల 15వ తేదీ నుంచి 'నెట్ ఫ్లిక్స్' లో స్ట్రీమింగ్ అవుతోంది. తమిళంతో పాటు తెలుగులోను అందుబాటులో ఉంది.
రామేశ్వరం సముద్ర తీరప్రాంతంలోని ఒక జాలరి గూడెం అది. అక్కడ 'తవశి' ( కరుణాస్) తన కుటుంబంతో కలిసి నివసిస్తూ ఉంటాడు. భార్య 'పాలమ్మ' .. చెల్లెలు 'మేఖల' .. కొడుకు .. కూతురుతో కలిసి జీవిస్తుంటాడు. అతను సముద్ర తీరంలో బొమ్మలు అమ్మడమే కాకుండా, చేపల వేటకు కూడా వెళుతూ ఉంటాడు. అలాగే సముద్రంలో నాణాల వేటను కూడా కొనసాగిస్తూ ఉంటాడు. ఒక రోజున అతనికి అరచేతి వెడల్పు కలిగిన ఒక లాకెట్ దొరుకుతుంది. తనకి బాగా పరిచయమున్న వరదరాజులు( మోహన్)కి చూపిస్తాడు తవశి.
ఆ లాకెట్ గిల్ట్ దని చెప్పిన వరదరాజులు, దానికి గల ఒక రాయిని రహస్యంగా తీసి లాకెట్ ను ఇంట్లో దాచమని తిరిగి ఇచ్చేస్తాడు. ఆ ఒక్కరాయిని డైమండ్స్ షాపులో అమ్మితే వరదరాజులుకి మూడు లక్షల రూపాయలు వస్తాయి. అదే సమయంలో తనకి లభించిన లాకెట్ గురించి భార్య 'పాలమ్మ'తో చెబుతాడు తవశి. ఆమె దానికి గీటు పెట్టి అది బంగారపుదేనని తేల్చి చెబుతుంది. వెంటనే పోలీస్ స్టేషన్ కి వెళ్లి దానిని ఇచ్చేయమని చెబుతుంది. పోలీస్ స్టేషన్ కి వెళ్లిన 'తవశి'ని వరదరాజులు సెల్లో వేస్తాడు. గుడిలోని ఆభరణాన్ని దొంగిలించాడని అబద్ధం చెబుతాడు.
అక్కడి దేవాలయంలో ఎలాంటి ఆభరణం పోలేదని తేలడంతో ఎస్ ఐ తో వరదరాజులు చీవాట్లు తింటాడు. కొన్ని నెలల క్రితం ఒక లాడ్జ్ లో జరిగిన దొంగతనం కేసును తవశిపై మోపాలని చూస్తాడు. తవశి చెల్లెలు తనకి పరిచయమున్న అడ్వకేట్ 'కాంచన' (నిమిషా సజయన్)ను పట్టుకుని విషయం చెబుతుంది. దాంతో ఆమె తవశి వైపు నుంచి రంగంలోకి దిగుతుంది. అప్పుడు ఆమెకి ఎలాంటి సవాళ్లు ఎదురవుతాయి? తవశి నిర్దోషిగా బయటపడతాడా? అసలు ఆ లాకెట్ వెనకున్న నేపథ్యం ఏమిటి? అనేది మిగతా కథ.
సముద్ర తీరప్రాంతం .. జాలరి గూడెం .. అక్కడ వాళ్లకి జరుగుతున్న అన్యాయం .. న్యాయం కోసం వాళ్లు చేసే పోరాటం గురించిన కథలతో చాలానే సినిమాలు తెరపైకి వచ్చాయి. అయితే ఆ కథలన్నీ కూడా చేపలవేట నేపథ్యంలో నడవడం ఎక్కువగా కనిపిస్తుంది. అందుకు భిన్నమైన కథ ఇది. సముద్రంలో దొరికిన ఒక ఖరీదైన లాకెట్ చుట్టూ .. ఆ లాకెట్ దొరికిన కథానాయకుడి చుట్టూ ఈ కథ తిరుగుతుంది.
నిజాయితీ .. నమ్మకం అనేవి అమాయకత్వంలో మరింత బలంగా కనిపిస్తాయి. అలాంటి ఒక అమాయకుడైన జాలరీ, తనకి సముద్రంలో దొరికిన లాకెట్ ను ఒక బీట్ కానిస్టేబుల్ కి చూపించడంతో కథ మలుపు తిరుగుతుంది. అక్కడి నుంచి ఈ కథ కోర్టుకు చేరడంతో మరింత పుంజుకుంటుంది. ఒక వైపున రంగులు మార్చుకునే సాక్ష్యాలు .. ఆధారాలు, మరో వైపున మీడియా హడావిడితో ఈ కథ ప్రీ క్లైమాక్స్ దిశగా పరిగెత్తి .. ముఖ్యమంత్రి జోక్యంతో క్లైమాక్స్ కి చేరుకుంటుంది.
తవశి ఆ లాకెట్ ను దొంగిలించాడని కానిస్టేబుళ్లు తమ పై అధికారులను .. కోర్టును నమ్మించాలి. అలా నమ్మించడానికి వాళ్లు చేసే ప్రయత్నాలే ఈ కథను మరింత ఆసక్తికరంగా మారుస్తాయి. అయ్యో ఈ కేసులో నుంచి తవశి ఎలా బయటపడతాడో అనే ఒక టెన్షన్ ఆడియన్స్ లో కలగాలి. కానీ అలాంటి ఆందోళన కలిగించే సన్నివేశాలు డిజైన్ చేయకపోవడం అసంతృప్తిని కలిగిస్తుంది.
ఇక ఈ కథకి కోర్టు రూమ్ సీన్స్ కీలకమని చెప్పాలి. ఇక్కడే ఆడియన్స్ ను కదలకుండా చేయాలి. కానీ వాదనలు .. ప్రతివాదనలు కాస్త వీక్ గానే అనిపిస్తాయి. సంభాషణలు సరిగ్గా రాసుకోలేదనే అభిప్రాయం కలుగుతుంది. అందువలన సన్నివేశాలు తేలిపోతూ ఉంటాయి. అయితే చివరికి వచ్చేసరికి, పేదవాడికి కూడా పరువు ఉంటుంది .. ఆ పరువుకు ఒక విలువ ఉంటుంది .. అంటూ సందేశాన్ని ఇవ్వడానికి చేసిన ప్రయత్నం బాగుందని అనిపిస్తుంది.
కరుణాస్ .. నిమిషా సజయన్ మొదలు ఇతర పాత్రలు పోషించిన వాళ్లంతా చాలా బాగా నటించారు. మోహన్ రామన్ కానిస్టేబుల్ పాత్రను ఇంకాస్త ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేస్తే బాగుండేదనే భావన కలుగుతుంది. ఆల్బీ ఆంటోనీ ఫొటోగ్రఫీ .. సామ్ సీఎస్ నేపథ్య సంగీతం .. ఎడిటింగ్ ఫరవాలేదు.
కథలోని పాయింట్ .. ఈ కథ ద్వారా చెప్పదలచుకున్న విషయం .. ఇవ్వదలచుకున్న సందేశం బాగానే అనిపిస్తాయి. అయితే వీటన్నింటినీ కలుపుతూ చేసిన ఆవిష్కరణ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోవడం కనిపిస్తుంది. ఓ మాదిరి కేటగిరీలోనే నిలిచిపోయిన కంటెంట్ గా చెప్పుకోవచ్చు.
Advertisement
'ఎన్నా విలై' (నెట్ ఫ్లిక్స్) మూవీ రివ్యూ!
Advertisement
Enna Vilai Review
Movie Details
Movie Name: Enna Vilai
Genre: Drama
Release Date: 2026-10-15
Cast: Karunas, Nimisha Sajayan, Vijayalakshmi Veeramani, Shashaa Shivakumar, Kamalesh, Jagan Heesha
Director: Sajeev Pazhoor
PRO: -
Music: Sam C S
Banner: Kalamaya Cineverse
Review By: Peddinti
Advertisement
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.
Trailer