కాజల్ అగర్వాల్ ప్రధానమైన పాత్రధారిగా రూపొందిన సినిమానే 'ది ఇండియా స్టోరీ'. కోర్టు లీగల్ డ్రామా నేపథ్యంలో రూపొందిన సినిమా ఇది. శ్రేయాస్ తల్పాడే కీలకమైన పాత్రను పోషించిన ఈ సినిమా, జులై 24వ తేదీన థియేటర్లకు వచ్చింది. చేతన్ డీకే దర్శకత్వం వహించిన ఈ సినిమా, సెప్టెంబర్ 18వ తేదీ నుంచి 'జియో హాట్ స్టార్'లో స్ట్రీమింగ్ అవుతోంది. సెప్టెంబర్ 30వ తేదీ నుంచి తెలుగులోను అందుబాటులోకి వచ్చింది.
యోగేశ్ పాటిల్ (శ్రేయాస్ తల్పాడే) ఒక ఆర్మీ ఆఫీసర్. అతని ఏడేళ్ల కూతురు పేరే 'పరి' ( త్రిష శ్రద్ధా). హ్యాపీగా జీవితం సాగిపోతుందని అతను అనుకుంటున్న సమయంలో, 'పరి' క్యాన్సర్ బారిన పడుతుంది. ఈ విషయం తెలియగానే అతను తన కూతురును బ్రతికించుకోవాలనే తాపత్రయంతో జాబ్ ను కూడా వదిలేసి వస్తాడు. తమ పూర్వీకులలో ఎవరికీ క్యాన్సర్ లేదని అతను డాక్టర్లతో చెబుతాడు. ఆహార పదార్థాలలో మోతాదుకు మించిన క్రిమి సంహారక మందులు వాడటం వలన, ఆ పాపకి క్యాన్సర్ వచ్చిందని డాక్టర్లు చెబుతారు.
అప్పటి వరకూ యోగేశ్ సంపాదించిందంతా ధారపోసినా తన కూతురును బ్రతికించుకోలేక పోతాడు. తన మాదిరిగా ఇంకెవరూ బాధపడకూడదనే ఉద్దేశంతో, అతను ఒక నిర్ణయానికి వస్తాడు. క్రిమి సంహారక మందులు తయారు చేస్తున్న సంస్థలు .. వాటిని పంటల కోసం ఉపయోగిస్తున్న రైతులపై కేస్ పెట్టడం కోసం పోలీస్ స్టేషన్ కి వెళతాడు. తన కూతురు చనిపోలేదనీ .. అది హత్యతో సమానమని ఫిర్యాదు చేయడానికి ప్రయత్నిస్తాడు. అయినా అతని గోడును ఎవరూ పట్టించుకోరు. కోర్టులో కూడా అతనికి ఇదే పరిస్థితి ఎదురవుతుంది.
సమాజంలో అతను ఒక నిస్సహాయుడైన తండ్రిగా నిలబడిపోతాడు. తన ఆవేదనను అర్థం చేసుకునేవారు కరువయ్యారని అనుకుంటాడు. అలాంటి పరిస్థితులలో అడ్వకేట్ 'అర్చన' అతనికి అండగా నిలుస్తుంది. ఆ కేస్ ను ముందుకు తీసుకెళ్లడానికి ఆమె సిద్ధమవుతుంది. ఈ క్రమంలో ఎలాంటి భయంకరమైన నిజాలు ఆమె అనుభవంలోకి వస్తాయి? వాటిని ఆమె ఎలా కోర్టు దృష్టికి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తుంది? అందుకోసం ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటుంది? అనేది కథ.
వ్యవసాయ రంగంలో పెను మార్పులు వచ్చాయి. ఒకప్పటిలా సేంద్రియ ఎరువులను వాడటం లేదు. పండ్లు .. కూరగాయలు .. ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంచడం కోసం .. తాజాగా కనిపించడం కోసం మోతాదుకు మించిన రసాయనాలు ఉపయోగిస్తున్నారు. తినే ఆహారంతో పాటు క్రిమి సంహారిక మందులు లోపలికి వెళ్లడం వలన అనేకమంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం .. క్రిమిసంహారక మందుల తయారీ సంస్థలు .. రైతుల పాత్ర ఉందనే ఒక ప్రధానమైన అంశం చుట్టూ ఈ కథ నడుస్తుంది.
కథలోని ప్రధానమైన సమస్య ఏదైతే ఉందో అది కోర్టుకు వచ్చిన దగ్గర నుంచి కథ మొదలవుతుంది. ఆ తరువాత ఈ సమస్య ఎలా కోర్టు వరకూ వెళ్లిందనేది చూపిస్తూ వచ్చారు. ఫస్టాఫ్ అంతా సమస్య చుట్టూ తిరుగుతుంది .. ఆ సమస్యకి గల కారణాలతో సెకండాఫ్ నడుస్తుంది. అసలు ఇండియా వ్యవసాయ రంగంలోకి మోతాదుకు మించిన రసాయనాలు ఎలా ఎంట్రీ ఇచ్చాయనే విషయం దగ్గర నుంచి, వాటి విస్తరణ ఎలా జరుగుతూ వచ్చిందనేది దర్శకుడు వివరిస్తూ వెళ్లాడు.
పండ్లు .. కూరగాయలు ఎంతో ఆరోగ్యాన్ని ఇస్తాయని భావిస్తుంటారు. కానీ అవి ఎంతటి విషతుల్యంగా మారిపోయి ప్రజల వరకూ వెళుతున్నాయనే విషయంపై, అవి ఎంతమందిని క్యాన్సర్ పేషంట్లుగా మారుస్తున్నాయనేది న్యాయస్థానం సాక్షిగా ప్రస్తావించారు. అడ్వకేట్ అర్చన తన కేసుకు సంబంధించిన ఆధారాలను సేకరించే వైపు నుంచి దర్శకుడు మరికొన్ని విషయాలను మన దృష్టికి తీసుకురావడానికి ప్రయత్నించాడు.
నిజానికి దర్శకుడు ఎంచుకున్న కథాంశం ప్రస్తుత పరిస్థితులకు అద్దం పడుతుంది. వాస్తవాలకు చాలా దగ్గరగా తీసుకుని వెళుతుంది. తండ్రీ కూతుళ్ల ఎమోషన్స్ ను టచ్ చేస్తూనే దర్శకుడు ఈ కథను చెప్పడానికి తనవంతు ప్రయత్నం చేశాడు. కాకపోతే అందుకు సంబంధించిన ఆవిష్కరణలో జీవం కనిపించదు. అక్కడక్కడా ఒక డాక్యుమెంటరీ మాదిరిగా అనిపించి అసహనాన్ని కలిగిస్తుంది. కొన్ని లాజిక్కులు వదిలేయడం అసంతృప్తిని మిగుల్చుతుంది.
ఇక అడ్వకేట్ అర్చనకి ఇది ఫస్టు కేస్ అని ఎందుకు చెప్పారో .. దాని వలన కథకి ఏం ఒరిగిందనేది అర్థం కాదు. అలాగే మురళీ శర్మ కాంబినేషన్ సీన్స్ కూడా బలహీనంగా అనిపిస్తాయి. కాజల్ .. శ్రేయాస్ తల్పాడే .. బేబీ త్రిష .. ఇలా అంతా తమ పాత్రలకు న్యాయం చేశారు. నిశాంత్ భగవత్ ఫొటోగ్రఫీ .. మంగేష్ నేపథ్య సంగీతం .. ఆశిష్ ఎడిటింగ్ ఓ మాదిరిగా అనిపిస్తాయి.
దర్శకుడు ఎంచుకున్న కథాంశం వాస్తవాలకు అద్దం పట్టేదే .. ఆలోచింపజేసేదే అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అయితే అందుకు తగిన ఆవిష్కరణ జరగలేదు అనిపిస్తుంది. సమస్య తీవ్రత .. ఎమోషన్స్ లో గాఢతను కనెక్ట్ చేయలేకపోయారు. ఒక చర్చా వేదికగా అనిపిస్తూ నిరాశ పరుస్తుంది. అదలా ఉంటే క్యాన్సర్ అనే మాట వినడానికే చాలామంది భయపడతారు. అందునా ఒక పాపకి క్యాన్సర్ అంటే ఆ కథకి ఆడియన్స్ మరింత దూరంగా ఉంటారు. ఫ్యామిలీతో కలిసి చూడకూడని సినిమాలు కొన్ని ఉంటాయి .. చూడలేని కాన్సెప్టులు మరికొన్ని ఉంటాయి. ఆ రెండో కోవలోకి చెందినదిగా ఈ సినిమాను గురించి చెప్పుకోవచ్చు.
'ది ఇండియా స్టోరీ'( జియో హాట్ స్టార్) మూవీ రివ్యూ!
The India Story Review
Movie Details
Movie Name: The India Story
Genre: Drama
Release Date: 2026-09-30
Cast: Kajal Aggarwal,Shreyas Talpade,Murali Sharma,Manish Wadhwa,Trisha Sarda
Director: Chettan DK
PRO: -
Music: Mangesh Dhakde
Banner: Zee Studios - MIG Productions
Review By: Peddinti
Disclaimer:
This review is based on the reviewer’s individual perspective. Audience opinions may vary.