'సత్తెంద్రుడు మారుదు వానిలై'( ఆహా) మూవీ రివ్యూ!

కోలీవుడ్ కథానాయకులలో 'జై' తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. తన బాడీ లాంగ్వేజ్ కి తగిన పాత్రలను ఎంచుకుంటూ ముందుకు వెళుతున్నాడు. తమిళంలో ఆయన  చేసిన సినిమానే 'సత్తెంద్రుడు మారుదు వానిలై'. మీనాక్షి గోవిందరాజన్ కథానాయికగా నటించిన ఈ సినిమా, ఒక రొమాంటిక్ థ్రిల్లర్. బాబు విజయ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, మే 15వ తేదీన థియేటర్లకు వచ్చింది. ఈ నెల 5వ తేదీ నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్ అవుతోంది.

జానకి (మీనాక్షి గోవిందరాజన్) మంచి విద్యావంతురాలు .. అందమైన యువతి. ఆమెపై ఒక రాజకీయనాయకుడి కన్ను పడుతుంది. దాంతో అతను తెలివిగా ఒక పథకం వేస్తాడు. జానకి తండ్రికి కూడా పదవిని కట్టబెట్టి, అందుకు బదులుగా ఆమెను తనకిచ్చి పెళ్లి చేయమని కోరతాడు. అందుకు జానకి తండ్రి సిద్ధమవడంతో, అది ఇష్టం లేని ఆమె ఇల్లొదిలి వెళ్లిపోతుంది. ఆ సమయంలోనే ఆమెకి దగ్గర కావడానికి రణేశ్ ప్రయత్నిస్తూ ఉంటాడు. 

జానకి పేరుతో 300 ఎకరాల భూమి ఉంటుంది. అందుకోసమే రణేశ్ ఆమెను వలలోకి లాగే ప్రయత్నం చేస్తుంటాడు. అతను స్వార్థంతోనే తన పట్ల ప్రేమను నటిస్తున్నాడని గ్రహించిన జానకికి, అదే సమయంలో రామచంద్రన్ (జై) పరిచయమవుతాడు. రణేశ్ టార్చర్ నుంచి తప్పించుకోవడం కోసం ఆమె రామచంద్రన్ ను వివాహం చేసుకుంటుంది. రామచంద్రన్ అనాథగా ఒక శరణాలయంలో పెరుగుతాడు. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తూ ఉంటాడు. జానకితో హనీమూన్ కి వెళ్లిన అతను అక్కడ సరదాగా గడుపుతాడు. అక్కడే అతను తొలిసారిగా 'చక్రవర్తి' (గరుడ రామ్) ను చూస్తాడు. 

చక్రవర్తి చేతిలో చాలా రిసార్ట్స్ ఉంటాయి. కొత్త జంటలకు ఆఫర్ పేరుతో రిసార్ట్స్ నిర్వహిస్తూ ఉంటాడు. పడక గదుల్లోని శృంగార సన్నివేశాలను రహస్య కెమెరాలతో చిత్రీకరించి, ఆ వీడియోస్ తో కోట్ల రూపాయల బిజినెస్ చేస్తుంటాడు. చక్రవర్తి చేసే బిజినెస్ .. అతని చేతిలో తమ వీడియో కూడా ఉందనే విషయం రామచంద్రన్ కి తెలుస్తుంది. అప్పుడు అతను ఏం చేస్తాడు? అతని కారణంగా జానకి ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటుంది? అనేది మిగతా కథ.

 వయసుమళ్లిన ఒక రాజకీయనాయకుడికి రెండో భార్యగా వెళ్లడం ఇష్టం లేని జానకి, ఇల్లొదిలి వెళ్లిపోతుంది. ప్రేమ పేరుతో మోసం చేయడానికి ప్రయత్నించిన ఒక యువకుడి నుంచి తప్పించుకోవడం కోసం, ఆమె రామచంద్రన్ చేయందుకుంటుంది. అతను అనాథ అని తెలిసి ఆమె పెద్దగా ఆశ్చర్యపోదు. కానీ ఆమె ఒక రాజకీయనాయకుడి కూతురని తెలిసి అతను షాక్ అవుతాడు. హనీమూన్ కి వెళ్లిన ఈ జంట ఎలాంటి చిక్కుల్లో పడతారనే ఒక ఆసక్తికరమైన అంశం చుట్టూ ఈ కథ నడుస్తుంది. 

అందం కోసం .. ఆస్తుల కోసం తనకి ఎరవేసిన వారి బారి నుంచి తప్పించుకున్న ఒక యువతి, ఒక అనాథ యువకుడిని నమ్మి పెళ్లి చేసుకుంటుంది. అయితే అనుకోకుండా ఈ కొత్త జంట ఒక ఉచ్చులో చిక్కుకుంటుంది. అందులో నుంచి బయటపడటానికి వాళ్లు ఏం చేస్తారు? ఎలా చేస్తారు? అనే ఆసక్తికరమైన మలుపులతో ఈ కథను అల్లుకుంటూ వెళ్లారు. 

ఈ కథలో .. పదవి కోసం కూతురికి వయసుమళ్లిన వ్యక్తితో పెళ్లి చేయడానికి సిద్ధపడిన జానకి తండ్రి ఒక విలన్ గా కనిపిస్తాడు. ఆస్తిపాస్తుల కోసం జానకి చుట్టూ వల పన్నడానికి ప్రయత్నించిన రణేశ్ మరో విలన్ గా అనిపిస్తాడు. ఇక కొత్త జంటల శృంగార సన్నివేశాలను రహస్యంగా చిత్రీకరించి,  సొమ్ము చేసుకునే అసలైన ప్రతినాయకుడిగా చక్రవర్తి కనిపిస్తాడు. నిజానికీ ఈ మూడు ట్రాకులు  ఆసక్తికరమైనవే. కానీ తెరపై వాటి ఆవిష్కరణ ఉత్కంఠభరితంగా జరగలేదని అనిపిస్తుంది.

హీరో - హీరోయిన్ మధ్య ప్రేమ కుదరడానికీ .. ముదరడానికే ఎన్నో రకాల సన్నివేశాలను డిజైన్ చేసుకోవచ్చు. కానీ అలాంటి కొత్తదనంతో పనిలేకుండా .. వాళ్ల ప్రేమాయణం మొదలవకుండానే పెళ్లైపోతుంది. హీరో గతం తాలుకు పరిస్థితులు .. హీరోయిన్ .. ఆమె తండ్రి, హీరోయిన్ ఆమె బాయ్ ఫ్రెండ్ .. హీరో - విలన్ .. ఈ పాత్రల మధ్య బలమైన ఘర్షణ .. సంఘర్షణకి అవకాశం ఉంది. కానీ దర్శకుడు ఆ విషయాలను గురించి పెద్దగా పట్టించుకొలేదు.    
         
ఆఫీసులో తనకి రావలసిన ప్రమోషన్ ను కొట్టేసిన హీరోపై అక్కసు చూపించే పాత్రలో యోగిబాబుతో మంచి కామెడీని క్రియేట్ చేయవచ్చు. కానీ ఆ పాత్ర కూడా చప్పగా సాగుతూ, ఉత్సాహంతో ఎదురుచూస్తున్న ప్రేక్షకులను నీరు గార్చేస్తూ ఉంటుంది. కథ ఏదైనా క్లైమాక్స్ లో కాస్త హడావిడి చేయడం సాధారణమైన విషయమే కాబట్టి, అలాంటి ఒక హడావిడి ఇందులోనూ కనిపిస్తుంది. కాకపోతే ఇది కూడా ప్రభావితం చేయలేకపోతోంది. 

రిచర్డ్ ఫొటోగ్రఫీ .. డార్లింగ్ రిచర్డ్ సన్ ఎడిటింగ్ ఓ మాదిరిగా అనిపిస్తాయి. గిరీశ్ గోపాలకృష్ణన్ నేపథ్య సంగీతం, సన్నివేశాలతో .. సందర్భాలతో సంబంధం లేకుండా కొనసాగుతుంది.ఇక నటీనటుల నటన గురించి చెప్పుకునే స్థాయిలో వాళ్ల పాత్రలను డిజైన్ చేయలేదు. లవ్ .. రొమాన్స్ .. కామెడీ .. యాక్షన్ .. ఇలా ఏ కోణంలో నుంచి చూసినా మెప్పించలేకపోయిన కంటెంట్ గా ఈ సినిమాను గురించి చెప్పుకోవలసి ఉంటుంది.   

               

Movie Details

Movie Name: Sattendru Maarudu Vaanilai

Release Date:

Cast: Jai,Meenakshi Govindarajan,Yogi Babu ,Ramachandra Raju, Sathyan,Sriman

Director: Babu Vijay

Producer: B V Shrmila

Music: Girishh Gopalakrishnan

Banner: BV Frames

Sattendru Maarudu Vaanilai Rating: 1.50 out of 5

Trailer

More Movie Reviews